This Short Story About A Guy Introspecting About His Busy Life Is A Harsh Reality !

Updated on
This Short Story About A Guy Introspecting About His Busy Life Is A Harsh Reality !

Contributed by భరద్వాజ్ గొడవర్తి

"Arey yaar why are you not understanding me, we should meet this deadline, Now you guys are on spotlight, you really need to stretch yourself to meet this deadlines understand. UNDERSTAND ?"

ఉల్లిక్కిపడి లేచికూర్చున్న, ఏంటి ఇదంతా కలా!! వీడు, కలలో కూడా నన్ను వదిలేలా లేడు. ఛ!

మళ్ళీ పడుకుందాం అని ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టటంలేదు, పైగా ఈసారి మరీ పక్కన ఉన్నట్టే అనిపిస్తున్నాడు, ఏదో ప్రేతాత్మలాగ!!

ఇంక లాభం లేదు అని, టైం ఎంత అయిందో చూడడానికి మొబైల్ వెతకడం మొదలుపెట్టాను. ఎదురుకుండా గోడంతా గడియారం వేలాడుతున్నా సరే, మొబైల్ కోసమే వెతుకుతున్నా!!

లేవగానే దేవుడిని చూస్తే ఆ రోజు బావుంటుందో, లేదో, తెలియదు కానీ! మొబైల్ చూడకపోతే మాత్రం ఆ రోజు కూడా మొదలవ్వదు ఏమో.

మొత్తానికి కాసేపు వెతికాక దొరికింది. టైం చూస్తే సమయం సుమారు ఉదయం నాలుగు గంటలు కావస్తోంది.

సెలవ పూట(మా భాషలో weekend లెండి), పైగా "అలారం కూడా విశ్రాంతి తీసుకునే సమయం", అలాంటిది అంత పొద్దునే లేవడం నాకే ఏదోలా అనిపించింది!

అంత పొద్దునే, ఏమి చేయాలో అర్ధంకాక టీవీ పెట్టుకుంటే, అయినవెరో గడ్డం వేసుకుని, అప్పుడే వీక్లీ రాసి ఫలాలు చెప్పడం మొదలుపెట్టారు.

"రాజ్యపూజ్యం ఎంత ఉన్నా, ఆత్మావమానం మాత్రం ఎలాగూ తప్పదని తెలిసి, టీవీ ఆఫ్ చేసేసాను".

బద్ధకానికి బ్రాండ అంబాసిడర్లా తయారైన బాడీని కదిలిద్దాము అని జాగింగ్ కి బయలుదేరాను.

"యుద్దానికి బయలుజేరను అని భావించింది కాబోలు ఆ 'తెల్లని దళసరి మంచు', మార్గమునంతా తన ఆధీనంలోకి తీసుకుంది!"

చేసేది లేక, "ఆ మంచు తెరల అంచును చుడుతున్న దారంలా, తిరగడం(వాకింగ్) మొదలుపెట్టాను."

ఆ క్షణాలు నాకెందుకో బాగా నచ్చాయి! అలా అడుగులు ముందుకు వేస్తున్న నేను, తెలీకుండానే నాతో నేను గడపడం మొదలు పెట్టాను.

"నాలో, నాకు ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు, మరి ఎన్నో ఊసులు ".

ఆ క్షణం అనిపించింది.

"నాతో నేను గడిపిన క్షణాలు మాత్రమే జీవితం ఏమో అని", "మిగిలిన క్షాణాలు అన్ని సమాజం నిర్దేశించావే అని".

నిజం చెప్పాలంటే "సంతోషం" అనే పదం ప్రస్తుత సమాజంలో, ఆ..?? తెలుగులో ఏమంటారో తెలీదు కానీ, ఇంగ్లీష్లో "virtual reality" అంటారు.

క్లుప్తంగా చెప్పాలంటే "software engineering" చదివిన నాకు, చిన్నపటి నుండి మన ఇంట్లో వాళ్ళు కానీ, చుట్టూ ఉన్నవాళ్లు కానీ, మన ఆర్ధిక పరిస్థితులు కానీ, నేర్పిన ఆనందం డెఫినిషన్ ఏంటి అంటే,

"మంచి జాబ్ తెచ్చుకోరా, లైఫ్ సెటిల్ అయిపోతుంది అని"!

తీరా, ఏవో తిప్పలు పడి ఉద్యోగం తెచుకున్నాక, "ఆ సెటిల్మెంట్ అనేది కనుచూపు దూరంలో అస్సలు కనపడదు, అద్దాలు పెట్టుకొని చూసిన కనపడదు"!!

పైగా, మళ్ళీ ఏవో కొత్త లక్షాలు!!

"మంచి ఇల్లు, టీవీ, కార్, బట్టలు" ఇలా, అవసరమున్న, లేకపోయినా, ఆఫర్లు పెట్టారని ఏమీ ఆలోచించకుండా అవి మనకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయని భావించి, "లోన్ తీసుకోని మరి కొంటాం"! అలా కొనపోతే సమాజంలో మనం ఆనందంగా ఉండడానికి అర్హులం కాదు.

"మళ్ళీ ఆ లోన్ తీర్చుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని భావిస్తాం"!!

ఇది చాలక, సమాజం మనకి, "పెళ్లి, పిల్లలు" అనే కొత్త బంధాలను నిర్దేశిస్తుంది, వాటి కోసం ఏ లోన్ తీసుకోకపోయినా?

"బాధ్యతే, జీవిత కాలపు వడ్డీ కింద చెల్లిస్తూ ఉంటాము? అసలు, రాబోయే తరాలకు మన ఆస్తులుగా పంచుతాము.

మన సమాజం, మనని ఎంతలా ప్రభావితం చేస్తుంది అంటే, మొన్నెవరో చెప్తుంటే విన్నాను

"రాత్రి, ఇంటికి వెళ్ళాక పని చేయడం కుదర్లేదు అండి, ఇంట్లో వాళ్తో ఏవో మాట్లాడాల్సివచ్చింది, ఆ తరువాత ఆలోచిస్తే నా మీద నాకే కోపం వచ్చింది, చాలా టైం వేస్ట్ చేస్తున్న అని. అదే టైంలో పనిచేసి ఉంటె ఆ "జాన్ గాడు" ఖుషి అయిపోయేవాడు".

"అంటే మనిషులతో గడపడం "టైం వేస్ట్" అని, అది ఏ రాబడి ఇవ్వదు అని, ఒకటికి రెండు సార్లు సామాజం నీకు రుద్దుతూ ఉంటుంది".

ఇలా కల్పిత ఆనందంలో బ్రతికే మనకు, మనతో మనం ప్రయాణించే అద్భుతమైన క్షణాలు ఎప్పుడు దొరుకుతాయో!!

అలా దొరికితే, చలంగారు చెప్పినట్లు,

"జీవితాన్ని ఒక అనుభవంలా, ఆ అనుభవాలని జీవిత లక్ష్యంగా చేసుకొని ప్రయాణించగలమా"!!

"లేదా, కంగారు పడిపోయి అది ఒంటరితనం అని ఫీల్ అయిపోయి, ఏ మొబైల్నో ఆశ్రయిస్తామా"!!

అనుకున్నానో లేదో, నీకు వెయ్యేళ్లు..

"ట్రింగ్ ట్రింగ్, ట్రింగ్ ట్రింగ్"

మొబైల్ చూస్తే: బాస్ కాలింగ్

నేను: హలో జాన్

జాన్: i am trying to reach you from last 2 hours, where are you? I said to be available all the time as there is a release, you are not understanding me yaar, you need to really stretch yourself yaar"..

నేను: sorry john, I apologize for my unavailability during early hours, just joining in another 5 minutes.

జాన్: ok. join quickly.

నేను: దీనమ్మ జీవితం(మనసులో), thank you.