నేను,తాత and చంటి – This Story Tells Us Why Parenting And Spending Time With Family Is The Most Important Of All.

Story about the importance of Parenting and Spending time with family
Updated on
నేను,తాత and చంటి – This Story Tells Us Why Parenting And Spending Time With Family Is The Most Important Of All.

తెల్లవారు జామున 7 , 7 :30 కావస్తుంది, ప్రతి రోజు లానే ఆఫీస్ కి వెళ్ళడానికి మెహదీపట్నం 49M ఎక్కాను. బస్ ఖాళీగా ఉండటం తో వెళ్లి నచ్చిన కిటికీ పక్కన కూర్చున్నా. నా ముందు సీట్ లో దట్టంగా మెరుస్తున్న తెల్ల గడ్డం ఉన్న ముసలాయన ఉన్నాడు. బస్ ఇంకో 2 నిమిషాలలో కదులుతుంది అనగా ఒక పని మనిషి , చిన్న పిల్లాడ్ని కొడుతూ ."రోజు విడొక బరువు నాకు " అని నసుగుతూ బస్ ఎక్కించింది. అది చుసిన తాత చెయ్యిసహాయం ఇచ్చి వాడ్ని పైకి లాగి తనకి ఎదురుగా ఉన్న సీట్ లో కుర్చోపెట్టుకున్నాడు.

తాత : ఏమైంది నాన్న ?

చంటి : (ఎం మాట్లాడకుండా మౌనంగా తల పక్కకి తిప్పుకున్నాడు)

కండక్టర్ వచ్చి తాతని టికెట్ ఎక్కడికి ఇవ్వమంటారు సార్ అని అడగగా , చంటి వైపు చూపిస్తూ , వీడు ఎక్కడ దిగుతాడో అక్కడదాక అని తాత చంటి వైపు చూపిస్తూ చెప్పాడు . కొంచెం ఏడుపు ఆపి కళ్ళు తుడుచుకున్నాడు చంటి.

తాత : ఇప్పుడన్నా చెప్తావా ? లేదా స్కూల్ కి కూడా రావాలా ?

చంటి : ఆ సరిత నన్ను రోజు కొడుతుంది , అమ్మ నాన్న ఉన్నప్పుడు మాత్రం చాలా బాగా చుస్కుంటది.

తాత : అవునా ? అంటే నువ్వు లేట్ గా లేస్తే బస్ మిస్ అవుతుంది కదా , అందుకేనేమో నాన్న

చంటి : ఏం కాదు , అన్ని రెడీ అయ్యి కూర్చున్నాక మెళ్లిగా సరిత వస్తది , వంట చేసి లంచ్ బాక్స్ పెట్టేసరికి టైం అయిపోతుంది. అందుకే నన్ను త్వరగా లాగుకుంటూ ఇలా బస్ లో పడేస్తది.

తాత : అయ్యయ్యో ! మరి అమ్మకి చెప్పలేదా?

చంటి : చెప్పాను ... కానీ నమ్మలేదు , అయినా వాళ్ళు కూడా నేను పడుకున్నాక వస్తారు. వాళ్ళు లేచే సరికి నేను వెళ్ళిపోతాను. మొన్న ఆదివారం ఇలా చెప్తే , నమ్మకం పక్కన పెడితే , అబద్ధాలు ఎక్కడ నేర్చుకుంటున్నావ్ అని తిట్టింది

(అలా ఆలోచిస్తూ చంటి మళ్లీ సైలెంట్ అయిపోయాడు )

తాత : మరి టీచర్ కి అయినా చెప్పాల్సింది కదా ?

(ఏం మాట్లాడలేదు ... 5 నిముషాలు తరువాత )

చంటి : మీ అమ్మ నాన్న కూడా ఇలానే చేసేవారా?

తాత : (నవ్వుతు ) వాళ్ళు లేరు నాన్న , దేవుడి దగ్గరికి వెళ్లారు కాకపోతే నా కొడుకు కూతురు చేస్తున్నారు ఇలా ఇప్పుడు

చంటి : మరి నువ్వు పొడుగుగా పెద్దగా ఉన్నావ్ కదా ,అది తప్పు అని చెప్పచు కదా ?

తాత : (నవ్వుతు ) నేను చెప్పే వయసు , వాళ్ళు వినే వయసు రెండు దాటిపోయాయి, అయినా నీకు అర్ధం కాదులే

తాత : సరే ఇంతకీ ఏ క్లాస్ నువ్వు ?

చంటి : 5th క్లాస్

తాత : ఎక్కాలు వచ్చా ?

చంటి : 5 టేబుల్ వచ్చు

తాత : అబ్బా ! 5 ఎవరికన్నా ఒస్తది , సరే 2 ఎక్కం చెప్పు

చంటి : 2 one za 2 , 2 two za 4 , 2 three za 6 , 2 four za 9

తాత : 9 ఆ? 8 కదారా

చంటి : నాకు 8 ఇష్టం ఉండదు ! పొద్దున్న 8 ఇంటికి టిఫిన్ పెట్టడానికి అమ్మ ఉండదు , రాత్రి కలిసి ఆమ్ తినడానికి ఇద్దరు ఉండరు.అందుకే 8 నచ్చదు నాకు

సరే తాత నా స్కూల్ వచ్చేసింది

(ముద్దు పెట్టి దిగాడు )

Bye

తాత : రేపు వస్తావా ?

చంటి : వస్తా

తాత , నేను ఒకేసారి

"రేయ్ నీ బాక్స్ మర్చిపోయావ్" అని అరిచాం. గబా గబా ఇద్దరం బస్ దిగి వాడికి ఇచ్చాము

చంటి: ఈ అంకుల్ ఎవరు ?

తాత : ఏమో

చంటి : కావాలనే వదిలేసా తాత ! ఆ బాక్స్ లో అన్నం బాగోదు , కూర ఉండదు , ఇలా అయినా అమ్మ వాళ్ళకి తెలుస్తుంది అని

(ఒక్కసారిగా కంట్లో నీళ్లు తిరిగాయి )

శ్రీనివాస్ : ఎలా ఉంటె మీ అమ్మ నాన్న నీకు నచ్చుతారు ? అని చంటిని

ఏం చేస్తే మీ కొడుకు మీద మళ్లీ మీకు నమ్మకం కలుగుతుంది అని తాతని అడిగాను.

ఆశ్చర్యంగా ఇద్దరు ఇచ్చిన సమాధానం ఒకటే ...

చంటి , తాత : " రోజులో ఒక్క అరగంట మాతో కూర్చుని మనస్ఫూర్తిగా మాట్లాడితే చాలు "

ఆరోజు సెలవు పెట్టేసి ఇంటికి వెళ్ళాను , మా ఇంట్లో పనిమనిషి పెట్టె లంచ్ బాక్స్ చూసాను , నా కూతురి రూమ్ లో నాది , నవ్య ఫోటోల మీద గీసిన గీతలు చూసాను.

జీవితం సంతోషంగా ఉండాలని పరుగులు తీస్తున్నాము , కానీ జీవించడం మర్చిపోతున్నాము.

అదే రోజు మా నాన్న దగ్గరికి కూడా వెళ్ళాను , చూడగానే ఆయన మోహంలో సంతోషం వర్ణించలేనిది. నేను వెళ్ళాక ఊరందరికీ నా కోసం నా కొడుకు వచ్చాడు అని చెప్పాడంటా! ఒక్క సారి కలిస్తే అంత ఆనందమా ? ఆ ఆనందం ఆయుష్షు పెంచుతది అనిపించింది.

నేర్చుకున్నాను , ఇంకెప్పుడు మర్చిపోను . 3 నెలల తర్వాత నా కూతురి ఇష్టమైన అంకె 8 అయింది, పొద్దున రాత్రి కూడా . పెంపకం బాగుంటే పరివారం బాగుంటుంది , పరివారం బాగుంటే సమాజం కూడా బాగుంటుంది.

అన్నట్టు మర్చిపోయాను , ఇప్పుడు నేను తాత చంటి మంచి స్నేహితులం , రోజు అదే బస్ , అవే సీట్లు. ఆరోజు వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడాను. ఇప్పుడు చంటికి ఇష్టం అయిన నంబర్ కూడా 8 ఏ.