This Story Narrated By OSHO About Your Hardships Will Make You Think Twice About Life!

Updated on
This Story Narrated By OSHO About Your Hardships Will Make You Think Twice About Life!

(ఓ వ్యక్తి నెలల తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు భగవంతుడిని ఇలా ప్రార్ధిస్తుంటాడు..) “భగవంతుడా. నాకోసం ఒక్క సహాయం చెయ్యి, కేవలం ఒకే ఒక్కటి, ఈ సహాయం తప్ప నాకు ఇంకేమి వద్దు.. నా పూర్తి జీవితంలో ఇక ఎప్పుడు నిన్ను ఏ కోరికా కోరను, ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు”. “ఈ లోకంలో నాకున్న కష్టాలు ఇంకెవ్వరికి లేవు, నా కష్టాలు ఒకే వరంతో తీర్చమని అడిగే అత్యాశ నాకు లేదు, కాని నా కష్టాలను మార్చుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి నా కష్టాలు ఇంకొకరికి ఇచ్చి అతని కష్టాలు నాకివ్వు చాలు (ఎందుకంటే తన కష్టాల కన్నా మిగిలిన వారివి చాలా తక్కువ కష్టాలు అని అతని భ్రమ)..” నాకు ఇంకేమి వద్దు.. ఈ ఒక్క కోరిక తీర్చు..! అని ఆ వ్యక్తి ప్రతిరోజు వేడుకుంటాడు.

నెలల తరబడి ఆ వ్యక్తి అడుగుతున్న కోరిక భగవంతునికి చేరింది.. ఆరోజు రాత్రి భగవంతుడు అతని కలలోకి వచ్చి ఇలా చెప్పాడు. “కుమారా.. నువ్వు ప్రతిరోజు నాకు చెబుతున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతున్నా.. అందుకోసం ముందుగా నువ్వు ఒక పని చెయ్యాలి.. నీ కష్టాల చిట్టా అంతా ఒక కాగితం మీద రాసి దానిని రేపు నా దేవాలయానికి తీసుకురా” అని చెప్పాడు. ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్ని ఒక పేపర్ మీద రాయడం మొదలుపెట్టాడు.. ఆ కష్టాలు ఒక్క కాగితంలో సరిపోలేదు.. అతనికున్న కష్టాలన్ని రాసేసరికి ముందుగా అనుకున్న ఒక్క కాగితం కాస్త చాలా కాగితాలయ్యాయి.. ఆ కాగితాలన్ని ఒక కట్టగా కట్టి మరుసటిరోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు.

ఆనందంతో దేవాలయానికి వెళుతున్న ఆ వ్యక్తికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది.. అదే దారిలో తన లాగే పేపర్ల కట్టలు కట్టుకుని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు. ఆ వ్యక్తికి అప్పుడే అర్ధమయ్యింది, “నా ఒక్కడికే కాదు నాతో పాటు భగవంతుడు వీరందరి కలలోకి వచ్చి నాకు చెప్పిందే చెప్పాడన్నమాట” అని. అక్కడున్న మిగిలిన వారి పేపరు కట్టలన్ని తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి. అంతకు ముందు తనతో పరిచయమున్న వారందరు ఆ కట్టలతో వచ్చేస్తున్నారు.. ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది “వీరందరికి నాకన్నా మంచి బట్టలున్నాయి, డబ్బులున్నాయి.. ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతు మాట్లాడతారు.. కాని తన కన్నా వారి దగ్గరున్న కష్టాల కట్టలు ఎక్కువ ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది. గుడి తలుపులు సమీపిస్తున్న కొద్ది ఆ వ్యక్తిలో భయంతో కూడుకున్న అలజడి మొదలయ్యింది. ఈ అలజడి ఆ వ్యక్తికి మాత్రమే కాదు అక్కడున్న గ్రామస్తులందరికి పాకింది.

అనుకున్న సమయం రానే వచ్చేసింది.. గ్రామస్తులంతా ఆ గుడిలోనికి ప్రవేశించారు. అప్పుడే భగవంతుడు అదృశ్యవాణిగా ఇలా చెప్పాడు.. “మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్ని కింద పెట్టండి”. చెప్పినట్టుగానే అందరు వారి కట్టలన్ని కింద పెట్టారు. అప్పుడు భగవంతుడు.. “ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్కడున్న ఏదో ఒక కట్టను తీసుకోండి, మీరు కోరుకున్నట్టుగానే ఆ కట్టలో రాసివున్న కష్టాలన్ని మీకు బదిలి చేయబడతాయి” అని అన్నాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది. “అదే భయంలో అందరు ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అక్కడున్న వారంత ఎవరి కట్టను వారు తీసుకోడానికి ప్రయత్నించారు”. ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరి ఊహించని కష్టాలు వస్తాయో, మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు కాని మనం జీవితంలో ఊహించని కష్టాలు వస్తే..? అని అందరు ఆలోచిస్తూ ప్రాణ భయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా అదే ప్రయత్నిస్తున్నాడు.. ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్టుగా ఉంది అక్కడి దృశ్యం.

అక్కడున్న వారంత ఎదుటి వ్యక్తిలోని ఎంతటి ఊహించని కష్టాలు ఉన్నాయో అవి ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టను వారే తీసుకోగలిగారు.. అప్పటివరకు ఏదో మృత్యువు తరుముతున్నట్టుగా ఉన్న వారంత తమ కష్టాల కట్ట తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగారు. అందరు చాలా ఆనందంగా ఉన్నారు.. ఆ వ్యక్తి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. వారందరికి స్పష్టంగా ఒక విషయం అర్ధమయ్యింది. “తమ కష్టాలే చిన్నవి, అనవసరంగా భయపడ్డాము..” వీటికి పరిష్కార మార్గాలను వెతకాలి, పోరాడాలి, విజయం సాధించాలి అని ధృడ సంకల్పంతో ముందుకు కదిలారు.