Contributed by Navaneeth Reddy
సినిమా - అరవింద సమేత పాట - పెనిమిటి రచయిత - రామజోగయ్యశాస్త్రి గానం - కాలభైరవ సంగీతం - థమన్
ఊరిని గెలిచేందుకు ఇల్లువదిలి వెళ్లిన భర్తకోసం ఎదురుచూసే భార్య మనోవేదన ఎలా ఉంటుంది? కట్టుకున్నోడు పదిలంగా తిరిగిరావాలని నిద్దర మరచిన కళ్లతో పడిగాపులు కాస్తున్న ఇల్లాలు ఆశలు ఎలా ఉంటాయి? పెనిమిటిని కళ్లారాజూసి ఎన్ని రోజులయిందో? కన్నబిడ్డను భర్తకు చూపించాలనే ఆరాటం. ఇంటాయనకు నచ్చిన భోజనం వండి వడ్డించాలనే తాపత్రయం. అన్నీ కలగలిపి గుండెనే గొంతుసేసి పాడుతున్న కోయిల కథను 'అరవింద సమేత' సినిమాలోని 'పెనిమిటి' పాట రూపంలో అందించారు రామజోగయ్యశాస్త్రి. రాయలసీమ సంస్కృతిని ప్రతిబింబించేలా 'ఒంటెద్దు బండెక్కి రారా' ' కమ్మటి సంగటి' ( రాగి సంగటి ) అని రాశారు. ఇక రాయలసీమలో ప్రవహించే సగిలేరు నది గురించికూడా ప్రస్తావించారు. సగిలేరు పెన్నా నదికి ఉపనది. సగిలేటి డొంకల్లో పదిలంగా రారా అంటూ సీమ భాషలో కలం కదిపారు.
పొలిమేరకు, పొలమారడానికి శాస్త్రిగారు కుదిర్చిన బంధం, భావం అద్భుతం. భర్త పొలిమేర దాటితే భార్యకు పొలమారుతోందని చెప్పారు. చుట్టూ ఉన్నవాళ్లకు కట్టుకున్నోడు కొడవలిలాంటోడే కావచ్చు... కానీ కట్టుకున్నదానికి మాత్రం సంటివాడేనని ( చిన్నపిల్లాడే ), కొంగున దాసుకునే ఆలి మనసుని సూసీ సూడక సులకన సేయకని వేడుకునే తీరుని చిన్నచిన్న పదాలతో అల్లిన రచయిత నేర్పు ప్రశంసనీయం. తలరాతలో కలతలు రాయకుండా.... పెళ్లినాడు కట్టిన తాలిబొట్టునైనా తలసుకొని తరలి రమ్మంటూ పిలవడం భార్య ఆవేదనకు అద్దంపడుతోంది.
జనం అవస్థలు తీర్చే పెద్దమనిషిగా ఎంత ఎత్తుకు ఎదిగినా నా భర్త నా కంటిముందే ఉండాలి. ఇల్లు వదిలి వెళ్లిన భర్త ఎండలకు కందిపోతున్నాడేమోనని, ప్రత్యర్థుల రక్తంతో తడిసిపోయాడేమోనని, వేళకు తింటున్నావో లేదో, అసలు ఎట్లా ఉంటున్నావో... వేట కత్తి తలగడగా మారిపోయిందేమో.... ఎన్ని కష్టాలు పడుతున్నావో... కనీసం నువ్వుకన్న బిడ్డనైనా తలచుకొని ఇంటికి రాలేవా.... ఇలా భర్తకోసం ఎదురుచూస్తున్న సీమ ఇల్లాలు మానసిక స్థితిని దర్శకుడు త్రివిక్రమ్ ఈ పాట రూపంలో మనకు చూపించబోతున్నారు.
పల్లవి: నిద్దరని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా... సగిలేటి డొంకల్లో పదిలంగా రారా.... నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా... గలబోటి కూరొండి పిలిసిన రారా... పెనిమిటి ఎన్ని నాళ్లయినాదో... నినుజూసి కళ్లారా..... ఎన్నెన్ని నాళ్లయినాదో నినుజూసి కళ్లారా....
చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రారా పెనిమిటి గుండెనే గొంతుసేసి పాడతాంది రారా పెనిమిటి || చిమ్మటి ||
చరణం1 : పొలిమేరదాటి పోయావని పొలమారిపోయే నీ దానిని కొడవలిలాంటి నిన్ను సంటివాడని కొంగున దాసుకునే ఆలి మనసుని సూసీ సూడకా సులకన సేయకు నా తలరాతలో కలతలు రాయకు... తాలిబొట్టు తలసుకొని తరలి తరలి రారా పెనిమిటి తాలిబొట్టు తలసుకొని తరలి తరలి రారా పెనిమిటి
చరణం2 : నరగోస తాకే....... కామందువే... నరగోస తాకే కామందువే... నలపూసవై నా కంటికందవే కటికి ఎండలలో కందిపోతివో... రగతపు సిందులతో తడిసిపోతివో యేలకు తింటివో ఎట్టనువ్వింటివో... యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో... నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రారా పెనిమిటి... నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రారా పెనిమిటి... || నిద్దర