Chai Bisket's Story Series: నాలో నేను (Part - 1)

Updated on
Chai Bisket's Story Series: నాలో నేను (Part - 1)
నా పేరు చీమకుర్తి వీర వెంకట సాయి నాగ యోగ చంద్ర శేఖర ప్రసాదు, ముద్దుగా కాదు...కాదు అంత పేరు పిలిచే ఓపిక లేక చందూ అని, వెంకట్ అని, సాయి అని ఇలా ఎవరి సౌలభ్యానికి అనుకూలంగా వారు పిలుస్తుంటారు. నాకు చదువు పెద్దగా అబ్బలేదు కాని, తెలుగు పదాలు చూస్తుంటే ఏదో తెలీని ఆనందం. నా కనులకు తెలుగు అక్షరాలు, నిశీది నక్షత్రాల్లా మిరిమిట్లు గొలుపుతుంటాయ్. తెలుగు చదువుతుంటే మనసుకి హాయిగా ఉంటుంది, రాస్తుంటే ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు కాని రాయటం అంటే నాకు బాగా ఇష్టం...కాదు, ప్రేమ...కాదు కాదు పిచ్చి. ఒక సారి పొద్దుటి నుండి సాయంత్రం వరకు రాస్తూనే కూర్చున్నాను. ఏం రాసానో గుర్తులేదు కాని, ఆ రోజు సాయంత్రం నేను ఏం రాస్తున్నానో అని లాక్కొని చూసారు నాన్న. కొడతారేమో అని భయపడ్డాను కాని, చాలా బాగా రాస్తున్నావ్ రా అని మెచ్చుకోవటం ఎప్పటికీ మర్చిపోలేను. బహుశ... ఆ రోజు మా నాన్న నేను అనుకున్నట్టు తిట్టడమో, కొట్టడమో చేసుంటే నేను రచయితను అయ్యే వాడిని కాదేమో. అమ్మా నాన్న ప్రోత్సాహం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆ తర్వాత నుండి విచ్చలవిడిగా రాయటం మొదలెట్టాను, ప్రతి అంశంపైన ఏదోటి రాసేవాడిని. కొన్నిరచనలు చాలా లోతుగా ఉంటె, కొన్ని చాలా చెత్తగా ఉండేవి. కొన్నిటిని చదివేవాడు అర్ధం చేసుకోవటం కష్టంగా ఉంటె, కొన్ని అర్ధమే లేకుండా వుండేవి. కొన్ని ఎంతో ఆలోచనతో రాస్తే, కొన్ని అనాలోచితంగా వచ్చేవి. తెలుగు భాష మీద నాకున్న అపారమైన ఆసక్తే, నాకు భుక్తిని ప్రసాదిస్తుందని అనుకోలేదు చిన్నప్పుడు. పొట్ట కోస్తే అక్షరం ముక్క రానివాడు ఎలా బతుకుతాడో అని బాధపడేది మా అమ్మ, ఏం అవుతాడో అని ఖంగారు పడేవాడు నాన్న. నేను మరీ పేద్ద స్థాయికి ఎదగలేదు కాని నా పేరు చెప్తే ఓ నలుగురు గుర్తుపట్టే స్థాయికి చేరుకున్నాను. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెద్ద రచయితలకు సహాయకుడిగా పని చేస్తున్నాను. ఇప్పటివరకు నా సొంతంగా చాలా కథలు రాసాను. కాని ఈ కథ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పాబోయేది సహాయకుడిగా కాకుండా, రచయితగా నాకు అవకాశం వచ్చిన తర్వాత రాస్తున్న మొదటి కథ. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ఎందుకు...నా గురించి అదే, నాలాంటి ఓ రచయిత కథ ఎందుకు రాయకూడదు అనిపించి రాయటం మొదలెట్టాను. అదే నాలో నేను... ఓ కథా రచయిత జీవిత గాధ. క్లైమాక్స్ ఒక్కటే రాయాలి, మిగతా అంతా మూడు నెలలుగా రాస్తూనే ఉన్నాను. రేపు నిర్మాతను కలవాలి, కథ వినిపించటానికి. ఓ రచయిత కథ అని చెప్పినప్పుడు ఒప్పుకున్నారు, మొత్తం రాసుకురా నచ్చితే వెంటనే తీసేద్దాం అన్నారు. క్లైమాక్స్ కోసమని మూడు రోజులుగా ఎదురుచూస్తున్నాను కాని ఎంతకీ ఓ కొలిక్కి రావటం లేదు. అందుకే ఇప్పటివరకు రాసిన కథని మొత్తం ఒకసారి ఎవరికైనా చెప్దాం అని అనుకున్నాను. నా స్నేహితుడిని పిలిచాను, వాడికి ఎదో అనివార్య పని తగలటం వలన రాలేకపోతున్నాను అని చెప్పాడు ఇప్పుడే. అందుకే వాడిని వీడిని బతిమాలటం ఎందుకని, నా గదిలో అద్దం ముందు కూర్చొని నా ప్రతిబింబానికి కథ చెప్పటం మొదలెట్టాను. ఓపెన్ చేస్తే... “పిల్లలందరూ అప్పుడే ప్రేయర్ ముగించుకొని, తరగతి గదులలోకి వస్తున్నారు. టీచర్ లు అందరు వారి వారి తరగతి లోకి వాళ్ళు వెళ్తున్నారు. అదిగో అందరూ వెళ్ళిపోయాక కూడా వెళ్ళకుండా, మోకాళ్ళ పైకి ఉన్న ఖాకీ రంగు నిక్కరు, బిస్కెట్ రంగు చొక్కా, మెడ దగ్గర బటన్ కు ఆనుకొని ఊపిరాడనంత దగ్గరగా కట్టిన టై, పోలిష్ చేయని నల్లటి షూ వేసుకొని, చేతిలో ఓ లెటర్ పట్టుకొని తన ఎదురుగా కొద్ది దూరంలో వెళ్తున్న టీచర్ ని ఆనందంగా చూస్తున్నాడే వాడే నేను. నేను వెళ్ళకుండా అక్కడే ఉండటం చూసి, నా వైపు వచ్చింది ఆ టీచర్. తను మా హిందీ టీచర్. “ఏం సంతోష్, తరగతికి వెళ్ళకుండా ఇక్కడే నిల్చొన్నావ్ !?” అని అడిగింది టీచర్. నేను సమాధానం చెప్పకుండా తననే చూస్తూ ఉన్నాను. “చేతిలో ఆ లెటర్ ఏంటి ?” అని అడుగుతూ తీసుకుంది టీచర్. తెరిచి చదవటం మొదలెట్టింది. “ప్రియమైన శోభ టీచర్ గారికి, ఉభయకుశలోపరి. నా రూల్ నెంబర్ 43, నాకు రేపు జ్వరం వస్తుంది కాబట్టి నేను రేపు రాను. అందుకే ఈ రోజు ఈ లెటర్ రాస్తున్నాను. మీ మాటలు చాలా మధురంగా ఉంటాయి. ఇంకోసారి అలా మాట్లాడితే మీ పళ్ళు రాలగొడుతాను. ఐ లవ్ రస్నా. నేను హార్లిక్స్ తాగాను తింటాను. హిందీలో తక్కువ మార్కులు వచ్చాయని పిర్రలు వాచేలా కొట్టారు అది నాకు నచ్చలేదు. కాని మీరంటే నాకు ఇష్టం. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మనిద్దరం కలిసి ఎక్కడికైనా పారిపోదాం. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఇంటికి వెళ్లి అద్దంలో చూసుకున్నాను, నా పిర్రలు ఎర్రగా అయ్యాయి. నా ఫ్రెండ్ రాజు గాడి పిర్రల కంటే, నావే బాగా ఎర్రగా అయ్యాయి. లెక్కల సార్ మొన్న మీకు చెక్కిలిగిలి పెడుతుంటే, మీరు నవ్వు ఆపుకోలేకుండా నవ్వటం చూసాను. మీ నవ్వు చాలా బావుంది. ఇంకోసారి కొట్టినప్పుడు వాడి పిర్రలు, నాకంటే ఎర్రగా అయ్యేలా కొట్టండి. పాల లోని తెలపు నిర్మాతో వస్తుంది. అప్పుడే వలిచిన దాన్నిమ్మ గింజల్లా ఉంటాయి మీ పళ్ళు. నిన్న ఆ దానిమ్మ పండు మురుగుకాలవలో పడింది. నేను వచ్చే వారం ఇంటికి వస్తాను. మన బాబుకి ముద్దులు.” పేరెంట్ సంతకం సంతోష్ వాళ్ళ నాన్న ఇట్లు, మీ ప్రేమకోసం పిచ్చిగా తిరుగుతున్న, సెనక్కాయల సంతోష్, ఆరవ తరగతి, బి సెక్షన్, విజ్ఞాన్ విద్యానికేతన్, రాముల వారి వీధి దగ్గర.” లెటర్ చదివేసి, స్టాఫ్ రూమ్ కి తీసుకెళ్ళింది టీచర్ నన్ను. ఆ లెటర్ పక్కన పడేసి, నా పిర్రలు వాచేలా ఇంకోసారి కొట్టింది శోభా టీచర్. నన్ను కొట్టకండి అని అడగటానికి రాసిన లెటర్ చదివి ఎందుకు కొట్టిందో అర్ధం కాలేదు. అసలు లెటర్ లో ఏం రాసానో చూద్దాం అని తీసాను. కాని ఈ లెటర్ రాయటం అంత సులువైన పని కాదండోయ్! కాపీ కొట్టటం తప్పని చెప్తారు కాని కాపీ కొట్టక తప్ప లేదండి. మా మామయ్య ఎవరికో లెటర్ రాస్తుంటే అందులో నుండి కొన్ని వాక్యాలు కాపీ కొట్టాను. టీవీ చూస్తూ రాసాను కదా కొన్ని ప్రకటనలు కూడా రాసినట్టు ఉన్నాను. మా పక్కింటి ఆంటీకి వచ్చిన లెటర్ నుండి చివరి రెండు లైన్ లు లేపెసాను. ఏ ముహుర్తానా లెటర్ రాయటం మొదలెట్టానో కాని, అది చదివిన తర్వాత రెండు వారాలు హిందీ టీచరు, లెక్కల మాష్టారు ఇద్దరూ నన్ను ఏదో ఒక కారణం చెప్పి కొడుతూనే ఉన్నారు. అందులో అంతగా తప్పు ఏం రాసానో మరి నేను. ఆ లెటర్ ఏ నా మొదటి రచన. నా రచనా జీవితానికి తొలి భీజం పడింది అప్పుడే. ఆ తర్వాత ఇంటర్ లో మా ఫ్రెండ్ గాడు బతిమాలితే ఓ లవ్ లెటర్ రాసాను. లెటర్ రాయక పోతే చచ్చిపోతాను అని బెదిరించిన వాడే, లెటర్ రాసి ఇచ్చాకా చంపేస్తాను అని మీదకొచ్చాడు. ఎందుకూ! అంటారా, లెటర్ అంతా రాసి చివరలో అలవాటులో పొరపాటుగా నా పేరు రాసాను. ఆ లెటర్ పిచ్చ పిచ్చగా నచ్చిన ఆ అమ్మాయి, ఆ లెటర్ ఇచ్చిన వాడితోనే “అన్నయా...సంతోష్ ఎక్కడున్నాడు” అని అడిగిందట. వాడు నన్ను చంపుతా అని రావటంలో తప్పేం లేదు అనిపించింది అసలు విషయం తెలిసాక. అప్పటి నుండి మా కాలేజి లో నాటకాలు, వ్యాస రచనలో, కథలు ఇలా ప్రతీదానిలో నాదే మొదటి స్థానం. డిగ్రీ పూర్తయ్యేలోపు ఎన్నో లెటర్లు రాసాను, ఆ తర్వాత ఎప్పుడూ లెటర్ లో నా పేరు రాయాలేదు. కాబట్టి నన్ను కొట్టడానికి ఎవరూ రాలేదు. డిగ్రీ అయిపొయింది. మనవి అంతంత మాత్రం చదువులు కదా, డిగ్రీ అయిపొయింది అని చెప్పుకోవటానికి చదివానే కాని, ఉద్యోగం సంపాదించే స్థాయి మార్కులు తెచ్చుకోలేదు. మనకి ఉద్యోగం ఒకడు ఇచ్చేదేంటి...నేను రాసిన కథలు అచ్చయితే, బుక్ షాపుల ముందు జనాలు కొట్టుకోవాలి, నా కథలు అచ్చు వేయలేక ప్రింటింగ్ మిషన్ లు ఆగిపోవాలి, నా కథల ద్వారా వచ్చిన డబ్బులు లెక్కపెట్ట లేక ప్రింటింగ్ ఏజన్సీ వాడి చేతులు నొప్పెట్టాలి అనుకునే స్థాయి బలుపు మనకి. కథలు రాయటం మొదలెట్టాను. ఓ రెండు సంవత్సరాలు ఇంట్లోనే, నా గదిలో కూర్చొని లెక్కలేనన్ని కథలు రాసాను. ఎందుకు రాస్తున్నానో తెలీదు, ఆ కథలతో ఎలా సంపాదించాలో కూడా తెలీదు. అందరూ నన్నో లెటర్ ఫ్యాక్టరీ లా వాడుకున్నారే కాని ఒక్కడు కూడా మిత్రుడిగా చూడలేదు. అందుకే కాలేజి తర్వాత ఎవ్వరు నాకు కలవలేదు, నేను ఎవ్వరిని కలవలేదు. అందుకేనేమో కథల్లో పాత్రలు ఊహించుకుంటూ, వాటితో మాట్లాడుతూ, ఆటలాడుతూ, పోట్లాడుతూ గడిచిపోయేది నాకు. ఒక్కడినే కూర్చొని కథల్లో లీనం అయ్యి రాసుకునే వాడిని. నేను ఎవరి గురించైనా రాయాలనుకుంటే, ఆ పాత్ర గురించి బాగా ఆలోచించే వాడిని. రెండేళ్ళు ఒకే పని మీద కూర్చోవటం, అమ్మా నాన్నతో తప్ప ఇంకేవ్వరితో మాట్లాడకపోవటం, బయట ప్రపంచాన్ని చూడకపోవటంతో నాలో నాకే ఓ విధమైన మార్పు తెలిసింది. కథలు రాస్తున్నప్పుడు, అందులో పాత్రల గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆ పాత్రలు నాకు ఎదురుగా కనపడేవి. మొదట్లో నిజంగా వచ్చారేమో అని భయపడేవాడిని కాని ఆ తర్వాత తెలిసింది అది కేవలం నా భ్రమని. అవన్నీ నేను సృష్టించిన పాత్రలు కదా, నేను వాటిని అదుపులో పెట్టగలను. అప్పటినుండి అలవాటైపోయింది. అమ్మ నాన్న కు చెప్పలేదు, నాకు ఏదైనా మానసిక రోగం వచ్చిందేమో అని బాధ పడతారని. చాలా రోజుల తర్వాత బయటకి వచ్చాను. అమ్మ ఏదో సరుకులు కావాలని చెప్పి, సూపర్ మార్కెట్ కు వెళ్లిరమ్మంది. చీటీ తీసుకొని బయలుదేరాను నేను. సూపర్ మార్కెట్లో కావలసిన సామాన్లు అన్ని కొనేసి బయటకు వచ్చేస్తున్నప్పుడు, ఎదురుగా కనపడింది ఓ అమ్మాయి. తను అచ్చం నేను రాసిన రాధే గోవిందా అనే కథలో రాధలా ఉంది...” మిగతాది తర్వాత భాగం లో...