10 Beautiful, Acha Telugu Songs From Nanduri Vaari 'యెంకి పాటలు'

Updated on
10 Beautiful, Acha Telugu Songs From Nanduri Vaari 'యెంకి పాటలు'

నండూరి వెంకట సుబ్బారావు గారు ఈ పాటలను తను చదువుకునే రోజులైన 1917 - 1918 కాలంలో మొదలుపెట్టారు. యెంకి - నాయుడు బావ మన తెలుగువారి సొత్తు. నండూరి వెంకట సుబ్బారావు మన తెలుగులోగిళ్ళలో కలియ తిరుగుతున్న దంపతులను చూసి మధించి, కాస్త కవిత్వాన్ని మేళవించి ఈ యెంకి పాటలు రాశారు. తెలుగు అక్షర అమృతానికి జత చేర్చే తేనె యెంకి పాట, యెంకి పాటలు విన్నప్పుడు శ్రోతలు తన్మయత్వానికి గురై తమ తమ భావనా వీధులలో తిరుగాడుతారు.

1. గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ కాకుండ నీదురా కూసింత సేపు!

నాకాసి సూస్తాది నవ్వు నవ్విస్తాది, యెల్లి మాటాడిస్తే యిసిరికొడతాదీ! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ కన్ను గిలిగిస్తాది నన్ను బులిపిస్తాది, దగ్గరగ కూకుంటే అగ్గిసూస్తాదీ! యీడుండమంటాది యిలు దూరిపోతాది, యిసిగించి యిసిగించి ఉసురోసుకుందీ! గుండె గొంతుకలోన కొట్లాడతాదీ! మందో మాకో యెట్టి మరిగించినాదీ, వల్ల కుందామంటే పాణమాగదురా! గుండె గొంతుకలోన కోట్లాడుతాదీ. మందో మాకో యెట్టి మరిగించినాదీ, వల్ల కుందామంటే పాణమాగదురా! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ.

2. నమిలి మింగిన నా యెంకీ

యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి! యెంకి నా వొంకింక రాదోయి రాదోయి మెళ్ళో పూసలు పేరు తల్లో పూవుల సేరు కళ్ళెత్తితే సాలు కనకాబిసేకాలు యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి! యెంకి నా వొంకింక రాదోయి రాదోయి! సెక్కిట సిన్నీ మచ్చ సెపితే సాలదు లచ్చ! వొక్క నవ్వే యేలు వొజ్జిర వయిడూరాలు! యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి! యెంకి నా వొంకింక రాదోయి రాదోయి! పదమూ పాడిందంటె పాపాలు పోవాల కతలూ సెప్పిందంటె కలకాల ముండాల! తోటంతా సీకట్లె దొడ్డీ సీకటిమయమె! కూటి కెళితే గుండె గుబగుబమంటా బయిమె! రాసోరింటికైన రంగుతెచ్చే పిల్ల! నా సొమ్ము - నా గుండె నమిలి మింగిన పిల్ల!

3. యెంకి సూపు

పదిమందిలో యెంకి "పాట" నే పాడంగ గోడ సాటున యెంకి గుటకలేసే యేళ సూడాలి నా యెంకి సూపు లా యేళ! సూడాలి నా యెంకి సోద్దే మా యేళ! "నా పాటె పా" టంట "నా మాటే మా" టంట నలుగు రమ్మలు సేరి నను మెచ్చుతావుంటె, సూడాలి నా యెంకి సూపు లా యేళ! సూడాలి నా యెంకి సోద్దే మా యేళ! పొరుగమ్మతో నేను వొరస లాడే యేళ పొలమెల్లి నే పొద్దుపోయి వచ్చే యేళ, సూడాలి నా యెంకి సూపు లా యేళ! సూడాలి నా యెంకి సోద్దే మా యేళ!

4. పిల్లోడు

యెంకితో తీర్తాని కెల్లాలి సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె యెంకితో తీర్తాని కెల్లాలి! నెత్తిమూటల నెత్తుకోవాలి! కొత్తమడతలు దీసి కట్టాలి! అడవి దారుల యెంట నడవాలి! బరువు మారుసుకొంట పక్కున నవ్వాలి! యెంకితో తీర్తాని కెల్లాలి! సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె యెంకితో తీర్తాని కెల్లాలి! తాతనాటీ వూసు తలవాలి! దారిపొడుగున కీసు లాడాలి! 'తప్పు నీదే' యంట దెప్పాలి! దైవ మున్నాడాని దడిపించుకోవాలి! యెంకితో తీర్తాని కెల్లాలి! సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె యెంకితో తీర్తాని కెల్లాలి! కతకాడ కూసింత నిలవాలి! కతగాడు మావూడె సెప్పాలి! నను చూసి పిల్లోడు నవ్వాలి! మాలోన మా మేటొ మతులిరుచుకోవాలి! యెంకితో తీర్తాని కెల్లాలి! సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె యెంకితో తీర్తాని కెల్లాలి! కోనేటిలో తానమాడాలి! గుడిసుట్టు ముమ్మారు తిరగాలి! కోపాలు తాపాలు మానాలి! యిద్దరము పిల్లోణ్ణి యిశుడికి సూపాలి! యెంకితో తీర్తాని కెల్లాలి! సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె యెంకితో తీర్తాని కెల్లాలి!

5. ముందుపుటక

నా పక్క తిరిగి మాటాడవా యెంకి? యీ సిక్కు నీ విప్పగలవా? యీ జంట విడిపోయి యే వాడనో తేలి, యెంకి పాటినగానే యెదర నిలిసే దెవరొ? నా సూపు సెదర గొట్టే దెవరొ? నా తోవ సదును సేసేదెవరొ? మనసేతితో నాటి మన సొంతమని పెంచి మనకోట యీ తోట మరపు రాకుంటాదా? నా గుండె? మరిగిపోకుంటాడా? నా పక్క తిరిగి మాటాడవా యెంకి? యీ సిక్కు నీ విప్పగలవా? వొయికుంటమే నీతో వొరుగుతాద నమ్మి కలిసున్న నాకాసి కన్నెత్తి సూసేవ నీ వొన్నె సిన్నేలు సూసేవ? యింతింత అన్నేయ ముంటాదా? నా పక్క తిరిగి మాటడవా? యెంకి! యీ సిక్కు నీ విప్పగలవా?

6. గోవు మా లచ్చిమి

గోవు మా లచ్చిమికి కోటి దన్నాలు మనిషికైనా లేని మంచి పోకిళ్ళు! యెంకితో కూకుండి యింత సెపుతుంటే తనతోటి మనిసల్లె తల తిప్పుతాదీ! గోవు మా లచ్చిమికి కోటి దన్నాలు.. యెంకి సరసాలాడ జంకుతా వుంటే సూసి సూడక కన్ను మూసి తెరిసేదీ! గోవు మా లచ్చిమికి కోటి దన్నాలు. కోరి కూకుని నేనె పోరు పెడుతుంటే తల్లిడిపు పిల్లల్లె తెల్లపోతాదీ! గోవు మా లచ్చిమికి కోటి దన్నాలు..

7. తెరచాటు

లేపకే నా యెంకి లేపకే నిదరా యీ పాటి సుఖము నే నింతవర కెరుగనే కలలోన నా యెంకి కతలు సెపుతున్నాది వులికులికి పడుకొంట 'ఊ' కొట్టుతున్నాను! కతలోని మనిసల్లె కాసింతలో మారి కనికట్టు పనులతో కత నడుపు తున్నాది! రెక్కలతో పైకెగిరి సుక్కల్లే దిగుతాది కొత్త నవ్వుల కులుకు కొత్త మెరుపుల తళుకు తెలివి రానీయకే కల కరిగిపోతాది.. ఒక్క నేనే నీకు పెక్కు నీవులు నాకు!

8. సరాగాలు

పూవు నేనైతే నే నీ వలపునౌదు! పూ నిన్నె జగమంత ధ్యానింపజేతు నేను కోయిల నైతే నీ రాగమౌదు! దిశ లహో నిన్నే కీర్తింపగా జేతు! రాయి నేనైతే? నీ ప్రాణమ్మునౌదు! ముజ్జగము నిన్నె మొక్కగా జేతు! నీవు నేనైతే! నిను నీలోనే కందు! నేను నేనుగా నుంటె? నీలోనె యుందు.

9. రాకపోకలు

ఏ లోకమో పోక; ఎటకో నా రాక యితరు లెవ్వరి కెరుక యెంకికేగాక! చేలపాటున నేను చెట్లచాటున తాను పాట జగమును రేపు పాటు యుగమును బాపు మోట నడుపుట నేను తోట తడుపుట తాను మనిసినే యని వగతు మాకునై పోవలతు చేనులోనే నిదర తాను వెలుగుచు యెదర స్వప్నలోకము దించు స్వర్థమును స్వారించు!

10. దీప సుందరి

దీప సుందరితోటి సాపత్యమా నాకు దీప సుకుమారి దరిదాపు చనగలనా! రంగుకోక ధరించి రాజురాక తపించు నీడలను తెలివి విడ నాడి కన నుంకించు రెప్ప వాల్చక మింట లెక్కించు చుక్కలను అలికిడికి వులికిపడు నలుదెసల విరగబడు! నిలువంత చెవి జేసి పిలుపు విన నోరగిలు కటి బిగునుచును శిరస్సు కాని లెమ్మని విసురు కెవ్వుమని కిందబడు నవ్వు నాలుక సాచు "రాజా" యనుచు నెగిరి "రా రా" యనుచు కునుకు వేదన సుఖాన మను వెలుగుచు సుఖాన చను దీప సుందరి దీప సుందరితోటి సాపత్యమా నాకు దీప సుకుమారి దరిదాపు చనగలనా!