This Intense Conversation Between A Writer And His Student Is Something You Must Read!

Updated on
This Intense Conversation Between A Writer And His Student Is Something You Must Read!

Contributed by Sai Ram

"సర్ ఒక పాట రాయాలి, మన స్టార్ హీరో సినిమాకి .." అని శంకరం గారి ఇంటికి వచ్చిన పెద్ద డైరెక్టర్ అడిగారు ..

ఆదివారం కావడంతో, ఆ సమయానికి నేను శంకరం గారి ఇంట్లోనే ఉన్నాను. శిష్యుడు అనుకున్నారో, ఆప్తుడు అనుకున్నారో తెలీదు కాని, సినీ ప్రపంచం లో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న శంకరం గారు, రెండు నెలలు ముందు తన పక్కింటి వాటా లో మా కుటుంబం అద్దె కి దిగినప్పటి నుంచి , తనతో ప్రతి శని ఆదివారాలు తెలుగు సాహిత్యం గురించి పుస్తకాల గురించి మాట్లాడే అదృష్టాన్ని నాకు కల్పించారు.

శంకరం గారు :: పాట సందర్భం చెప్పండి.

పెద్ద డైరెక్టర్ :: సందర్భం అని ఎమీ లేదండి .. బాగా ఊపున్న పాట, హీరోయిన్ తో కలిసి హీరో పాడుకునే పాట కోసం కావాలి.

శంకరం గారు :: రేపు వచ్చి తీసుకుని వెళ్ళండి.

------------

నాలుగు గంటలు లేవకుండా ఆయన కుర్చుని రాసిన ఆ పాట ని మరుసటి రోజు తీసుకుని వెళ్ళటానికి ఆ పెద్ద డైరెక్టర్ వచ్చి , పాట చదువుకున్నారు ..

పెద్ద డైరెక్టర్ :: అదేంటండీ, భూరుహము, విపంచి లాంటి కష్టమైన పదాలు వాడారు. నాకే అర్ధం కావట్లేదు, ప్రజల లోకి వెళ్లడం కష్టం కదండీ. అందులోను హీరోయిన్ ని ఋతువులతో పోలుస్తూ హీరో పాడుతునట్టు రాసారు. జనాలకి ఎక్కదండి .. మీరు ఎమీ అనుకోకపొతే పాట మార్చి రాయగలరా ?

శంకరం గారు :: రేపు పొద్దున్న వచ్చి తీసుకుని వెళ్ళండి. చెప్పడం మర్చిపోయాను, ఈ పాట కి పది లక్షలు ఇవ్వండి.

పెద్ద డైరెక్టర్ : సరే ..!!

"ఈయన కి మరీ డబ్బు ఆశ ఎక్కువైపోయింది. పాట ఈయన రాస్తే సినిమా కి పేరు వస్తుందని మర్యాద ఇస్తుంటే, మరీ రెచ్చిపోతున్నాడు" అని ఆ డైరెక్టర్ అనుకుంటూ వెళ్ళడం నేను గమనించాను.

ఎలాగో అలాగ ధైర్యం తెచ్చుకుని, నేను శంకరం గారితో :: కాటన్ పంచె, కాటన్ తెల్ల చొక్కా, మధ్య తరగతి ఇల్లు, ఇంటి నిండా పుస్తకాలు, కంటి నిండా మీ రచన కి దోహదపడే కలలు, గుండె నిండా మనసుని హత్తుకునే రచనా కళలు, ఒక పాత పడక కుర్చీ, ప్రభుత్వ పెన్షన్ తో నిరాడంబరం గా కనిపించే మీరు ఇంత డబ్బులు ఎందుకు అడుగుతున్నారు ? ఎంత డబ్బు సంపాదిస్తే మీకు తృప్తి గా ఉంటుంది ?

శంకరం గారు :: పాటలు రాసి సంపాదించే డబ్బు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు నాకు.

---------

ఇంతలో ఇంకొక డైరెక్టర్ ఇంటికి వచ్చి

ఇంకొక డైరెక్టర్ :: హీరోయిన్ మానసికంగా కృంగిపోయి ఉన్న సమయం లో తనంతట తాను ధైర్యం తెచ్చుకుని జీవితం లో మళ్ళీ సంతోషాన్ని, విజయాన్ని, పొందే సందర్భానికి పాట కావాలండీ. అలాగే ఆ పాట కి మీరు ఎంత తీసుకుంటారో కూడా చెప్పండి .

శంకరం గారు :: రెండు రోజులలో వచ్చి పాట తీస్కుని వెళ్ళండి. డబ్బులు ఏమి వద్దండి. సినిమా లో ఈ పాట ని బాగా తీయండి.

------------ నేను ఆశ్చర్యపోయాను, ఇందాక పది లక్షలు అడిగిన వ్యక్తేనా ఈయన ? అనుకున్నాను. ఆ డైరెక్టర్ థాంక్స్ చెప్పి వెళ్లిపోయారు.

శంకరం గారు నాతో :: నేను తృప్తి గా రాసిన పాటలకి డబ్బులు తీసుకోను, నా మనసుని చంపుకుని రాయాల్సిన పాట వస్తే ఎక్కువ డబ్బులు తీసుకుంటాను. అందుకనే అన్నాను , పాటలు రాసి సంపాదించే డబ్బు ఎంతైనా నాకు ఆ డబ్బు సంపాదించినందుకు తృప్తి ఉండదు అని. ఆ చంపుకున్న మనసుతో వచ్చిన ఎక్కువ డబ్బుని ఉచిత గ్రంధాలయం కి వినియోగించేస్తాను. చంపుకున్న నా మనసుని పుస్తకాలతో మళ్ళీ బ్రతికించుకుంటూ ఉంటాను. ఈ డబ్బు లేకపోయినా నాకున్న ఆస్థి తో పెన్షన్ తో ఆ గ్రంధాలయం ని నడుపుతాను. కాని నేను ఉచితం గా రాస్తాను అని ఆలోచించి అయినా నాకు ఆత్మ సంతృప్తి కలిగే పాటలు రాయడానికి అవకాశం ఇస్తారని చిన్న ఆశ. ఇన్నేళ్ల నా రచనా జీవితం లో ఇవన్నీ బయట ఎవరికీ తెలియదు, నా శిష్యుడివి కాబట్టి నీకు చెప్పాను.

----------

అని చెప్పి, దేవరకొండ బాలగంగాథర్ తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి పుస్తకం లో ఆయన నిమగ్నం అయిపోయారు.

ఆయన నన్ను శిష్యుడి గా భావించినందుకు, నా మీద అమృతం కురిసినంత ఆనందపడ్డాను.

ఇంతలో, శంకరం గారి ఫోన్ మోగింది. ఆయన పుస్తకం లో నుంచి తల పైకి ఎత్తకుండా తన ఫోన్ నన్ను ఎత్తమని సైగ చేసారు.

మరొక డైరెక్టర్ :: శంకరం గారితో మాట్లాడాలి, మీరు ఎవరు ?

నేను :: నేను ఆయన శిష్యుడిని మాట్లాడుతున్నాను, చెప్పండి.

మరొక డైరెక్టర్ :: ఒక పెద్ద సినిమా కి మూడు పాటలు రాయాలి, మీ గురువు గారు ఎంత తీసుకుంటారో చెప్తే, మా బడ్జెట్ చూసుకుంటాం.

నేను :: ఎంత కాదు, ఏమి తీసుకుంటారో అని అడగడం సబబు అని నా అభిప్రాయం అండి.

మరొక డైరెక్టర్ :: అదేంటి ??!! సరే, ఏమి తీసుకుంటారు ?

నేను :: మంచి పాట రాసే అవకాశం వచ్చిందని ఆయన కి కలిగే ఆత్మ సంతృప్తి ..!!