Contributed By Aditya Gangadhar
సీతారామశాస్త్రీ గారి పాటలుమనం చాలానేవిన్నాం.ఆయన సాహిత్యంలో గొప్పదనం ఏమిటంటే పైకి ఒకలా ఉండే ఆయన పాట లోపల ఇంకొక అర్థం వచ్చేలా ఉంటుంది. ప్రతీ పాట మనల్ని ఆలోచింపచేసేలా ఉండటమో, లేక ఎదో ఒక సందేశం ఇవ్వటమో జరుగుతూనే ఉంటుంది. ఆయన రాసిన పాటలు వినటం కాకుండా, సరిగ్గా అర్థం చేసుకొనేందుకు ప్రయత్నిస్తే, మనం ఆలోచించే తీరు మారుతుంది అనటం లో అస్సలు సందేహం లేదు.
ఖడ్గం సినిమా లో నువ్వు నువ్వు అనే పాట లో నువ్వు అనే పదానికి అర్థం మనమే అనుకోని ఒకసారి ఆ పాటని ఒకసారి పరిశీలిద్దాము. పైకి ఒక అమ్మాయి తన ప్రియుడి కోసం పడుతున్నట్టు ఉంటుంది. కానీ అది మనం మనతో మాట్లాడుకుంటున్నట్టు కూడా ఉంటుంది.
నువ్వు .నువ్వు.నువ్వే నువ్వు ఇక్కడ మనం మనతోనే మాట్లాడుకుంటున్నాం అనుకుందాం.
నాలోనే నువ్వు నాతోనే నువ్వు నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు నా పెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు ఇక్కడ మనం మనతోనే ఉంటాం. ఎప్పుడూను కూడా. మన చుట్టూ ఉన్న ప్రతి విషయం లో మన కోణం లోనే చూస్తాం. అందులో మనకి దగ్గర ఐన వాటికీ మనం స్పందిస్తాం. మన మొహం మీద నవ్వుకి మన ఆలోచనలే కారణం.
బుగ్గల్లో నువ్వూ మొగ్గల్లే నువ్వు ముద్దెసే నువ్వూ నిద్దర్లో నువ్వూ పొద్దుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వూ... నువ్వు .నువ్వు.నువ్వే నువ్వు ముద్దేసే నువ్వు, అంటే మనకి మనమే నచ్చినంతగా ఇంకొకరిని ఇష్టపడతామా? పైకి కాదు అని చెప్పినా లోపల మనం మనల్నే ఎక్కువ ప్రేమిస్తాం. నిద్రపోతున్న, నిద్రలేచిన, ప్రతినిమిషం, మనతో మనమే ఉంటాం. ఎన్ని బంధాల్లో ఉన్నా, ఎంత మందితో ఉన్నా, ఎక్కువ సేపు , మనతో మనమే ఉంటాం.
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు నా మనసును లాలించే చల్లదనం నువ్వు పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు నా ప్రతి యుద్ధం నువ్వూ నా సైన్యం నువ్వు మన యువతనం లో మనం ఎన్నో సాధించాలి అనుకుంటాం. ఆ తపన తో మనల్ని మనమే వేధించుకుంటాం ( అంటే కష్టపడి కలలని నిజం చేసుకొంటాము అని ) , ఆ కళలు తీరక మన మనసు కుదుట పడ్డాక మనమే శాంతం గా ఉంటాం. మనసును లాలించే చల్లదనం అంటే ఇదీ. మన మనసులో మనకి తెలియని భారం కొన్నిసార్లు మోస్తూ ఉంటాం. అందులోంచి బయట పడితే బావుండు అని మనమే అనుకుంటాం. కొన్ని సార్లు అది పిచ్చితనం లా అనిపించొచ్చు. అక్కడ కూడా మనమే ఉంటాం. మనం చేసే ప్రతి యుద్ధం లో మనమే ఉంటాం. మనకోసం చేస్తున్న యుద్ధం అంటే అది మనమే. ఏ యుద్ధం అయినా కూడా రాజు సరిగా లేకపోతే సైన్యం సరిగ్గా ఉండదు. అంటే సైన్యం అంటే సైనికులే కాదు. రాజు కూడా. అలాగే, మన యుద్ధానికి ముందు మనం సిద్ధంగా ఉండాలి. నా సైన్యం నువ్వు అంటే అదే అర్థం.
నా ప్రియ శత్రువు నువ్వూ.నువ్వూ. మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు నచ్చే కష్టమ్ నువ్వూ. నువ్వూ. నువ్వు . మనం కొన్నిసార్లు తీసుకున్న నిర్ణయాలు మనకే నచ్చవు. మనల్ని మనమే తిట్టుకుంటాం. మనమే మన శత్రువులం. కొన్ని కష్టాలు కావాలని తెచ్చుకొంటాం, వాటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటాం. భార్య, పిల్లలు ఇలాంటివి. బాధ్యత లో కష్టం ఉన్నా, మన అనుకోని ముందుకు వెళ్లి వాటిల్లో ఆనందం వెతుక్కుంటాం. ముల్లై గిల్లి తొలి చినుకే మనం. మనకి నచ్చిన కష్టం మనమే.
నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు ఇక్కడ సిగ్గు అంటే, కొంచెం భయపడే మనస్తత్వం. మనకి మనమే ధైర్యం చెప్పుకోగలగాలి. ఎంత మంది మనల్ని encourage చేసిన కూడా మనం మనకే ధైర్యం చెప్పుకోలేకపోతే, ముందుకు వెళ్లలేం. మనల్ని మనమే దోచుకొనే కోరిక కూడా మనమే. కొన్ని సార్లు మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఆశించి మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అని అర్థం చేస్కొచు.
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు తప్పని స్నేహం నువ్వూ.నువ్వూ. తీయని గాయం చేసే అన్యాయం నువ్వు అయినా ఇష్టం నువ్వూ నువ్వూ నువ్వు . పైన చెప్పినట్టే, మనల్ని మనమే ముందుకి నడిపించుకోగలం. మనలో కోరికలు, ఆశలు, అన్నీ మనమే. తప్పని స్నేహం మనమే. మన స్నేహితులకి మన గురించి బాగా తెలుసు. అమ్మ నాన్నలతో చెప్పుకోనివి కూడా ఒక స్నేహితుడితో చెప్పుకుంటాం. కానీ స్నేహితులతో కూడా చెప్పుకోలేనివి కొన్ని మన మనసులోనే దాచుకుంటాం. అక్కడ మనల్ని మనమే నమ్ముతాం. మనకి మనమే స్నేహితులం. మనం తెలియక, తెలిసి కూడా తప్పులు చేసినా మనమీద మనకి ఏదో ఒక మూల ఇష్టం ఉంటూనే ఉంటుంది.
మైమరిపిస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు నే కోరుకునే నా మరోజన్మ నువ్వు కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు మనల్ని మనమే చూసుకొని మురిసిపోతాం, మైమరచిపోతాం. ఇంకొక జన్మ ఉంటే అంబానీ లా పుట్టాలి అనుకుంటాం. కానీ ఆలా పుట్టాక కూడా మనం ఎం చెయ్యాలి అని అనుకున్నామో అవే అప్పుడు చెయ్యాలి అనుకుంటాం కానీ, reliance ని నడిపిస్తాం అని అయితే అనుకోము. కాబట్టి మనకి తెలియని ఒక కొత్త పేరు, ఒక కొత్త ప్రపంచం కూడా మనం అనుకున్నట్టు గానే ఊహించుకుంటాం.
నా అందం నువ్వు ఆనందం నువ్వు నేనంటే నువ్వూ. నా పంతం నువ్వు నా సొంతం నువ్వు నా అంతం నువ్వూ. మనం మనకి అందంగా ఉంటె చాలు. ఇంకొకరికోసం ఉండాలి అనుకోక్కర్లేదు. మన ఆనందం కూడా మనమే. మనం తీసుకొనే నిర్ణయాలు, వాటి వల్లే మన ఆనందం ఉంటుంది. పక్కవాళ్ళ వాళ్ళ కూడా అనుకొనేముందు ఒక విషయం. పక్కవాళ్ళు మన జీవితం లోకి ఆహ్వానించింది మనమే కదా! అలాంటప్పుడు మన ఆనందానికి కారణం కూడా మనమే! మన పంతం పట్టుదల అన్ని మనకే సొంతం. మనల్ని మనం సొంతం చేసుకోవాలి. ఎం చేసిన ఎం జరిగిన అన్నీ మనమీదే ఆధారపడి ఉంటాయి. చివరికి మన చావులో కూడా మనతో మనమే ఉంటాం.
ఇలాంటి ఒక అంతర్మథనాన్ని, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కోసం పడే తపనలా రాయటం మాములు విషయం కాదు. అయన ప్రతిభకి, అయన ఆలోచన సంవిధానానికి, ఆయన పాదాలకి, నమస్కారం చేయటం ఒక్కటే మనం ఆయనకి చేయగలిగింది. _/\_