Contributed By Ranjith Kumar
నా జతగాళ్ళతో గోలీలాడుతుంటే పిలిచాడు నాన్న, ఏరా! అంగడికి పోయి షేవింగ్ బ్లేడు తీసుకుని రా అని.
కుదరదన్న, కొడతా అన్నాడు. అప్పుడొచ్చింది నాన్న మీద కోపం. ఏడుస్తా అన్న, ఇక ఏమీ చేయలేక. ఎందుకు ఏడుపు? మిగిలిన చిల్లర నీకైనప్పుడు, అన్నాడు నవ్వుతూ. అంగడి నుండి తిరిగొచ్చేదాకైనా ఉండలేదు ఆ చిల్లరకొచ్చిన పిప్పరమెంట్లు, అచ్చం నాన్నమీద నా కొచ్చిన కోపంలా.
కొన్ని క్షణాల మునుపు చిరుబుర్రులన్నీ ఈ చిల్లర కోపం వల్లన, ఛఛా! అనుకున్న.
అమృతం సీరియల్ చూడందే ఆదివారం పూర్తవదు అనుకునే వాళ్ళలో నేను ప్రథమున్ని, అందుకు అడ్డుచెప్పే అమ్మ మీద వచ్చేది పట్టరానంత కోపం.
గోలచేసో, బ్రతిమిలాడో టీవి కట్టెయ్యకుండా ఆపగలిగా కాని, రెండూ, మూడు భాగాల మధ్య వచ్చే అడ్వర్టైజ్మెంట్లు, ఆ అడ్వర్టైజ్మెంట్లు తెచ్చె నిద్రను మా అమ్మమీద వచ్చిన కోపం కూడ కాదనలేకపోయెది. పొద్దున్నే లేచినప్పుడు అమ్మే మూడోభాగంలో ఏం జరిగిందో చెబుతుంటే అమ్మ మీద కోపం నటించడానికి కారణమేలేకపోయెది.
నా పంతాల కోపం ఇంత అకారణమా, ఛిఛీ! అనుకున్న.
ఆనందాలకు అడ్డు చెబుతున్నారని అధ్యాపకులపై వచ్చే కోపం, ఎడ్డెమంటే తెడ్డెమనే సోదరుని మీదొచ్చె కోపం, కాలం ఇచ్చే సమాధానాలతో, చివరకు 'ఛఛాఛిఛీలతో అనుకున్నా' అని అనుకునేల చేసేవి.
కాని కులం కోసం ప్రేమను చంపెస్తారని తెలిసినప్పుడు. కామవాంఛ ప్రాణాన్ని లెక్కచేయడంలో తప్పినప్పుడు, ఆ లెక్కను సరిచెయ్యడంలో 'మైనస్ ఇంటు మైనస్ ఈజ్ ఇక్వల్టు ప్లస్', సూత్రం ఒక్క దిశ కు మాత్రమే వర్తించినప్పుడు, అప్పుడు వచ్చింది కోపం, నా మీద నాకే.
ఆ కోపం కొరకు చఛాఛిఛీలు దాటి ఛెఛేఛైల దాకా వెదికాను, అ కోపానికి నా మనస్సుకి రెండింటికి సమాధానం దొరకలేదు.
'ఛ' దాటి అక్షరమాలలోని అన్ని అక్షరాల గుణింతాలు శోధించాను, ఆ దొరికిన అక్షరాల సమాహారంతోనే ఇది రాస్తున్నాను, ఇది చదివినవారు నాకు సమాధానం దొరకని కోపాలకు కారకులు కాకూడదని కోరుతూ! ఇట్లు, ఓ కోపిష్ఠి.