'Why You Shouldn't Watch TV While Eating'? A Grandfather Explains

Updated on
'Why You Shouldn't Watch TV While Eating'? A Grandfather Explains

(సమ్మర్ వచ్చిందంటే తాతయ్య వాళ్ళింటికి పిలవకపోయినా వెళ్లిపోవడం లో ఉన్న చనువు తో, ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా నాకూ మా తాతయ్య వాళ్ళుండే పల్లెటూరు బాగా ఉపయోగపడుతుంది అని వెళ్లి, పొద్దున్నుండీ తీసుకున్న ఫోటోలు చూస్తూ ఆ మండువా ఇంటికి చేరుకున్న నాకు తాతయ్య ఒంటరి గా భోజనం చేస్తూ కనిపించారు.)

నేను : ఏంటి సార్ ఒక్కరే ఉన్నారు ? అమ్మమ్మ ఎక్కడ ? తాతయ్య : ఇదిగో ఆ గడ్డి లో పోగేసిన మామిడిపళ్ళు తేవడానికి వెళ్ళింది.

నేను : ఓ భోజనం చేస్తున్నావా .... ఏం కూర తాతయ్యా ? ఇదిగో చూడు ఫొటోస్. పొద్దున్నే తీసా. ఇదిగో ఇది నువ్వు ఆ చెట్టు కింద ఉన్నావ్. ఎలా ఉన్నాయ్ ? తాతయ్య : హ్మ్ చాలా బాగున్నాయ్ రా... బాగానే తీసావ్ .... వెళ్లి భోంచెయ్.

నేను : అది సరే, ఇంట్లో అందరూ హాల్ లో టీవీ చూస్తూ చేస్తుంటే నువ్వూ అమ్మమ్మా ఏంటీ ఇక్కడ ఇద్దరే తింటుంటారు ? తాతయ్య : మాకు ఎప్పుడూ ఇక్కడే అలవాటు రా. నీకు గుర్తుందా నీ చిన్నప్పుడు పొడుపు కథలు చెప్పుకుంటూ భోంచేసేవాళ్ళం మనిద్దరం ?

నేను : ఎందుకు గుర్తులేదు? ఒక్కటి కూడా నాకు వచ్చేది కాదు. నేను తినే కంచం, కలుపుతున్న చెయ్యి చూపించి ఒక బంగారు మండపం లో అయిదుగురు నాట్యం చేస్తున్నారు అనేవాడివి. ఆ రోజులే వేరు తాతయ్యా అసలు. తాతయ్య : గత ఐదేళ్లలో మొత్తం మారిపోయింది. ఐనా పాత జ్ఞపకాలు పాతవే. కొత్తవి పుడుతూనే ఉంటాయి.

నేను : అదంతా సర్లే, పదా హాల్ లో మంచి సినిమా పెడతా . చూస్తూ తిందాం. తాతయ్య : టీవీ చూస్తూ భోజనం ఏంట్రా ..... ఒంటపట్టద్దా ?

నేను : తినేది మనలోకే గా వెళ్ళేది మరి ఒంటపట్టకుండా ఇంకేం అవుతుంది ? తాతయ్య : చిన్న విశ్లేషణ చెప్తా విను. నువ్వు ఫొటోస్ ఇంత బాగా తీస్తున్నావ్. నువ్వు చుపిస్తున్నప్పుడు ఎవడైనా ... ఆహ్ ఎదో ఉన్నాయ్ లే ..... అంటే నువ్వు ఫీల్ అవ్వవా ?

అది సరే వదిలేయ్. ఈ మధ్య ఏవో చిన్న కథలు కూడా రాస్తున్నావ్. కొన్ని రోజులయ్యాక ఒక పుస్తకమే రాసావ్ అనుకుందాం. అందరూ దాన్ని పైపైన తిరగేస్సీ పెద్ద గొప్పగా లేదు అంటే బాధ అనిపించదా ? ఇదీ అంతే.

వ్యవసాయం నా రక్తం. ఒక రైతుని రా నేను. ఒక రైతు కి ఆనందం చాలా విధాలు గా వస్తుంటుంది. తన పంట సరైన సమయానికి చేతికి వచ్చినప్పుడు, సరైన ధర కి అమ్ముడైనప్పుడు, కావలసినప్పుడు కావాల్సినంత వర్షం కురిసినప్పుడు..... వీటితో పాటు ఇంకొక పెద్ద ఆనందం ఉంది. అదే తను చెమటోడ్చి పండించిన పంట ని అందరూ తృప్తి గా ఆస్వాదిస్తూ తింటున్నప్పుడు. ఎదో తినాలని తింటే వీరికి కడుపు నిండుతుందో లేదో తెలీదు కానీ, రైతు కి ఆకలి పోతుంది రా అలాంటివి చుస్తే !!

తినే ఆహారం లో ఆరో వంతు మనస్సు అని వేదం చెప్తుంది. నీలాంటోడికి వేదం, రామాయణం అంటే రాతి యుగం అంటావ్. నీకు అర్ధమయ్యే విధం గా చెప్తా విను. కేవలం ఆకలేస్తుంది , ఎదో తినాలని లోపల వేసుకుంటే కడుపు మాత్రమే నిండుతుంది ఏమో.... మనస్సు కి కూడా ఆకలి ఉంటుంది. అది ప్రకృతి వల్ల మాత్రమే తనివి తీరుతుంది. వర్షం పడినప్పుడు వచ్చిన మట్టి వాసనా, మండుటెండ లో నారు పోసిన నాడు సాయంత్రం వచ్చిన గాలీవానా వల్ల , మనం సాధించలేము అని అన్నదాన్ని సాధించినప్పుడు, ఆహారం ఆస్వాదించి తింటున్నప్పుడు ..... ఇలాంటి వాటి వల్ల మాత్రమే దాని ఆకలి తీరుతుంది. అప్పుడే ..... మీరందరూ అంటుంటారు చూడు క్లారిటీ అఫ్ థాట్ అని ...అది వస్తుంది.

సరే ఇదీ వదిలేయ్! పొద్దున్నే నాతో పాటు ఆ గట్టు మీద నడుస్తున్నప్పుడు కోసిన తోటకూర ని ఫోటో తీసుకున్నావ్. ఫోటో కే అది పరిమితమా ? రుచి చూడవా రా ? మన పెరట్లో వంకాయలు పుష్టిగా కాసాయి. ఈరోజు మీ అమ్మమ్మ వండిన గుత్తివంకాయ కూర యొక్క ఘుమఘుమలు గుర్తించుకొని నీ ఇన్సూతాగ్రము లో రాసుకోవా ? టీవీ లేదా ఫోన్ చూస్తూ తింటావ్ సరే. దాని వల్ల "చాలా చాలా బాగుంది, ఇంకోసారి వండాలి" అనే ఫీలింగ్ నుండి "ఆ సర్లే ఎదో పర్లే " అనే దానికి దిగజారిపోతావ్ !! దాని వల్ల ఎప్పుడూ జీవితం లో దేనికైనా టేస్ట్ ఉండాలి అంటుంటావ్ కదా..... చివరికి ఆ టేస్ట్ ఏ లేకుండా పోతావ్.... అదిగో అలా వాళ్ళలా టీవీ చూస్తూ కూర్చొని తింటావ్.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది పక్కనెట్టు, ముందు తిండిని తిండి లా తినడం నేర్చుకో ! ఇక నీ స్థిత ప్రజ్ఞత రా !! వెళ్లి భోంచెయ్, నేను పడుకుంటా.

(తాతయ్య చెప్పినదానికి నేను నోరెళ్ళబెట్టి వినడం తప్పా ఏమీ చేయలేకపోయా.)

నేను : ఇదేంటీ ఇంతా చెప్పి పడుకుంటానంటారు? నాకు మండువా ఇల్లుల గురించి చెప్తానన్నారు గా. మీరు చెప్పాలి, నేను వినాలి ! అదంతా కాదు కానీ నువ్వు ఇంస్టాగ్రామ్ ని ఎదో అన్నావ్ ....ఏంటది ఇంసూతాగ్రము ఆహ్ హహహ.... వెళ్లి కుర్చీ తెచ్చుకోండి. నేనిక్కడే ఉంటా.....