Contributed By Sowmya Uriti
ఐ.పి.ఎల్. నడుస్తుంది టి.వి.లో.. చాలా ఆశక్తిగా చుస్తున్న నాని "అయ్యో..ఛ..ఇప్పుడే పోవాలా ఈ కరెంట్.." అంటూ విసుక్కుంటూ లేచి మొబైల్ తీశాడు.. అది లో బ్యాటారీ చూపిస్తుంది.. ఇంక చేసేదేం లేదు.. కాసేపు తరవాత వాచ్ చూశాడు నాని. "ఏంటి ఇంకా పది నిమిషాలే ఐందా..! ఇంత బోర్ కొడుతుంది. పాత రోజుల్లో ఎలా ఉండేవారో ఏంటో కరెంట్ లేకుండా..!" అంటున్న నాని మాటాలు విన్న సుధ కల్పించుకొని "ఏరా.. ఓ పది నిమిషాలైనా ఉండాలేవా ఆ మోబైల్ లేకుండా? ఏంటో మీ జెనరేషన్ ఫోన్లతో స్నేహం; టి.వి, కంప్యూటర్లతో కాలక్షేపం చేస్తారు.. కానీ మా జెనరేషన్ అలా కాదు. మాకు ఈ మొబైల్స్ అవీ లేకపోయినా టి.విలు, రేడియోలు ఉండేవి. అయినా మేం వాటిని రోజుకో గంటో రెండు గంటలో వాడేవాళ్ళం. ఎక్కువ సమయం స్నేహితులతోనో, ఇంట్లోవాళ్ళతోనో గడిపేవాళ్ళం. అసలు అప్పట్లో ఎలా ఉండేది.. పండగలొస్తే ఇళ్ళన్నీ బంధువులతో నిండిపోయేవి. అందరి అంగళ్ళు ముగ్గులతో, గుమ్మాలు మావిడాకులతో, ఆడపిల్లల చేతులు ఎర్రగా పండిన గోరింటాకులతో కలకలలాడేవి. ఇప్పుడో ..ఇంటి ముందు స్టిక్కర్ ముగ్గులూ, గుమ్మానికి ప్లాస్టిక్ పువ్వుల దండలు. బంధువుల రాక దేవుడెరుగు పండుగ ఒక్క రోజైనా ప్రశాంతంగా ఇంట్లో ఉండాలంటే పది రోజుల ముందు నుండే లీవ్ పెట్టాల్సిన పరిస్థితి. నా చిన్నప్పుడు వేసవి వచ్చిందంటే చాలు మాగాయలూ, వడియాలూ పెట్టాల్సిందే. మరిప్పుడో పళ్ళెల్లో తప్ప పట్టణాల్లో ఎక్కడా మచ్చుకైనా కనిపించవు ఒడియాలు ఎండపెట్టిన డాబాలు, మాగాయ ఆవపెట్టిన జాడీలు," నానిని మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చెప్తుంది సుధ.
“ అబ్బా..అమ్మా! ఇప్పుడవన్నీ చేయడానికి ఎవరికి టైం ఉంటుంది! ఓపిక ఐతే అసలుండదు. ఐనా అవన్నీ మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా," అన్నాడు నాని.
"నిజమే, ఆవకాయలు మార్కెట్ కే పరిమితమవుతున్నాయి..ఆప్యాయతలు ఫేస్ బుక్ వాట్సాప్ పలకరింపులకే పరిమితమవుతున్నాయి. అప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు లేవుగా. వాటితో పాటే ఆప్యాయతలూ కనుమరుగౌతున్నాయి. మాకైతే వేసవి సెలవులివ్వడమే తరువాయి తాతగారింటికి పరుగు తీసేవాళ్లం. పిల్లలందరిదీ పెద్ద బెటాలియనే. ఎండ, వర్షం ఎన్ని అడ్దొచ్చినా మా ఆటలు ఆగేవి కావు. ఎంతైనా మా ఆటలలో ఉండే మజా మీ పబ్జీలో ఉండదులే. ఆ కొబ్బరి తోటలూ, మాగానులూ, చెరువు గట్లు ఇవేమీ లేవు మీ బాల్యంలో. గుర్తుచేసుకుంటే మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకోవాలనిపించే బాల్యం మాకుంది. మీరు భవిష్యత్తులో గతం గుర్తుచేసుకుంటే ఆ మోబైల్ తప్ప ఇంకేం ఉండదు,” సుధ చెప్తుండగానే కరెంట్ వచ్చేసింది. "హమ్మయ్య " అనుకుంటూ నాని మళ్ళి టి.వి ముందుకు చేరాడు.