పాట లో ని పాఠం : ప్రేమంటే అంటే నిర్వచించే సిరివెన్నెల గారి అద్భుతమైన పాట 'ఆకాశం తాకేలా' - A Short Note

Updated on
పాట లో ని పాఠం : ప్రేమంటే అంటే నిర్వచించే సిరివెన్నెల గారి అద్భుతమైన పాట 'ఆకాశం తాకేలా'  - A  Short Note

ఎవరైనా "ప్రేమంటే ఏంట్రా" అని అడిగితే నాకు గుర్తొచ్చే మొదటి పాట "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" లో ని ఈ పాట . ఇంతవరకు ఎవరు వాడని ఉపమానాలను వాడుతూ సిరివెన్నెల గారు అద్భుతమైన సాహిత్యం రాస్తే.., బాలు గారి గొంతు నుండి అమృతం లా జారింది ఈ పాట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇంకో స్థాయి కి తీసుకెళ్లింది ఈ పాట ని..

సందర్భం: హీరో అమెరికా లో పుట్టిన ఒక సంపన్న కుటుంబానికి చెందిన కుర్రాడు.., కానీ తను ప్రేమించిన అమ్మాయి ని దక్కించుకోవడానికి, వ్యవసాయం చేసి తన ప్రియురాలి అన్న కన్నా ఎక్కువ పంట పండిస్తాను అని పందెం వేస్తాడు.. మట్టి వాసన ఎరుగని తను, చేతులకు వాతలు వచ్చేలా పనిచేస్తాడు.. ఈ ప్రయాణం లో తనకు తోడుగా బలంగా నిలుస్తున్నది ప్రేమ ఒక్కటే.., మరి ఆ ప్రేమ ఎంత బలమైనది అంటే? ఆ ప్రశ్న కి సమాధానం ఈ పాట..

పల్లవి: ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల్ ఘల్ ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందిచే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడి గానం ప్రేమంటే అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం

భూమి, ఆకాశాన్ని ప్రేయసి, ప్రియుడు గా వర్ణించారు. నిజానికి అవి రెండు కలవవు.. కానీ భూమి కొన్ని సార్లు వడగాలి సృష్టిస్తుంది.. ఆ వడగాలి మేఘం కి పిలిచే ఆహ్వానం లాంటిదే ప్రేమంటే.., ఆ వడగాలి ఆకాశాన్ని తాకాలని ఎలా ప్రయత్నిస్తుందో.. ప్రేమ కూడా ప్రేమించే వ్యక్తి ని చేరాలని అంతే ప్రయత్నిస్తుంది.. ఈ వడగాలి ఆరాటం తీరేలా ఆకాశం వాన గా కురుస్తుంది.. ప్రేమించుకున్న వ్యక్తుల మధ్య కురిసే ప్రేమ ని వాన తో బాగా ఉదాహరిస్తారు.. సిరివెన్నెల గారు. గాలి తాకినా వెంటనే మేఘం, వర్షం గా ఎలా మారుతుందో.. ప్రేమించుకున్న వ్యక్తులు మౌనంగా ఉన్న వారిలో ఉన్న మమతా ఒకరిని విడిచి ఒకర్ని ఉండేలా చేయదు.. పరుగులు పెట్టిస్తుంది.. అదే వారి మధ్య ప్రణయానికి శ్రీకారం అవుతుంది..

దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే

చివురు, నీళ్లు పోస్తే కానీ పెరగదు.. అలంటి చివురు కి ఒక వర్షపు చినుకు అందించే స్నేహం లాంటిది ప్రేమంటే, హరివిల్లు ఎప్పుడో కానీ రాదూ.., అందులో రంగులన్నీ కలిపి మాగాణి అంటే ఇంటి గుమ్మం లో చక్కగా వేసిన రంగుల ముగ్గులాంటిది ప్రేమంటే.. ప్రేమ ఎలాంటి అద్భుతమైన చేయగలదు...

చరణం 1: ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే

అమ్మ కడుపు లో మన ప్రాణం ఎప్పుడు మొదలయ్యిందో ఎవరు చెప్పలేరు.. ప్రేమ కూడా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో కూడా గమనించలేం.. ప్రకృతి లా అది సహజంగా జరిగే చర్య.. ప్రేమంటే సరిగ్గా ఇది అని మాట ఏదైనా ఉంటే.. నిజానికి ఆ మాట కి కూడా ప్రేమంటే అర్ధం సరిగ్గా తెలుసుండదు.. చరితలో చదవని ఒక కథే ఏ ప్రేమ కథైనా.. కవిత్వాలు ఎన్ని రాసిన ప్రేమ అంటే 100 శాతం చెప్పే కవిత లేదు.. అలాంటి భావన ప్రేమ.. ఎవరికీ వాళ్ళు నిర్వచించుకోవాల్సిందే...

దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే

వరద లా పొంగే నది, తనలో ఈ వేగాన్ని పెంచిన తొలి చినుకు ఎదో కనిపెట్టలేదు.. పంట, తనలో ఎదిగిన తొలి ధాన్యం ఏంటో.. చెప్పలేదు.. ప్రేమ కూడా అంతే తనలో ఈ భావన కలిగిన తొలి క్షణం ఏంటో చెప్పలేదు..

చరణం 2: మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే

కొలిమి మండితే కానీ, బంగారం ఎవ్వడు, నాగలి పదును విత్తనాన్ని నాటితే కానీ పొలం పండదు.. తణువంతే గాయాలు అయ్యేంతల కష్టపడితే ఆ గాయాలే వరమాల గా మారి గెలుపు ప్రేయసి లా నిన్ను వరిస్తుంది.. నీ మనస్సు కు ఒకరి ప్రేమని గెలిచేంత విలువ ఉంటే.., నువ్వు కోరుకున్న దానికన్నా రెట్టింపు ప్రేమ నిన్ను చేరుతుంది.. నీ మనస్సులో కొలువుంటుంది..

జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా

నిన్ను ఒకరు నమ్మి, జన్మంతా నీతో నడవాలి అని నిశ్చయించుకున్నప్పుడు, ఆ నడకల్లో తడబడిన అది నాట్యం అంత అందంగా మారిపోతుంది.. రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ... నిద్రలేక ఎర్రబడిన కళ్ళలో ని మంట కూడా క్రాంతి లా మారి సంక్రాంతి పండగంత సంబరంగా నీకు ఎదురవుతుంది..

ప్రేమని చూసే వైఖరి మారుతుందో ఏమో కానీ, ప్రేమ మాత్రం మారదు.., మనల్ని నమ్మే ప్రతి ఒక్కరి ప్రేమ మనకు బలంగా నిలుస్తుంది. మనల్ని గెలుపు వైపుకి నడిపిస్తుంది.. సిరివెన్నెల గారు ప్రేమ అనే పదానికి రాసిన dictionary ఈ పాట...