Contributed By Aravapalli Aravind
ఈసారి పండుగ ఆదివారం వచ్చింది. ఒక హాలీడే దొరకకుండా పోయిందని కాలేజీలో ఫ్రెండ్స్ అంతా తెగ హడావిడి పడిపోయి బాధ పడ్డారు. చిన్నప్పుడైతే పది రోజులు సెలవులు. ఇప్పుడు ఇంటర్మీడియెట్ అని ఆ కోర్సులు ఈ క్లాసులు అని ఒకే రోజు సెలవు ఇస్తున్నారు పండగకి. ఆ ఒక్కరోజు కూడా ఆదివారం పడిందీసారి. అయినా నాకీ సెలవుల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. నిజానికి సెలవు పేరుతో ఇంట్లో కూర్చుంటే ఈ మిడిల్ క్లాస్ జీవితాన్ని తలచుకుని చిరాకు పడటం తప్ప ఏమీ ఉండదు. అప్పుడప్పుడు దేవుడు అస్సలు పట్టించుకోని రోజుల్లో అమ్మా నాన్న గొడవ పెట్టుకుని ఉన్న కొంచెం ప్రశాంతత కూడా పాడు చేసేవాళ్ళు. సరే ఎలాగోలా రాత్రి గడిచి తెల్లారి స్కూల్ కి వెల్తే అక్కడ ఫ్రెండ్స్ మేం పండగకి అది చేసాం, ఇది కొన్నాం అని గొడవ.” పోనీ అక్కడితో ఆపుతారా అంటే, చివరికి నా దగ్గరికి వచ్చి “ఏం రాహుల్.. నువ్వేం చేసావ్ పండగకి” అని అడుగుతారు.. “నేనేం చేయలేదు, కొనలేదు అని వాళ్లకి తెలుసు. అయినా అడుగుతారు, పక్కకి వెళ్లి నవ్వుకుంటారు. నాకు వినిపించేలా!
నేను నాలుగవ తరగతికి వచ్చే వరకు పండగలైనా, సమ్మర్ హాలిడేస్ అయినా ఇంట్లోనే. ఆ టైంకి నాన్న దగ్గర ఏమైనా డబ్బు ఉంటే మంచి వంట చేసుకుని తిని టివి లో సినిమా వేస్తే చూడటం తప్ప పెద్దగా బయటకి వెళ్లటం, షాపింగ్ చేయటం, లాంటివి ఏమీ ఉండేవి కాదు. ఆ తరువాత నాన్న పండుగ సెలవులు వచ్చినప్పుడల్లా అత్త వాళ్ళ ఇంటికి పంపేవాడు. వాళ్ళు మాకన్నా కొంచెం బాగా బ్రతుకుతారు. కొంచెమే. పెద్ద గొప్పగా కూడా కాదు. కానీ మేమంటే చాలా చిన్న చూపు. ఎందుకో తెలీదు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతిసారి సంధ్య అత్త మేము పోయిన నెలలో “ఫ్రిడ్జ్ కొన్నాం బావుందా? అవునూ మీ ఇంట్లో ఇంకా ఆ పాత సెకండ్ హాండ్ ఫ్రిడ్జ్ ఎనా లేక కొత్తది ఏమైనా కొన్నాడా మీ నాన్న? ఈ చీర చూసావా మొన్న మామ కొన్నాడు. మీ అమ్మ దగ్గర ఇలాంటి చీరలు ఉన్నాయా? ఉండి ఉండవులే ఇవి చాలా కాస్ట్లీ” లాంటి ముచ్చట్లన్నీ చెప్పేది. ఇంకా అక్కడ ఉన్నన్ని రోజులు కూరగాయలు, పాలు తీసుకురావటం, అందరు నిద్ర లేచాక దుప్పట్లు మడత పెట్టటం లాంటి పనులన్నీ చెయటం నా డ్యూటి.
మరి నేను చిన్నపిల్లాడ్ని కదా అత్త అలా ఎందుకు చెప్పేదో ఇప్పటికీ అర్థం అవదు. అక్కడ పరిస్థితి అలా ఉన్నా కానీ నాన్న పండుగకి అక్కడికి వెళ్ళమన్నప్పుడల్లా వెళ్ళేవాడ్ని. నేను అక్కడ సంతోషంగానే ఉన్నా అని అత్త వాళ్ళ పిల్లలతో బాగా ఆడుకుంటున్నా అని అమ్మ నాన్న, అనుకుంటారు, సంతోషంగా ఉన్నా అని. కానీ చిట్టి పుట్టి పెరిగాక ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ చిట్టిని కూడా అలా చూడటం అస్సలు నచ్చలేదు నాకు. అప్పటినుండి ఇద్దరం ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పి అత్త దగ్గరకు వెళ్లటం తప్పించుకుని హాలీడేస్ ఇంట్లోనే ఎలాగోలా టైంపాస్ చేసేవాళ్ళం... అవన్నీ తలచుకున్నప్పుడల్లా కొంచెం చిరాగ్గా, బాధగా ఉంటుంది కానీ ఇంకా అయిందేదో అయిపోయిందని వదిలేస్తుంటా. ఇప్పుడు పరిస్థితులూ అప్పటికన్నా కాస్త గొప్పగా లేకపోయినా ఒక ఇంట్లో ఉండాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి ఆ మూడు గదుల అద్దె ఇంట్లో. నాన్నకి ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉందని మొన్న ఆ మధ్య అన్నాడు. అప్పుడప్పుడు ఆయన ఫ్రెండ్స్ తో చిన్న చిన్న పార్టీలు చేసుకుంటున్నాడు. నేను చదువుకున్న స్కూల్ కాకుండా చిట్టి ని కొంచెం మంచి స్కూల్ లో పడేసారు. నేను కూడా బాగానే చదువుతున్న.
ఇప్పుడు పండుగలు వగైరా వచ్చినా కానీ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళం చూస్కోకుండా కొంచెం ఖర్చు పెట్టగలుగుతున్నాం. ఈసారి పండగకి నాక్కూడా కొంచెం సంతోషంగా ఉంది. ప్రమోషన్ ఇస్తారంట అని తెలిసిన రోజు నాన్న నాకు మంచి స్మార్ట్ ఫోన్ కొనిస్తా ఈ పండగకి అని వరం విసిరాడు. ఇవాళ రేపు ప్రతివాది దగ్గర ఓ కాస్ట్లీ ఫోన్. నా ఫ్రెండ్స్ అంతా స్కూల్లోనే మొదలు పెట్టేసారు. నాకేమో నాన్న ఓ సెకండ్ హ్యాండ్ కలర్ ఫోన్ ఇచ్చాడు. ఆరు నెలలు బ్రతిమాలితే. అందులో ఫోన్ మాట్లాడటం, హెలికాప్టర్ గేమ్ ఆడటం తప్ప ఇంకేం చేయలేం. నాకు పెద్ద అవసరం ఏం లేదు కానీ పాటలు వినటం అంటే చాల ఇష్టం. మొదట్లో ఫ్రెండ్స్ ఫోన్ ఒక పావుగంట, అరగంట అని అడిగి తీస్కుని పాటలు వినటం, గేమ్స్ ఆడేవాడిని కానీ తర్వాత తర్వాత వాళ్ళు కూడా చిరాకు పడటం మొదలు పెట్టారు. అడగటం మానేసాను. ఇంకా నాన్న ని అడిగేసాను. మొదట్లో కుదరదు అన్నాడు. తర్వాత చూద్దాం అన్నాడు. ఇంకా నేను ప్రతి సందర్భం లో సర్తుచేసేవాడ్ని. చివరికి ఇప్పుడు కొనిస్తున్నాడు. 9:30 అవుతుంది ఇంకా లేవలేదు నాన్న. లేచాడా లేదా అని బెడ్ రూమ్ డోర్ తెరిచి చూసా. మంచి నిద్రలో ఉన్నాడు. ఇంతలో అమ్మ పిలిచింది టిఫిన్ అయింది తినమని కేకేసింది వంటింట్లోనుంచి. వెళ్లి టివి చూస్తున్న చిట్టిదాని పక్కన కూర్చున్నా. తినడం మొదలెట్టగానే ప్రోగ్రాం మధ్యలో యాడ్స్, మంచి మంచి ఫోన్స్ పండగ ఆఫర్ లో సగానికి సాగం రేట్లు తగ్గించి అమ్మేస్తున్నారు. నేను అనుకున్నా “ఇవాల్టి నుంచి మనకి ఫోన్ వచ్చేస్తుంది, రేపట్నుంచి పాటలే పాటలు “ అని నవ్వుకున్నా.
తినటం ఐపోయింది. ప్లేట్లో వంటింట్లో పెట్టి వచ్చేటప్పుడు ఇంకోసారి బెడ్ రూమ్ లోకి ఒక లుక్ వేసా.. ఇంకా లేవలేదు నాన్న. వచ్చి టివి ముందు కూచ్చున్నా.. ఇంతలో అమ్మ కేకేసింది. మార్కెట్ కి వెళ్లి చికెన్ ఇంకా వంటకి కావలసినవి తెమ్మని ఒక లిస్ట్, డబ్బులు చేతిలో పెట్టింది. సరే ఈయనేలాగు లేవలేదు కదా అని వెళ్ళా మార్కెట్ కి. మార్కెట్ అంటే పెద్ద దూరం ఏం కాదు, పొడువాటి మా వీధి చివర్న ముందు కొన్ని కిరాన దుకాణాలు, అవి దాటాక కొన్ని చిన్న కూరగాయల బండ్లు. అవి దాటాక ఈ చికెన్, మటన్ షాప్స్ ఉంటాయి. ముందు వెళ్లి కిరాణా కొట్టులో లిస్ట్ ఇచ్చా. “కట్టి ఉంచండి, పది నిమిషాల్లో వస్తా” అని అన్నా “అబ్బో” అన్నాడు వెటకారంగా, వాడికి నాకు అస్సలు పడదు. 6th క్లాస్ లో ఉన్నప్పుడు అరేయ్ తురేయ్ అని ఏదో మాట్లాడాడు అని ఏదో గొడవ పెట్టుకున్నా.. నా దరిద్రానికి మా నాన్న వాడి కొట్లోనే ఖాతా మెయిన్టెయిన్ చేస్తున్నాడు. వాడి మొహం చూసినప్పుడల్లా చిర్రెత్తుతుంది కానీ తప్పదు. “కట్టు బే!” అన్నట్టు ఓ చూపు విసిరి మిగితా సామాన్లు తీస్కోతానికి నడిచా. వెళ్లి లిస్ట్ లో ఉన్న కూరగాయలు తీసుకుని ఆ సంచి పట్టుకుని చికెన్ షాప్ కి వెళ్ళా. అసలే ఆదివారం పైగా పండగ. చాల మంది ఉన్నారు. అనవసరంగా టెన్షన్ పడటం కన్నా బెటర్ అని కొంతమంది వేల్లిపోఎదాక వెయిట్ చేసాను. నాతో కలిపి ఇంకొక నలుగురు ఉన్నారు. అప్పుడు అరిచా “అన్నా నాకో 2కేజిస్ చికెన్ కొట్టవా” అని. వినిపించినట్టు లేదు ఆ హడావిడికి, అరుపులకి ఇంకా ఆ చికెన్ కొట్టేటప్పుడు వచ్చే ఆ చప్పుడుకి. మళ్ళీ అరిచా. వినలా. ఇంకా చిరాకేసి గట్టిగా అరిచా “అన్నా” అని. పని చేస్తూనే తల ఎత్తి చూసాడు.. ఎంత అసహ్యంగా ఉన్నాడో.. రక్తం, చిన్న చిన్న చికెన్ ముక్కలు ఆయన చెస్ట్ మీద నుంచి మెడ వరకు ఉన్నాయి. ఒక చూపు చూసి మళ్ళీ తల కిందికి దించుకున్నాడు. “వాడికసలు వినిపించిందా లేదా..ఇస్తాడా ఇవ్వడా? అసలు మాటకి సమాధానం చెప్పడేంటి?” అని చెడ్డ చిరాకేసింది.
ప్రతిసారీ బాగానే ఇస్తాడు. ఇవాళ కొంచెం బిజీ ఉన్నాడు సరే... “ఊ” అనో “ఊహూ” అనో ఏదో ఒక రిప్లై ఇచ్చి చావాలి కదా.. ఇంకా చిరాకేసి వెళ్లి పోదామని వెనక్కి తిరిగి షాప్ ముందు ఉన్న రెండు మెట్లు దిగా.. “2కేజీలు చికెన్ ఎవరికి?” అని వినిపించింది, తిరిగి చూసా, నా వైపే చూస్తున్నాడు. “నాకే” అన్నాను. “మరి ఎళ్ళిపోతున్నావేం” అన్నాడు. కొంచెం కోపంగా “అప్పటికెళ్ళి అడుగుతున్న” అన్నాను. “చూసినవ్ కదా బాబు. పండగ బిజీ ఇంత మంది ఉన్నారు. కొంచెం లేట్ కే అంత కోపం అయితే ఎలా?” “సరే రెండు కేజీలు ఇవ్వు, లివర్ వెయ్యి, లెగ్ పీస్ లు అలానే ఉంచు, మిగితాది మీడియం సైజ్ లో కొట్టు, మెడకాయ వేయకు” అన్నాను.
“మళ్ళీ సమాధానం చెప్పకుండా కొట్టడం మొదలు పెట్టాడు. 2కేజీలు సరిగ్గా తూగాక ఒక ముక్క ఎక్స్ట్రా వేసి నా వైపుకి చూసి నవ్వాడు. “ఆపరా బాబు” అనుకున్నాను. ఒక చేతిలో కూరగాయల సంచి, ఇంకొక చేతిలో చికెన్ సంచి పట్టుకుని నా ఫోన్ గురించి పగటి కళలు కంటూ ఆ కిరాణా కొట్టు వైపుకి నడిచాను. దూరం నుంచి చూస్తూ “వీడు అన్ని ప్యాక్ చేసాడో లేదో..” అనుకుంటూ దగ్గరికెళ్ళి చూసాను. వాడు బొర్రా గోక్కుంటూ టివి చూస్తున్నాడు. రెండు సార్లు, రెండోసారి గట్టిగా అంకుల్ అని పిలిచాక పలికాడు. “నా సామాన్లు” అని అడిగా.. “ఆ(? ఏం సామాన్లు?” అన్నాడు. “అదే ఇందాక లిస్ట్ ఇచ్చా కదా.. ప్యాక్ చేసి ఉంచమని చెప్పా?”.. “ఓ ఆ లిస్ట్ ఆ.. మర్చిపోయా.. ఉండు కడతా అన్నాడు”.. కావాలనే చేసాడు.. కోపమొచ్చింది కానీ ఇప్పుడు ఈడితో గొడవపెట్టుకునే ఓపిక లేదు.
వెయిట్ చేయించీ చేయించీ పావుగంట తర్వాత సంచి చేతిలో పెట్టాడు. మూడు సంచులయ్యేసరికి బరువు, చెమట దానికి తోడు వీళ్ళ వాళ్ళ వచ్చిన కోపానికి చెడ్డ చిరాకు పుట్టేసింది. సరే మనకి మన ఫోన్ వచ్చేస్తుందివాళ ఈ యెదవలందరితో మనకెందుకు అని ఇంటివైపుకి నడిచా. తలుపు తీసుకుని లోపలికెళ్ళగానే అమ్మ చేతిలో ఉన్న సామాన్లన్నీ తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది. నేను బాత్రూం లోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని హాల్ లోకి వెళ్ళగానే నాన్న స్నానం చేసి రెడీ అయి ఫ్యాన్ కింద కూర్చుని తింటున్నాడు. నేను వెళ్ళి పక్క కుర్చీలో కూర్చున్నాను. తింటూనే నావైపుకి చూసి “చికెన్ కోసం వెళ్ళావటగా తీసుకొచ్చావ?” అన్నాడు. “తెచ్చా నాన్న” అన్నాను. “ఒకే” అని మళ్ళీ తినటం స్టార్ట్ చేసాడు. కొంచెం సీరియస్ గా తేడాగా ఉన్నాడు. మొహంలో నవ్వు లేదు. టివి చూస్తూ తింటూ..అలా కొద్దిసేపటికి కంప్లీట్ చేసేసి లేచాడు. బెడ్ రూమ్ లోకి వెళ్ళి బైటికి వచ్చి, పర్స్ ప్యాంట్ జేబులో పెట్టుకుంటూ “లక్ష్మీ నేను బైటికి వెళ్తున్నాను ఒక రెండు గంటల్లో వచ్చేస్తాను, వచ్చేటప్పుడు తీస్కోస్తా” అన్నాడు. అమ్మ లోపలినుంచే “ఆ..సరే” అంది. బైటికి వెళ్ళిపోయాడు నాన్న. సరే పని ఉన్నట్టుంది నాన్నకి అనుకున్నాను. ఈలోగా టివి లో పండగ స్పెషల్ కొత్త సినిమా స్టార్ట్ అయింది.
నేను, చిట్టి ఇద్దరం ఇంక టివి ముందు కూర్చున్నాం. అమ్మ పండుగ కోసం చేసిన చిరుతిళ్ళు ఏవో తెచ్చి ఇచ్చింది. ఇద్దరం ఇంక టివిలో లీనమైపోయాం. సినిమా ఐపోయే టైంకి నాన్న బండి సౌండ్ వినిపించింది. “నన్నేనా” అనుకుంటూ చూద్దామని డోర్ వైపుకి నడుస్తుండగా “నానీ” అని నాన్న అరుపు వినిపించింది. పరిగెత్తుకుంటూ బైటికి వెళ్లాను. నాన్న బండి మీదనే ఉన్నాడు. దగ్గరికెళ్ళా. బండికి ఉన్న కవర్ లు నాకు అందించి “చూసుకో..నీకు నచ్చకపోతే ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు. అమ్మతో చెపు నేను రవి అంకుల్ ని కలవటానికి వెళ్తున్నా అని..కొంచెం late అవుతుంది ..మీరు తినేయండి” అని వెళ్ళిపోయాడు. తాగటానికి వెళ్తున్నట్టున్నాడు. రవి అంకుల్ ని ఎప్పుడు కలవటానికి వెళ్ళినా తాగటానికే.. చాలా సార్లు గొడవ కూడా అయింది అమ్మా నాన్నకి ఈ విషయంలో. నాన్న వీధి దాటగానే కవర్స్ పట్టుకుని లోపలికి పరిగెత్తాను. అమ్మ కిచెన్ నుంచి బైయిటికి వచ్చింది. నాన్న చెప్పింది చెప్పాను. మొహం కొంచెం కోపంగా మారిపోయింది. టేబుల్ మీద పెట్టిన కవర్స్ ని చూసి చెమటలు తుడుచుకుంటూ బైటికి వచ్చింది. కవర్స్ ఓపెన్ చేసాం.. మూడిట్లో ఒకదాంట్లో అమ్మకు రెండు చీరలు, ఇంకో దాంట్లో నాన్నకి జత బట్టలు, చిట్టికి ఒక ఫ్రాక్ ఉంది. బట్టలన్నీ బైటికి తీసి చూస్తే ఫోన్ మాత్రం కనిపించలేదు..
“ఏంటి మర్చిపోయాడా, లేక ఈవినింగ్ కొంటాడా.. పోనీ గుర్తుచేద్దామా.. వద్దులే మొన్నే అన్నాడు కదా కొంటాని..ఈవినింగ్ చూద్దాం” అనుకున్నాను. అమ్మ భోజనం పెట్టింది. ఇద్దరం టివి చూస్తూ తిన్నాము. టివి లో ఇంకో కొత్త సినిమా స్టార్ట్ అయింది. చూసి, నిద్రోస్తుంటే అలానే హాల్ లో సోఫా మీద పడుకున్నాను. లేచేసరికి 7 అయింది. కొంచెం డిసెపాయింట్మెంట్ తో పడుకున్నా కదా.. లేచాక చాల చిరాగ్గా ఉంది. వెళ్లి మొహం కడుక్కుని వచ్చా.. నన్నోచ్చాడెమో చూద్దామని బెడ్ రూమ్ డోర్ చేసి చూస్తే అమ్మ ఫోన్ లో వాళ్ళమ్మతో మాట్లాడుతుంది. పక్కన చిట్టి డ్రాయింగ్ బుక్ లో ఏదో రాస్కుంటుంది. నాన్న ఇంకా రాలేదు.. చేసేదేముందని టివి ముందు కూర్చున్నా.. ఇంకో సినిమా స్టార్ట్ అయింది. “వీటికేం తక్కువ లేదు నీయమ్మ..” అనుకుంటూ కూర్చున్నా. టైంపాస్ అవ్వాలిగా.. ఫోన్ గురించి మర్చిపోయి టివి చూస్తున్నా.. 9:30 ఆ ప్రాంతానికి నాన్న వచ్చాడు బాగా తాగేసి.. రాగానే బాత్రూం లోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చాడు. నాకు అప్పటికే మండుతుంది. ఆయన్ని అలా చూడగానే అమ్మ కూడా కోపంగా సామాన్లు ఎత్తేస్తూ కిచెన్ లో నుంచి తిండి గిన్నెలు తీస్కోచ్చి హాల్ లో పెట్టింది. అమ్మ నన్ను, చెల్లిని వెళ్ళి పడుకోమంది కానీ ఈయన్ని ఫోన్ సంగతి అడుగుదామని నేను వెళ్ళలేదు. చిట్టిది అప్పటికే భయపడి వెళ్ళి పడుకుంది.
వచ్చి కూర్చున్నాడు టవల్ తో తల తుడుచుకుంటూ నా వైపుకి చూసి “ఇంకా పడుకోలేదా?” అన్నాడు. నాకు మండి కోపంగా, “ఇవాళ ఫోన్ కొనిస్తా అని చెప్పావ్ నాన్న గుర్తులేదా, ఇవాల్టితో చాలా ఫోన్ ల మీద ఆఫర్ కూడా అయిపోతాయి” ఆయన నిజంగానే మర్చిపోయాడు. “అయ్యో..అవును కదా, ఆ సంగతే మర్చిపోయాను, ఏముందిలే ఆఫర్ లేకపోతే ఏముంది, కొందాంలే ఈ వారంలో మంచిది”. “పొద్దుట్నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాడు” అది అమ్మ. “పండగ పూట ఇంట్లో పెళ్ళాం పిల్లలతో గడపటం గుర్తుండదు, వాడికి ఫోన్ కొంటా అన్న విషయం గుర్తులేదు, ఆ రవి గాడితో వెళ్లి తప్ప తాగటం మాత్రం తెలుసు” అని అంటూ ప్లేట్ లో అన్నం, కూరా వడ్డిస్తుంది. నాన్న అమ్మ వైపుకి కోపంగా చూసాడు, అమ్మ నావైపు చూసి, “చూసావ్గా, ఫోన్ లేదు ఏం లేదు, పో! పోయి పడుకో పొద్దునే వెళ్ళాలిగా..!” నాకు అప్పటికే బాధగా ఉన్నా కానీ ఆపుకున్నా. అమ్మ ఆ మాట అనగానే ఏడుపొచ్చేసింది. లేచి రూమ్ వైపుగా నడుస్తుంటే నాన్న “అది కాదు, నానీ రేయ్..ఆగు” అంటున్నా కానీ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి గట్టిగా డోర్ వేసా.. నాన్న బైటినుంచి పిలుస్తూనే ఉన్నాడు, “నాని ఏయ్! ఆగు ఇటురా, అని..” వెళ్లి బెడ్ మీద పది ఏడవటం మొదలు పెట్టాను. కొంచెం సేపు ఏడ్చి ముక్కు చీదుకుని ఇంకేం చేస్తాం పాడుకుందాం అనుకునేలోపు గిన్నెలు ఎత్తేసిన చప్పుడైంది. గొడవ పెట్టుకుంటున్నారు.
అబ్బబ్బా ఇప్పుడు ఇదొక్కట్టే తక్కువయింది,” ఇప్పుడు ఆయన ఆమె మీద చెయ్యిచేస్కుంటాడేమో, చిన్నప్పట్నుంచి చాలాసార్లు గోదావయింది, చాలా సార్లు కొట్టాడు అమ్మని. కానీ ప్రతిసారి లేద్దామా, ఆపుదామా అనుకునేలోపు మళ్ళీ భయం.. ఇంకా ఆ చిన్నప్పటి భయం పోలేదు, ఇంకేప్పటికి పెద్దోడిని అవుతానో.. లేద్దాం.. ఒకటో రెండో దెబ్బలు తిని అయినా ఆపుదాం అనుకుంటే కాళ్ళు సహకరించాట్లా, ఒళ్ళంతా వణుకుతుంది, ఇంకా ఏడుపొచ్చింది.
అలా కొన్ని నిమిషాల తర్వాత అరుపులు, తగ్గాయి. డోర్ వేసిన చప్పుడు మెల్లిగా లేచి వణుకుతున్న కాళ్ళతోనే అడుగులేస్కుని వెళ్ళి తలుపు తోసా, ఇల్లంతా అన్నం, కూరలు, చిందరవందర, అమ్మ ఏడ్చుకుంటూ క్లీన్ చేస్తుంది. నన్ను చూసి “ఏం లేదు వెళ్ళి పడుకో” అంది. ప్రతిసారీ అలవాటే ఇది కూడా. తలుపు వేసేసి పడుకున్నాను..ఏడుస్తూ, ఏంటి ఇలా అయిపోయిందే అని ఆలోచిస్తూ, ఎప్పుడు నిద్రలోకి జారుకున్ననో తెలీదు కానీ పడుకున్నాను. తలుపు చప్పుడుకి ఉలికిపడి లేచాను, పక్కన table మీద నా వాచ్ ఉంటె తీసి చూసాను. 1:50 ఆవుతుంది, తలుపు చప్పుడు, “నానీ తలుపు తీయి” “రేయ్..లే” అని, నాన్న.. భయపడుతూనే వెళ్ళి తలుపు తీశాను, నాన్న “ఒకసారి మొహం కడుక్కుని రా.. ఒక అయిదు నిమిషాలు మాట్లాడాలి నీతో” అని మెల్లిగా చెప్పి తూగుతూ వెళ్ళిపోయాడు ఆయన రూమ్ లోకి, వెనుక అమ్మ భయంగా ఉంది, నాన్న వెళ్ళగానే, “ఏం వద్దు.. ఏదో మత్తులో ఉన్నాడు నువ్వెళ్ళి పడుకో” అంది. “లేదు చూద్దాం అసలు ఏంటో, చిన్న దానికి ఇంత గొడవ ఎందుకు చేస్తున్నాడు”. “సరే ఉండమ్మా వస్తా” అని లోపలికెళ్ళా, నిద్ర మత్తుకి కళ్ళు మసకలుగా కనిపిస్తున్నాయి, పైగా కళ్ళకి సైట్ ఉందాయె! వెళ్ళి మొహం కడుక్కుని అద్దాలు వెతుక్కుని పెట్టుకున్నా..నాన్న వాళ్ళ రూమ్ తలుపు తీసా, అమ్మ ఓ మూలకి నిల్చుని ఉంది నాన్నని చూస్తూ.. నాన్న పాత సూట్ కేస్ లో ఏదో వెతుకుతున్నాడు. పిలిచా “నాన్న..” వెనక్కి తిరిగి చూసాడు.. “నువ్వు దా.. కూర్చో” వస్తున్నా అన్నాడు..లోపలి వెళ్ళి కూర్చున్నా ..ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. అమ్మ వైపుకి చూసి “ఏంటి!” అన్నట్టు సైగ చేసాను.. అమ్మ నన్ను చూసి తెలీదు అని సైగ.
రెండు నిమిషాల తర్వాత నాన్న లేచాడు, కొన్ని ఫోటోస్ అనుకుంటా, చేతిలో పట్టుకుని వచ్చి నా పక్కన కూర్చుని నవ్వాడు. ఒక ఫోటో నా చేతికి ఇచ్చాడు, ఇది చూడు, “నా చిన్నపటి ఫోటో” అని ఇచ్చాడు. చూసాను. “అప్పటికి నా వయసు 7 ఏళ్ళు ఉంటాయి so, నా చుట్టు పక్కల, ఇంట్లో ఏం జరుగుతుందో అంతా తెలుసు. అప్పట్లోనే మా నాన్న అమ్మని, నన్నూ తీసుకుని సిటికి వచ్చేసాడు. ఒక బాగా డబ్బున్న వాళ్ళింట్లో వాచ్ మ్యాన్ గా పనిచేసేవాడు. గేట్ పక్కన చిన్న రూమ్ లో మేం ముగ్గురం ఉండేవాళ్ళం..వాళ్ళు విడిచిన తిండి తింటూ బట్టలేస్కుంటూ బ్రతికేవాళ్ళం. చాలా కష్టంగా ఉండేది. ఆరోజు ఆ ఇంటి ఓనర్ వాళ్ళ అబ్బాయి బర్త్ డే. ఫోటోగ్రాఫర్ ని ఇంటికి పిలిపించి ఫోటోస్ తీయిస్తున్నారు. మా అమ్మ మా నాన్నని అడిగింది, పెద్దాయనని అడిగి బుజ్జిగాడికి కూడా ఒక ఫోటో తీయించచ్చు కదా అని. నాన్నకి కూడా తీయించాలనే ఉంది. నాకింకా గుర్తు, ఆయనని అడిగేటప్పుడు నాన్న మొహంలో ఎంత ఇబ్బంది, అవమానమో..కానీ దరిద్రం అలా ఉండేది. అందుకే ఆ ఫోటో లో నా మొహం అంత బాధగా ఉంది. అలానే కిందామీద పడి, ఇంకొకళ్ళ తిండి తింటూ, ఇంకొకళ్ళ బట్టలేసుకుంటూ మెల్లగా చదువైపోయింది. అమ్మ, నాన్న వెళ్ళిపోయారు.
మొదట్లో చిన్నా చితకా ఉద్యోగాలు చేస్కునేవాడ్ని.. అన్ని ఏళ్ళు ఎవరో హెల్ప్ చేస్తే కానీ తినటం, ఎవరివో బట్టలేస్కోటం.. ఎవరైనా ఇచ్చిన చొక్కా వేస్కుంటూ గుండీలు పెట్టుకుంటూ నా చేతులు చూస్కుంటున్నప్పుడు ఎంత ఉక్రోషం వచ్చేదో. కాళ్ళు, చేతులూ బాగున్నా ఇదేం పరిస్థితి నాదీ అని. కానీ తప్పదు. అలానే కిందామీదా పడి ఒక మంచి ఉద్యోగం సంపాదించా, తర్వాత మీ వచ్చింది, తర్వాత మీరు. మొదట్లో కొన్నేళ్ళు కష్టపడ్డా కానీ, తర్వాత పరిస్థితులు బాగుపడ్డాయి. నాలాగా నా పెళ్ళాం, పిల్లలు ఎవరి తిండి తినకూడదూ, ఎవరి బట్టా కట్టకూడదనే కష్టపడుతుంటా..వీలైనప్పుడల్లా బట్టలు కొంటుంటా..నీకు కావాల్సినవన్నీ కొనివ్వలేకపోవచ్చు. నిజంగా ఇప్పటికీ నా పరిస్థితి ఇదే, కానీ ఇంకా కష్టపడతా. నాకుంది మీరే, నాకు చాలా చేయాలనుంది మీకు, మీరు అడకముందే మీకు కావాల్సినవన్నీ ఇవ్వాలనుంది. నాకన్నీ తెలుసు మీకేమేం అవససరమో, ఏం ఇష్టమో మిమ్మల్ని ఎలా నవ్వించాలో, సంతోషంగా ఉంచాలో అన్నీ తెలుసు. నాకు మీ పట్ల బాధ్యత, ప్రేమ, శ్రద్ధ, మీకోసం ప్లాన్స్ అన్నీ ఉన్నాయి, డబ్బొకటే లేదు. ఒక వస్తువు వల్ల మీకేం చేయలేకపోతున్నా, చేతగానివాడ్ని అవుతున్నా...కానీ సంపాదిస్తా, అదొక్కటి వచ్చిన రోజు ఇంకా ఇంకా బాగుంటాం, కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్.
నా ప్రమోషన్ క్యాన్సెల్ అయిపోయింది. అందుకే ఏదో బాధలో ఇలా అయింది అని అమ్మ వైపుకి తిరిగి “సారీ” అన్నాడు. ఇదంతా మాట్లాడేటప్పుడు నాన్న ఏడుస్తూనే ఉన్నాడు. గొంతు వణుకుతూనే ఉంది. అమ్మ ఏం మాట్లాడకుండా హాల్ లోకి వెళ్ళిపోయింది. అది చూసి నాన్న తల కిందికి వంచుకున్నాడు బాధగా.. “సరే నువ్వు కూడా వెళ్ళి పడుకో, సారీ..” అన్నాడు. ఇవాళ్ళ నాన్న, నాన్నలా కాకుండా చిన్నపిల్లాడిలా అనిపించాడు.
తెల్లారింది. లేచి హాల్ లో కూర్చున్నా, నాన్న అప్పటికే రెడీ అయిపోయాడు. నన్ను చూసి, ఏదో ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వి, అద్దంలో చూసి తల దువ్వుకుంటూ “అమ్మ ఇంకా లేవలేదు, లేచాక నేను వెళ్ళానని చెప్పు” అని వెళ్ళాడు. నేను టివి ఆన్ చేసా, ఒక అరగంటకి అమ్మ లేచింది. హాల్ లో జుట్టు ముడేస్కుంటూ వచ్చింది “ఇవాళ కాలేజీకి వెళ్ళకు” అంటూ చిట్టిని లేపుకుని బాత్రూం లోకి తీస్కెళ్లిoది. టివి చూస్తూ టైంపాస్ చేస్తూ లంచ్ టైం అయింది, అమ్మ ఏవేవో వంటలు చేస్తుంది. అన్నీ నాన్నకు ఇష్టమైన వాసనలే. లంచ్ టైం కి బాక్స్ రెడీ చేసి, ముగ్గురం ఆటో ఎక్కాం నాన్న ఆఫీస్ వైపుకి.
ఆఫీస్ ముందు ఆటో దిగాం, అమ్మ మమ్మల్ని రోడ్ కి ఆనుకుని ఉన్న ఐస్ క్రీం షాప్ లో కూర్చోపెట్టింది. రోడ్ దాటి నాన్న ఆఫీస్ బిల్డింగ్ కింద నిల్చుంది, రెండు నిమిషాల తర్వాత నాన్న దిగాడు. నేను గమనిస్తున్నా.. ఇద్దరు మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా, తర్వాత నవ్వటం, మాట్లాడటం మొదలెట్టారు. కొత్త జంటలా సిగ్గుపడుతున్నారు. కోస్సేపటికి నాన్న ఆఫీస్ వైపుకి తిరిగాడు బాక్స్ పట్టుకుని, అమ్మ రోడ్ క్రాస్ చేసి మా వైపుకి వస్తుంది నవ్వుతూ, సంతోషంగా, అందంగా ఉంది అమ్మ అలా. ఇంటికొచ్చి తిన్నాం.. సాయంత్రమయింది. ఈసారి ఆటోని నాన్న బిల్డింగ్ ముందే ఆపాము. నేను దిగి ముందు సీట్ లో కూర్చున్నాను. నాన్న మెట్లు దిగటం చూసి చిట్టిది ఆటో దిగి “నాన్నా..” అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నాన్న దాన్ని వెనుక మమ్మల్ని చూసి సర్ప్రైజ్ అయి అటో దగ్గరికొచ్చాడు. అమ్మ పక్కకి కూర్చుంది. “తొందరగా రండి టైం అయిపొయింది” అంది. నాన్న అయోమయంగా ఆటో ఎక్కి కూర్చుని “ఎక్కడికి” అన్నాడు. “సినిమాకి”, “సినిమాకా? ఇలా సడెన్ గా ఎలా!! నేనేం...” “నానిగాడు మధ్యాహ్నమే వెళ్ళి టికెట్స్ తెచ్చాడు వాడి పాకెట్ మనీ తో.. ఇవాలంతా వాడి ట్రీట్ ఏనట” అంది.
నాన్న అద్దంలో నా మొహం చూసి నవ్వాడు, నేను కూడా నవ్వాను. నాన్న మొహం ప్రశాంతంగా అయిపొయింది. అమ్మ నాన్న దారిపోడువునా ఏవేవో మాట్లాడుకున్నారు. థియేటర్ వచ్చింది, నేను డ్రైవర్ కి డబ్బులు ఇచ్చేసి ఆటో దిగి ముందే నిలుచున్నా నాన్న ఎక్స్ ప్రెషన్ చూద్దామని. నాన్న దిగాడు, అమ్మా దిగింది. ముందర శ్రీ దుర్గా కళామందిర్, చిరంజీవి సినిమా.. ఖైదీ నెంబర్ 150. ముందుగా 50 అడుగుల చిరంజీవి కటౌట్ చూడగానే చిట్టిని ఎత్తుకుని నిలుచున్న నాన్న కళ్ళు మెరిసాయి చిన్నపిల్లాడిలా...
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.