జరిగిన కథ: Part - 1, Part - 2, Part - 3, , Part - 4 Part - 5
రైలు వెల్లిపోతుందేమో అని పరిగెత్తుకుంటూ వచ్చాను కదా, మొహం అంతా చెమట పట్టేసింది. మొహం కడుక్కుందాం అని మంచి నీళ్ళ పంపు దగ్గరికి వెళ్లాను. పంపు పక్కగా పార్సిల్ చేయటానికి సిద్ధంగా ఉన్న పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయి. మొహం కడుక్కొని వాటిలో నన్ను నేను చూసుకున్నాను. మరీ పెద్దగా లేకున్నా బాగానే పెరిగిన జుట్టు, నిద్రసరిగా లేక కారుచీకట్లో డిమ్ముగా వెలుగుతున్న కారు లైట్లలా ఉన్నాయి కనులు, వాడిపోయిన మొహం, ఓ మోస్తరు గడ్డం మీసం, లేత బూడిద రంగు టి షర్టు, దాని మీద ముదురు బూడిద రంగు స్వెటర్, ముదురు నీలం రంగు జీన్స్, బాత్రూం లో వేసుకునే చెప్పులు, ఓ పెద్ద ట్రావెల్ బాగ్. ఇది నా వాలకం. నవ్వుకున్నాను. ఎలా ఉండేవాడిని ఎలా అయ్యాను. రైలు రావటానికి ఇంకో గంట పైన ఉనట్టుంది, టికెట్ తీసుకునేప్పుడు తప్పుగా విన్నట్టున్నాను. ఏం చేస్తాం, ట్రైన్ వచ్చే ప్లాట్ఫారం దగ్గర ఓ బల్ల మీద కూర్చొని, ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న నా పక్కన వచ్చి కూర్చుంది ఓ అమ్మాయి. లేత గోధుమ వర్ణం చర్మం, చక్కగా దువ్విన జుట్టు, పెద్ద కళ్ళు, అంత పెద్ద కళ్ళను కూడా కనపడకుండా కప్పేసేంత కాటుక, రెండు కనుపాపల మధ్యగా ఓ ఇంచు పైన రెండు ఇంచుల మందాన విభూతి, ముక్కు ఎడమ వైపుగా కనిపించేంత పెద్దగా ఉన్న బంగారు పుడక, ముద్దొచ్చేలా ఉన్న బుగ్గలు, గులాబి రేకులనంత సున్నితంగా కదులుతున్న పెదాలు, చెవులకు బంగారు బుట్టల దిద్దులు, మెడలో గుర్తించే మందాన ఉన్న బంగారు గొలుసు, గోరింటాకు తో పండిన చేతులు, తెల్లటి పంజాబీ దుస్తుల్లో చూడముచ్చటగా పద్దతిగా మహాలక్ష్మిలా, అమ్మలకు నచ్చేలా ఉంది తను.
నేను తనని పట్టించుకునేవాడ్ని కాదు, కాని మరీ దగ్గరిగా, నాకు తను కూర్చుంది తెలిసేలా కూర్చుంది ఆ అమ్మాయి. ఇంచుమించుగా నాకు అనుకుంటూ కూర్చుంది. తనని చూడటమే ఓ విధంగా చూసాను నేను. తను “సారీ ఇంగే” అని పక్కకి జరిగింది. తన పక్కన ఓ ఇద్దరు చిన్న పిల్లలు కూర్చుంటాం అని మారం చేస్తుంటే, నా వైపుగా జరిగింది తను. “ఎంగె... లవ్ ఫెయిల్యూర్ ఆ” అని అడిగింది తను. నేను పట్టించుకోలేదు. “తెలుంగా...హలో మిమ్మల్నే” అని మళ్ళీ అడిగింది తను. అవును, ఏంటి అని అడిగాను నేను. “ఏం లేదు, మీరు చూస్తే కుర్రాడిలా ఉన్నారు, కళ్ళు చూస్తే ప్రేమ కోల్పోయిన వాడిలా ఉన్నారు, చదువుతున్నదేమో రమణ మహర్షి - భగావన్ స్మృతులు పుస్తకం, అది కూడా రాసింది చలం గారు. అత్యంత అసాధారణంగా ఉంది ఈ కలయిక”. అవునా అని నా మానాన నేను చదువుకోవటం మొదలెట్టాను. “కడవులే...ఏంటండి నా మానన నేను మాట్లాడుతుంటే మీరు పట్టించుకోవట్లేదు అసలు. హలో...”. నన్ను విసిగించటం తప్ప ఇంకేం పని లేదనుకుంటా ఆ అమ్మాయికి, తెలిసిన మొహం కూడా కాదు, చూసిన గుర్తులేదు, కనీసం తెలుగు అమ్మాయి కూడా కాదు కాని నాతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటుందో అర్ధం అవ్వటంలేదు. సరే ఏంటో తెలుసుకుందాం అనుకోని, ఏంటమ్మా...నీ బాధేంటి. నేనెవరో తెలుసా, ఎందుకు నాతో మాట్లాడాలి అనుకుంటున్నావ్ ? అని కొద్దిగా కోపంగా అడిగేసాను. “హరి హరి...అంత కోపం ఎందుకోయ్. ఏం తెలీని వాళ్ళతో మాట్లాడకూడద ఏంటి ? ఎదో తెలిసిన మొహంలా అనిపించి పలకరిస్తే...పొగలు కక్కుతున్నావ్.” అంటూ అమాయకంగా ఏడుపుమొహంతో చెప్పింది తను. హ్మ్...అది కాదమ్మా. నేను నిన్నెప్పుడు చూడలేదు, తెలీని వాళ్ళతో మాట్లాడటం నాకు అలవాటు లేదు. “నువ్వు నాకు తెలుసు.” టక్కున అంది తను. ఏంటి, సరదాగా అంటున్నావా. “మీరు కథారచయిత సంతోష్. 13 సినిమాలకు రచయితగా, 7 సినిమాలకు సహాయ రచయితగా, ఒక్క సినిమాకు మాటలు, రెండు పాటలు రాసారు. అందులో 6 సినిమాలు సూపర్ హిట్, 8 హిట్, 4 ఎవరేజ్, రెండు ఫ్లాప్. మీరు రాసిన రెండు పాటలు నా ఫోన్ లో ఉన్నాయ్. చాలా ఇంకా ఎమన్నా చెప్పాలా మీ గురించి.” అంటూ టక టకా చెప్పేసింది తను.
ఆశ్చర్యంతో అవాక్కయ్ చూస్తున్నాను నేను. ఆశ్చర్యం కాక మరేమిటి...ఓ కథా రచయితకు కూడా అభిమానులు ఉంటారా? రచయిత పేరు కనపడేది ఒక్క క్షణం, ఆ లోపు చూసేవారు, గుర్తుంచుకొని మరి పిలిచేవారు ఉంటారా? మొదటిసారి నన్ను గుర్తుపట్టారు ఒకరు, నా కథలు నచ్చి నాతో మాట్లాడాలి అనుకుంటున్నారు. బావుంది, చాలా బావుంది ఆ అనుభూతి. ఇలా నాలో నేనే మాట్లాడుకుంటుంటే... “హలో...ఏంటడి ఇప్పటికైనా మాట్లాడుతారా? అభిమానులతో కూడా మాట్లాడనంత బిజీగా ఉండరు అనుకుంటున్నా”. ఈలోపు నేను తేరుకొని, సారీ. నేను తెలీనివాళ్ళతో మాట్లాడను, అభిమానించే వాళ్ళతో మాట్లాడకపోతే నా అంత మూర్ఖుడు ఇంకోడు ఉండడు. చెప్పండి. “నాకు మీ గురించి మొత్తం తెలుసు, ఒక్కటే తెలుసుకోవాలి అనుకుంటున్నా. ఈ మధ్య మీ సినిమా ఏది రాలేదు, మీరు చూస్తే ఎదో కోల్పోయిన వాడిలా ఇక్కడ కూర్చొని పుస్తకం చదువుకుంటున్నారు. ఏమైంది ?”. నేనేదో చెప్పేలోపు... “చెన్నై వెళ్ళు చెన్నై ఎక్ష్ప్రెస్స్ ఆరవ నంబెర్ ప్లాట్ఫారం మీది నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉంది” అని అనౌన్స్మెంట్ వినిపించింది. రైలు వెల్లిపోయేలా ఉంది పదండి, అని నేను తను రిజర్వుడు పెట్టెలోకి ఎక్కేసాం. టికెట్ కలెక్టర్ వచ్చాడు ఈ లోపు, టికెట్ అడిగాడు నా దగ్గర సెకండ్ క్లాసు టికెట్ ఉంది. దిగిపోమన్నాడు, ఈ లోపు తను వచ్చి రెండు రిజర్వుడు టికెట్స్ చూపించింది. ఒకటి నాకు, రెండు తనకి. వాళ్ళ అన్నయకు రావటం కుదరలేదట, వాడి బదులు నేను వెళ్తున్నాను. కూర్చొని, తనకు మొత్తం చెప్పేసాను ఎక్కడికి వెళ్తున్నాది, ఏం చేయలనుకునేది అన్నీ. తెల్లారి ఆరున్నరకి చెన్నై సెంట్రల్ స్టేషన్ లో ఆగింది రైలు. క్లీన్ చేసేవాడు వచ్చి లేపెంతవరకు నాకు సోయలేదు. లేచి చూస్తే తను లేదు. స్టేషన్ అంతా వెతికాను, ఎక్కడా కనపడలేదు. అప్పుడు అర్ధమైంది...అభిమానం నా మీద కాదు, సినిమాలో పేర్లు పడేప్పుడు కనిపించే రచయిత మీద. ఇంకెప్పుడు నా పేరు వెండితెర మీద కనపడదు అని తెలుసుకుంది, కనపడకుండా వెళ్ళిపోయింది. తప్పేంలేదు.
ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి, అప్పటివరకు జరిగింది ఓ నోట్బుక్ లో రాసుకొని టిఫిన్ చేయటానికి వెళ్లాను. చూడటానికి మనూరులానే ఉంది, కాని కొత్తగా అనిపిస్తుంది. బుర్ర మీసాలు, తెల్ల పంచెలు, ముదురు రంగు చీరలు, పెద్ద బొట్టు, తల నిండా పూలు, మందపు బంగారు గొలుసులు, బుగ్గ నిండుగా కిళ్ళీ పెట్టుకొని నములుతున్న ముసలివాళ్ళు, ముదురు గోధుమ నుండి నలుపు వర్ణంలో మెరిసిపోతున్న మనుషులే కనిపిస్తున్నారు చుట్టూ. ఎంగె...వాంగ...సొల్లుంగ అంటూ ఏంటో ఈ “గ”ల గోల. దోస చెప్పి కూర్చున్నాను, రెండు నిమిషాల తర్వాత తెచ్చి నా ముందు పెట్టాడు. సాంబారులో టబ్ బాత్ చేస్తున్నట్టు ఉంది దోస, చట్నీ ఏం వెయ్యరట. సాంబార్ నాకస్సలు నచ్చదు, కాని పొద్దునే సాంబార్ తో మొదలెట్టాల్సి వచ్చింది. దోసని సాంబార్ నుండి వేరు చేసి, కొద్దిసేపు ఆరబెట్టి, నిండుగా తిన్నాను అనేట్టు కడుపుని మోసం చేస్తూ తిన్నాను. డబ్బులు ఇస్తూ పక్కకి చూస్తుంటే, హోటల్ లో తింటున్న అందరు సాంబార్ ని పాయసం తాగినట్టు తాగుతున్నారు. బహుశా తమిళనాడు రాష్ట్ర వంట సాంబార్ ఏమో అనిపించింది నాకు. ఆ తర్వాత కంచిపురం వెళ్ళే లోకల్ ట్రైన్ ఎక్కాను. అంత రద్దీలో కూడా నాకు కాస్త స్థలం దొరికింది కూర్చోటానికి, అది కూడా కిటికీ పక్కగా. సముద్రం పక్కగా ఉంది కదా ఒకటే ఒక్కపోతగా ఉంది, లోపల బనియన్ అప్పటికే మూడు సార్లు తడిచి ఆరిపోయింది, తల రెండు సార్లు స్నానం చేసేసింది స్వేదంలో. కిటికీ పక్కన ఉన్నా కదా, గాలికి చెమట ఆరిపోతుంటే చల్లగా అనిపిస్తుంది. ప్రతి ఐదు నిమిషాలకు ఒక్కమారు రైలు ఆగుతుంది, లోకల్ రైలు కదా. అందరికీ ఒక్కటే ఆరాటం, ఎక్కేప్పుడు దిగేప్పుడు. బతుకంటేనే పరుగు కదా, ఎత్తుకు తగ్గ గోతిలో సేద తీరటానికి ఇంతలా పరుగు పెట్టటం ఏమిటో కదా! నాకు పక్కగా కొద్ది దూరం లో, ఇద్దరు తిట్టుకుంటున్నారు. తండ్రీ కొడుకులు అనుకుంటా. వాళ్ళెం మాట్లాడుకుంటున్నారో వినపడలేదు, ఐనా వినపడినా పెద్ద అర్ధం అయినట్టు. కొద్దిసేపు అరిచాడు కొడుకు, ఆ తర్వాత ఇద్దరూ శాంతించారు. ఆ సన్నివేశం చూస్తుంటే నా కాలేజి అయిపోయిన సంవత్సరం జరిగిన సంఘటన గుర్తొచ్చింది నాకు.
నాన్నకు కోపం ఎక్కువ, ఎంత వస్తే అంత మాట అనేస్తారు, వెంటనే కోపం తగ్గిపోయి మాములుగా అయిపోతారు. నోరు అదుపులో ఉంచుకోలేరు. చిన్నప్పటినుండి మాకు ఆయన తీరు అలవాటు అయిపొయింది. ఆయన అరుస్తుంటే అర్ధం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయేవాళ్ళం, కాని ఎప్పుడూ ఎదురు తిరగలేదు. చిన్నప్పుడు అంటే కొన్ని మాటలకు అర్ధం తెలీదు, అవి చేసే గాయానికి కలిగే బాధ తెలీదు. గాయం చేయటానికి పెద్ద పెద్ద ఆయుధాలు అవసరం లేదని చిన్నప్పుడు తెలీదు కదా. కాని పెద్దయ్యాక కూడా అలానే మాట్లాడితే బాధేస్తుంది కదా, అది కూడా అమ్మని అంటే కోపం వస్తుంది కదా. ఆ రోజు నాన్న ఎదో అన్నారు అమ్మని. ఏం అన్నారో, ఎందుకు అన్నారో గుర్తులేదు కాని, ఓ భర్త తనని భార్యని అనకూడనిది, ఓ కొడుకు తన తల్లిని అంటుంటే వినలేని మాటలు అన్నారు ఆయన. మొదటి సారి అరిచాను నాన్న మీద. నా మీద ఇంట్లో ఎవ్వరికి గౌరవం లేదు, అలాంటప్పుడు నేనెందుకు ఉండాలి అని వెల్లిపోటానికి సిద్ధపడ్డారు ఆయన. అప్పుడు...
“నాన్నా... మీరంటే మాకు గౌరవం ఉంది కనుకే ఇంతకాలం మీ ఆవేశం ఇల్లంతా ప్రతిధ్వనిస్తున్నా మా చెవులు మూత పడలేదు, మా పెదాలు తెరుచుకోలేదు. మీ కోపం వెనుక కారణాన్ని చూసాం, మీ మాటల వెనక తొందరపాటుని అర్ధం చేసుకున్నాం. కాని నాన్నా...కోపానికి మంచి చెడు, తన మన, వావి వరసలు ఎలా తెలీవో; గౌరవానికి ప్రతీదాని గురించి పూర్తిగా తెలుస్తుంది. మంచీ చెడులు సరిచేస్తుంది, తన మన లెక్కేస్తుంది, వావి వరసలు గుర్తిస్తుంది. ఇంతకాలం మీ మాటలకు నోరెత్తకుండా ఉంది, మీరెమంటారో అనే భయం వలన కాదు-మిమ్మల్ని బాధపెట్టలేనంత గౌరవం వలన. మనం ప్రేమించే వాళ్ళని, మనం గౌరవించే వాళ్ళు అనాగరికంగా అవమానిస్తుంటే తట్టుకోలెం కదా. కారణం లేకుండా కోప్పడటం మీకు అలవాటే, తప్పుచేయకపోయినా పడటం మాకు అలవాటే, కాని ఈ రోజు అమ్మని మీరు చాలా తప్పుగా తిట్టారు. క్షమించమని అడగండి. మీరు క్షమాపణలు చెప్పటం తప్పేం కాదు, మా దృష్టిలో తక్కువేం అయిపోరు...చెప్పండి. పాపం నాన్నా...అమ్మా, మీరు మేము ఇల్లు తప్ప ఇంకో లోకం తెలీదు.” నేనెలా మాట్లాడుతుంటే కోపంగా ఉన్న నాన్న మొహం, బాధగా ఆ తర్వాత తప్పు చేసినవాడిలా దీనంగా మారిపోయింది. ఆయన గదిలోకి వెళ్లి తలుపేసుకున్నారు. అమ్మ నన్ను అరిచింది. ఎంతైనా వాళ్లాయన్ని అంటే కోపం వస్తుంది కదా మరి. ఓ గంట తర్వాత నాన్న గదిలోకి వెళ్లి చూసాను, పడుకొని కన్నీరు కారుస్తున్నారు. కోపం అవలీలగా చూపించగల మనిషికి, బాధ చూపించటం రాదానకుంటా. పరుష మాటలు పలికించే పెదాల కన్నా, కన్నీరు కురిపిస్తున్న కనులను చూసి భయమేసింది నాకు. ఆయన ఎక్కడికైన వెళ్లిపోతారేమో అని. ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని, క్షమించండి నాన్న, అమ్మని అనేప్పటికి ఆవేశం ఆగలేదు అంటుంటే నాకు నీల్లోస్తున్నాయ్.
రైలు లో ఉన్న నాకు ఆ దృశ్యం తలుచుకోగానే కనీళ్ళు నిండిపోయాయ్. కాంచీపురం వచ్చేసింది. “వాంగా...” అంటూ చేయిపట్టుకు లాగుతోందో చిన్నిపాప. అప్పుడు తేరుకొని, కాంచీపురంలో దిగాను. తుంచేసిన జిలేబి ముక్కల్లా కనిపిస్తున్నాయ్ నాకు తమిళ పదాలు. అక్కడ ఉన్న దేవాలయాలు అన్నీ తిరిగాను, చాలా మంది మనుషులని కలిసాను. సూర్య భగావానుడి వేడిని మించి దహించేస్తుంది నన్ను జటరాగ్ని. త్వరగా ఏదోటి సమర్పించకపోతే దహనం కాస్తా, దారుణం లా మారుండేది. దగ్గరలోని హోటల్ కి వెళ్లాను. పొద్దున్న జరిగింది గుర్తొచ్చి, ఈ సారి టిఫిన్ కాదు భోజనం ఆర్డర్ చేసాను. ఇల్లు కట్టేప్పుడు, సిమెంటు ఇసుక కలిపి మధ్యలో గుంటలా చేసి నీళ్ళు పోసినట్టు, కంచం నిండుగా అన్నం పెట్టి మధ్యలో సాంబార్ పోసి తెచ్చాడు. నంజుకోవటానికి అరటి చిప్స్, ఓ రెండు కూరలు తెచ్చి పెట్టాడు. ఇక్కడ ఉన్నంతకాలం సాంబార్ తో సావాసం తప్పదనిపించింది. ఆకలి రుచెరగదు అన్నట్టు, భుక్తాయాసం కలిగేల భోజనం చేసాక చూసుకుంటే పర్సు లేదు, ఎవరో కొట్టేసారు. ఆ హోటల్ వాడికి తెలుగు రాదు, నాకు అరవం రాదు, అందుకే మా ఇద్దరి మధ్య చర్చలకు చోటు లేదు. పప్పు రుబ్బుతా అని అడగటానికి కూడా అవకాశం లేదు. ఆ హోటల్ యజమాని గారు అరవంలో అరక్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా బండబూతులు తిట్టేస్తున్నట్టు ఉన్నాడు. వాడి నాన్ స్టాప్ వాగుడికి బ్రేక్ వేసిందో ఆడ చెయ్యి, డబ్బులు ఇస్తూ. తనే...రైలు దిగగానే మాయం ఐన అమ్మాయి మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అయింది దేవతలా. తన పక్కనే తెల్లటి చొక్కా, పంచె వేసుకున్న దృడమైన మనిషి, తమిళ మగతనానికి మచ్చుతునకలా ఒకడు నిల్చున్నాడు. మా బావ అంటూ వాడిని నాకు పరిచయం చేసింది.
మిగిలిన కథ తర్వాతి భాగం లో