Chai Bisket’s Story Series: నాలో నేను (Part – 8)

Updated on
Chai Bisket’s Story Series: నాలో నేను (Part – 8)
జరిగిన కథ: Part - 1, Part - 2, Part - 3, , Part - 4 Part - 5 Part - 6 Part - 7 అమ్మా... నువ్వేంటి ఇక్కడ ? నాన్న కూడా వచ్చారా ? నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలుసు ? “ఎక్కడ ఉన్నావ్ నువ్వు ?” అమ్మ అడిగింది. మీరూ ఇక్కడే ఉన్నారుగా. “ఏంటో నీ మాటలు అర్ధమే అవ్వటం లేదు ఈ మధ్య. సరేలే నీకోసమని గారెలు చేశా తిందువుకాని రా.” ఆకలి లేదు, కాని అమ్మ చేతి వంట తిని చాలా కాలం అయిపొయింది కదా. తినాలనిపించింది. కడుపు నిండుగా, భుక్తాయాసం కలిగేలా తిన్నాను. నాన్న వచ్చి ఇప్పుడు నాతో రా అని ఎక్కడికో తీసుకెళ్ళారు. ఇదో వైద్యశాల ల ఉంది. నాకెందుకు నాన్న ఇవన్నీ అంటే వినరే. ఆ రోజంతా అక్కడే గడిచిపోయింది. నేను లేచి చూసేప్పటికి అమ్మా నాన్న డాక్టర్ తో ఎదో మాట్లాడుతున్నారు. నేను లేచింది చూసి అమ్మ నా దగ్గరికి వచ్చింది. నువ్వో రెండు వారాలు మాతోనే ఉండాలి అని ఒట్టేయించుకుంది. సరే తప్పుతుందా అనుకోని, రెండు వారాలు ఆ వైద్యశాల లోనే ఉన్నాను. నాకేం అవ్వలేదు అని చెప్పినా ఒక్కరూ వినరే. అమ్మ కోసం రెండు వారాలు ఉన్నాను. ఎన్నో పరిక్షలు చేసారు, ప్రతి ఒక్కడూ వచ్చి ఇక్కడ ఎవరున్నారు, నువ్వేక్కడున్నావ్ అని అడుగుతాడు. ఇందాకటి వరకు కంచి తాత ఉన్నాడు, కంచిలో ఉన్నాను అని చెప్పగానే వెళ్ళిపోతారు. నా వళ్ళ కావటం లేదు ఇక్కడ ఉండటం. రెండు వారాలు నాకు అర్ధమైంది ఏంటంటే ఎవడైనా వచ్చి ఇక్కడ ఎవరున్నారు అంటే ఎవరూ లేరనాలి, నువ్ ఎక్కడ ఉన్నావ్ అంటే మా ఊర్లోనే ఉన్నాను అనాలి. అప్పుడు కాని నన్ను వదలరు అని అర్ధమైపోయింది నాకు. ఈ రోజు మళ్ళీ అవే ప్రశ్నలు, ఈ పెద్దాయన్ని కలిసిన విషయం చెప్పకూడదు, నేనెక్కడికి వెళ్తున్నానో కూడా. ఈ సారి మా ఊర్లో అని చెప్పాను. నాన్న డాక్టర్స్ తో ఎదో మాట్లాడుతున్నారు, అమ్మ నా దగ్గరికి వచ్చి ఎదో చెప్తుంటే...సర్లే కాని, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి నేను ఈ పని అవ్వగానే వస్తా. మా అమ్మ ఎదో చెప్తుంటే వినకుండా నా మానాన నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. “ఎక్కడికి నాన్నా !?” అంటూ అడుగుతుంది అమ్మ. ఎక్కడికి వెళ్ళాలి అనే ప్రశ్న రాలేదు నాకు, వెళ్తున్నాను, వెళ్తున్నాను....నడుస్తూనే ఉన్నాను. పొలాలు, కాలువలు, రహదారులు, అడవులు, చెరువులు, కొండలు దాటి నడుస్తూనే ఉన్నాను. మొత్తానికి ఒక దగ్గర ఆగాయి నా కాళ్ళు. ఎదురుగా తెల్లటి ఆకాశం. భూమి మచ్చుకు కూడా కనిపించటం లేదు, మొత్తం ఆకాశమే. వెండిలా మెరిసిపోతుంది. చాలా చాలా చాలా చల్లగా ఉంది. చెట్లు, నీళ్ళు, రాళ్ళు, మొక్కలు, నేల అంతా తెల్లగా ఉంది. చుట్టూ చూసాను నేను తప్ప ఎవ్వరూ లేరు, గట్టిగా అరిచాను. ఆకాశంలో ఎవరో నా అరుపు విన్నట్టున్నారు, నా మాటనే తిరిగి పలుకుతున్నారు. సరదా మనిషిలా ఉన్నాడు. నేనేమన్నా తిరిగి పలుకుతున్నాడు. ఆకాశానికి కూడా కోపం, బాధ, ఆనందం లాంటివి ఉంటాయేమో. కొన్ని సార్లు ఎర్రగా, తెల్లగా, నల్లగా మారిపోతుంది ఆకాశం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఏడుస్తుంది కూడా. ఆ ప్రదేశం అంతా అంగుళం వదలకుండా తిరిగాను. చెట్లమీది తెల్లని ఆకులో పండ్లో తెలీదు కాని తినెసాను. నీళ్ళని కొరుక్కుని నమిలి నమిలి తాగాను. జీవితం లో మొదటిసారి ఊపిరిని చూసాను. తెల్లగా పొగలా వస్తుంది నాసిక, నోటి నుండి. నోట్స్ లో మొత్తం రాసాను ఆ పరిసరాలు, చెట్లు వాటి సువాసన, నీళ్ళు, ఆకాశం గురించి. చిన్నపిల్లాడిలా నేలపై బోర్లాను. ఆ వెండి వెలుగుకి నా ఆలోచనంత మసకబారింది. ఖాళీగా ఉంది మనసంత. ఈ వెలుగే నిజం అన్నమాట, దీనికోసం కదా అందరు తాపత్రేయ పడాల్సింది. కాని ఎందుకు వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎలా వెళ్తున్నారో తెలీకుండా ప్రయాణం చేస్తున్నారు అందరూ. దానికి జీవితం అనే పేరు పెట్టుకున్నారు. ఇలానే నడవాలి, ఇలానే తినాలి, ఇలానే ఆలోచించాలి, ఇలానే వెళ్ళాలి అంటూ ప్రతీ దానికి ఓ నియమం అనే కంచే కట్టి అందులో కూర్చోపెట్టి బయటకి వెళ్తే బలైపోతావు నీ ఇష్టం అని భయపెడుతున్నారు. ఈ నియమాలకు కులం, మతం, భాష, ప్రాంతం, వర్గం, వర్ణం అంటూ వీలైనన్ని సంస్థలు సిద్ధం చేసి వాటికి అధికారం కట్టపెట్టారు. ఒకదాన్ని తప్పించుకున్నా వేరోకదానికి బలిఅవ్వాల్సిందే. అవన్నీ బూటకం రా! నిజం వేరే ఉంది అని చెప్పేవాడ్ని పిచ్చివాడిగా ముద్రేశారు. కొంతమంది ఎవరైనా నమ్మితే, ఆ చెప్పే వాడ్ని దేవుడ్ని చేసి వేరే చోటులో కూర్చోపెట్టి ఆయనకీ మాత్రమె అలా ఉంటుంది, మనం మామూలు మానవ మాత్రులం, మనం ఇలానే బతకాలి అని లంకె పెడుతున్నారు. అంతా ద్వైదీప్యమైన కాంతి స్వరూపాలే అన్న సంగతి ఎంతమందికి తెలుసు ? ఆ కాంతిని కూడా విడగొట్టి వర్ణాలుగా నామకరణం చేసి దూరం పెంచేస్తున్నారు. కంటికి కనిపించని, కష్టంలో కలిసిరాని, బాధలో ఒదార్చని ఓ విధానాన్ని సృష్టించి దానికి సమాజం అని ప్రజల మనసుల్లోకి చేర్చి నడక రాకముందే కాళ్ళకు సంకెళ్ళు తయారుచేసి పెట్టారు. ఏ జన్మ పుణ్యమో, ఏ నాటి వరమో నేను ఈ స్థితికి చేరుకోగలిగాను. ఇదే అన్నమాటా పరమానందం అంటే, ఇదే అన్నమాట మోక్షం అంటే, ఇదే అన్నమాట ప్రసన్న స్వరూపం అంటే. దీనికోసమే కదా అందరూ వెతకాల్సింది, తిరగాల్సింది, కష్ట పడాల్సింది. అయినా నాకెందుకులే అనుకోని ఆ తర్వాత ఓ చోటులో పడుకొని ప్రశాంతంగా ఆలోచించటం మొదలెట్టాను. నా వీపంతా ఘనీభవిస్తున్నట్టు తెలుస్తుంది. రక్తం వేడి తగ్గి నెమ్మదిగా ప్రవిహిస్తున్న పద్దతి తెలుస్తుంది. హృదయ స్పందన మధ్య వ్యత్యాసం తెలుసుకోగలిగినంత ఉంది. కనురెప్పలు కొట్టుకోవటం దగ్గరినుండి, శ్వాస తీసుకోవటం వరకు అన్నీ చాలా నెమ్మదిగా జరుగుతున్నాయ్ ఆలోచనలతో సహా. ఎందుకో ఓ లేఖ రాయాలనిపించింది నాకు. ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్తానని నమ్మకం లేదు నాకు. ఇక్కడే ఉండిపోతాను. ఏం రాద్దాం, ఎవరి గురించి రాద్దాం అనుకోగానే ఉన్నపళంగా మా బామ్మా గుర్తొచ్చింది, నా పదవ ఏట చనిపోయింది తను. నాకు ఎన్నో కథలు చెప్పేది. నేను రచయితని అవ్వటానికి కారణమే తను. కారంస్ లో స్ట్రైకర్ అంత పెద్ద బొట్టుతో, నార చీర కట్టుకొని నన్ను పక్కనే కూర్చోపెట్టుకొని అన్నం తినిపిస్తూ రాముడ్ని, రావణుడిని, సీతని, లక్ష్మనుడిని, కృష్ణుడిని, పాండవులని, కురవులని, ఆఖరికి మతాన్ని దాన్ని నడిపిస్తున్న దేవుడిని కూడా మా బామ్మే పరిచయం చేసింది నాకు. ఎన్ని ముద్దలు తిన్నా అమ్మమ్మ ముద్ద అంటూ ఒకటి ఎక్కువ పెట్టేది. ఒక్క ముద్ద పెట్టావా బామ్మా అని అడగాలని ఉంది ఇప్పుడు కాని లేదుగా, ఎక్కడ ఉందో ఎలా ఉంది ఏం చేస్తుందో పాపం. మానస సరోవరం, 29-04-1990. దైవసమానులైన అమ్మా నాన్నకు, ఉభయకుశలోపరి. నా గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ లేఖ రాయటానికి ముఖ్య ఉద్దేశం నేను ఇక్కడే స్థిరపడిపోదాం అని నిశ్చయించుకున్నాను. మీ అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయం తీసుకోవటం తప్పే, క్షమించగలరు. నాకోసం రావటం, నన్ను తీసుకువెళ్ళాలి అనుకోవటంలాంటివి చేయొద్దని నా ముఖ్య మనవి. ఈ వయసులో మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెట్టటం నాకు ఇష్టం లేదు. నాకు తెలిసినంత వరకు నేనేవరికైన ఋణపడి ఉన్నానంటే అది మీ ఇద్దరికే. అమ్మా...నా ధైర్యం నువ్వు. నా ప్రాణం నువ్విచ్చింది. నాన్న...నా రూపం మీది, నా ఆలోచన మీరిచ్చినది. ఎందుకు కలిగిందో, ఎలా కలిగిందో కాని నాకీ ఆలోచన కలిగింది. ఇక్కడకి రాగలిగాను. ఇల్లు వదిలిన మొదటి రోజు నాకు తెలీదు నా గమ్యం ఇదవుతుందని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికీ వెళ్ళాలి అనిపించటంలేదు. ప్రశాంతంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఆలోచనల వేగం, సంఖ్యా దారుణంగా మందగించింది, నాకు నేను పరిచయం అయ్యాను. నేను ఆనంద సాగరంలో తేలుతూ, మిమ్మల్ని ఆందోళన లోయలోకి తోయటం నాకు మనస్కరించటం లేదు. అందుకే ఈ లేఖ రాస్తున్నాను. నిజానికి మన మధ్య ఉన్నది ఋణం కాదు బంధం. ఋణం అయితే ఎప్పటికైనా, ఎలా అయినా తీర్చేసి వెళ్ళిపోతానని బంధం వేసి బందిద్ధం అనుకునట్టు ఉన్నాడు దేవుడు. బంధం కూడా నిర్బందిచలేదని తెలీదేమో పాపం. నా ప్రస్తుత స్థితిని మీరు పొందాలని కోరుకుంటున్నాను, కాని అది ఎంతవరకు సాధ్యమో నాకు తెలీదు. ఎప్పటికైనా మీకోసం ఒక్కసారి వస్తాను, కొడుకుగా నా బాధ్యతలు చేయలేకపోతున్నాను క్షమించండి. ఈ జన్మకు నన్ను ఇలా వదిలేయండి. శ్రీని...నీ గురించి ప్రత్యేకంగా చెప్పకపోతే పాపం చేసినవాడినవుతాను. తోబుట్టిన వాళ్ళు లేరని తోడుగా పంపాడు దేవుడు నిన్ను నాకోసం. నీకు కృతజ్ఞతలు చెప్పటం చాలా చిన్నమాట. కాని అంతకు మించిన పెద్ద మాట, మన బంధాన్ని గౌరవించే మాటా నాకు తెలీదు. మనిద్దరం కలిసి ఉన్న ప్రతీ క్షణం నా హృదయంతరాలలో ఎప్పటికీ భద్రంగా ఉంటుంది. నిన్ను మళ్ళీ కలుస్తానో లేదు తెలీదు, నా జీవితం లో అత్యంత చీకటి రోజుల్లో నా వెంటే ఉన్నావు. నేను అలా ఉండలేకపోతున్నాను క్షమించు. నాకు తెలుసు నీకెప్పుడు కష్టం కలగదు. కంచి తాత గారు, మీరు చూపిన ప్రేమని మాటల్లో చెప్పలేను. అనామకుడ్ని మీలో ఒకడిగా ఆదరించారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నాను. నేనెవరో తెలుసుకున్నాను. ఇక్కడ చాలా బావుంది. కైలాసం లో ఉన్నానెమో అనిపిస్తుంది. మీకోసం వస్తానని మాటిచ్చాను. తప్పకుండా నెరవేర్చటానికి ప్రయత్నిస్తాను. అమ్మా నాన్న...శ్రీని, కంచి తాత(కంచి కుడి) గురించి రాసింది వారికి అందేలా చూడండి. మీరు నా గురించి ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీ కళ్ళ ముందు లేకపోవచ్చు కాని మీరు లేని నా ఆలోచనలు ఉండవు. ఇక సెలవు మరి. ఇట్లు, మీ చిరంజీవి. లెటర్ రాసి పోస్ట్ బాక్స్ లో వేసి వచ్చాను. చాలా రోజులు క్షణాల్లా గడిచిపోయాయ్. ఒక్కసారి ఇంటికి వెళ్లి రావాలి అనేది మరుపురాక ఓ బరువుగా అనిపిస్తుంది. అందుకే ఒక్కసారి వెళ్లి బరువు దించేసుకుందాం అని నిర్ణయించుకున్నాను. మా ఊరు బయలుదేరాను. దారిలో ఓ పుస్తకం కొని ఇప్పటివరకు జరిగిన నా ప్రయాణానికి అక్షర రూపం ఇస్తున్నాను. చాలా ఏళ్ళ క్రితం నాలో సమాధి చేయబడిన రచయిత ఈ రచన కోసం మళ్ళీ తిరిగివచ్చాడు. ప్రయాణాన్ని ఓ డైరీ లా రాయకుండా ఓ కథలా రాయాలని అనుకున్నాను. నేను జరిగినవి మట్టుకు రాద్దాం అనుకున్నాను, కాని రచయిత ఊరికే ఉండడు కదా. కొద్దిగా కల్పితాలు కలిపేద్దాం ఏమవుతుంది అని సతాయిస్తున్నాడు. వాడిని వారించటం, వాడితో వాదించటం కంటే వాడికి విలువ ఇచ్చేస్తే మనల్ని విసిగించడని, కల్పితం కొంతవరకు ఐతే సరే అన్నాను. ఇంట్లో నుండి బయలు దేరిన మొదటి రోజు నుండి, రైల్వే స్టేషన్, నా అభిమాని, కంచి వెళ్ళటం, తన పెళ్లి, కంచి కుడి, కంచి తాత గారు, అక్కడి సన్యాసులు, కామాక్షమ్మ సన్నిది, కన్యాకుమారి, వివేకనందుడు, హిందూ మహా సముద్రం, స్టేషన్ లో ఓ యోగి, కాశి వెళ్ళటం, అక్కడ ఓ పెద్దాయన కలవటం, మానస సరోవరం చేరుకోవటం, అక్కడి నుండి ఇంటికి ప్రయాణం అంతా రాసేసాను. జీవ నది అనే పేరుతో ఓ పుస్తకం తయారయ్యింది. అంతా చాలా బావుంది, సరే నాకు అలా అనిపించింది. కాని మా రచయితకు ఎదో తగ్గినట్టు అనిపించిందట. అంతా బావుంది, కాని ఇంటికి వెళ్తావ్, అమ్మా నాన్నని కలుసుకుంటావ్, కంచి వెళ్తావ్, మళ్ళీ తిరిగి వచ్చేస్తావ్. బానే ఉంది కాని అంత బాలేదు. ఏదైనా ఉండాలి ఇక్కడ అంటూ ఓ కొత్త సన్నివేశం పెడదాం అని నన్ను ఒప్పించాడు. నేను సరే అన్నాను. కాని ఏమి రాయాలో నాకు తోచలేదు. మా ఊరు వచ్చేసింది. ఇంటికి వెళ్లాను. అమ్మ నన్ను దూరం నుండి చూసే గుర్తుపట్టేసింది. నాన్నకు కొద్దిగా అనుమానం ఉంది నేనా కాదా అని. కాని ఇద్దరికీ ప్రేమ, ఆనందంతో కన్నీరు కారిపోతున్నాయ్. మళ్ళీ మామూలు మనిషిలా మారాను ఓ గంటలో. జుట్టు కత్తిరించటం, తల స్నానం, ప్యాంటు షర్టుతో. నాన్న అందరికి చెప్పాలని ఆరాట పడుతున్నారు. నేను వద్దని వారించాను. ఆ తర్వాత ఓ పూటంతా ఇంతకాలం నా ప్రయాణం గురించి తెలుసుకున్నారు. జీవనది గురించి చెప్పాను. అమ్మా నాన్న నేనేం చెప్తున్నానో వింటున్నారో, లేదో తెలీదు కాని నన్నే చూస్తున్నారు. జీవనదిలో చివరి సన్నివేశంలో నేను రాసే పాత్ర చనిపోతుంది, వాళ్ళ అమ్మ వాడి ఎదురుగా కూర్చొని ఏడుస్తుంటుంది. ఇలా మారిస్తే ఎలా ఉంటుంది అని వాళ్ళని అడుగుతున్నాను. నాకో విషయం అర్ధం అవ్వలేదు...నేను చనిపోయిన ఓ పాత్ర గురించి చెప్తుంటే...మా అమ్మ నాన్న నేను చనిపోయినంతగా ఏడుస్తున్నారు ఎందుకు. నా పాత్ర అంత ప్రభావం చూపిస్తుందన్నమాట. శభాష్ రా సంతోషా! అని నాకు నేనే పోగుడుకొని, “అమ్మా...ఆకలవుతుంది అన్నం పెట్టావా...” అని పిలిచాను. అమ్మ కదలకుండా ఆ శవాన్ని చూస్తూ ఏడుస్తుంది, అమ్మ పక్కగా శ్రీని ఎదో పుస్తకం చదువుతుంది. నాన్న చేతిలో ఎదో లేఖ ఉంది. అందరు దుఖంలో ఉన్నారు. ఈ లోపు ఓ పోలీస్ వచ్చాడు, వాడే నా ఇంటర్ స్నేహితుడు. నేను వాడి దగ్గరికి వెళ్లి ఏమైంది రా ఏంటి ఇదంతా అని అడుగుతున్నాను, వాడు వెళ్లి మా నాన్నని అదే ప్రశ్న అడిగాడు. ఆయన ఏమి మాట్లాడకుండా ఓ లేఖ, పెద్ద పుస్తకం ఇచ్చాడు. ఆ లేఖ నేను రాసినదే, ఆ పుస్తకమే జీవనది. పోలీస్ నా రూమ్ లో కి వెళ్ళాడు, అక్కడ గోడల నిండుగా కాంచీపురం, కన్యాకుమారి, కాశి, మానస సరోవరం ఫోటోలు, వార్త కథనాలు కుప్పలు తెప్పలుగా అతికించి ఉన్నాయి. నేను చూసాను అనుకున్న ప్రతీది అక్కడ ఫొటోస్ లో ఉంది. భగవాన్ స్మృతులు, యోగి ఆత్మకథ, వివేకానంద జీవిత చరిత్ర, రామకృష్ణ పరమహంస జీవితం, మానస సరోవర యాత్ర ఇలా ఆధ్యాత్మిక పుస్తకాలు లెక్కలేనన్ని ఉన్నాయి అలమరలలో. నా గదిలో ఫ్లోర్ మీద నేను మానస సరోవరం లో పడుకొని లేఖ రాసినప్పటి ఆఖరం లో సద్ధముక్కతో ఓ ఆకారం గీసి ఉంది. ఈ లోపు మా నాన్న ఆ పోలీస్ కి ఏవో వైద్య రిపోర్ట్స్ తెచ్చి చూపించాడు. ఈ లోపు ఓ డాక్టర్ వచ్చాడు. నాన్నకి, పోలీస్ కి ఏదో చెప్తున్నాడు. “ఇది తీవ్రమైన మనోవైకల్యం (Paranoid Schizophrenia). చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళు మనకు కనిపించని పాత్రలను సృష్టించుకొని, వాటితో స్నేహం చేస్తుంటారు. వారికి నచ్చిన ప్రతీ అంశాన్ని ఓ పాత్రతో పంచుకుంటారు. వాటినే నిజం అనుకోని బతికేస్తుంటారు. నేను చెప్తే మీరు వినలేదు. చికిత్స మధ్యలో ఆపెయ్యటం వలెనే ఇదంతా. మీరు తీసుకురావటమే చివర్లో తీసుకొచ్చారు. క్షమించండి.” అని ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం నేను లేని పాత్రలని ఊహించుకొని, వాటినే నిజం అనుకోని బతికానా. చిన్నప్పటి నుండి నాకు కనిపించే పాత్రలు నిజం కాదా, నాకు రోగం ఉందా!?. అంటే నేను మానస సరోవరం వెళ్ళటం అంతా ఊహేన! అక్కడి నుండి ఇంటికి రావటం, జీవనది గురించి అమ్మ నాన్నకి చెప్పటం అంతా ఊహేనా! అంటే నేను చనిపోయానా !? అనే ప్రశ్న రాగానే “అవునంకుల్... డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తె సంతోష్ మానస సరోవరం లో చల్లని నేలపై పడుకునట్టు ఊహించుకొని ఆ చలికి రక్తం గడ్డకడుతునట్టు ఫీల్ అయ్యి శ్వాసని నిలిపేసి చనిపోయుంటాడు.” అని చెప్తున్నాడు ఆ పోలీస్ మా నాన్నకి. మా అమ్మ దుఖం చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది. అదే సమయం లో గట్టిగా గాలి రావటం తో శవం మీద కప్పిన గుడ్డ తొలగిపోయింది. నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నా, నా కళ్ళ నుండి కన్నీరు కారుతుంది.” అబ్బాః...కథ చాలా బావోచ్చింది అనుకోని వర్డ్ డాక్యుమెంట్ సేవ్ చేసి, లాప్టాప్ షట్ డౌన్ చేసి వెళ్లి పడుకున్నాను. ఇప్పటికే తెల్లవారు జాము మూడున్నర అయింది, మళ్ళీ రేపు ఏడున్నరకే నిర్మాత ని కలవాలి అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను. కథ సమాప్తం :)