శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కొలువై ఉన్న శ్రీ నీలమణి దుర్గాదేవి దేవాలయానికి సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉన్నది. పూర్వం పర్లాకిమిడి ప్రాంతాన్ని ఏలుతున్న గజపతి మహారాజు కలలో అమ్మవారు కనిపించి నేను ఫలానా ప్రదేశంలో ఉన్నానని ఆనవాళ్లు చెప్పారట. అక్కడికి వెళ్లి వెతకగా అమ్మవారు చెప్పినట్టుగానే ప్రతిమ రూపంలో దర్శనమిచ్చారట. ఇక ఆ రోజు గజపతి మహారాజుల పాలన నుండి ఇప్పటివరకు ఆలయంలో వైభవంగా పూజలు, పండుగలు జరుగుతున్నాయి. పాతపట్నం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం అవ్వడంతో ఇక్కడికి పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
అలాగే ఇక్కడ మరో కథ కూడా ప్రచారంలో ఉన్నది. పూర్వం ఇక్కడి పొలాల్లో ఒక వృద్ధుడు వ్యవసాయం చేస్తూ ఉండేవారు. ఒకరోజు నాగలితో పొలం దున్నుతుండగా భూమిలో నాగలికి ఏదో అడ్డు తగిలిందట ఏంటా అని చూడగా ఆ నాగలికి సాక్షాతూ అమ్మవారి విగ్రహం తగలడంతో ఏం చెయ్యాలో తెలియక గ్రామ ప్రజలకు తెలియజేశారట, ఈ మాట గజపతి మహారాజు వరకు వెళ్ళిందట. అలా ఈ ఆలయ నిర్మాణం జరిగిందని ఈ రెండు కథల ద్వారా తెలుస్తున్నది.
ఈ ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ కోవెలకు కూడా వందల సంవత్సరాల చరిత్ర ఉంది. శివుడు ఇదే చోట స్వయంభూ గా వెలిశారని చెబుతారు. ఇక్కడ కొలువై ఉన్న శివలింగం 6 నెలల పాటు నీటిలోనే ఉంటూ భక్తుల అభిషేకాలు అందుకుంటున్నారు.