Chai Bisket’s Story Series – రాధే గోవింద (Part – 7)

Updated on
Chai Bisket’s Story Series – రాధే గోవింద (Part – 7)
(జరిగిన కథ – Part-1, Part- 2, Part-3, Part – 4, Part - 5, Part - 6.) నా కాళ్ళు భూమిలో కూరుకుపోయినట్టు ఉన్నాయి, ఇంచ్ కూడా కదలటం లేదు. చల్లటి గాలిలో కూడా నాకు చెమట పడుతుంది. కళ్ళని కనురెప్పలు మూసెయ్యాలని చూస్తున్నాయి. నరాల్లో రక్తం కాలి చివరి వేలు నుండి మెదడులోని న్యురాన్స్ వరకు ప్రవహించటం తెలుస్తుంది. కండరాల కదలికలు, ఊపిరి పయనం స్పష్టంగా తెలుస్తుంది. గుండె చప్పుడు డాల్బీ డిజిటల్ సౌండ్ లో వినిపిస్తుంది. లబ్...డబ్ అని కాకుండా లబ్డబ్ లబ్డబ్ గా పది సార్లు ఫాస్ట్ ఫార్వర్డ్ లో కొట్టుకుంటుంది హృదయం. చేతులు వణుకుతున్నాయి, చలికి మాత్రం కాదు. ఎదురుగా ఉన్నది రాధే నా అనే సందేహాన్ని నిరూపణ చేసుకుందాం అని ఎవరమ్మా అని గాట్టిగా అరుద్దాం అనుకున్నాను కాని నా వళ్ళ కాలేదు. హనుమాన్ చాలీసా మనసులో మార్మోగిపోతుంది. జై హనుమాను జ్ఞానగుణసాగర్.... అనుకుంటూ దైర్యం కూడ కట్టుకొని ఎవరమ్మా...అది...నువ్వు నాస్రావ్ బాబాయ్ కూతురు నాగమ్మ కదూ అన్నాను. ఎదో పేరు చెప్పి పిలిస్తే పలుకుతుందని అనుకున్నా...కాని ఎదురుగా ఎటువంటి చలనం లేదు. విపరీతమైన భయం కలిగితే శరీరం లో అన్ని భాగాలు అద్భుతంగా పనిచేస్తాయి అని ఎవరో రాసింది చదివినప్పుడు నేను నమ్మలేదు. కాని ఇప్పుడు అనుభవం అవుతుంటే నమ్మక తప్పటం లేదు. నా చెవులు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాయ్ అంటే దగ్గరలో ఉన్న కొలిమి లో నిప్పు కాలుతున్న శబ్దం దగ్గరి నుండి ఎదురుగా ఉన్న రాధ కురులు గాలికి కదులుతున్న శబ్దం వరకు అన్నీ అత్యంత స్పష్టంగా వినిపిస్తున్నాయ్. ఓ రెండు గంటల పైన అక్కడే నిల్చునట్టు అనిపించింది, తెల్లారి పోవాలి కదా అని టైం చూసాను. నేను అక్కడ నిల్చొని రెండు నిమిషాలు కూడా అవ్వలేదు. ఈ లోపు కొన్ని వేళ కోట్ల ఆలోచనలు నా మనసులో మెదిలాడాయి. నేను ఎవరమ్మా ఎవరమ్మా అని పిలవటం ఆపలేదు. కొద్దిసేపటికి అరవటం ఆపు అన్నట్టుగా చేతి సైగా చేసింది ఎదురుగా ఉన్న అమ్మాయి. నేను వెంటనే ఆపేసాను, గుండె ఇంతకు ముందు కంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో కొట్టుకుంటుంది. తను నా వైపు తిరిగింది. ఆ క్షణంలో ఆ వీధిలో ఉన్న లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయ్. నేను భయంతో కళ్ళు మూసుకున్నాను. తన పరికిణీకి ఉన్న ఘజ్జేల శబ్దం ని బట్టి తను నాకు దగ్గరగా వస్తున్నట్టు అర్ధం అవుతుంది. కళ్ళు తెరిచే ధైర్యం లేదు నాకు. ఎంతో దైర్యవంతుడిని అనుకున్నాను కాని నాలోనూ ఓ పిరికి వెధవ ఉన్నాడని ఈ రోజే తెలిసింది. ఎదురుగా ఉన్నది మనిషో కాదో తెలీదు కాని, తెలుసుకునే సాహసం చేయలేకపోతున్నాను. ఇంత భయం ఉన్నవాడికి నీకెందుకురా హరిశ్చంద్ర వేదిక గురించిన అన్వేషణ అని నన్ను నేనే తిట్టుకుంటున్నాను. ఘజ్జేల శబ్దం రావటం ఆగిపోయింది. గంధపు వాసన మాత్రం నా ముఖం ఎదురుగా ఉన్నట్టు దట్టంగా వస్తుంది. కనులను మూసి ఉన్న నా చేతులని తాకాయి తన చేతులు. ఎంత చల్లగా ఉందో ఆ స్పర్శ. తన చేతులు నా చేతులని కనులపై నుండి తీసేసాయి. తను నన్ను తాకిన క్షణం నా ఒంట్లోని భయం ఆవిరైపోయింది. కళ్ళు తెరిచి చూసాను ఎదురుగా ఓ అమ్మాయి ఉంది. రాత్రి కాస్తా తెల్లారి పోయింది. అద్భుతంలా ఉంది ఆ అమ్మాయి. పాల మీగడ రంగు, కారు చీకటి కురులు, చూపు తిప్పుకోలేని కన్నులు, లేత గులాబీ రంగు పెదాలు ఇలా వర్ణించుకుంటు పొతే తన అందం పొగడటానికి తెలుగు బాషలో ఉన్న పద ప్రయోగాలు, అలంకారాలు, ప్రాసలు, అతిశయోక్తులు ఏవి సరిపోవేమో అనిపించింది. ఆకుపచ్చ పరికిణీ పైన పసుపుపచ్చ ఓణి వేసుకొని, తలనిండుగా కనాకాంబరాల పూలు దండగా పెట్టుకొని, నుదుటిన మెరిసిపోతున్న బొట్టు, కళ్ళకు దిష్టి తగలకుండా కాటుక, మెడకు సువాసన పంచె గంధం, నడుముకు జారిపోతున్న వడ్డానం, చేతులకు ఎర్రగా పండిన గోరింటాకు, కాళ్ళకు మంచి చేసే పసుపు రాసుకున్న ఐదడుగుల నాలుగు అంగుళాల అచ్చ తెలుగు అందం నా ఎదురుగా నిలబడింది. తన చేతిలో ఓ డైరీ ఉంది. నేను గ్రంధాలయం లో వదిలేసి వచ్చిన డైరీ ఈ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చింది. రాత్రి పూట భయంతో కళ్ళు మూసుకొని తెరిచేలోపు ఎలా తెల్లారిపోయింది ? అసలు ఎక్కడ ఉన్నాను నేను అనుకోని చుట్టూ చూసాను. దిమ్మ తిరిగిపోయింది. నేను గ్రంధాలయం లో ఉన్నాను. అది కూడా ఇందాకటి వరకు ఉన్న గ్రంధాలయం కాదు అప్పుడే కట్టిన కొత్త గ్రంధాలయం. అక్కడ బల్ల మీద ఉన్న వార్తా పత్రిక ప్రకారం అది 1924 జూలై 12. అంటే రాత్రి ఎదురుగా ఉన్న రాధ నన్ను ముట్టుకోగానే తొంబై ఏళ్ళు వెనక్కి వచ్చానా ? మరో కల కంటున్నానేమో అని నన్ను నేనే కొట్టి చూసుకున్నాను. కల కాదని అర్ధం అయ్యింది. తననే అడుగుదాం అని తనని పట్టుకోబోయేలోపు తనే నా వైపుగా నడుచుకుంటూ వచ్చింది. నేను పక్కకి తప్పుకున్నాను. ఏవండీ నేను ఎక్కడ ఉన్నాను ? మీరు రాధ గారే కదా. రాత్రి నా ఎదురుగా ఉన్నది మీరే కదా. నేను ఇక్కడికి ఎలా వచ్చానో చెప్తారా ప్లీజ్ అంటూ గొంతు చించుకు అరుస్తున్నాను నేను. తనేం మాట్లాడటం లేదు. అదే సమయంలో తన చేతి గాజులు బల్ల మీద నుండి కింద పడబోతుంటే చూసి పట్టుకుందాం అని చేయి పెట్టాను. గాజులు నా చేతిలోపలి నుండి వెళ్లి కిందపడి పగిలి పోయాయి. రాధ పరిగెత్తుకు వచ్చి ఆ పగిలిన ముక్కలు ఏరి కాగితంలో చుట్టి సంచిలో పెట్టుకుంది. తను కూడా నాలో నుండి వెళ్ళింది. నాకు చుచ్చు పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికి అర్ధం అయ్యింది, డైరీ లో లేని విషయాలు ఏవో చెప్పాలనుకుంటుంది రాధ. అందుకే నన్ను ఇలా తనతో పాటు ఆ కాలానికి తీసుకొచ్చింది. అదే సమయంలో వైద్యుడు కూడా వచ్చాడు. రాధ తన కుర్చీలో కూర్చొని డైరీ రాసుకుంటుంది. రాధ వెళ్లిపోతుంది, నేను వెళ్ళకుండా అలానే నిల్చున్నను వైద్యుడు ఏం చేస్తుంటాడో చూద్దాం అని. కాని నా ఆధీనంలో లేకుండా నేను నడుస్తున్నాను. ఇక్కడ జరిగే ప్రతీది నేను చూడగలను కాని నన్నెవ్వరు చూడలేరు. ఈ క్లారిటీ వచ్చేసాక భయం పోయి ఆసక్తి పెరిగింది. ఇలా రావటం బావుంది కాని ఓ చిన్న మెలిక ఉన్నట్టుంది. రాధ తో వచ్చాను కనుక తనకు అనుభవం కాని ఏ విషయం నేను చూసే అవకాశం లేదు, ఇంకోటి రాధ నేను తెలుసుకోవాలి అనుకున్నవి మాత్రమే చూడగలను. ఇదేదో వర్చ్యువల్ సినిమా చూస్తున్నట్టు ఉంది. అంతా దగ్గరుండి చూడొచ్చు కాని ఏది ముట్టుకోలేం, ఆపలేం, మార్చలేం తన డైరీ లో రాసిన ప్రతి రోజుని దగ్గరుండి చూసాను. గోవింద్ పట్నం అతనితో గొడవ పడటం, రాధ మీద ప్రేమను చెప్పటం అన్నీ ఎదురుగా ఉండి విన్నాను. రాధే గొప్ప అందగత్తే అనుకుంటే గోవింద్ రాధకంటే అందంగా ఉన్నాడు. చమనఛాయ, తీక్షణమైన కళ్ళు, గంభీరమైన స్వరం, గర్వం చూపించే మీసకట్టు, పొడుగు చేతులు, విశాలమైన భుజాలు, ధృడమైన దేహం, సమ్మోహన రూపం కలిగిన ఐదడుగుల పదకొండు అంగుళాల అచ్చ తెలుగు పౌరుషంలా ఉన్నాడు గోవింద్. వాళ్ళిద్దరి ప్రేమ గురించి చూసి మురిసిపోవటమే తప్ప చెరిగిపోకుండా కాగితం పై రాయలేం అనిపించింది. రాధ ని చూసినప్పుడు గోవింద్ కళ్ళలో మెరుపు చూసాను, గోవింద్ కనపడనప్పుడు రాధ కళ్ళలో నిస్తేజం చూసాను. రాధ కాళ్ళకు ఘజ్జల పట్టీలు బరువని చెప్పి, పట్టీలకు ఉన్న ఘజ్జలు తీసేసాడు గోవింద్. కాని రాధకు ఘజ్జల శబ్దం ఇష్టం అని తెలిసి పరికిణీ చివరణ కుట్టాడు తనే స్వయంగా. రాధకు నచ్చనివి ఏవి గోవింద్ చేసేవాడు కాదు. రాధ ఇష్టాన్ని ఎప్పుడు కాదనేవాడు కాదు. అతని ప్రవర్తన, మాట తీరు, చూపులు, నడక చూస్తే రాధ రాసిన దానికంటే ఎన్నో రెట్లు గోప్పవాడిలా అనిపించాడు గోవింద్. డైరీ రాయటం అలవాటు లేక ముందు జరిగిన కొన్ని సంఘటనలు, డైరీలో రాయని సంఘటనలు చూసాను నేను. గోవింద్ వైద్యుడి కి రాధ వైపు చూడద్దు అని చెప్పిన తర్వాత రాధ అడిగింది గోవింద్ ని ఏమైంది అని. గోవింద్ ఏం అవ్వలేదని చెప్పాడు. నువ్వేం మాట్లడావో నేను విన్నాను; అలా చెప్పాల్సిన అవసరం ఏముంది ? మనిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం కదా మధ్యలో ఆ వైద్యుడి మనసులో ఏముందో తెలుసుకోకుండా అలా భయపెట్టటం ఎందుకు బావ ? “రాధమ్మా...కొన్ని విషయాలు నీకు అర్ధం అవ్వవు. వైద్యుడు ఎందుకు వచ్చాడో నాకు తెలుసు. అతను నీ వైపు ఎలా చూస్తున్నాడో నీకు తెలీదు. నేను అతనికి సలహా మాత్రమే ఇచ్చాను భయపెట్టలేదు. సలహా ఇచ్చింది మన బంధం పై అనుమానంతో కాదు, అతని ప్రాణం పై గౌరవంతో. ఈ రోజు నేనలా చెప్పకపొతే...రేపు వాడు నిన్ను ఇబ్బందిపెట్టినట్టు తెలిసి అతని ప్రాణాలు ఎక్కడ తీస్తానో అన్న భయంతో. మన మనసులో కల్మషం లేనంత మాత్రాన ప్రపంచం అంతా అలానే ఉంటుంది అనుకోవటం అమాయకత్వం అవుతుంది. గుర్తుంచుకో... అమాయకత్వం అన్ని వేళలా మంచిది కాదు.” రాధ వాళ్ళ తాతకు ఆరోగ్యం బాలేనప్పుడు వచ్చిన మేనత్త చుట్టాలతో గోవింద్ మాట్లాడుతున్న రోజు... “చూడండీ! రాధ చుట్టాలు అంటున్నారు, ఇప్పటివరకు మీరు ఉన్నారనే మాకు తెలీదు. ఐనప్పటికీ సంతోషం ఇప్పటికైనా మీరున్నారని తెల్సినందుకు. ఆస్తి అంటారా నాకు చిల్లిగవ్వ కూడా వద్దు, అంతా రాధ ఇష్టం. కానిసమయం లో...కానికోరికలు కోరుతున్నారు... తప్పు. మొదటిసారి వచ్చారు భోజనం చేసి బయలుదేరండి.” గోవింద్ ఓ పెద్ద మనిషిలా మాట్లాడుతుంటే అవతలి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఒకడు గోవింద్ పై చేయి చేసుకున్నాడు కూడా. కాని గోవింద్ పెద్దగా తీసుకోలేదు. కనురెప్పల లోపలే కోపాన్ని కట్టేసినట్టు ఉన్నాయి కళ్ళు. నరాలలో పొంగుతున్న రక్తాన్ని పిడికిలి బిగించి ఆపుతున్నట్టు ఉన్నాయ్ చేతులు.ఆ సమయంలో ఒకడు రాధను ఉద్దేశించి “నీయమ్మ! ఎందుకు ఇవ్వవే ఆస్తి” అన్నాడు. అంతే కట్ట తెగిన ఏరులా నిప్పులు కురుస్తున్న కళ్ళతో లేచాడు గోవింద్. చితకోట్టేస్తాడు అనుకున్నాను కాని మాటలతోనే పంపించేసాడు అందరిని. “నువ్వు రాధ కి మావయ్య అవుతావ్ అంటే నాకు బాబాయ్ అన్నమాట. ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరు నాకంటే పెద్ద వారు, నాతో ఎదో ఒక బంధుత్వం ఉన్నవారు. మనవాళ్లు కదా అని మాటలతో చెపుతున్నాను బాబాయ్. వద్దు...అవసరం లేని చోట, అవసరం కాని వేళల్లో, అనవసరంగా ఆడవాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దు...కోపంతో ఉన్న నా కళ్ళనే చూసి తట్టుకోలేరు మీరు అలాంటిది నా కోపాన్ని చూడాలి అనే ఆలోచన రానివ్వద్దు. వెళ్ళండి, భోజనం చేసి వెళ్ళండి.” గోవింద్ చనిపోయే ముందు... “రాధమ్మా... నేను ఉన్నా లేకున్నా ఎప్పుడూ కన్నీరు పెట్టకు. అమ్మ దగ్గరికి వెళ్తున్న ఆనందం కన్నా, అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అనే బాధ ఎక్కువ ఉంది. చివరి వరకు తోడుగా ఉండలేకపోతున్నాను నన్ను క్షమించు.” గోవింద్ ని చూస్తే తప్ప అతని గొప్పతనం అర్ధం అవ్వదు అనిపించింది. ఆ రోజుల్లోనే కాదు ఏ రోజుల్లోనూ అంతటి స్పష్టత ఉన్న మనిషి ఉండకపోవచ్చు. గోవింద్ లాంటి ప్రత్యేకమైన ఉన్నత వ్యక్తిత్వం ఉన్న మనుషులు పుట్టటం చాలా అరుదు. రాధకు గోవింద్ దొరకటం దేవుడు ఆమెకు చెప్పకుండా ఇచ్చిన వరం ఏమో!. రాధ వాళ్ళ తాత దహనం హరిశ్చంద్ర వేదిక లో చేస్తున్న రోజు... తాతని దహనం చేసేప్పటికే అక్కడ చాలా సమాధులు ఉన్నాయి. వీళ్ళు మధ్యానం మూడింటికి దహనం మొదలెట్టారు అది పూర్తయ్యేప్పటికి సాయంత్రం ఆరు దాటింది. అప్పటికే అక్కడ వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. దాదాపు మధ్యానం వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. రాధ, గోవింద్, కాటి కాపరి తప్ప ఇంకెవ్వరు లేరు. ఒక్కసారిగా చాలా చల్లగా అయిపొయింది ఆ ప్రదేశం అంతా. రాధ మోహంలో ఎదో మార్పు. గాలి రాకున్నా రాధ కురులు ఎగురుతున్నాయి. కళ్ళు పెద్దగా అవుతున్నాయ్. తల దించుకొని, గోవింద్ చేతిని గట్టిగా పట్టుకొని చంపేస్తాను, ఆ వైద్యుడిని చంపేస్తాను, నా పిల్లలు భర్తా వాడి వల్లనే చనిపోయారు అని అరుస్తుంది రాధ. గోవింద్ రాధని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. నేను కొద్ది దూరంలో నిల్చొని రాధనే చూస్తున్నాను. గోవింద్ చేతిని విడిపించుకొని ఏంట్రా అలా చూస్తున్నావ్ అంటూ నా కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ నా వైపుగా ఉరుక్కుంటూ వస్తుంది రాధ, తన మోహంలో ద్వేషం, కోపం కలిపి కనిపిస్తున్నాయి... మిగతాది తర్వాతి భాగం లో...