This Song From "Maryada Ramanna" Will Give All The Motivation That We Need In This Lockdown Period

Updated on
This Song From "Maryada Ramanna" Will Give All The Motivation That We Need In This Lockdown Period

Contributed By Nimmagadda Saroja

మరో రెండు వారాలు మన అందరం ఇళ్లలోనే ఉండాలి. పైకి ఎంత నవ్వుతున్నా, పెదవి విప్పి బయట పడినా, పడుకున్నా ప్రపంచ జనావళి అందరి మదిలో ఇప్పుడు నడుస్తున్న ఒకే ఒక భయం కరోనా! మన అందరి ధ్యేయం ఈ విపత్తు నుంచి వీలైనంత త్వరగా బయట పడాలి. పడతాం కూడా! ఇంట్లో కూర్చోవటం చేతకానితనమో లేదా ఫలితం లేని చర్య అని మనం అనుకోకుండా ఉంటే. ఈ సమయంలో ఇంట్లో కూర్చోవడమే ఒక వీరోచిత చర్య. ఇదే మనం చేసే సమరం. మన అలవాట్లతో, మన మనసులతో మనమే చేసే యుద్ధం. ఇందులో మనం గెలిస్తే మానవాళి గెలుస్తుంది. లేదంటే అందరం ఓడిపోతాం. ఇది మనం చేసే సమాజ సేవ కూడా. ఇంత పెద్ద భాద్యతని ఎలా నిర్వర్తించాలి? దానికి తగిన స్ఫూర్తి ఎక్కడ నుంచి వస్తుంది? అలా స్ఫూర్తిని నింపేది ఒక కళ మాత్రమే.

నాకు తెలిసిన కళ అంటే సినిమా పాటలు మాత్రమే. కత్తులు పట్టుకొని కథానాయకుడు వీరోచితంగా విలన్లను ఎడాపెడా నరికేస్తుంటే బోలెడు పాటలు వచ్చాయి, వస్తూనే ఉంటాయి. కానీ ప్రాణాలను కాపాడుకోవాలని ఒక మనిషి పడే తాపత్రయాన్ని కూడా heroic act గా చూపించే పాట, మన రాజమౌళి గారు మాత్రమే ఊహించగలరు. అటువంటి సందర్భానికి కీరవాణి గారి అద్భుతమైన బాణిలో, సీతారామశాస్త్రి గారి కలంలోంచి వచ్చిన రచన బ్రతకాలని మనకుండే సంకల్పానికి నివాళిలా ఉంటుంది. అలంటి బాణీకీ, రచనకి తన గాత్రంతో ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళగలిగారు బాలు గారు.

బయటకి అడుగుపెడితే చంపేస్తారని తెలిసి బిక్కు బిక్కు మంటున్న హీరోకి ఒక అవకాశం వచ్చింది. పరిగెత్తి పారిపోతే బ్రతుకుతాడు కానీ ఇంత సేపు ఓ రక్షగా, లక్ష్మణ రేఖగా నిలచిన ఆ గడప దాటాలంటే భయం, అనుమానం. ఒక్కసారి దేవుడి గది వైపు చూస్తాడు. శివలింగం కనిపిస్తుంది. అతని గుండె దడే పైకి వినిపిస్తుందేమో అనిపిస్తుంది. అతనికి చెమటలు పట్టి గుండె గొంతులో కొట్టుకుంటుంది. వెనుక నుండి "దడ దడ దడ దడ లాడే ఎద సడి ఢమరుకమై...వడి వడి వడి దూకే పదగతి తాండవమై..." ప్రాణ భయంతో పారిపోతున్నవాడిని పరమశివుడితో పోల్చటం ఏమిటి అనిపించవచ్చు మనకు, అదే మజా ఇక్కడ! శివుడికి సంకల్ప బలం ఎక్కువ, భయపడుతున్న మన హీరో ఎలాగైనా బ్రతకాలి అని సంకల్పించుకొని పరిగెడుతాడు. తరువాత ప్రేమ కోసం ఎంతమంది చావబాదుతున్నా ప్రేయసి చెయ్యి వదలడు. అందుకు అతన్ని శివుడితో పోల్చిన శాస్త్రి గారి రచనాపటిమను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

సంకల్పించుకొని పరిగెత్తి పారిపోదాం అని నిలబడిన హీరోని మనం చూసే కోణాన్ని శివుడి నుంచి, శివ భక్తుడైన మార్కండేయుడిగా ఇట్టే మార్చేస్తారు శాస్త్రి గారు. "పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై..." నీ పంచ ప్రాణాలే పంచాక్షరిగా కాపాడమని శివుని పిలుస్తూ, "ముంచుకు వచ్చే మృత్యువుకి అందని మార్కండేయుడవై ... పరుగులు తీయ్…" నిన్ను తరుముకు వచ్చే ఆ చావుని తప్పించుకుని, మృత్యువు అంటే ఎరుగని మార్కండేయుడవై (మార్కండేయుడుని శివుడు చనిపోనివ్వడు) పారిపో అంటూ ఉంటే హీరో అడుగు తీసి బయట పెట్టినప్పుడు మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

కత్తులతో వెంటపడుతున్న వాళ్ళని చూస్తూ "కుత్తుక కోసే కత్తి కొనలు దరిదాపుకి చేరని దూకుడువై…".వెంటపడుతున్న వాళ్ళు సైకిల్ మీద వెళ్తున్న హీరోని పట్టుకోలేక అలసిపోయి ఒక్క క్షణం ఆగగానే "ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్". ఆ తరువాత జీపులో వేగంగా వచ్చే ఇంకో పగవాడిని చూసి "మట్టిలోకి తన గిట్టలతో నిన్ను తొక్కేయాలని దూసుకు వచ్చే కాలాశ్వంపై స్వారీ చెయ్యి". జీవరాసులన్నీ మట్టి నుంచి వచ్చినవే, చనిపోయాక మళ్ళీ మట్టిలో కలిసిపోతాయ్. ఆ ప్రక్రియని circle of life (జీవితచక్రం) అంటాము. మనం కాలాన్ని (time ని) సూర్యుడి గమనంతో పోల్చుకొని లెక్కేస్తాం. సూర్యుడు ఇక్కడ ఉంటే ఉదయం, అక్కడ ఉంటే మధ్యాహ్నం అని. అలాంటి సూర్యుడు సప్తాశ్వాల రథం (A chariot that is driven by seven horses) మీద కదులుతాడు అంటారు. అందుకే ఇక్కడ కాలాన్ని అశ్వంతో పోల్చి, కాలాశ్వం అన్నారు. మనం చనిపోయాక గొప్ప వాళ్ళం అయితే చరిత్ర అవుతాం. మాములు వాళ్ళం అయితే మన వాళ్ళకి జ్ఞాపకం అవుతాం. ఎలాంటి వాళ్ళమైనా ప్రపంచ గణాంకాలలో ఒక అంకె అవుతాం. కాలాశ్వం మనల్ని మట్టిలోకి కలిపేసాక మనం చేసేది ఏమి లేదు. ఏమి చేసినా ఈ ప్రాణం ఉన్నంత వరకే. అందుకే నిన్ను మట్టిలోకి తొక్కేయాలని చూసే ఆ కాలం అనే గుఱ్ఱం పైనే నువ్వు స్వారీ చేసి ఆ చావుని ఓడించమని మన హీరోకి చెబుతున్నారు అన్నమాట. ఆ వాక్యం విన్న ప్రతిసారీ ఎంతో స్ఫూర్తిని నింపుతుంది.

అంత సేపు పరిగెత్తాక, ఇక బ్రతుకుతానో లేదో అన్న ఆశ వదులుకుంటున్నావేమో, అలా కాదు "ఎడారి దారిన తడారిపోయిన ఆశకి చెమటల ధారలు పొయ్యి" బీటలువారిన నీ ఆశకి నీ చెమటనే ధారగా పొసి చిగురింపజేయి. "నిస్సత్తువతో నిలబడనియ్యక ఒక్కో అడుగును ముందుకు వెయ్యి". ఇంత అలుపు వస్తుంటే ఎందుకు అడుగు ముందుకు వేయాలని అనుకుంటవేమో, బ్రతకాలన్న నీ సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకో. ఎందుకు బ్రతికుండాలని, ఇలా పరిగెత్తడం పిరికితనమని అనుకుంటవేమో, ఇప్పటివరకు నువ్వు చూడని ఎన్నో సమస్యలని, నిన్ను భయపెట్టే సమస్యల్ని, ఎదురుకునేందుకు బ్రతికి ఉండటమే ఒక సాహసం! అందుకే పరిగెత్తు. "వంద ఏళ్ళ నీ నిండు జీవితం గండి పడదనే నమ్మకమై శతకోటి సమస్యలని ఎదుర్కొనేందుకు బ్రతికి ఉండగల సాహసానివై పరుగులు తీయ్య్" అని ఇలాంటి పాట వెనుక వస్తుండగా, హీరో ఎవరినీ ఎదిరించకుండా తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతున్నా కూడా ఇది సైతం మాస్ అంశమే. ఎందుకంటే, తాను మనుషుల నుండి తప్పించుకుంటున్నా, అంతకంటే పెద్ద శత్రువైన ‘మృత్యువు’ని మాత్రం జయిస్తున్నాడు.

ఇంత గొప్ప పాట మనకు ఇచ్చిన రాజమౌళి గారు, కీరవాణి గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, బాలు గారు ఎప్పటికీ మృత్యుంజయులు. ఎందుకంటే కాలం మీద స్వారీ చేసి దానిపై తమ తమ ముద్రలను వేశారు.

మనం కూడా మన ముద్ర (స్టాంప్) కాలం మీద వేయాలి అంటే, ఇప్పుడు ప్రపంచాన్నే మట్టిలోకి తొక్కేస్తాను అని వణికిస్తున్న కాలాశ్వం పై స్వారీ చెయ్యాలి. అయితే అది ఇంట్లో ఉంటేనే సాధ్యపడుతుంది. ఈ సంకల్పమే మన ఆయుధం. ఇదే మనం దేశానికి ప్రస్తుతం చేయగలిగిన సేవ కూడా. కనుక, ఇంట్లో ఉండే ప్రాణాలు కాపాడుదాం. ఈ గండం గడిచాక మన వైపు వచ్చే శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బ్రతికి ఉందాం. అలా ఉండటమే ఒక గొప్ప సాహసం. Because we need our lives to make adventures. ఈ కరోనా నుంచి అందరం తప్పించుకొని, మృత్యుంజయులమవుదాం.