'ఆర్. నారాయణ మూర్తి' తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు ఇది. హిట్ కు పొంగిపోరు, ఫ్లాప్ కు కుంగిపోరు. తను చేసిన సినిమా హిట్ అవుతుందా అట్టర్ ఫ్లాప్ అవుతుందా అని ఆయన ఆలోచించరు.. "నేను చేసిన సినిమాలో నిజాయితీ ఉందా..?, అందులో నిజం ఉందా..? ఏ తప్పు లేకుండా సమాజాన్ని సరైన పద్దతిలో స్పూర్తిని రగిలిస్తున్నానా..? అని మాత్రమే ఆయన ఆలోచిస్తారు. ఆయన ఎలాంటి వారో, ఆయన సినిమాకున్న శక్తి ఎలాంటిదో అందరికి తెలిసిందే. తనని చూసి కొంతమంది నవ్వినా, తన సినిమాలకు ఏ లాభం రాకపోయినా, తన సొంత సుఖాలన్ని త్యాగం చేసి ఎంతో కష్టపడి సినిమాలను తీస్తుంటారు.. "ఒకవేళ ఆయన తన దారిని మార్చుకుని మిగిలిన అన్నిరకాల సినిమాలను, అన్ని రకాల క్యారెక్టర్లు చెయ్యడానికి నేను సిద్దమే అంటే ఒక నెలలోనే కోటీశ్వరుడు ఐపోగలరు.
ఆర్. నారాయణ మూర్తి గారి సినిమాకు ఎంత రాబడి వస్తుందో మనకు తెలుసు. ఒకవేళ ఆ సినిమా నుండి ఎక్కువ లాభాలు వచ్చినా ఆ డబ్బులతో బిల్డింగులు కాని, కార్లు కాని ఇవ్వేమి కొనరు. ఆ సినిమా ద్వారా వచ్చిన లాభాలను సినిమా కోసం చేసిన అప్పుల కోసం వెచ్చిస్తారు. ఇంకేమైనా మిగిలితే తన సొంతూరులో అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించే గొప్ప మానవతావాది మన మూర్తి గారు. 30 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న సుధీర్ఘ కెరీర్ లో కారు, సొంత ఇల్లు లేకుండా ఒక సాధారణ మనిషిలా రోడ్డు మీద నడుచుకుంటు వెళ్ళే నిజమైన స్టార్ నారాయణ మూర్తి గారు. ప్రేక్షకులలో మాత్రమే కాదు సినీ పరిశ్రమలో కూడా నారాయణ మూర్తి గారికి విశేష గౌరవం ఉంది "కాని అది కేవలం మాటల వరకే, చేతల రూపంలో మాత్రం లేదు."
సంక్రాంతి అంటే కేవలం మనకే కాదు సినీ పరిశ్రమకు కూడా పెద్ద పండుగ. ఈ పండక్కి రిలీజ్ చేసే ప్రతి సినిమా ప్రేక్షకులకు ఎక్కువ రీచ్ అవుతుంది అని సంక్రాంతికి తమ సినిమాను రిలీజ్ చేయాలని ప్రతి హీరో ఆశిస్తాడు.. కాని పండక్కి రిలీజ్ చేసే అర్హత కేవలం బలం, డబ్బు ఉన్న కొంతమంది చేతులలో ఉండడం మాత్రం నిజంగా బాధకరం. ఒక పక్క దాదాపు 10 సంవత్సరాల తర్వాత వస్తున్న చిరంజీవి గారి సినిమా, మరోపక్క బాలకృష్ణ గారి 100వ సినిమా, ఇంకా దిల్ రాజు గారి శతమానం భవతి. మూర్తి గారి సినిమాకు చిరంజీవి గారి సినిమాలాగా, బాలకృష్ణ గారి సినిమాలాగా భారీ కలెక్షన్స్ రాకపోవచ్చు, మూర్తి గారి సినిమా పెద్ద హీరోల సినిమా కలెక్షన్లను తగ్గించలేరు.. కాని ఆయన సినిమాల కోసం ఎదురుచూసే ప్రత్యేక ప్రేక్షకులున్నారు. ఈ మూడు సినిమాల కోసం మూర్తి గారి సినిమాకు కనీసం ఆశించినంత థియేటర్స్ ఇవ్వకపోవడం అత్యంత బాధాకరం. ఆర్. నారాయణ మూర్తి గారు చెప్పినట్టు "ఒక సినిమా హిట్టా కాదా అని చెప్పేది ప్రేక్షకులు.. ముందు సినిమా రిలీజ్ ఐతేనే కదా ఆ సినిమా గొప్పతనం తెలిసేది.."
మూర్తి గారు చెప్పింది నిజంగా వాస్తవం.. దసరాకు పెద్ద సినిమాలే, సంక్రాంతికి పెద్ద సినిమాలే, సమ్మర్ హాలిడేస్ కు పెద్ద సినిమాలే.. ఇక చిన్న సినిమాల రిలీజ్ ఎప్పుడంటే ఏ పెద్ద సినిమా లేనప్పుడు, థియేటర్స్ ను ఖాళీగా ఉంచడం ఇష్టం లేక అప్పుడు చిన్న సినిమాను రిలీజ్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. "ఒక సినిమాను సరైన సమయంలో రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ టైం ఆ సినిమా విజయానికి చాలా ఉపయోగ పడుతుంది కాని మన ఇండస్ట్రీలో ఈ స్వేచ్ఛ చిన్న సినిమాకు లేదు". ఇది ఇప్పటిది కాదు ఏళ్ళ తరబడి ప్రతి చిన్న సినిమా ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య. అల్లారుముద్దుగా కడుపులో మోసిన తల్లికి సుఖ ప్రసవం కాకుండా కొంతమంది ప్రముఖులు అడ్డుకుంటున్నారు. అదృష్టవశాత్తు ఏదో రకంగా పోరాడి ఏదో సమయంలో రిలీజ్ చేస్తే సినిమా బ్రతుకుతుంది లేకుంటే ఆ సినిమా పురిటిలోనే చచ్చిపోతుంది.
ఒక విద్యార్ధి చాలా కష్టపడి చదివాడు పాస్ అవుతానని ధైర్యంగా చెప్పినా గాని 'లేదు నీకంత దమ్ములేదు మూసుకొని కూర్చోరా అని పరీక్షకు అనుమతి ఇవ్వకుంటే' ఆ విద్యార్ధి ఎంత మానసికంగా క్షోభ పడతాడో అంతకు పదిరెట్లు ఇప్పుడు ఆర్. నారాయణ మూర్తి గారు మానసిక క్షోభ పడుతున్నారు. కంపిటీషన్ అనేది ప్రతి చోట ఉంది, నిజానికి కాంపిటీషన్ ఖచ్చితంగా ఉండాలి. గెలుపు, ఓటమి అనేది తర్వాత సంగతి ముందు ఆ కాంపిటీషన్ లోకి అర్హత ఇవ్వకుండా తొక్కెయ్యడం అనేది చాలా బాధకరం. ఈరోజు స్టార్స్ గా కొనసాగుతున్న చాలామంది హీరోలు, స్టార్ డైరెక్టర్లు, ఎందరో టెక్నిషియన్స్ ఒక చిన్న సినిమా నుండే వచ్చారని మనకు తెలుసు. చిన్న సినిమాను కాపాడటం, బ్రతికించడం ఇండస్ట్రీకే అవసరం. ఒక చిన్నసినిమా ఉంటేనే రేపటి భవిషత్ పరిశ్రమ బ్రతుకుతుంది. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే ఆ ప్రాతిపదికన ఒక "రాజు" గారి సినిమాను రిలీజ్ చేసినట్టే, ఒక "ఖైదీ" గారి సినిమాను రిలీజ్ చేసినట్టే ఒక "సైనికుడు లాంటి కానిస్టేబుల్" సినిమాకు కూడా ఆశించిన స్థాయిలో థియేటర్స్ అందించాలని కోరుకుంటున్నాను. మూర్తి గారి సినిమా అని మాత్రమే కాదు ప్రతి మంచి చిన్న సినిమాకు భవిషత్ లో థియేటర్స్ అందించాలి.. ఈ ఆర్టికల్ ఉద్దేశం ఏ ఒక్కరిని కించపరచడం కాదు.. పెద్ద సినిమా ఎగురుతున్నట్టే చిన్న సినిమాను కూడా స్వేచ్ఛగా ఎగరనివ్వండి.. దయచేసి దానిని పంజరంలో బంధించడమో, లేదంటే కర్కషంగా రెక్కలు విరిచేయడం మాత్రం చేయకండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.