Meet Pavani, A Telugu Woman Who Is On A Mission To Save Birds & Animals

Updated on
Meet Pavani, A Telugu Woman Who Is On A Mission To Save Birds & Animals

నాకు మొన్న పావని గారి గురించి ఒక ఫ్రెండ్ ద్వారా కాస్త తెలిసింది. తను చేస్తున్న కార్యక్రమాలకు చాలా సంతోషమేసింది!! ఇంటికి ఎదురుగా ఉన్న ఎకరం భూమిలో రెండు వందల సంఖ్యలో వివిధ రకాల జీవజాతులను పోషిస్తున్నందుకు నాకు నా బాధ్యత గుర్తుకు వచ్చి ఒకింత గిల్టీగా కూడా ఫీల్ అయ్యాను. లాస్ట్ లో మాత్రం నాకో భయంకరమైన ట్విస్ట్ కూడా ఇచ్చారు!! అదేంటన్నది నేను కూడా ఆర్టికల్ చివర్లో చెబుతా!!

రకరకాల పదాలతో వర్ణించడం కన్నా పావని గారి మనసును అర్ధం చేసుకోవడానికి ఈ ఒక్క చిన్న ఉదాహరణ చాలు.. పనిమీద బయటకు వెళ్తున్నప్పుడల్లా తనకో చికెన్ షాప్ కనిపించేది. షాప్ ముందే ఒక పెద్ద ఐరన్ బాక్స్ లో ఉరిశిక్షకు సిద్ధమయ్యే అమాయక ఖైదీలలా కోళ్లు ఉండేవి. "ఎలాగూ చనిపోయేదే కదా ఇంకా జాగ్రత్తగా తీసుకెళ్లడం ఎందుకు అని కోళ్ల రెక్కలను పట్టుకుని నరకడానికి తీసుకెళ్లే పనివాళ్ళు, అలా తీసుకెళ్తున్నా కానీ అరుపులతో బాధను Express చెయ్యడమే తప్పా ప్రతిఘటించడం రాని ఆ ముగజీవాలను చూసి పావని గారు బాధపడుతుండేవారు". ఇలా బాధపడడం మానేసి వీలు దొరికినప్పుడల్లా "చికెన్ షాప్ కెళ్ళి ఒక్కో కోడిని కొనేవారు"!! షాప్ వారు అడిగితే పెంచుకోవడానికి అని చెప్పేవారు. మనసులో మాత్రం "హమ్మయ్య!! కనీసం ఈ రోజు నీ ప్రాణం కాపాడుకోగలిగాను" అని ఆ కోడిని ముద్దు చేసేవారు. ఆ బ్రాయిలర్ కోడిని తన ఇంట్లోనే పెంచుకుంటారు. ఇప్పటికి ఇలా ఎన్నో సార్లు జరిగాయి, ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటాయి కూడా..

ఎకరం స్థలంలో: పావని గారిది తణుకు(అక్కడ మంజీర బ్యాంక్ లేదట అడిగి తెలుసుకున్నాను). జంతువుల కోసం ఇన్ని చేస్తున్నా కానీ ఏ మాత్రం అడ్డు చెప్పని కుటుంబం వారిది, నిజానికి తనపై ఇంతటి ప్రేమ కలగడానికి కారణం కూడా వారే. తాతయ్య గారు డాక్టర్, నాన్న డెంటిస్ట్, వారు కూడా తణుకులోనే పుట్టి పెరిగారు. నాన్న కు జంతువుల మీద ప్రేమ కలగడానికి కారణం తాతయ్య. పావని గారికి కలగడానికి మాత్రం వీరిద్దరూ కారణం. ఇంటికి అతిథులుగా పక్షులు వచ్చినా, జంతువులు వచ్చినా ముందు వాటి కడుపు నింపి, ఆ తర్వాత కాసేపు సరదాగా గడిపే మనసు వారిది.

నెలకు రూ.20,000: నాటు కోళ్లు, బొబ్బరసి కోడి, చైనా కోడి, టర్కీ కోడి, గిన్నె కోడి, బ్రాయిలర్ కోడి, కౌజు పిట్టలు, నాలుగు రకాల బాతులు, కుందేళ్లు, ఇలా ఎకరం స్థలంలో వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఇంత ప్రేమను కురిపిస్తున్నందుకు వాటి నుండి వచ్చే ప్రతి స్పందన కూడా అలాగే ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళగానే ఎక్కువ శాతం కోళ్లు బాతులు భయంతో పారిపోకుండా దగ్గరికి వస్తాయి, చాలాసార్లు పావని గారి ఆదేశాలను పాటిస్తాయి. నాణ్యమైన కూరగాయలు, వడ్లు, గింజలు, గడ్డి ఇలా వీటి ఆహారానికి నెలకు రూ.20,000 పైగా ఖర్చు అవుతుంది.

ఎమ్.ఎల్.ఏ లను, మంత్రులను కలిసి.. నాన్న సుందర రామరాజు గారికి రాజకీయ నాయకులతో మంచి సాన్నిహిత్యం ఉండడంతో పావని గారు కూడా వారిని కలుస్తూనే ఉంటారు. వ్యక్తులుగా కన్నా ప్రభుత్వం పరంగా చేస్తే ఎక్కువ మేలు జరుగుతుంది. తణుకు ఎమ్.ఎల్.ఏ నాగేశ్వరరావు గారిని, ఇంకా అప్పుడప్పుడు తణుకుకు వచ్చే మంత్రులను కలిసి "మన ఊరిలో స్కూల్స్, కాలేజీలు ఇంకా పేదవారికి ఇల్లు కట్టించాలనే సంకల్పంతో పాటుగా తణుకులో జంతువులకు, పక్షులకు ఒక స్థలం కేటాయించాలి. అడవులు తగ్గిపోతున్నాయి, దానికి కారణం కూడా మనమే వాటిని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని రిక్వెస్ట్ చేస్తుంటారు.

మొన్న పావని గారి నెంబర్ తీసుకున్న తర్వాత తనకు మెసేజ్ చేశాను. "సరే శ్రీకాంత్ గారు తప్పకుండా, కాకపోతే రేపు ఉదయం నేను స్కూల్ కి వెళ్ళాలి, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుదాం" అని అన్నారు. దానికి నేను "అంటే టీచర్ గా లెస్సన్స్ చెబుతూనే ఇలా చేస్తున్నారని సంతోషపడ్డాను". మళ్ళీ నిన్న కాల్ చేశాను, 30నిమిషాలు మాట్లాడి Information తీసుకున్నాను. (చివరికి చిన్న Curiosity తో..) "మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు.?" 'చిన్నగా నవ్వి' అయ్యో నేను టీచర్ ని కాదండి.!! నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను, నా ఏజ్ 14!! అని లాస్ట్ లో పెద్ద ట్విస్ట్ ఇచ్చారు నాకు!!