This Army Major's Love Story Is Both Emotional & Reflects A Harsh Reality Of People Who Serve Our Country

Updated on
This Army Major's Love Story Is Both Emotional & Reflects A Harsh Reality Of People Who Serve Our Country

Contributed By Kalyana Raghav Pasapula

ఆరోజు ఆకాశం మామూలుగా కాకుండా, రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్‌లా చాలా అందంగా ఉంది. పట్టాల మీద రూపాయి బిళ్ళ పెట్టి రైలు కోసం ఎదురుచూస్తున్న పిల్లాడు, రైలు తన రూపాయి మీద నుంచి వెళ్తుంటే, ఆనందంతో కేరింతలు కొడుతున్నాడు. తనవల్ల పిల్లాడు ఆనందపడ్డాడన్న గర్వమో ఏమో! నిజాముద్దీన్ మరింత ఉత్సాహంగా ఢిల్లీ వైపు పరుగులు తీస్తోంది.

ఎస్-6 భోగీలో రాజకీయాలు మాట్లాడుకుంటూ బిజీగా ఉన్న ముసలాళ్ల మధ్య, రామ్‌గోపాల్ వర్మ సినిమాలో హీరోలా చాలా సహజంగా ఉన్నాడు ఓ కుర్రాడు.

‘పెద్దయ్యాక నువ్వేం చేస్తాం?’ అని మాస్టారు అడిగిన ప్రశ్నకి ‘పెళ్ళి చేసుకుంటా’ అని ఆరేళ్ళ వయస్సులో తను చెప్పిన సమాధానం గుర్తొచ్చి నవ్వుకుంటూ, ప్రయాణాల్లో తోడుండేది జ్ఞాపకాలే కదా! ప్రతి ప్రయాణం ఒక జ్ఞాపకం అని మనసులో అనుకుంటున్నాడు.

ఆ కుర్రాడి పేరు మానవ్. అవును మానవే.. కమ్యూనిస్టు అయిన తన తండ్రి తన కొడుకు కులాల్లో మతాల్లో కలిసిపోకూడదు, మనుషుల్లో మనిషిలా కలిసిపోవాలని తన కొడుక్కు పెట్టుకున్న పేరది. తండ్రి పెట్టిన పేరు, చనిపోతూ ఇచ్చిన బాధ్యతలూ తప్ప, తండ్రి కూడా ఒక జ్ఞాపకంలా మిగిలిపోయాడు ఆ కుర్రాడికి.

తన ప్రయాణంలో మరికొందరిని కలుపుకుందామని ఓ స్టేషన్‌లో ఆగింది నిజాముద్దీన్. ఏ ఊరో చూద్దామని కిటికీలోంచి తొంగి చూశాడు మానవ్. పచ్చటి బోర్డు మీద నల్లటి హిందీ అక్షరాల్లో ‘ఝాన్సీ’ అని రాసుంది. బహుశా ఝాన్సీ లక్ష్మీభాయిది కూడా ఈ ఊరేనేమో అనుకుంటూ లేచి, డోర్ దగ్గర నిలబడి, అటూ ఇటూ చూస్తున్న మానవ్ ఒక వైపు అలాగే చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోయాడు. తన ఆశ్చర్యానికి కారణమైన ఆ నిజం తన దగ్గరికి వచ్చి ‘ఎక్స్‌క్యూజ్‌మి’ అని అడిగే వరకు, తనలో తనకే తెలియని మరో ప్రపంచంలో ఉండిపోయాడు.

బాపుగారి అక్షరాలంత అందంగా, పసిపిల్లాడి బోసినవ్వంత స్వచ్ఛంగా, అప్పుడే తడి ఆరిన మట్టి వాసనంత అద్భుతంగా ఉంది ఆ అమ్మాయి. అందం చూసే కళ్ళలో ఉంటుందన్నది ఎంత అబద్ధమో ఆ అమ్మాయిని చూస్తుంటే అర్థమవుతోంది మానవ్‌కి.

తనకి నచ్చిన అమ్మాయి కనపడితే తను ఏమేమి చేయకూడదనుకున్నాడో, అవన్నీ తనకు తెలియకుండానే చేసేస్తున్నాడు. ఆల్రెడీ రైలు ఎక్కుతున్న అమ్మాయిని, ‘ఎక్కండి’ అన్నాడు. ఢిల్లీ రైలెక్కిన అమ్మాయిని ‘ఢిల్లీకెళ్తున్నారా?’ అని అడిగాడు. ఖాళీగా ఉన్న తన ముందు సీట్లో కూర్చుంటున్న ఆ అమ్మాయి కాళ్ళకి మెట్టెలున్నాయో లేదో చూడటానికి తెగ కంగారు పడిపోతున్నాడు.

కుర్రాడి బాధ ఆ అమ్మాయికి అర్థమయ్యిందో, లేక యాదృచ్ఛికంగా జరిగిందో, సీట్లో కూర్చున్న ఆ అమ్మాయి తన చీర కాస్త సర్దుకుని కాళ్ళు ముందుకు జరిపింది. జర్మనీ యుద్ధం గెలిచుంటే హిట్లర్ ఎంత ఆనందపడేవాడో తెలీదు కానీ, ఆ అమ్మాయి కాళ్ళకు మెట్టెలు లేకపోవడం చూసి అంతకన్నా ఎక్కువ ఆనందపడ్డాడు మానవ్.

గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్న నిజాముద్దీన్, ఆ కుర్రాడి గుండె వేగం ముందు ఓడిపోయినా, పెళ్ళికానబ్బాయికి పెళ్ళికానమ్మాయి ఎదురయితే ఉండే ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ ముందుకెళ్తోంది.

‘మీ పేరేంటి?’ అని హిందీలో ఆ అమ్మాయిని అడగటానికి, మనసులో తెగ ప్రిపేర్ అయిపోతున్న మానవ్ ని గమనించిన ఆ అమ్మాయి, ‘నా పేరు కైవల్య’ అంది. అమ్మాయి నోట తెలుగు పలికేసరికి ఆనందం, ఆశ్చర్యం కలిసి కాస్త అయోమయంలో పడ్డ మానవ్ తేరుకుని, ‘నా పేరు మానవ్’ అన్నాడు. వెంటనే కైవల్య ‘మీది అనంతపురం కదా?’ అంది. తన ఊరిపేరు కైవల్యకెలా తెలుసో అర్థంకాక మళ్ళీ ఆలోచనలో పడ్డ మానవ్‌కి, అతని పక్కనే ఉన్న కళామందిర్ – అనంతపురం అని రాసున్న బ్యాగ్ చూపించింది కైవల్య.

కైవల్య తెలివితేటలకీ, కలుపుగోలు తనానికీ తనలో తాను సంబరపడిపోతున్న మానవ్, ‘మీది ఝాన్సీ కదా?’ అని అడిగాడు. కైవల్య నవ్వుతూ ‘మాది అదిలాబాద్. నాన్న వ్యాపార రిత్యా రెండేళ్ళ క్రితం ఢిల్లీకి వచ్చాం. ఫ్రెండ్ పెళ్ళి ఉంటే ఝాన్సీకి వచ్చాను’ అని చెప్పింది. అలా కరువు జిల్లాల పేర్లతో మొదలైన వారి సంభాషణ, మాటలకి మాత్రం కరువు లేకుండా అలా కొనసాగుతూనే ఉంది.

వాళ్ళిద్దర్నీ అలా చూస్తే కొత్తగా పరిచయం అయిన వాళ్లలా కాదు కదా! ఏదో జన్మ జన్మల పరిచయం ఉన్న వాళ్ళలా మాట్లాడుకుంటున్నారు. కాలం కూడా వాళ్ళని చూసి కాసేపు ఆగిపోదాం అనుకునేంత ఆహ్లాదంగా ఉంది ఆ జంట. రైల్వే క్రాసింగుల దగ్గర నిజాముద్దీన్ అయినా అప్పుడప్పుడూ కునుకు తీస్తుందేమో కానీ, వీళ్ళు మాత్రం పడుకున్న టీ వాణ్ని కూడా లేపి మరీ కబుర్లు చెప్పుకుంటున్నారు.

మాకు పెళ్ళైపోయిందే అన్న బాధలో కొందరు మగాళ్ళకీ, ఆ అమ్మాయి మన పక్క సీట్లో ఎందుకు కూర్చోలేదు అన్న అసూయతో కుర్రాళ్ళకీ, భర్తల మీద అనుమానంతో కొంతమంది భార్యలకీ, ఆ అమ్మాయి సీట్లో నేనుంటే ఎంత బాగుండేది అన్న ఈర్ష్యతో కొంతమంది అమ్మాయిలకీ, ఇలా వివిధ కారణాల వల్ల మానవ్, కైవల్యలకు కాకుండా, వాళ్ళని అలా చూసిన ఆ భోగీలోని వాళ్ళెవ్వరికీ ఆ రాత్రంతా కునుకులేదు.

మానవ్, కైవల్యలకి మాత్రం గంటల ప్రయాణం క్షణంలా గడిచిపోతోంది. చివరికి అనుకున్న క్షణం రానే వచ్చింది. నిజాముద్దీన్ ఢిల్లీలో తన స్టేషన్‌కు చేరుకుంది. మానవ్, కైవల్యలకి ఆ విషయం తెలిసేసరికి కాస్త టైం పట్టింది. ఇద్దరూ లగేజీలు తీస్కుని ట్రైన్ దిగారు.

కైవల్య మొబైల్ నంబర్ అడగటానికి సిగ్గుపడుతూ మానవ్, తను అడిగితే బాగుంటుంతో లేదో అన్న సందేహంతో కైవల్య, ఈ ఆలోచనలతో ఇద్దరి మధ్య మాటలు కాస్త తగ్గాయి. అలా ఇద్దరూ స్టేషన్ బయటకి వచ్చేశారు.

‘బై’ అన్న మానవ్ మాట కాస్త బాధగా వస్తే, ‘బై’ అంటూ చెయ్యి కాస్త బరువుగా ఊపింది కైవల్య, కళ్ళతోనే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది కైవల్య. అది తనకు అర్థమవుతోందని కళ్ళతోనే సమాధానం చెప్తున్నాడు మానవ్. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. వెంటనే ఇద్దరూ ఒకేసారి ‘వాట్సాప్ ఉందా?’ అని ఒకరినొకరు అడిగి, నవ్వుకుని నంబర్లు ఎక్స్‌చేంజ్ చేసుకున్నారు. వైఫై ఉంటే తప్ప నెట్ వాడని మానవ్, మొదటిసారి డాటా ఆన్ చేశాడు. ఫార్మల్‌గా వాట్సాప్‌లో హాయ్ మెసేజ్‌లు ఎక్స్‌చేంజ్ చేస్కుని, మనసు నిండా ఏదో తెలియని వెలితితో, ఎవరి గమ్యాలకు వాళ్ళు బయల్దేరారు.

అలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నా, ప్రతి రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ, వీలున్నప్పుడు కలుస్తూ, ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. వాళ్ళ బంధం, ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకునే దగ్గరి నుంచి, ఒకరి లోపాల్ని ఒకరు యాక్సెప్ట్ చేసుకునే స్థాయి వరకు రావటంతో, అది ఆకర్షణ కాదని, ప్రేమని తెలుసుకున్నారు.

ప్రేమ విషయం ఇద్దరిళ్ళలో చెప్పారు. పిల్లల ఇష్టాన్ని గౌరవించి పరస్పరం మాట్లాడుకుని, సిర్పూర్ కాగజ్ నగర్‌లో పెళ్ళి జరిపించాలని ముహూర్తం నిర్ణయించారు పెద్దలు. పెళ్ళికి రెండు రోజుల ముందు మానవ్‌తో పాటు అందరూ ఢిల్లీ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్ళటానికి నిజాముద్దీన్ లో టికెట్లు బుక్ చేశాడు కైవల్య తండ్రి.

బయల్దేరాల్సిన రోజు రానే వచ్చింది. మానవ్, కైవల్యల రాక కోసం ఎదురుచూస్తున్న నిజాముద్దీన్‌కి గుండె ఆగినంత పనైంది. నలుగురు వ్యక్తులు మానవ్ పార్దివ దేహాన్ని రైలెక్కిస్తుంటే, తను ప్రాణంగా ప్రేమించిన మానవ్ ఇక రాడని తెలిసిన కైవల్య, గుండెలవిసేలా రోదిస్తోంది. తన జీవితంలోనే మధుర జ్ఞాపకంలా నిలిచిపోయిన నిజాముద్దీన్ ప్రయాణం, మానవ్ గుర్తొచ్చినప్పుడల్లా నరకంలా అనిపిస్తోంది కైవల్యకి. తను జీవితంలో చూసిన అత్యద్భుతమైన జంటకి ఇలాంటి కష్టం ఎదురవటం చూసి నిజాముద్దీన్ తనలో తాను వెక్కి వెక్కి ఏడుస్తోంది.

బాధగా ముందుకు కదిలింది నిజాముద్దీన్. కైవల్య నుంచి తను దూరంగా వెళ్తున్నట్టే, మానవ్ జ్ఞాపకాలు కూడా కైవల్య నుంచి త్వరగా దూరమై, ఆ అమ్మాయి ఆనందంగా ఉండే రోజులు రావాలని ప్రార్ధిస్తూ ముందుకు సాగింది నిజాముద్దీన్. ఐస్ బాక్స్‌లో పెట్టుంచిన మానవ్ పార్దీవ దేహాన్ని చూసిన ఓ ప్రయాణీకుడు అక్కడే ఉన్న ఒకతన్ని ‘ఏమైంది, ఎవరితను?’ అని అడిగాడు.

‘ఇతను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో సైనికుడు. నిన్న జరిగిన ఉగ్రవాద దాడుల్లో చనిపోయాడు’ అని చెప్పాడు ఆ వ్యక్తి. ఏదో కథ విన్న వాడిలా విని, మళ్ళీ తన సీటు దగ్గరికి వెళ్ళి, ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని యూట్యూబ్‌లో బ్రతుకు జట్కాబండి చూడటంలో మునిగిపోయాడా ప్రయాణీకుడు. సైనికుల తాలూకు జీవితాలకి, ప్రేమలకి, దేశం కోసం అన్నీ వదిలేసి పోరాడి మరణించి వారి చేస్తున్న త్యాగాలకి కనీస కృతజ్ఞత కూడా ఆ ప్రయాణికుడు కళ్ళలో కనిపించకపోయేసరికి, ఈదేశం ఎటుపోతోందో? అని బాధ పడుతూ బరువుగా ముందుకెళ్తోంది నిజాముద్దీన్.