'Barrister Parvateesam': The First Book Every 90's Telugu Kid Has Fell In Love With

Updated on
'Barrister Parvateesam': The First Book Every 90's Telugu Kid Has Fell In Love With

Contributed by Naga Chetan

ఈ పుస్తకం ప్రతి తెలుగు వాడికి పదవ తరగతి ఉపవాచకంగా సుప్రసిద్ధమే. ఉపాధ్యాయుడు పాఠం చెప్పక మునుపే చాలా మంది పుస్తక పఠణం చేసుంటారు. అంతగా మంత్ర ముగ్ధులను చేస్తుంది ఈ పుస్తకం. కాకపోతే పదో తరగతి లో 72 పేజీలుగా ఉన్న పుస్తకం "లండన్ అడుగు పెట్టాను" అనే వాక్యం తో ముగుస్తుంది. 348 పేజీలున్న పుస్తకంలో అది కేవలం మొదటి భాగం మాత్రమే. అంతర్జాలంలో పొందబర్చిన సమాచారం ప్రకారం పుస్తకం మొట్ట మొదటిసారిగా 1924 ప్రచురించారు. మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు దీని రచయిత. ఆ తరువాత భాగాలు ఎప్పుడు ముద్రించారు అన్న విషయం ఎంత గాలించిన కూసంత జాడ కూడా దొరకలేదు, కాకపోతే 1971లో దూరదర్శన్ రేడియోలో ప్రసారమైన మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి ముఖా ముఖి కార్యక్రమంలో మాత్రం, రెండవ భాగం స్వాతంత్రం ముందు, మూడవ భాగం స్వాతంత్రం వచ్చాక ఒక పది సంవత్సరములకు రచించినట్లు ఒక సందర్భం లో మొక్కపాటి గారు చెప్పుకొచ్చారు. అసలు బారిష్టరు పార్వతీశం అనే పాత్ర కూడా చాల విచిత్ర సందర్భంలో రూపుదిద్దుకుంది. కాలక్షేపన రచనలు చేస్తున్న మొక్కపాటి గారు ఒకానొకనాడు రాజమహేంద్రవరంలో తన తోటి మిత్రులు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, సహదేవ సూర్య ప్రకాశ రావు గారుతో గోదావరి తీరాన కబుర్లు చెప్పుకుంటున్న వేల అప్పుడే అక్కడికి ఆసీనులైన వేదుల సత్యనారాయణ శాస్త్రి గారిని చూసి ఒక్క క్షణం నిర్గాంతపోయి, ఆ క్షణికాశ్చర్యం నుంచి మొదట తేరుకున్న మన మొక్కపాటి గారు "ఏమిటోయ్ నువ్వు నీ వస్త్ర ధొరనీ, వాటితో ఆ పిలక ఏంటోయ్"అని నల్ల సూటులో వచ్చిన సత్యనారాయణ గారిని హేళన చేసారు. సంభాషణ మొత్తం లో "పిలక" అనే పదం గమత్తుగా, హాస్యాస్పదకంగా ఉండటంతో పైగా అక్కడున్న వారంతా సాహితీప్రియులవడంతో, పిలక మీద ఒక నాటకం వేయదలిచి, అనుకున్నదే తడవుగా దాని మీద ఒక నాటకం రాసి, అదే గోదారి తీరాన మరుసటి రోజే ప్రదర్శించారు. ఈ హాస్య నాటకం పేరు గోదారి తీరాలను దాటి హైదరాబాదు వరకు పాకింది. అలా మొక్కపాటి గారికి హాస్య రచనల మీద కొంచెం మక్కువ కలిగింది.

స్వతహాగా పుస్తక ప్రియులైన మొక్కపాటి గారు, ఆంగ్ల హాస్య రచయితులైన Mark Twain, WW Joseph రచనలకు వీరాభిమాని. మొక్కపాటి గారి మిత్రులైన చింతా దీక్షితులు గారు అప్పటికే అడపాదడపా హాస్యరచనలు చేస్తుండేవారు.ఒకనాడు వారిద్దరి మధ్య WW Joseph రచించిన "The innocent Abroad" అనే పుస్తకం గురించి చర్చకు వచ్చింది. చర్చాంతరం మొక్కపాటి గారికి అలాంటి హాస్య రచన ఒకటి చేయాలని మనసుకు తూలింది. అంతకు పూర్వమే "పిలక" అనే పాత్రకు భీజం వేయడం వాళ్ళ, అలంటి విచిత్ర రూపాన్నే అభినయిస్తూ, తాను మొగల్తూరు నుంచి నిడదవోలుకు చేసిన ఓడ ప్రయాణం ఆ పిమ్మట చేసిన రైలు ప్రయాణం అంశాలను కొన్ని తీసుకొని హాస్య జనకంగా పార్వతీశం అనే పాత్రని రూపు దిద్ది కథగా విడుదల చేసారు. అది యువకుల్లో విశేష ఆదరణ పొందడంతో, ఎందుకు పార్వతీశాన్ని విదేశాలకు పంపకూడదు అనే ఆలోచన నిమ్మితం చేసిన రచనే భారిష్టారు పార్వతీశం మొదటి భాగం. నిజానికి కథ పార్వతీశం లండన్ లో అడుగు పెట్టడం తోనే ముగుస్తుంది. రెండవ భాగం రాయడానికి సంకోచిస్తున్న సమయంలో, ఈ పుస్తకం ఆ కాలం లోనే దిన పత్రికల్లో సీరియల్ గా ప్రచురించారు. రెండవ సారి ప్రచురించినప్పటికీ విశేష ఆదరణ పొందడంతో దాని తరువాయి భాగం కూడా రాయవలిసినధిగా పత్రికా సిబ్బంది వారు మొక్కపాటి వారిని తీవ్ర ఇబ్బంది పెట్టారు. మొక్కపాటి గారి స్నేహితుడైన నార్ల వెంకటేశ్వర రావు గారు కూడా రెండవ భాగం రాస్తే బాగుంటుందని అతన్ని ప్రోత్సహించారు. అలా రెండవ భాగానికి నాంది పలికారు మొక్కపాటి గారు. ఆ పిమ్మట మూడవ భాగం కూడా రాసి, కథకు, పాటకులకు కూడా సుఖాoతానిచ్చారు. అల చిలిపిగా రూపాంతరం దిద్దుకున్న ఒక పాత్ర ఇప్పటికి తెలుగు పాఠకులను ఆకరర్షిస్తూ భారతదేశం లోనే అత్యునతమైన హాస్య నవలగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఒకానొక సమయం లో మొక్కపాటి నరసింహ రావు గారి కంటే, బారిష్టరు పార్వతీశం రచయిత అనే పేరు తోనే వారు సుప్ర సిద్దులయ్యారు.

ఇక కథ విషయానికి వస్తే, మొదటి భాగం లో ఒక అమాయక కుర్రాడు, ఎవరో భారిష్టరు చదువు అని ఇచ్చిన సలహాకి ఆకర్షితుడై, ఇంట్లో చెప్పాపెట్టకుండా లండన్ కి ప్రయనమౌతాడు. దారి పొడువునా రైల్లో, ఓడలో అతను పడే పాటలతో చమత్కార భరితంగా అతను లండన్ కు చేరుకుంటాడు అనే అంకంతో కథ ముగుస్తుంది. రెండవ భాగం లో లండన్ లో అతని జీవితం, తెల్ల దొర సాని తో అతని ప్రేమ వ్యవాహారం, MA మరియు భారిష్టరు పూర్తి చేసుకొని బొంబాయిలో తిరిగి అడుగు పెట్టడం వరకు ఉంటుంది. ఇక పోతే మూడో భాగం లో పార్వతీశం పెళ్లి, మద్రాసులో న్యాయవాదవడం, గాంధీ గారి ఉపన్యాసాలకు ముగ్ధుడై స్వాతంత్ర సమరయోదంలో పాల్గొని పలుమార్లు జైలుకు కూడా వెళ్లి, న్యాయ వ్యవస్థలో జరుగుతున్నా అక్రమార్కల పైన చీదర గలిగి, స్వాతంత్రానంతరం చివరికి మళ్ళి మొగల్తూరు చేరి వ్యవసాయం చేసుకోవడం తో పూర్తి కథ ముగుస్తుంది.

నవల మొత్తం లో మనం చర్చించుకోదగ్గ విషయములు మూడు: 1. వ్యాకరణం 2. పాత్ర రూపుదిద్దుకున్న వైనం 3. ఆ రోజుల్లో మన సమాజ శైలి వ్యాకరణం: స్మురించుకుంటే తెలుగు వ్యాకరణంలో చర్చించుకోవలసిన అంశాలు ఎన్నో.. 1970-1980 ఆ పిమ్మట గ్రాంధిక తెలుగు అంతరించి ఆధుమిక తెలుగు మాట్లాడటం ప్రారంబించారు. అంటే ప్రకృతి పదాలను కాకుండా వికృతి పదాలను వాడటం మొదలు పెట్టాం. నేటి రచయితులు కూడా పాటకులకు అర్థమయ్యేలా వుండటం కోసం ఆధునిక తెలుగు లోనే రచనలు చేస్తున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ గారి "ఆనందో బ్రహ్మ" వంశీ గారి "గాలి కొండాపురం రైల్వే స్టేషన్" లాంటి నవలల మినహా అన్ని నేటి తెలుగు పదాలే. హాస్య రచనలలో విచిత్ర పద ప్రయోగాలు, సామెతలతో మాత్రమె పాటకులను ఆకట్టుకోగలరు. అలాంటివి మన పార్వతీశంలో కోక్కల్లలు. గోపీచంద్ గారు రచించిన "అసమర్థుని జీవిత యాత్ర" మన "భారిష్టరు పార్వతీశం" రెండూ కూడా కేవలం ఒకే పాత్ర చుట్టూ తిరిగే కథలే. కాకపోతే కథ పరంగానే కాకుండా అందులో ఉపయోగించే పద ప్రయోగాల వాళ్ళ కూడా ఆయ పాత్రలు వెలుగొందాయి. మచ్చుకకు రెండు కథలలోనూ కథా నాయకుణ్ణి చూచి జనం నవ్వుకునే సన్నివేశాన్ని పోలిస్తే, సీతారామారావు (అసమర్థుని జీవిత యాత్ర కథా నాయకుడు) అనుకుంటాడు "సాటి మనిషి ఇబ్బంది పడుతుంటే అసలు నవ్వు ఎలా వస్తుంది. ఒకరు కష్టాల్లో వుంటే ఎందుకు అవతలి వారికి అంత మిక్కిలి సంతోషం" అని తనలో తానె ప్రశ్నించుకుంటూ సతమతమౌతాడు. ఇక పోతే పార్వతీశం మాత్రం "నవ్వుకుంటే వాళ్ళే మూతే వంకర పోతుందని" ముందుకు సాగిపోతాడు. ఇలాంటి చలోక్తులు నవల మొత్తం ఎన్నో పొందబరిచారు మొక్కపాటి గారు. జంట పదాలు మనందరికీ సుపరిచితమే. సంధులు అనే వ్యాకరణ అంశం వాటి కోసం వెలువడినదే. ఇందులో త్రిపద వ్యాకరణం వుపోయోగించారు. అనగా ఒకే పదంలో గుణ సంది, సవర్ణ దీర్గ సంది, లేదా ఉకార సంది, గుణ సంధి కల గలిపి ఉన్న పదాలు ఉపయోగించారు. ఇలా అచ్చమైన తెలుగు పదాలతో వ్యాకరణ బద్దకంగా ఈ నాటికి కూడా చదివి అర్థం చేసుకొని నవ్వుకునేంత సులువుగా రచింపబడినది.

పాత్ర రూపుదిద్దుకున్న వైనం: అమాయకంగా అల్లరి చిల్లరగా పల్లెటూళ్ళో తెలిసీ తెలియని తనంతో మనల్ని కడుపుబ్బా నవ్వించిన పాత్రగా మొదట పరిచయమై ఆ తర్వాత బారిష్టరు పూర్తీ చేసే వరకు ఇంగ్లండు విడిచే ప్రసక్తే లేదు అని పట్టుదల ఉన్న వ్యక్తిగా, సందర్బాన్ని గ్రహించి తనను తానూ సరలించుకున్న ఆత్మ స్థైర్యం కలవాడిగా, వాక్చాతుర్యంతో ఎందరో మహానీయులతో ప్రశంసలు అందుకున్న వాడి లా, ఎలాంటి విషయాన్ని అయిన త్వరగా గ్రహించగలిగే జ్ఞానిలా, టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి వారిచే కూడా భేష్ అనిపించుకునే బుద్ధి శాలి ల పాత్ర రూపుదిద్దుకున్న వైనం ప్రశంసనీయం. చదువు మనిషి ఆలోచన దొరనిని ఎలా మారుస్తుందో అని చెప్పడానికి పార్వతీశం పాత్ర ఒక చక్కటి ఉదాహరణ. మొదటి పేజి పార్వతీశానికి చివరి పేజి పారవతీశానికి ఎంతో వ్యత్యాసం ఉంది. క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి మనషిలోను ఏదొక సన్నివేశంలో ఒక పార్వతీశం కనిపిస్తాడు.

ఆ రోజుల్లో మన సమాజ శైలి: పార్వతీశం లండన్ చేరుకున్న తర్వాత, అడుగడుగునా అక్కడ జనం తనకి ఎలో సహాయం చేసారో అనే అంశాన్ని మాత్రం మొక్కపాటి గారు పలు సార్లు ప్రస్తావించారు.అక్కడ ఆచార వ్యవాహరలాలు, మనుషుల ఆలోచన ధోరణి, వారి వ్యక్తిత్వాల గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. పార్వతీశం బారిష్టరు పూర్తి చేసుకొని వివేకవంతుడై భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత నాగరికతలో మనం ఎంత వెనక బడి ఉన్నామో అన్న సంగతి వ్యక్తపరుస్తాడు. పార్వతీశం విదేశాల నుంచి వచ్చిన తర్వాత కొన్ని పద్దతులు చాల మూర్ఖంగా అర్థం లేని తనంగా ఉన్నాయని గ్రహిస్తాడు. ఆడ పిల్ల రజస్వల అవ్వకముందే పెళ్లిలు చేసేయడం, పుష్పవతి అయ్యాకే కాపురానికి పంపడం, కీలక నిర్ణయాలలో వారి సలహాలతో సంబంధం లేకుండా మొగవాడి పెత్తనంతో చెలామణి అవుతున్న ఆనటి ఆడవారి అణిచివేత గురించి క్లుప్తంగా వివరించారు. ఇక న్యాయవ్యవస్థలో జరుగుతున్న అవకతవకల గురించి ఒకే వాక్యం తేల్చేశారు మొక్కపాటి గారు "కోర్టులో ఇచ్చే తీర్పులు కొందరు పెద్దలు ఏర్పాటు చేసిన చట్టాలకు సూత్రాలకు విరుద్దం కాకుండా ఉండవలెనని చూస్తాము కాని, కేవలం ఇదే న్యాయం ఇదే ధర్మం అని చెప్పడం కష్టమే (we administer law, not justice)" ఈ వాక్యం ఇప్పటి పరిస్తుతులకు కూడా చెల్లుతుంది. ఇక పోతే అప్పటికే బలం పుంజుకుంటున్న స్వాతంత్ర పోరును అరి కట్టడానికి బ్రిటీషు వారు ఎన్నో దారుణాలకు వడగట్టారు. కాని ఐక్యత పెరుగుతుందే గాని బలహీన పడట్లేదు. దీనిని చెల్లా చెదురు చేయడానికి తెల్ల దొరలు విసిరిని అస్త్రం అంతర్శత్రువులు, అనగా కుల, మత, ప్రాంత విభేదాలతో అల్లర్లు సృష్టించి, విప్లవాన్ని కొన్నాళ్ళు తప్పు దావ పట్టించారు. ఆ ఆలోచన ఎంతో క్రూరమైనదప్పటికి, ఈ రోజుకి అదే అస్త్రాన్ని ఉపోయోగించి రాజ్యాన్ని ఏలుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బారిష్టరు పార్వతీశం నవలలో అంతర్గతంగా ఎన్నో అంశాలు వున్నాయి. ప్రతి ఒక్కరు చదివి ఆస్వాదించగలిగితేనే అవేంటో క్షుణ్ణంగా బోధపడతాయి.