This School Is Totally Redefining Meaning Of School & Essence Of Schooling...

Updated on
This School Is Totally Redefining Meaning Of School & Essence Of Schooling...

మీ పిల్లల్ని చంపడం ఎలా.? హాహా.. నాకు బాగా తెలుసు మీలో చాలామంది మీ పిల్లల్ని చంపాలని అనుకుంటారు. ఐతే టెక్నిక్స్ తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను చెప్పే కొన్ని సింపుల్ టెక్నిక్స్ తో ఈజీ గా చేతికి మట్టి అంటకుండా చంపేయ్యొచ్చు! ముందుగా వారిని గ్రౌండ్, కనీసం పార్కింగ్ స్పేస్ కూడా లేని అగ్గిపెట్టేలాంటి తరగతి గదులున్న స్కూల్ లో జాయిన్ చేయించండి, స్వేచ్ఛ లేకుండా పంజరంలో పెరుగుతారు. బయటకు వెళితే అస్సలు బ్రతకడం రాకుండా పోతుంది! క్లాస్ రూమ్ లో టీచర్స్ చెప్పే లెస్సన్స్ కు వాడికి డౌట్స్ వచ్చి, వాడు జీవితంలో ఏమైనా తెలుసుకునే ప్రమాదం ఉంది, అందుకని సిలబస్ లో తప్ప బయటి విషయాలలో నాలెడ్జ్ లేని లెక్చరర్లు ఉన్న స్కూల్స్ లో మాత్రమే జాయిన్ చేయించండి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.. ఇవన్నీ కూడా నా ఫ్రెండ్ తన యూట్యూబ్ ఛానెల్ లో చెప్పుకొచ్చిన టెక్నిక్స్. అతను వెటకారంగా చెప్పినా మనం చూసే చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న పనులు ఇవ్వే. ఇలాంటి స్కూల్స్ ఉన్న ప్రస్తుత సంఘంలో పిల్లల్ని శాశ్వితంగా బ్రతికించుకుని, వారిని ప్రయోజికలను చేసే అతి తక్కువ విద్యాలయాలలో జీవన వికాస విద్యావనం ఒకటి. ఇది పిల్లల ఊహలకు అందని పాఠశాల, ఇది తల్లిదండ్రులను వారి బాల్యానికి వెనక్కి చేర్చి తిరిగి ఈ స్కూల్ లో చదువుకోవాలనిపించే పాఠశాల.

"విద్యార్థుల మీద ఒత్తిడి డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది కావచ్చు, సుఖంగా జీవించడానికి మాత్రం ఏ మాత్రము ఉపయోగపడదు. -డా.పరిమి గారు" జీవన విద్యా వికాస లక్ష్యాలు: 1. తక్కువ పుస్తకాలతో ఎక్కువ నాలెడ్జ్. 2. విద్యార్థులపై ఏ విధమైన ఒత్తిడి ఉండకూడదు. 3. బాగా చదువుతున్న విద్యార్థులకు బహుమతులు ఇవ్వకూడదు. 4. తోటి విద్యార్థులతో పోలిక ఉండకూడదు. 5. పాఠశాలలో భయంతో కూడిన వాతావరణం ఉండకూడదు. 6. పిల్లలు స్వేచ్ఛగా ఉంటూ చదువుకోగలగలి, మాతృభాషలోనే బోధన జరగాలి. 7. పిల్లల్లో పోటీ వాతావరణం అస్సలు ఉండకూడదు. 8. విద్యార్థులు వాళ్ళ కాళ్ళ మీదే వాళ్ళు నిలబడగలిగే శక్తిని పెంపొందించాలి. 9. పిల్లల్లోని వ్యత్యాసాన్ని ఉపాధ్యాయులు గుర్తించకూడదు.

"విద్యాలయ చైర్మన్ ను ఇక్కడి విద్యార్థులు సార్ అని కాకుండా పెదనాన్న అని పిలుస్తారు." విద్యార్థులా.? జైలులో నేరస్థులా.? జీవన వికాస విద్యాలయం కృష్ణా జిల్లా పోరంకిలో ఉంది. అసలు పిల్లలకు ఎలా చెబితే అర్ధం అవుతుందో కేవలం ఆ పద్ధతుల్లో మాత్రమే వారి టీచింగ్ మెథడ్స్ ఉంటాయి. కర్ర పట్టుకుని నేరస్థుడిని విచారించినట్టుగా, లేదంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటే కర్ర విరిగేలా కొడతా, వీపు విమానం మోత మొగుద్ది లాంటి బెదిరింపు దోరణలు ఇక్కడ ఉండవు. అసలు విద్యార్థి తన విలువైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టాన్ని వెచ్చిస్తుంది దేనికి.? ఇలాంటి మినిమమ్ కామన్ సెన్స్ తోనే ఈ విద్యాలయం నడుస్తుంది. ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు సిలబస్ ను పూర్తి చేయాలన్న ఒత్తిడిలో ఉండరు, చెప్పే పాఠాలు విద్యార్థులకు అర్ధమవుతున్నాయా అన్న తపనలో మాత్రమే ఉంటారు. మర్క్స్ ర్యాంక్స్ లాంటి కంపారిజషన్ ఇక్కడ చెయ్యరు!! ప్రతీ ఒక్కరిది ఒక్కో విలక్షణ వ్యక్తిత్వం, మీలోని ఆ శక్తిని తెలుసుకోండి అని మాత్రమే ఇక్కడ బోధిస్తారు.

"ఇక్కడ ఎవరి పని వారే చేసుకుంటారు, అలాగని ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం మానరు." 50 ఎకరాల మామిడి తోటలో: పెంచి పెద్ద చేసిన నేలతల్లిని, చుట్టూ ఉన్న సాటి మనుషులకు ఏదో చేయాలన్న తపనతో విదేశాలలో స్థిరపడిన కొందరు తెలుగువారు దాదాపు 35 సంవత్సరాల క్రితం ఈ విద్యాలయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం విశాలమైన 50 ఎకరాల మామిడితోటలో ఈ పాఠశాల నడుస్తుంది. ఇక్కడ స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది కనుక పిల్లలకు ఆడిపాడే ఈ వయసులోనూ ఒత్తిడి కలగదు. ఇక్కడ కూడా లైబ్రరీ తో పాటుగా కంప్యూటర్లు ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది అయితే వాటిని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో మాత్రమే వివరిస్తారు. ప్రతిరోజు సిలబస్ కోసం వెచ్చించే సమయం నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది, మిగిలిన నాలుగు గంటలు విద్యార్థుల జీవితానికి ఉపయోగపడే పనులు ఉంటాయి. ఫలానా పని మాత్రమే చెయ్యాలి అన్న నిబంధన ఇక్కడ లేదు. మొక్కలు నాటొచ్చు వాటికి నీరు పొయ్యొచ్చు, బొమ్మలు గీసుకోవచ్చు, హాయిగా మట్టిలో ఆడుకోవచ్చు, వంట పనిచెయ్యొచ్చు.

"ఇక్కడ హోమ్ వర్క్ ఇవ్వరు, పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్ళాల్సిన రూలు లేదు!!" మేమేమి తీర్చిదిద్దడం లేదు, వారిని వారు తీర్చిదిద్దు కుంటున్నారు: డా.పరిమి డా. పరిమి గారు సివిల్ ఇంజినీర్. కాన్పూర్ ఐఐఐటీలో పీజీ చదివారు. కెనెడాలో పి.హెచ్.డి చేసి అమెరికాలో 15 సంవత్సరాల పాటు పనిచేశారు. సమగ్ర జీవనంలోనే సమగ్ర వికాసమనేది సాధ్యపడుతుంది, మేము జీవనానికే ముందు ప్రాధాన్యమిస్తాము. చదువులు, నేర్చుకోవడం అనేది జీవితంలో ఒక భాగం అవ్వాలి కాని నేర్చుకోవడం అనేది జీవితాన్ని లేకుండా చేసుకోవడం కాదు, నిజ జీవితం నుండి దూరమవ్వడం కాదు! ఆ కారణంగా సమగ్ర జీవనానికి ఒక నమూనాగా ఈ జీవన వికాస విద్యా వనాన్ని ఇక్కడ ఏర్పాటుచేయడం జరిగింది. ఈ స్కూల్ పిల్లల కోసం, తల్లిదండ్రుల మెప్పుకోసం కాదు. పిల్లలకు ఏది మంచిదైతే అది చేస్తాము, అది కూడా మేమేదో కొత్తగా కనిపెట్టి చేస్తున్నది కాదు ఎన్నో తరాలుగా విద్యావేత్తలు, విద్యావంతులు ఏది సమగ్ర విద్యకు మూలాలు అని వాళ్ళు ఏమేమి అంటున్నారో ఆ రకమైన విధంగా టీచింగ్ మెథడ్స్ ఉంటాయి. ఉదాహరణకు ప్రాధమిక విద్య వారి మాతృభాషలో జరగాలంటే అలాగే ఇక్కడ ఆ భాషలో పాఠాలు చెబుతాము. మిమేమి విద్యార్థులను తీర్చిదిద్దడం లేదు, ఎదిగే తపన వారిలో సహజంగానే ఉంటుంది దానికి చిన్నపాటి గైడెన్స్ అందుకు తగిన స్థలాన్ని మాత్రమే మేము ఏర్పాటుచేశాము. -డా. పరిమి గారు(విద్యాలయ నిర్వాహకులు)