Contributed By N.V. Chaitanya Sai
ఎప్పటిలాగే నాకు ఫోన్ చేస్తావు, నవ్వుతూ మాట్లాడతావు, ఎందుకు ఆంత బాగా నవ్వుతావు... రోజులో జరిగిన విషయాలు అన్ని చెప్తావు, నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను మధ్యలో నేను ఏదైనా చెప్తే, కొన్ని సార్లు కొప్పడతావు... అప్పుడు నువ్వు తిడుతుంటే కూడా ఎంత బాగుంటుందో. ఏదేదో మాట్లాడుకుంటాం, మన గురించి మొదలుపెట్టి...ప్రపంచంలో ఏ మూలో జరిగిన విషయాలు మాట్లాడతాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాం అని నవ్వుకుంటాం. ఇంతలో ఫొన్ కట్ అయిపోతుంది,
అప్పుడు తెలుస్తుంది గంటన్నర అయిపోయిందని... అప్పుడు నాకు అనిపిస్తుంది, ఎందుకు గంటన్నరకే ఫోన్ కట్ అవ్వాలి అని. ఉల్లిక్కిపడి ఫోన్ చుస్కుంటాను, నీకు మళ్ళీ కాల్ చేద్దామని. కానీ,
ఇవన్నీ గడిచిపోయిన రోజులు కదా... బహుశా, నేను మళ్ళీ జరగాలని అనుకుంటున్న రోజులేమో. అలా నిద్రలోను నీ జ్ఞాపకాలే, అందుకేనేమో ఈ మధ్య నాకు నిద్ర బాగా నచ్చుతుంది. ఎందుకంటే...
అక్కడేగా నువ్వు నాతో ఉండేది, మాట్లాడేది. నిద్రలేస్తే... మళ్ళీ ఈ నిజంలో నువ్వు నాకు దూరం అయ్యావు అనే నిజాన్ని అంగీకరించలేని పిరికోనిలాగా...ఆ నిద్రలోనే నా కలల జీవితాన్ని సృష్టించుకుంటున్నాను. ఆ ఊసులే, ఆ ఊహలే ఊపిరై జీవిస్తున్నాను..