అందానికి మూలం ఏంటి? రూపమా? చూసేవాడి భావమా? - A Short Poem

Updated on
అందానికి మూలం ఏంటి? రూపమా? చూసేవాడి భావమా? - A Short Poem

Contributed by Yeswanth Chinni

మబ్బుల చాటు నుంచి నువ్వు చూసే దొంగ చూపుల వలన వచ్చిందా ఈ అందం? చల్లని వెన్నెల కురిపించడం వలన వచ్చిందా ఈ అందం?

పక్షం పెరిగి పక్షం తరుగుతూ ఉండడం వలన వచ్చిందా ఈ అందం? చెట్టుకొమ్మల మధ్యలో నుంచి నేను చూడడం వలన వచ్చిందా ఈ అందం?

తారలను పక్కకు తన్ని రాత్రికి రారాజు కావడం వలన వచ్చిందా ఈ అందం? నెలకు ఒక్కసారి నీ నిండుతనం కోసం నిరీక్షించే నా కళ్ళ వలన నీకు వచ్చిందా ఈ అందం?

గ్రహణం పట్టిన విడిపించుకునే నీ ధైర్యం నుంచి వచ్చిందా ఈ అందం? భువి చుట్టూ తిరుగుతూ అనుభవించిన ఒంటరితనం నుంచి వచ్చిందా ఈ అందం?

చంటి పిల్లలకు నిన్ను మాత్రమే చూపించి గోరు ముద్దలు తినిపించాలని నువ్వు కోరుకోవడంలో నుంచి వచ్చిందా ఈ అందం? భూమికి నేను మాత్రమే సహజ సిద్దమైన ఒకే ఒక్క ఉపగ్రహం అనే స్వార్ధంలో నుంచి వచ్చిందా ఈ అందం?

ఎలా వస్తే ఏం లే చంద్రమా ఇంత అందం, దానిని అనుభవించడానికి ఒక మనసు ఉంది అది చాలు నాకు.