ఓ చిన్న ఆశ - Musings Of A Boy About His Love & Dreams

Updated on
ఓ చిన్న ఆశ - Musings Of A Boy About His Love & Dreams

Contributed by Gopinath Vaddepally

ఓ సాయంత్రం, సముద్ర తీరాన నీతో కూర్చుని, అలలు నా కాళ్ళని తాకుతుంటే, నా కనులు నిన్ను చూస్తూ ఏవో కలల అలల్లో మునిగిపోవాలని ఓ చిన్న ఆశ..

విరగకాసిన వెన్నెల రాత్రిలో, ఆ వెన్నెల ప్రతిబింబన్నీ నీ కళ్ళలో చూస్తూ, ప్రపంచం పెట్టిన హద్దుల్ని చేరిపేస్తూ, నిన్ను నా కౌగిట్లో బందించి, గుండెసడి ఎక్కువై తడారిపోయిన నీ పెదాలపై నా పెదాలతో ముద్దుపెట్టాలని ఓ చిన్న ఆశ..

ఎంత మందిలో ఉన్న నీకోసం వెతికే నా కనులకి నువు చూసే ఓ ఓరచూపు మరో జన్మలో గత జన్మ జ్ఞాపకంగా నన్ను వెంటాడుతుండాలని ఓ చిన్న ఆశ..

గెలుపోటముల పరుగు పందెంలో నేను ఓడిపోయి, మనసు నిరాశలో మునిగిపోయి, జీవితం ఏడరాయితే, నీ ప్రేమ వర్షం కురిపించి, నీ చిరునవ్వుతో ఓ కొత్త ఆశ చిగురింపచేసి కాలలు కొలవలేనంత దూరాన్ని నా చెయ్యి పట్టుకుని నడవాలని ఓ చిన్న ఆశ..

నా మాటలు విని ఆశకి ఓ హద్దు ఉండాలి రా అన్నాడొకడు. ఉందొ లేదో తెలియని రేపటి కోసం ఈరోజు కష్టపడటంలో అర్థం ఉన్నప్పుడు నా ప్రేమ ఇలా ఉండాలని ఆశపడడంలో తప్పు లేదనిపించింది..