పాట లోని పాఠం; "నీ ప్రశ్నలు నీవే" పాటలో సిరివెన్నెల గారు చెప్పిన అద్భుతమైన భావం - A Short Explanation

Updated on
పాట లోని పాఠం; "నీ ప్రశ్నలు నీవే" పాటలో సిరివెన్నెల గారు చెప్పిన అద్భుతమైన భావం - A Short Explanation

Contributed by Bharadwaj Godavarthi

సిరివెన్నెల గారి సాహిత్యం లో ఒక మాణిక్యం కొత్త బంగారు లోకం లో "నీ ప్రశ్నలు నీవే" పాట. ఆ పాట మాధుర్యాన్ని మరి కొంత లోతు గా తెలుసుకుందాం.

తండ్రికి తన కొడుకు, ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోదాం అని తెలుసుకున్న సమయం. ఈ పాటకు ముందు వచ్చే సన్నివేశం.

ఇంటికి వచ్చిన వెంటనే కొట్టేస్తాడు అనుకున్న, కానీ దర్శకుడు ఎంత అందంగా రాసాడో, తన చేయిజారిపోతున్న తన కొడుకుని ఎలా పట్టుకున్నాడో చూడండి

కొడుకు(వయసు) ఊగిసలాడే మనసు

సంభాషణ: తండ్రి: ఏంట్రా ఈ దారిలో వెళ్తున్నావు? కొడుకు: shortcut నాన్న తండ్రి: జాగ్రత్త రా? గోతులు ఉంటాయి

అప్పుడు వస్తుంది అండి ఈ సాహిత్యం, సిరివెన్నెల మాయాజాలం "నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా! నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా! ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా! ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా!"

విశ్లేషణ: ఈ పదాలు బహుశా ఒక పాత్ర గురించి కాకుండా "యుక్త వయసు" ఆలోచన ధోరణి గురించి విశ్లేషించినట్లు అనిపించింది. ఆ ప్రాయం తాలూకు అపరిపక్వమైన జ్ఞానం, ఊగిసలాడే మనసు, ఆ ప్రాయంలో మనతో ప్రయాణం చేసే 'వేల ప్రశ్నలు', ఆ ప్రాయంలో ఉండే ప్రేమలు(infatuation). ఇలా ఆ వయసు పడే ప్రతి సంఘర్షణ గురించి ప్రస్తావించినట్లు అనిపించింది. కానీ ఎన్ని ప్రశ్నలు మనలో రేగిన, ఆ ప్రశ్నలకు జవాబు మనమే వెతకాలి, ఏమి తెలియని అయోమయం లో ఉన్నకాని, కాలం పరీక్ష పెట్టక మానదు.. అనేది ఈ సాహిత్యం వెనుక భావం.

"పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అపుడో ఇపుడో కాననే కనను అంటుందా!! ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైన, గుడికో జడకో సాగనంపక ఉంటుందా!!"

విశ్లేషణ: అమ్మ తొమ్మిది నెలలు బిడ్డని తనలో మోస్తుంది, అని మనకి తెలుసు. కానీ, "పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా" అని రాయడం ద్వారా అమ్మ గొప్పతనాన్ని, మాతృ హృదయాన్ని, ఒక్క పదంలో ఎంత గొప్పగా విశ్లేషించారో. బహుశా పై పల్లవిలో "శాస్త్రిగారు" ఆ వయసుని హెచ్చరిస్తున్నట్లు అనిపించింది? పది నెలలు నిన్ను మోసిన అమ్మైనా నిన్ను కనను అంటుందా? కంటుంది కదా. కాలం కూడా నీకు కావల్సినది సమయం వచ్చినప్పుడు ఇస్తుంది. అలా కాకుండా తొందరపడే యవ్వనాన్ని, అన్నీ నేనకున్నట్లే జరుగుతాయి అనే మూర్ఖత్వంలో నువ్వు ఉండిపోకు అని చెప్పారు అనిపించింది.

"బతుకంటే బడి చదువా, అనుకుంటే అతి సులువా?? పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగ, ఒక నిమిషం కూడ ఆగిపోదే నువ్వొచ్చేదాకా!!"

విశ్లేషణ: కొత్తబంగారులోకంలో హీరో క్యారెక్టర్ ఎప్పుడూ చివరి పేజీ ముందు చదువుతూ ఉంటాడు. ఏంట్రా అంటే చివరికి ఏమి జరుగుతుందో తెలుసుకుంటే సరిపోతుంది కదా అంటాడు. తన ప్రేమ విషయంలో కూడా అదే ఉద్దేశం తో ఉంటాడు, పెళ్లి చేసుకుంటే జీవితం అయిపోతుంది అనుకుంటాడు. అంత సులువా జీవితం అంటే, ఒక్క తప్పటడుగు చాలా జీవితం మారిపోవడానికి. నిన్ను చూసి జాలిపడడానికి కాలం నీ చుట్టమేమికాదు, కనీసం నీ కోసం ఒక్క నిమిషం కూడా ఆగదు.

చరణం: 1 "అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా?? కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా!! గత ముందని గమనించని నడిరేయికి రేపుందా?? గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా!!"

విశ్లేషణ: ఓ 'యవ్వనమా', నీ తెలివి అంతా కష్టాలుండని జీవితం ఏదని అడిగేందుకే ఉందా? గమ్యం అనే 'కలని' కనకుండా నిత్యం నిదురలోనే గడిపేయమందా?? "పది నెలలు" తనలో నిన్ను పెంచిన అమ్మ, నీ జీవితం తానై మోస్తున్న "నాన్న", వీళ్ళళ్ళ ప్రేమను భారంగా భావించి, మోయలేక మరిచిపోయి, నీ యవన్న ప్రేమవైపు పయనిస్తున్న నీకు, రేపు విలువ ఎలా తెలుస్తుంది? ఎటు ప్రయాణిస్తున్నావో తెలియని నీ గమనానికి, అసలు గమ్యం అంటూ ఉందా?

"వలపేదో వలవేస్తుంది, వయసేమో అటు తోస్తుంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే ఋజువేముంది?? సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేదా"

విశ్లేషణ: ఈ యవ్వనం వ్యక్తిత్వాన్ని వివరించారు శాస్త్రి గారు ఈ పదాలలో గెలుపంటే ఇది అని తెలియని వయస్సు అది. కానీ హీరో ఒక పెద్ద సాహసం చేయడానికి సిద్ధపడతాడు. అది సుడిగుండం అని ఎన్నో రుజువులు తన ముందు ఉన్న అవి అతను గుర్తించట్లేదు.

చరణం : 2 "పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా?? ప్రతిపూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా, మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా??"

విశ్లేషణ: ఇక్కడ కూడా సమయం విలువ గురించి, ఆ సమయాన్ని "నిర్లక్ష్యం" చేస్తే అది నేర్పే పాఠాల గురించి వివరించినట్లు అనిపించింది. రవి(సూర్యుడు-లోకానికి వెలుగునిచ్చే వాడు), మన ఇంటికి వెలుగునిచ్చే నాన్న, ఆయన మనకోసం తనలో తాను రగిలే ఆ తపన అంతా, ఆయన కన్నుమూసిన తరువాత నీ ఇంటిని కమ్ముకున్న ఆ చీకటి నీకు తెలిపిందా??? తనకిష్టమైన అమ్మాయి గురించి ఒక్క మాట నాన్న తో చెప్పుంటే కథ వేరేలా ఉండేదేమో.. కానీ కాలం ఇప్పుడు ఆ నాన్న నే అతనికి దూరం చేసింది. అమ్మ కి ఉండే ఒకే ఒక్క తోడుగా హీరోని మిగిల్చింది.

"కడతేరని పయనాలెన్ని, పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగేశాయా చరిత పుటలు వెను చూడక ఉరికే వెతలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు"

విశ్లేషణ: ఆ వయసు ప్రభావంలో, నీకున్న ఊగిసలాడే మనసుతో, నువ్వు సాగించే నీ ప్రేమ ప్రయాణం తీరానికి చేరుతుందా? లేక నీ ప్రణయం ప్రయలం అయ్యి పాతాళానికి పదతోస్తుందా?? ఒకసారి నీ జీవితంలో నువ్వు తిరిగి వెన్నకి చూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలు, అనుభూతులు నువ్వు సిగ్గుపడేలాగా ఉండకూడదు! నీ ముందు తరాలకి నీ ప్రేమని, ఒక అందమైన అనుభూతిలా అందించాలి కానీ, నీ జీవితమనే 'చితిలో' కాలిపోయిన ఒక 'జ్ఞాపకంలా' కాదు!!