అడవిలో జంతువులకు సింహం వల్ల ప్రాణహానీ ఉంటుంది, దీని బారి నుండి తప్పించుకోవడానికి మార్గమే లేదని అనుకుంటున్నప్పుడు ఓ కుందేలు తోటి జంతువుల సమస్యను ఎలా తీర్చగలిగింది.? నీటిలోని మొసలి, చెట్టు మీది కోతి స్నేహితులు.. ఒకరోజు మొసలి భార్య ఆ కోతి గుండె తినాలని భర్తను అడుగుతుంది. భార్య కోరిక మేరకు తన మిత్రుడైన కోతినే చంపాలనుకునే చర్య నుండి కోతి ఎలా సమయస్ఫూర్తితో తప్పించుకోగలిగింది.?
ఇలాంటి రకరకాల పంచతంత్ర కథలను హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీ గచ్చిబౌలి పంచతంత్ర పార్కులో వినవచ్చు, చూడవచ్చు. పంచతంత్రం ప్రపంచ సాహిత్యానికి భారతదేశం అందించిన గొప్ప రచన. దీనిని క్రీ.శ.5వ శతాబ్దంలో విష్ణుశర్మ గారు సంస్కృతంలో రచించారు. ఆ తర్వాత అనేక భాషలలో దీనిని అనువాదం చేశారు. మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో, లౌక్యం, తెలివితేటలు మొదలైనవాటిని ఆసక్తికరమైన కథనంతో విష్ణుశర్మ బోధించారు. భారతదేశంలోనే పుట్టి పెరిగిన పంచతంత్ర కథలు ముఖ్యంగా పిల్లలకు అవసరం. ఇప్పటి పిల్లలకు పంచతంత్రంపై ఆసక్తి పెరగడానికి ఈ పార్క్ ను జి.హెచ్.ఎం.సి వారు 45 లక్షలతో రూపొందించారు.
బొమ్మలు ఆ పక్కన పెద్ద బోర్డు అందులో కథ.. ఇలా కాకుండా "పిల్లలకు నచ్చేటట్టుగా పచ్చని చెట్లు.. ఆ పక్కనే బొమ్మలు చూస్తూ అక్కడే ఉన్న స్పీకర్ స్విచ్ ఆన్ చేస్తే కథ ఆడియో ప్లే అవుతుంది". పంచతంత్రం కథల నేపథ్యం చాలా శతాబ్దాల క్రితం నాటిది. ఆ కాలంలో రాజులు, రాజ్యాలు, జంతువులు, అడవి మొదలైన వాటిని బేస్ చేసుకుని ఈ కథలన్నీ ఉంటాయి. పంచతంత్రం కథలను వివరించాలంటే అడవి లాంటి వాతావరణం క్రియేట్ చేస్తేనే కథను పిల్లలు పూర్తిగా అర్ధం చేసుకుంటారనే ఉద్దేశ్యం కోసమే ఈ థీమ్ తో పార్క్ ను సిద్ధం చేశారు. ప్రతి ఒక్క కథ 3 నుండి 4 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుంది, కథ చిన్నదే కానీ జీవితానికంతటికి కావాల్సిన లౌక్యం ఈ కథలో ఉంటాయి. అలాగే ఎటువైపు చూసినా పిల్లలలో ఆలోచన చెలరేగాలని పార్కులోనే ఉన్న కాంపౌండ్ వాల్ మీద 20 కథలను పెయింటింగ్ రూపంలో వేశారు. పిల్లలకు అన్ని వేళలా ఎంట్రీ ఉంటుంది.. పెద్దవారి కోసం ఉదయం సాయంత్రం కలిపి ఆరు గంటలు మాత్రమే పార్క్ లోకి అనుమతి ఉంటుంది.