Chai Bisket’s Story Series – రాధే గోవింద (Part – 8)

Updated on
Chai Bisket’s Story Series – రాధే గోవింద (Part – 8)
(జరిగిన కథ – Part-1, Part- 2, Part-3, Part – 4, Part - 5, Part - 6, Part - 7.) మైండ్ ఫ్రీజ్ అయ్యి, మనసు ఖాళీ అయ్యింది ఎదురుగా రాధ దూసుకుంటూ రావటం చూసేప్పటికి. నడుము కింద నుండి వెన్నెముక మీదుగా తల వరకు ఎదో ప్రవహించినట్టు అనిపించింది. రోమాలు నిక్కపోడుచున్నాయి. తొడల మీదుగా నీళ్ళు జారి కాలివేళ్ల మీదుగా కిందకు వెళ్తునట్టు తెలుస్తుంది, కాని అది చెమట మాత్రం కాదు. గుండె చప్పుడు నిమిషానికి 72 సార్లు కాదు కదా 10 సార్లు కూడా కొట్టుకోవటం లేదు. అంతా చాలా చాలా నెమ్మదిగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. రాధ కురులు కాదు... ఒక్కో వెంట్రుక గాలికి ఎలా కదులుతుందో స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా...చావు భయం అంటే ఇదేనేమో!. నా వైపు దూసుకొచ్చిన రాధ నా ముందు ఆగిపోయింది...నా గుండె కొట్టుకోవటం కూడా. తీక్షణంగా నన్నే చూస్తూ గొంతు పట్టుకోవటానికి చేయి చాచింది. తను పట్టుకుంది నా గొంతు కాదు, నా వెనుక ఉన్న కాటి కాపరిది. రాధ చేయి నా గొంతులోనుండి వెనుక ఉన్న కాపరి గొంతుని పట్టుకొని పైకి లేపుతుంది వాడిని. “ఏరా...మా వాళ్ళకి నాతో పాటుగా నిప్పు పెడతావా? నీ ప్రాణాలు తీస్తా ఈరోజు” అంటూ రాధ వాడిని చంపబోతుంటే, గోవింద్ వచ్చి కాపరిని విడిపించి రాధను గట్టిగా హత్తుకున్నాడు. క్షమించు జయమ్మ, అందులో నా తప్పేమీ లేదు నా ధర్మం నేను చేసాను అంటూ కాపరి వెళ్ళిపోయాడు. గోవింద్ హత్తుకున్న కొన్ని క్షణాలకు రాధ కన్నీళ్లు పెట్టుకుని శాంతించింది.” కాపరి గోవింద్ తో చెప్పినదాని ప్రకారం జయమ్మ కుటుంబం ఒక్కటే కాదు చాలా కుటుంబాలు అన్యాయంగా సమాధి అయ్యాయట ఇక్కడ. దానికి కారణం ఎవరో, ఎందుకు చేసారో అనేది తెలీలేదు. గోవింద్ చనిపోయే ముందు రోజు, వైద్యడి దగ్గరికి రాధ వెళ్ళిన రోజు, దీని గురించి డైరీలో రాయలేదు... రాధ వైద్యడు కోసం గ్రంధాలయం లో ఎదురు చూస్తుంది. వైద్యుడు వచ్చాడు. డైరీ చదువుతున్నప్పుడు నేను ఊహించుకున్న వైద్యుడికి, ఎదురుగా చూస్తున్న వైద్యుడికి ఎంతో వైరుధ్యం ఉంది. మాసిన గడ్డం, ఎర్రటి కళ్ళు, శివుడి విభూతి నిండిన నుదురు, జీవం లేని ముఖం, మెడకు చేతికి లెక్కలేనన్ని తాయత్తులు, చర్మంతో కప్పిన ఎముకల గూడులా ఉన్నాడు. బయట భీకరంగా వర్షం పడుతున్నట్టు ఉంది తడిసిపోయి వచ్చాడు, నాకే భయమేసింది అతన్ని చూస్తుంటే. “బావకు బాలేదు, దయచేసి మీరు ఒకసారి వచ్చి చూడండి అని ఏడుస్తూ ఖంగారుగా తడబడుతున్న మాటలతో అడిగింది రాధ. పదండి వెళ్దాం అని తొందర చేస్తుంది.” బావ అనగానే వైద్యుడి ముఖం లో మార్పు కనిపించింది. విపరీతమైన ద్వేషం, ఈర్ష, కోపం కనిపిస్తున్నాయి అతనిలో. వస్తున్న కోపాన్ని పళ్ళ కింది అనిచిపెడుతునట్టు కనిపిస్తుంది. “త్వరగా పదండి. రండి... అంటూ అడుగుతుంది రాధ”. “వెళ్దాంలే కాని ఇప్పుడు మీ బావ చనిపోతే నువ్వేం అవుతావ్, తాత లేడు ఉన్న ఒక్క బావ కూడా పోతున్నాడు, అనాధవి అయిపోతావు కదా పాపం అని వైద్యుడు చెప్తుంటే నిర్ఘాంతపోయి పోయి చూస్తుంది రాధ. ఏంటి అలా చూస్తున్నావ్, నిజమే కాదా నేను చెప్పేది. నేను ఎంత చేసినా మీ బావ బ్రతికే అవకాశం లేదు. మీ బావ ఇక లేడనుకో, అనాధగా ఎలా బతుకుతావ్. అందుకే నీకో అద్భుతమైన అవకాశం ఇస్తున్నా, నువ్వు నాతో ఉండిపో. పువ్వులలో పెట్టి చూసుకుంటా. నిన్ను మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను. నా ప్రేమని ఎన్నో సార్లు చెప్పాలని చూసాను, మీ వీధికి రోజూ వచ్చాను, నీకోసం గ్రంధాలయం పెట్టించాను, పుస్తకాలు చదవటం అలవాటు చేసాను, తెలుగు రాయటం నేర్పించాను, డైరీ రాయటం చూపించాను ఇవన్నీ నా ప్రేమని తెలిపే నిదర్శనాలు. కాని నువ్వు ఎప్పుడు నన్ను పట్టించుకోలేదు. దేవుడికి కూడా మనం కలవాలని ఉన్నట్టు ఉంది, అందుకే మీ బావని చంపేస్తున్నాడు. మీ బావని గతం అనుకో, వర్తమానంలోకి రా...రేపటి నుండి కొత్త జీవితం ప్రారంభిద్దాం మనం. ఇక్కడ నీకు ఇబ్బంది అనిపిస్తే వేరే ప్రాంతానికి వెళ్లిపోదాం. నువ్వు నాకు కావాలి, నీకోసం నేను ఏదైనా చేస్తాను. గోవింద్ లేకపోయినా...వాడితో గడిపిన జ్ఞాపకాలు నీడలా నీతోడే ఉంటాయని తెలుసు, కాని నీడల్లో ఎంత కాలం బతకగాలవ్. నాతో రా సుందర ప్రపంచాన్ని నిర్మిస్తాను నీకోసం.” వైద్యడు అలా గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతుంటే రాధ కన్ను రెప్ప వేయకుండా చూస్తుంది. “ఏమంటావ్, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఒప్పుకో...నువ్వు లేకుండా నేను బతకలేను. గోవింద్ ఎలాగు బతకడు, నువ్వు నేను కలిసి బతుకుదాం.” వైద్యడు గొంతులో వ్యత్యాసం వస్తుంది, మొదట నెమ్మదిగా మాట్లాడిన వాడు ఒక్కసారిగా కోపంగా మాట్లాడుతున్నాడు,ఆ వెంటనే దీనంగా అర్ధిస్తున్నాడు. “అదంతా తర్వాత చూద్దాం...ముందు మా బావని బతికించండి, మీరు చెప్పినవి ఒక్కటి కూడా నాకు అర్ధం అవ్వటం లేదు. ఇక్కడ జరిగింది ఏది నేను ఎవరికీ చెప్పను, దయచేసి మా బావని కాపాడండి” అని దీనంగా అడుగుతుంది రాధ. “నేను వచ్చిన కొత్తలో స్నానానికని ఏరు దగ్గరికి వెళ్లాను, అక్కడే మొదటిసారి నిన్ను చూసాను. నువ్వు స్నానం చేస్తున్నావ్, తోడుగా ఎవరు ఉన్నారో నాకు గుర్తులేదు. తెల్లవారు జామున సూర్యుడు, చంద్రుడు ఇద్దరు కనిపించే సమయంలో కలిగే వెలుగులో ఏక వస్త్రం కట్టుకుని తడిచిన దేహంతో నడుచుకుంటూ వస్తున్న నిన్ను చూసిన క్షణం ఏం చేసైనా నిన్ను పొందాలి అనుకున్నాను. ఆ తర్వాత ప్రతి రోజు నీకోసం ఏరు దగ్గరికి వెళ్ళే వాడిని, అప్పుడప్పుడు నువ్వు కనపడే దానివి. కొన్నిసార్లు నిగ్రహం కోల్పోయి నిన్ను హత్తుకుందాం అని వచ్చేవాడిని, కాని అక్కడకి దగ్గరలో ఆ గోవింద్ గాడు కుక్క కాపలాగా ఉండే వాడు. వాడిని చంపెయ్యాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాను. అందుకే మీ తాత మందుల కోసం వాడు వచ్చిన రోజు, జబ్బు కలిగించే మందు కలిపిన మజ్జిగ ఇచ్చాను. ఈ పాటికే చనిపోవాలి, గట్టి పిండం కదూ ఇన్ని రోజులు బతికాడు. ఇప్పటికైనా అర్ధం చేసుకో నీకోసం ఒక మనిషి ప్రాణాలు తీసేంత గొప్ప ప్రేమ నాది. నాతో ఉండిపో...” ఆ మాట వినగానే గట్టిగా అరుస్తూ రాధ కుప్పకూలి కుర్చీలో పడిపోయింది. రాధ కన్నుల నిండుగా నీరు నిండిపోయాయి. బావని కాపాడలేకపోతుంది అనే వాస్తవం, తనని వైద్యుడు కావాలనుకుంటున్నాడు అనే నిజం, బావ చావుకి కారణం వైద్యుడే అనే సాక్ష్యం అన్నీ ఒకేసారి తెలిసేప్పటికి షాక్ కి తన మాట పడిపోయింది. “నీవల్ల కాదు కదూ, జీవితాంతం నాతో ఉండటం నీవల్ల కాదు కదూ. సరే వదిలేయ్...కనీసం ఈ ఒక్క రోజైనా నా దానిలా ఉండు. మీ బావని నేను బతికిస్తా. ఈ ఒక్క రోజే...ఆలోచించుకో. దయచేసి ఒప్పుకో ఒక్కరోజే. మీ బావ ప్రాణాలు కంటే ఈ ఒక్క రోజు ఎక్కువ కాదు”. వైద్యుడు చాలా వింతగా ఉన్నాడు. రాధ ఎంతకీ ఒప్పుకోలేదు. ఏడుస్తూ కూర్చుంది అక్కడే. వైద్యుడు “నాకు ఉన్నవి రెండే కోరికలు. ఒకటి అంతులేని సంపాదన, రెండు నువ్వు. మొదటిది నా వైద్యం మూలానా ఎప్పుడో పొందాను. హరిశ్చంద్ర వేదిక లో జబ్బు చేసి చనిపోయిన వారి ఆస్తులన్నీ నా దగ్గరే ఉన్నాయి. చావు భయం దేన్నైనా ఖర్చుపెట్టేలా చేస్తుంది, అందుకే చనిపోయే ముందు బతికించే ముందు ఇస్తానని చెప్పి చికిత్స చేసినందుకు ఫీజుగా ఆస్తులన్నీ రాయించుకున్నాను. వాళ్ళ కుటుంబం లో ఎవరైనా బతికుంటే నాకు ఇబ్బంది కనుక జబ్బు చేసి చనిపోయిన వారి ఇంట్లో అందరిని సమాధి చేయాలని నేనే చెప్పాను. అది సరే సంపాదన ఎలాగు అనుభవించలేనంత ఉంది ఇప్పుడు నా దగ్గర. ఖరీదైన టేకు బల్లాలు, వెండి గ్లాసులు, బంగారు పళ్ళెం ఎదురుగా ఉన్నా అందులో తినటానికి రుచికరమైన భోజనం లేకుంటే దేనికి అవన్నీ. అందుకే నాకు నువ్వు కావాలి. కాని నా మాట నువ్వు వినవ్. నా కోరిక తీర్చకపోతే ఆ గోవింద్ గాడిని నేనెందుకు కాపాడాలి, పో వాడితోనే చావు. నువ్వు నాకు ఆక్కర్లేదు. వెళ్ళు అని రాధని బయటకి నెట్టి తలుపేసుకున్నాడు”. గోవింద్ అంత్యక్రియల రోజు... హరిశ్చంద్ర వేదిక అంతా నీటితో నిండిపోయి ఉంది. చిన్నప్పటి నుండి ఎవరో ఒకరు చెప్తే వినటం తప్ప చూసింది లేదు. నిజమే అందరూ చెప్పినట్టు నీటి కింద ఉన్న సమాధులు కనిపించేంత నిర్మలంగా ఉన్నాయి నీళ్ళు. గోవింద్ ని దహనం చేయటం ఎలా అని అందరూ ఆలోచిస్తుంటే ఇనుప పడవని ఎడ్ల బండిలో వేసుకు వచ్చాడు వైద్యుడు. దాన్ని ఆ చెరువులోకి దించి అందులో గోవింద్ శవాన్ని ఉంచి దహనం చేయాలని చెప్పాడు అందరికి. గోవింద్ తో పాటు రాధని కూడా దహనం చేయాలి కదా అన్నారు అందరు. కాని రాధకు ఎటువంటి ప్రమాదం లేదు, నేను పరీక్షించాను అని చెప్పి అందరిని నమ్మించాడు వైద్యుడు. నువ్వు ఇక నా సొంతం అనే గర్వం తో కూడిన నవ్వుతో చూస్తున్నాడు రాధని. రాధ అతన్నే చూస్తూ ఉంది ఎటువంటి భావన లేకుండా. గోవింద్ ని పడవలో ఉంచి నిప్పు పెట్టగానే, నా వెనుక ఉన్న రాధ ఆ పడవలోకి దూకేసింది. మంటల్లో కాలిపోతున్నా...తన మోహంలో ఆనందం తొణికిసలాడుతుంది. అప్పటివరకు మాట్లాడని తను, కాలిపోతున్న గోవింద్ ని హత్తుకొని కూర్చొని “అంతా గుర్తుంది...తిరిగి వస్తాము” అంటూ వైద్యుడి వైపు చూస్తుంది. వైద్యుడు ఆ పడవని గట్టిగా తన్నాడు, పడవ ఒడ్డు నుండి దూరంగా కదులుతూ వెళుతుంది. అందరు వెళ్ళిపోయారు, పడవ లో బూడిద మాత్రమె మిగిలింది. ఆ కాగడ ఇప్పటికి మండుతూనే ఉంది. ఆ బూడిదని ఒక సంచిలో కట్టి ఆ నీటిలోకి విసేరేసారు. నా పక్కన ఉన్న కాపరి మాయం అయ్యాడు కొద్దిసేపటి తర్వాతా. నా ఎదురుగా ఉండే దృశ్యం అంతా మారిపోతుంది, చీకటి పడింది. గ్రంధాలయం లో ఉన్నాను నేను కాని రాధ నా పక్కన లేదు. వైద్యుడు వచ్చాడు, అతని వంటి నిండా బంగారపు నగలు ఉన్నాయి, ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఎదురుగా ఎవరూ లేరో నాకు కనపడటం లేదో తెలీదు. అరుస్తున్నాడు, వెళ్ళిపో నన్ను చంపొద్దు, తప్పైపోయింది క్షమించు, ఈ నగలన్నీ మీవే, కావాలంటే తీసుకోండి అని అరుస్తున్నాడు. బయట ఎవ్వరు తలుపు కొట్టకపోయినా, ఎవరూ అని వెళ్లి చూస్తున్నాడు. తన ఇంటి మీద తనే రాళ్ళు విసిరికోడుతున్నాడు. పుస్తకాలు విసిరేస్తున్నాడు, పెయింటింగ్స్ అన్నీ కింద పడేస్తున్నాడు. రాధ గోవింద్ ఉన్న పెయింటింగ్ మాత్రం ముట్టుకోలేదు. ఆ తర్వాత రోజు ఎవరో మంత్రగాడిని తీసుకొచ్చాడు, అతను ఇల్లంతా చూసి ఏమి లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా రోజులు ఇలానే తనంతట తానె అన్ని పడేస్తూ, అరుస్తు అర్ధరాత్రి ఇంటి చుట్టూ తిరుగుతూ భయపడుతున్నాడు. వైద్యం కోసం వచ్చిన వారితో వింతగా ప్రవర్తిస్తున్నాడు. తనని తానె కొట్టుకుంటున్నాడు. కొన్ని రాత్రులు హరిశ్చంద్ర వేదిక దగ్గరికి వెళ్లి ఆ పడవలో కూర్చొని ఆ కాగడాకి నిప్పు అంటించుకొని పెద్దగా అరుస్తూ చెరువంత తిరుగుతున్నాడు. ఆ కాపరికి వైద్యుడు వస్తున్న విషయం తెలీదు. ఆ పడవ తిరగటం చూసి, ఆ శబ్దాలు విని భయపడి ఊర్లో వాళ్ళకు వాడికి వచ్చిన కథ అల్లి చెప్పాడు. అది నమ్మిన జనం హరిశ్చంద్ర వేదిక దగ్గర దయ్యాలు తిరుగుతున్నాయ్ అని అటువైపు వెళ్లకూడదని నిశ్చయించుకున్నారు. ఎవరైనా జబ్బు చేసి చనిపొతే...వాళ్ళని వేదిక గేటు ముందు వదిలి వెళ్ళిపోయేవారు. వైద్యుడు రాత్రి పూట వెళ్లి వారిని దహనం చేసేవాడు. కొద్ది రోజులకు జనం అతన్నో పిచ్చివాడిగా జమకట్టి ఆ ఇంటికి రావటం మానేశారు. అక్కడి నుండి వైద్యుడి ఇంటి వెనుక పెరట్లోకి వచ్చాను. వైద్యుడు ఆరోగ్యం బావునట్టు లేదు, బాగా నీరసించినట్టు కనిపిస్తున్నాడు. ఈలోపు వేరొక వైద్యుడు వచ్చాడు, అతని పక్కన ఓ కుర్రాడు ఉన్నాడు. ఇంకో వైద్యుడు చూసి, ఈయనకు శారీరక రోగం ఏమి లేదు ఎదో మానసిక రోగంతో బాధ పడుతున్నాడు నేనేం చేయలేను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కుర్రాడిని మంచి నీళ్ళు తెమ్మని అడిగాడు వైద్యుడు. కుర్రాడు తెచ్చి వైద్యుడితో నీళ్ళు తాగిస్తున్నాడు, నేను వాళ్ళ ఎదురుగా ఉండి చూస్తున్నాను. అప్పటివరకు సాఫీగా నీళ్ళు తాగిన వైద్యుడి నోటి నుండి నీళ్ళు బయటకు రావటం చూసాను. వైద్యుడి గొంతుని ఎవరో నులిమేస్తునట్టు కనిపిస్తుంది. ఆ వైద్యుడు మెడ ముందు భాగం నుండి చేతి పిడికిలి,ఒక వేలికి ఉన్న ఉంగరం అచ్చు స్పష్టంగా కనిపిస్తుంది చర్మం మీద. ఆ సంఘటన అంత దగ్గరిగా చూసేప్పటికి ఆ కుర్రాడికి మతిబ్రమించింది. నాకు ఏం అర్ధం అవ్వటంలేదు. అంతవరకు కనిపించని రాధ వైద్యుడి లో నుండి బయటకు వస్తుంది అప్పుడు. అంటే రాధ చనిపోయిన తర్వాత నుండి వైద్యుడిలోకి ప్రవేశించి వాడితో ఇవన్నీ చేయించింది అన్నమాట. అంటే హరిశ్చంద్ర వేదిక గురించి అందరికి తెలిసింది నిజం కాదన్నమాట. అంటే వైద్యుడి కోరిక ఇంతమంది చావుకి కారణం అన్నమాట. అదంతా సరే...నాకెందుకు చూపిస్తుంది ఇదంతా అనుకోగానే, వైద్యుడి ఇంటి వెనుక నుండి ఒక్కసారిగా రంగయ్య మావ ఇంటి వెనుక దారిలో చీకట్లో భయంతో కళ్ళు మూసుకున్న చోటికి వచ్చాను. రాధని చూస్తున్నాను, తన ముఖంలో సంతోషం ఉన్నా కళ్ళలో నీల్లోస్తున్నాయి. నాకే తెలీకుండా నా కళ్ళు కన్నీరు కారుస్తున్నాయి. నీకు కావాల్సింది అంతా తెలిసింది కదా, ఇక సంతోషంగా ఉండు బావ అని చెప్పి తను మాయం అయిపొయింది. నా వెనుక ఎవరో పిలుస్తున్న శబ్దం వచ్చి వెనక్కి తిరిగాను, ఎదురుగా ఓ కారు ఆగి ఉంది. అందులో నుండి ఓ అమ్మాయి దిగి గట్టిగా అరుస్తూ నా వైపే వస్తుంది. “ఏవోయ్...పిచ్చి పట్టిందా !? ఈ టైం లో రోడ్ కి అడ్డంగా నిల్చున్నావ్. ఎంత హార్న్ కొట్టిన కదలటం లేదు. చేవుడా ఏంటి. పక్కకి జరుగు నేను వెళ్ళాలి.” ఆ కారు లైట్ల వెలుతురులో తన మొహం సరిగా కనిపించలేదు. దగ్గరిగా వచ్చినప్పుడు కల్లార్పకుండా తననే చూస్తున్నాను. తను నన్ను పట్టుకొని గట్టిగా ఊపిన తర్వాత ఈ లోకంలోకి వచ్చాను. తను అచ్చం రాధలా ఉంది. “ఓయ్...పలకటం లేదు, జరగటం లేదు ఈ అనురాధ కారుకే అడ్డుగా నిల్చున్నావ్, ఇంత దారుణంగా ఉన్నావ్ ఎవరయ్యా నువ్వు ?” అని అడిగింది తను. అ...నేనా గోవిందరాజండి. కథ సమాప్తం. :)