Chai Bisket's Story Series - రాధే గోవింద (Part - 1)

Updated on
Chai Bisket's Story Series - రాధే గోవింద (Part - 1)

మా రూం కి వెళ్ళాలంటే ఒక స్మశానాన్ని ఆ తర్వాత శివుడి గుడిని చివరిగా పెద్ద ఆట స్థలాన్ని దాటి వెళ్ళాలి. మా రూం తర్వాత ఇంకో రెండు మూడు ఇల్లులు ఆ తర్వాత బ్రిటిష్ వారి కాలం లో కట్టిన మానసిక రోగుల మిషన్ ఆసుపత్రి మెయిన్ గేటు ఉంటుంది, దాన్ని దాటి మేము ఎప్పుడు వెళ్ళింది లేదు. అద్దె తక్కువ కదా అని అక్కడ తీసుకున్నాం. మేము ఉండేది 4 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లోని సింగల్ రూం లో. నేను ఇంకో ఇద్దరం కలిసి ఉంటాం, ఒకటే రూం దాంట్లోనే బాత్రూం కూడా. ఎవ్వరు వచ్చేది వెళ్ళేది మాకు కనిపిస్తూ ఉండేది, లిఫ్ట్ మా రూం కి ఎడమ వైపుగా, మెట్లు కుడివైపుగా ఉండేవి. మా రూం పక్కగా వాచ్ మెన్ రూం ఉండేది. రూం లో నాకు ఒక్కడికే చనిపోయిన తర్వాత విషయాల గురించి చాలా ఆసక్తి, మిగిలిన ఇద్దరికీ కొద్దిగా భయం. నేను అవి ఇవి చెప్పి రాత్రి పూట వాళ్ళని బయపెడుతూ ఉండేవాడని పడుకున్నప్పుడు. నా కంప్యూటర్ లో సినిమాలు అన్ని దయ్యాల సినిమాలే, భాషా బేధం చూపించకుండా అన్ని భాషలలోని హారర్ సినిమాలు చూసేవాడిని. ఎందుకింత ఆసక్తి అంటే చిన్నప్పుడు మా ఊర్లో వినిపించే కథ గురించి చెప్పాలి. అప్పుడు నాకు పదేళ్ళు అనుకుంటా, మాది ఓ టౌన్ కి దగ్గరలో ఉన్న పల్లెటూరు, మా ఇంటికి దగ్గరిలో 200 చెట్లకు పైగా ఉండే మా మామిడి తోటలో, రోజు బడి నుండి రాగానే ఆడుకునే వాళ్లం అందరం. మా అమ్మ చెపుతుండేది ఎంతసేపైన ఆడుకో కాని చీకటి పడేలోపు ఇంటికి వచ్చేయ్, తోట మొదట్లోనే ఆడుకోవాలి లోపకి వెళ్ళకూడదు అని. ఎందుకు అని నేను చాలా సార్లు అడిగాను, తానెప్పుడు కారణం చెప్పలేదు. మా ఊర్లో మాత్రం ఓ పుకారు ఉండేది రాత్రి చీకటి పడిన తర్వాత మా మామిడి తోటలో ఎవరో తిరుగుతుంటారు అందుకని అటు వైపు ఎవ్వరు వెళ్ళకండి అని చెపుతుండేవారు. మా తాత ఎప్పుడు ఆ తోటలోనే ఉండేవాడు, ఆయన బతికున్నంత కాలం ఆ తోటకు కాపలాగా, చెట్లను చంటిబిడ్డల్లా చూసుకునేవాడు. మంచి మంచి పండ్లు చెట్టు దగ్గర ఎండిన వరి గడ్డిలో మాగేసి మా అమ్మకు ప్రత్యేకంగా తినేపించేవాడట, అమ్మ అంటే తాతకు ప్రాణం. ఆయన ఈ మధ్యనే కాలం చేసారు, 80 ఏళ్ళు పైన ఆనందంగా బతికిన మనిషి, మామిడి తోటంటే ఆయనకు కుటుంబం కిందే లెక్క, మాతో కన్నా తోటలోనే ఎక్కువ గడిపిన మనిషి, ఆ అనురాగం వల్లనే రాత్రి పూట కాపలాగా తిరుగుతుంటాడు అని అంటుండే వారు కొంతమంది. మా తాత కాలం చేసిన తర్వాత వారం మా తోట చుట్టూ వేసిన కంచె పక్కగా ఇద్దరు ప్రేమికులు చనిపోయి పడి ఉన్నారు. వాళ్ళ ఒంటి మీద ఎటువంటి గాయం లేదు, చావుకి కారణం ఎవరికీ తెలీలేదు. మా తాత కాలం చేసిన తర్వాత ఆ తోటని పెద్దగా పట్టించుకోలేదు మా నాన్న గారు. 200 చెట్లలో మా ఇంటి నుండి వెళ్తుంటే ముందుగా కనిపించే ఓ 20 - 30 చెట్ల వరకు బావుండేవి వాటిని దాటి ఎవ్వరు ముందుకు వెళ్ళేవారు కాదు. మేము కూడా తోట మొదట్లో ఆడుకునే వాళ్ళం లోపలకి వెళ్ళింది లేదు. తోటలో ఆడుకునే సమయం లో అప్పుడప్పుడు మా తాత పిలుస్తునట్టు అనిపించేది నాకు, మా ఫ్రెండ్స్ కు చెప్పేవాడిని వాళ్ళు సరదాగా ఆటపట్టించటానికి చేస్తున్నాను అని నవ్వేవాళ్ళు. మా తోటకు దగ్గరలో పెద్ద చెరువు దానికి అటు చివరగా పెద్ద అడవి ఉండేవి. వినాయక నిమజ్జనం అప్పుడు తప్ప ఆ చెరువు దగ్గరికి ఎవ్వరు వెళ్ళరు. అది కూడా సాయంత్రం 5 లోపు ముగించేస్తారు. మా తాత వాళ్ళతాత వాళ్ళ చినప్పుడు అంటే ఓ 100 ఏళ్ళ క్రితం అక్కడ చెరువు ఉండేది కాదు అదో స్మశానం అట, ఏదైనా రోగం వచ్చి హటాత్తుగా చనిపోయిన వారిని మాత్రమె అక్కడ పూడ్చేవారట, భర్తకు జబ్బు చేసి చనిపోతే అతని భార్య ను పిల్లలతో సహా బతికుండగానే వారి సామాన్లు ఆస్తులు బంగారం అన్నిటితో కలిపి తగలెట్టేవారట లేదా పూడ్చేవారు. వారి ద్వారా ఇంకెవరికైనా వస్తుందేమో అన్న అనుమానంతో. అది లోతట్టు ప్రాంతం అవ్వటం వలన వర్షం వచ్చినప్పుడల్లా ఆ స్మశానం నీటితో మునిగి పోయేది, నీళ్ళనీ ఇంకిపోవటానికి చాలా సమాయం పట్టేది, ఆ సమయం లో ఎవరైనా జబ్బుతో చనిపోతే వారిని ఓ ఇనుప పడవలో పెట్టి నిప్పెట్టి, బూడిదను నీటికి తడవని ఒక వస్త్రంలో కట్టి చెరువులోకి విసిరేసేవారట. చెరువు ఇంకిపోయిన తర్వాత ఆ బూడిదను మట్టిలో కప్పెట్టేవారు. ఆ స్మశానం ఎంత పెద్దగా ఉండేది అంటే చుట్టు పక్కల చాలా ఊర్ల వాళ్ళు ఇక్కడే దహనం చేసేవారు జబ్బు చేసినవాళ్ళని. విచిత్రం ఏమిటంటే ఎవరినైనా కాల్చేప్పుడు పొగ అస్సలు వచ్చేది కాదట, ఆ తర్వాత రోజు మాత్రం విపరీతమైన పొగ వచ్చేదట. అక్కడ ఉండే ఇనుప పడవ ఇప్పుడు కనపడటం లేదు కాని, అప్పుడప్పుడు మండుతున్న పడవ నీటిపైన తేలుతూ ఉండటం కొంతమంది చూసాం అని చెపుతుంటారు. నిప్పు పెట్టేందుకు వాడిన కాగడా ఎప్పుడు మండుతూనే ఉంటుంది అంటారు. ఒక్కసారి కొంతమంది దొంగలు ఆ సమాధుల్లో ఉన్న బంగారం డబ్బు కోసం అమావాస్య రోజు రాత్రి వెళ్లారట, కాటి కాపరిని కొట్టి మరీ లోపలకి వెళ్లారు వాడు వద్దని ఎంతగా వారిస్తున్నా వినకుండా, వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. తర్వాత రోజు కాపరికి స్మశానంలో కొన్ని కొత్త సమాధులు కనిపించాయి వాటి మీద ఆ దొంగలు తెచ్చుకున్న సామానులు గుర్తుగా పెట్టి ఉన్నాయట. చాలా రోజుల తర్వాత ఆ కాపరి కూడా కనిపించకుండా పోయాడు. పారిపోయాడ చచ్చిపోయాడ అని ఎవ్వరికి ఆచూకి తెలీదు. వాడి గదిలో వాడికి సంబందించిన ఒక్క వస్తువు కూడా దొరకలేదు. స్మశానం నుండి అప్పుడప్పుడు చిన్న పిల్లల ఏడుపులు, భార్య భర్తలు గొడవ పడుతునట్టు అరుపులు, రోగం తో బాధ పడుతున్న మనుషుల ఆర్తనాదాలు వినిపిస్తుండేవట, అలా వినిపించిన రోజు ఎక్కడో ఒక ఊరిలో ఎవరో ఒకరు మరణించే వారు. కొంతకాలం తర్వాత ఎవరైనా జబ్బు చేసి మరణిస్తే, వారిని మాత్రమె స్మశానం మొదట వదిలి వచ్చేవారట, తర్వాత రోజు వెళ్లి చూస్తె ఆ శవం కనపడేది కాదు. ఈ విషయాలు తెలిసి భయంతో ఆ స్మశానాన్ని మూసేశారు, అటువైపు ఎవ్వరు వెళ్లకూడదని నిశ్చయించుకున్నారు. ఆ చెరువులో నీళ్ళు చాల తేటగా ఉండేవి కింద ఉన్న సమాధులు కనిపించేలా, పూర్ణమి రోజు చంద్రుడి ప్రతిబింబం స్పష్టంగా కనిపించేది ఎంతలా అంటే భూమి పైకి చంద్రుడు దిగాడా అని భ్రమించేలా. కొన్నేళ్ళు నిర్విరామంగా నెలకు పదిహేను రోజులు వర్షం పడటం వలన ఆ స్మశానం పూర్తిగా నీటిలో సమాధి అయిపొయిందిట. మా తాతకు ఆ దగ్గరలో స్థలం ఉండటంతో అక్కడ మామిడి తోట పెంచటం మొదలెట్టాడు, నీళ్ళు లేకపోయినా ఎరువులు వేయకపోయినా మా తోట కొన్నేళ్లలో బాగా ఎదిగింది. స్మశానానికి పర్లాంగు దూరం లో ఉండేది మా తోట వెనుక కంచె. తోట మొదలు నుండి చివరకు నడవటానికి దాదాపు పదిహేను నిమిషాలు పట్టేది చుట్టూ మామిడి చెట్లు వరసగా ఉండేవి. తోట చివరలో ఉన్న చెట్లకు కాసిన పండ్లు ఎప్పుడు పండలేదు, రేపటికి పండుతాయి అనుకుని రేపు వచ్చి చూస్తె చెట్టుకు ఒక్క కాయ కూడా కనపడేది కాదుట. అందుకని మా తాత తోట చివరి మూడు వరసల్లోని చెట్ల పండ్లు ఎప్పుడు చూసేవారు కోసేవారు కాదు. మా తోటలో తిరిగే మనిషి గురించి, ఆ వెనుక ఉన్న చెరువు గురించి తెలుసుకోవాలని నాకో ఎంతో ఆసక్తి ఉండేది, కాని మా అమ్మ అటువైపు వెళ్ళద్దు అని నాతొ ప్రమాణం చేయించటం వలన నా మదిలో ఆ చెరువు హిస్టరీ ఓ మిస్టరీలా మెదులుతూనే ఉంటుంది. దాని వలెనే నేను చావు తరవాత మనం ఏం అవుతాం ఆత్మలు దయ్యాలు అనే అంశం మీద రీసర్చ్ చేయటం మొదలెట్టాను ఒకవైపు జాబు చేసుకుంటూ. ఇదే విషయం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండటం వలన నాకు ప్రతి చిన్న శబ్దం వినిపిస్తుండేది, చీకట్లో కూడా ఎదురుగా ఉన్నది ఎవరో అర్ధం అవుతుండేది. ప్రతి చిన్న విషయానికి భయపడేవాడిని మొదట్లో కాని వాటి గురించిన వివరణ తెలుసుకోవటం మొదలెట్టాకా భయం తగ్గిపోయి తెలుసుకోవాలనే కుతూహలం పెరిగిపోయింది. మా ఊరి చెరువు దగ్గరికి వెళ్ళలేదు కాని దాని గురించి తెలిసిన ప్రతి ఒక్కరిని కలవాలని నిశ్చయించుకున్నాను. చాల మందిని కలిసాను, కలిసిన ప్రతి ఒక్కరు ఒక్కో కథ చెప్పేవారు నిజమో కాదో చెప్పలేను కాని ఆశ్చర్యంగా ఉండేవి. ఆ చెరువు గురించి ఎన్నో కథలు, ఉన్నపళంగా నీళ్ళని ఇంకి పోయి సమాధులు కనిపించేవట, నీళ్ళ పైకి సమాధులు తేలేవట, నీళ్ళ మీద ఆకులు మునిగిపోయి రాళ్ళు తేలేవట, చెరువులో చేపలు ఒక్కటికూడా ఉండేవి కావు, కనీసం నాచు కూడా పెరిగేది కాదు ఎప్పుడు నీళ్ళు స్వచ్చగా ఉండేవట, జబ్బు పడిన మనుషులు వాళ్ళంతట వాళ్ళే వెళ్లి స్మశానంలో కూర్చునేవారట, వాళ్ళని సమాధి చేస్తుంటే ఆనందంగా నవ్వుతుండేవారట, కొంతమంది తిడుతూ ఇంకోతమంది శపిస్తూ మరికొందరు ఏడుస్తూ సమాధి అయ్యేవారట. కాలం తో సంబంధం లేకుండా ఆ చెరువు దగ్గర ఎప్పుడు చల్లగా ఉంటుందని అందరు అనేవారు. ఆ చెరువు గురించి చెప్పిన విషయల్లో అన్నిటికంటే ఆసక్తి రేపినది ఇప్పటికీ నన్ను వెంటాడుతున్నది రాధా గోవింద్ అనే ఇద్దరు ప్రేమికుల గురించి చెప్పిన విషయాలు. అప్పటివరకు చెప్పిన కథలన్నీ కట్టుకథలని కొట్టిపారేసిన నేను, రాధ గోవింద్ గురించి చెప్పిన విషయాలు అంత సులువుగా తీసేయలేకపోయాను.

మిగిలిన కథ తర్వాతి భాగం లో...