Here's An Open Letter To All Those Who Are In Depression And With Suicidal Tendencies!

Updated on
Here's An Open Letter To All Those Who Are In Depression And With  Suicidal Tendencies!

జీవితంలో ఎదురైన కష్టనష్టాలతో కుంగుబాటుకులోనైన వారందరికీ, గెలవలేక నిలవలేక అర్దాంతరంగా తనువు చాలించే కొందరికి, సానుకూల దృక్పదం తో జీవిత సాగరాన్ని ఈదుతున్న ఎందరికో ఈ లేఖలో రాయునది ఏమనగా... ఓటములు, నిరాశ, నైరాశ్యం, నిస్సహాయత, అశక్తత, ఆత్మనూన్యతాభావం, అభద్రతా ఇవన్నీ ప్రతీ మనిషి జీవితంలో ఎదురయ్యేవే, వీటిని సమస్యలుగా భావించకుండా సవాళ్లుగా స్వీకరించి ఎదుర్కొని ఎలా ఎదగగలిగాము అన్నదే మన జీవితం. 8 గ్రహాలు,ఇన్ని కోట్ల జీవ రాశుల మధ్య ఒక మనిషిగా మనం పుట్టాము అంటే అదే ఓ గొప్ప విజయం, మనం పుట్టడమే విజేతలుగా పుట్టాము,మరి ఎదో సాదిన్చలేదని జీవితంలో ఓడిపోయామని అనుకోవడం మన మూర్ఖత్వమే కదా . జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకి, తుచ్చమైన భయాలకి, క్షణికమైన భాదలకి, అల్పమైన కష్టాలకి భయపడి ఇంత గొప్ప అందమైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసి చావే పరిష్కారం అనుకోవడం అమాయకత్వమే. నిజంగా అన్ని సమస్యలకి చావే శరణ్యం అని అందరూ అనుకుంటే అసలు మనం ఈ భూమి మీదకి వచ్చి ఉండే వాళ్ళమే కాదు, మానవ మనుగడ ఉండేదే కాదు, ఈ ప్రపంచం ఏనాడో వల్లకాడుగా మారి ఉండేది.

నువ్వంటే కేవలం 206 ఎముకలతో ఉన్న మాంసపు ముద్దవి కాదు, నీ తల్లిదండ్రుల ఆరో ప్రాణం నువ్వు, నీ కుటుంబం ఆశవి నువ్వు. ఈ సమాజపు రేపటివి ఈ దేశ భవిష్యత్తువి. నీకేవరిచ్చారు నిన్ను చంపుకునే హక్కుని?? ఇలా పిరికివాడిగా చావడానికా మన తల్లి మనల్ని తొమ్మిది మాసాలు మోసి తన ప్రాణాల్ని పణంగా పెట్టి మనకి జన్మనిచ్చింది. ఇలా ఒక అసమర్దుడిగా మిగిలిపోవడానికా మన తండ్రి మనల్ని పుట్టిన మరుక్షణం నుండి కంటికి రెప్పలా కాచుకొని కాపాడుతూ వచ్చింది. వాళ్ళు చేసిన త్యాగాలన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా? మన మీద పెట్టుకున్న ఆశలు అన్నీ అడియాసలేనా? అసలు మన వయసెంత, మన అనుభవమెంత మనం చూసిన జీవితమెంత మనకి ఎదురైన కష్టాలేంటి?? చదువు రావట్లేదని, చదువుకి తగ్గ ఉద్యోగం లేదని, ప్రియురాలు మోసం చేసిందని , ప్రేమ విఫలం అయ్యిందని, కోరుకున్న జీవితం అందలేదని, వీటికేనా మన జీవితం ఇంతటితో అయిపోయందని మనం అనుకునేది? అక్షరం ముక్క రాకపోయినా కోట్లు సంపాదిస్తూ వేల మందికి జీవితాన్ని ఇచ్చిన ఎంతో మంది అపర కుబేరులు ఉన్నారు. అతి చిన్న ఉద్యోగాలు,రోజూవారి కూలీలుగా జీవితం మొదలెట్టి ఈరోజు సొంత సంస్థలు స్థాపించి వ్యాపారంలో దిగ్గజాలుగా మారిన వాళ్ళు ఉన్నారు. ప్రేమ విఫలం అయినా జీవితంలో గెలిచి చూపించిన వాళ్ళూ ఎంతో మంది ఉన్నారు. కోట్లు లక్షలు లేకపోయినా బంగళాలు కార్లు లేకపోయినా హాయిగా నవ్వుతూ ఆనందంగా బ్రతుకుతున్న వాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. మరి వీళ్ళ నుండి మనమేమి నేర్చుకోలేమా? వీళ్ళూ మనలాంటి మనుషులేగా. మనలాగా రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు అన్నీ మనలానే ఉన్న మనుషులేగా వాళ్ళకి సాద్యం అయ్యింది మనకెందుకు కాదు. వాళ్ళు కూడా జీవితం ఇక ముగిసింది అని అనుకోని ఉండలేదేందుకు? వాళ్ళకి మనకి తేడా ఏంటో తెలుసా కసి, ఓటమి పలకరించిన ప్రతీసారి వాళ్ళు మనలా కుంగి పోలేదు కసితో నేనెందుకు గెలవలేనో చూస్తాను అంటూ ముందుకు అడుగేసారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు చివరికి గెలిచారు . మరి మనలో ఆ పోరాటపటిమ లేదా? ఉంది కచ్చితంగా ఉంది. దగ్గర నుండి చూస్తే గుండు సూది కూడా గునపం లానే కనిపిస్తుంది. మన సమస్యలు కూడా అలాంటివే ఒక్కసారి వాటికి దూరంగా వచ్చి చూస్తే అవెంత అల్ఫమైనవో ఎంత చిన్నవో తెలుస్తుంది. ఓడిపోతున్నామని, ఏనాడూ విసుగు చెందకూడదు . ఓటమి ఎప్పుడూ ఒంటరిగా రాదు, ఎన్నో అవకాశాలని వెంట తీసుకొస్తుంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాలే తప్ప నా గతి ఇంతే నా రాత ఇంతే అంటూ నిట్టూర్పుతో ఉండకూడదు.

ఎదో చిన్న అవరోధం వస్తే ఎలా నిర్దారించుకుంటావు నీ జీవితం ముగిసిపోయిందని, ఎలా ఒక నిర్ణయం తీసుకుంటావు చనిపోవాలని. అందరిలా లేనని ఎందుకు చింతిస్తావు. నువ్వు నీలా ఉండడానికే ఉన్నావు, ఎవరిలానో కాదు. ఎవరికో జరిగింది నీకు జరగాలని లేదు. ఏమో నువ్వు ఇలా ఉండడానికే సృష్టింపబడ్డావు, నీకెప్పుడూ కష్టాలే ఉంటాయేమో, ఆ కష్టాలని దాటుకొని ముందుకెళ్ళే నువ్వు రేపటి తరానికి స్పూర్తిప్రదాతగా నిలుస్తావేమో. నీకు ఎప్పుడూ సమస్యలే ఎదురవుతాయేమో? ఆ చిక్కుముడులన్నీ విప్పి ఎంతో మందికి మార్గదర్శిగా నిలుస్తావేమో. ఇవేవి చూడకుండా ఇవేవి సాదిన్చకుండానే అర్ధాంతరంగా జీవితాన్ని చాలించేద్దమా .

అయినా ప్రతీసారి ఎవరో వచ్చి మనకి ధైర్యవచనాలు చెప్తూ ఉండాలా?? ఎప్పుడూ ఎవరో ఒకరు మనవంక దీనంగా జాలిగా చూస్తూ అయ్యోపాపం అంటూ సానుభూతి వాక్యాలు చెప్తూ ఉండాలా? ఎవరో ఒకరు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉండాలా?? భుజం మీద చేయి వేసి ఎప్పుడూ ఎవరో మనకి తోడు నిలవాలా?? ఒక చిన్న చీమ కూడా తనని తానూ కాపడుకోగలదు, కనీసం ఆ ప్రయత్నం అయినా చేస్తుంది. అలాంటిది మనల్ని మనం కాపడుకోలేమా? మనం అంత ఆశక్తులమా?? మన మీద మనకి ఆమాత్రం నమ్మకం లేదా కనీసం చీమ కి ఉన్నంత పోరాడే తత్త్వం కూడా మనకి లేదా? మనకి ఆ మాత్రం ఆత్మా విశ్వాసం లేదా?? మన వ్యక్తిత్వం అంత బలహీనమైనదా?? మనల్ని మనం నమ్మకపోతే మన మీద మనకే విశ్వాసం లేకపోతే ఈ ప్రపంచం ఎలా నమ్ముతుంది? ముందు మనల్ని మనం నమ్ముదాం. మనకి మనం తోడుగా నిలుద్దాం. నేనొక్కడినే ఉన్నాను, నేనే౦ చెయగలను?నాకు తొడుగా ఎవరూ లేరు నా వల్ల ఎ౦ సాద్యపడుతు౦ది? ఒక్కడిని ఎ౦త దూర౦ వెళ్ళగలను? ఒక్కడినే ఎమీ చేయలేను అని అడుగు వెనక్కివేయకుండా ముందుకి అడుగేద్దాం, చరిత్ర సృష్టించిన మహానుభావులు కూడా ఒకప్పుడు ఒంటరిగానే మొదలెట్టారు.ఈరోజు కుంగిపోయిన మనమే ధైర్యంగా జీవితంలో రేపటి కోసం వేసే ఆ ఒక్క అడుగు వల్ల చరిత్ర సృస్తిస్తామేమో.

ఎప్పుడూ ఒకే కాలం ఉండదు, నాకెప్పుడూ సుఖమే కావాలి,సంతోషమే ఉండాలి అంటే కుదరదు, చీకటి వెలుగు, భాద – ఆనందం, సుఖం – కష్టం ఇవన్నీ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వచ్చే ఈ మార్పులకి తగ్గట్టు సాగిపోతూ ఉండాలే తప్ప ఆగిపోకూడదు. ఒక్కసారి మనం మన చుట్టూ గీసుకున్న చట్రంలోనుంచి బయటకొచ్చి, కళ్ళు పెద్దవి చేసి,ఆలోచనా పరిదిని దాటి చూస్తే ప్రతీ మనిషికి ఓ కథ ఉంటుంది మనం కలలో కూడా ఊహించని సమస్యలు, మనం వినడానికే భయపడే భాధలు, మనం నమ్మడానికి వీలు లేని ఆటుపోట్లతో నిత్యం పోరాడుతున్న ఎంతో మంది మనకి కనిపిస్తారు. ఓసారి వాళ్ళతో మాట్లాడి చూస్తే , వాళ్ళ గురించి అడిగి తెలుసుకుంటే అప్పుడు అర్ధం అవుతుంది మన ఎంత అవివేకంగా ఆలోచించామో.

వచ్చే ప్రతీ కష్టం, సమస్య జీవితంలో ఒక చిన్న మలుపు లాంటిదే తప్ప జీవితానికి ముగింపు కాదు. ఏదేమైనా బతికి సాదిద్దాం, బతుకు సాగిద్దాం.

ఇట్లు మీలో ఒకడు