Meet Praveen, Who Are Making Cost Efficient Products For Society

Updated on
Meet Praveen, Who Are Making Cost Efficient Products For Society

వందకోట్ల జనాభాలో 11 మంది దేశం తరుపున క్రికెట్ ఆడుతారు ఐనా గాని మనదేశంలో ఎక్కువ మంది ఆడే ఆట క్రికెట్. క్రికెట్ ఎలా ఐతే గల్లీలకు ఇంట్లోకి చేరుకుందో సైన్స్, టెక్నాలజిని అలాగే అందరికి అర్ధమయ్యేలా అందుబాటులోకి తేవాలన్నదే ప్రస్తుతం ప్రవీణ్ డ్రీమ్. ప్రవీణ్ మాములు వ్యక్తి కాదు, 12 సంవత్సరాలకే 40 వేల సంవత్సరాల క్యాలెండర్, ఆ తర్వాత బ్రెయిలీ లిపిలో 30 వేల సంవత్సరాల క్యాలెండర్ రూపొందించారు.. 14 సంవత్సరాలకు వికలాంగుల కోసం తక్కువ ఖర్చుతో కృత్రిమ కాలు తయారుచేశారు.. 250 రంగులలో రాసే నెయిల్ పెయింటర్ పెన్ బహుశా ప్రపంచానికి ప్రవీణ్ ఇచ్చి ఉంటాడు. అలాగే కాఫీ పెట్టడానికి, ఇంటిని శుభ్రపరచడానికి, అన్నయ్యను నిద్రలేపడానికి ఇలా చిన్నతనంలోనే దాదాపు 50 రకాల రోబోలను తయారుచేశారు. ఇలా వయసు పెరుగుతున్న కొద్దీ, జ్ఞానం చెట్టు వేఱులా శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న కొద్దీ ఈ ప్రపంచంలో లేనివి, అవసరమైనవి సృష్టిస్తూ వస్తున్నారు.

కొన్ని సాధించాలంటే చాలావాటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. అమ్మ జి.రామలక్ష్మి గారు 24 నవలలు రాసిన రచయిత్రి. నాన్న శంకర్ గారు ఎమ్.ఏ ఎకనామిక్స్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తున్నారు.. ప్రవీణ్ కు చిన్నతనం నుండి సవాలక్ష అనుమానాలు.. "ఇవన్నీ నీకు ఇప్పుడెందుకు రా.? నోర్మోయ్!! వెళ్లి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదువుకోపో" అని కాసురుకోకుండా ప్రవీణ్ అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబులను తెలుసుకుని మరి చెప్పేవారు.

ప్రవీణ్ ను తనంతట తాను అన్ని విషయాలలో ఎదిగేలా ప్రోత్సహించారు తప్ప ఏనాడు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని హద్దులు ఏర్పరుచలేదు. ఇంట్లో ఏదైనా వస్తువు కనిపించిందంటే చాలు అది ఎలా తయారుచేశారు.? దీనితో ఇంకేదైనా కొత్తగా మరేదైనా చేయవచ్చా అని వాటిని విరగొట్టి ప్రయోగాలు చేసేవారు.. అలా తయారుచేసినవాటిలో వచ్చింది తుంటరి రోబో కుక్కపిల్ల.. అలారం సమయానికి లేవకుంటే కనుక అన్నయ్య మీద టాయిలెట్ పోస్తుంది ఈ రోబో కుక్కపిల్ల.. ఇంట్లో కాపలాగా ఉండే రోబో, ఇంటికి బంధువులు వస్తే కాఫీ టీ టిఫిన్లను అందించే రోబో.. 10వ తరగతి దాటకముందే సుమారు 50 రోబోలను తయారుచేశాడు..

చిన్నప్పుడు ఎక్కువగా ఇంట్లో అవసరమయ్యేవి రూపొందిస్తే ప్రస్తుతం ప్రకృతికి, సమాజానికి ఉపయోగపడేవి రూపొందిస్తున్నారు. ఫీ ఫ్యాక్టరీ అనే కొత్త స్టార్టప్ ద్వారా "గోరకవి ఫిల్లింగ్ పార్టికల్స్" అనే ప్యాకేజింగ్ పౌడర్ ను సృష్టించి పెద్ద సంస్థలకు అమ్మకుండా చిన్న చిన్న సంస్థలకు తక్కువ ధరకే అమ్ముతుంటారు. ఈ ప్యాకేజింగ్ పౌడర్ తో వచ్చే బ్రౌన్ పేపర్ చాలా బలంగా, ఎక్కువ బరువు మోసేలా ఉంటుంది అలాగే తేలికగా కూడా ఉంటుంది. దీన్ని కనుక పెద్ద సంస్థలకు అమ్మి ఉండేదుంటే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ప్రవీణ్ అలా అనుకోలేదు. ఇలాంటి ఆలోచనలు గల వ్యక్తిని అబ్దుల్ కలాం గారు ముందుగానే కలిశారు. చిన్నతనంలోనే బాలశ్రీ అనే బిరుదుతో ప్రోత్సహించారు.