Contributed By Indu Priya
ఓ మనిషి....... ఇంకెంతకాలం.... నాలోన పుట్టావు నా మట్టి పట్టావు నా గాలి పీల్చావు చివరికి... నన్నే హతమార్చావు.......... ఇంకెంతకాలం
ప్రేమనందించాను ఓర్పుతో సహించాను కడదాకా మోసాను చివరికి... పతనమవుతున్నాను......... ఇంకెంతకాలం
నీ కడుపు నింపుటకు మొక్కనై మొలిచాను నీ దాహం తీర్చుటకు గంగనై పారాను నీ ప్రాణం నిలుపుటకు వాయువై తిరిగాను చివరికి... నీ కామవాంఛకు బలియైపోయాను...
ఇంకెంతకాలం ఎంతకాలం గుండెల్లో గునపాలు గుచ్చ్చిన వ్యర్థాన్ని నాలోన కలిపినా బిడ్డలనుకున్నాను నవ్వుతో స్వీకరించాను
అడగలేదే నిన్నేనాడు బదులు తలపలేదే నీకేహాని అసలు తెలియలేదా నా కన్నీటి వ్యధలు చూడలేవా నా అణువణువు రగులు
పీల్చేటి గాలిని త్రాగేటి నీటిని స్వచ్చమయిన ప్రేమని కలుషితం చేసావు విషాన్ని చిమ్మావు
నీడైన చెట్టుని నిండు ప్రాణులని నిర్దయగా నరికావు నేలపై కూల్చావు
నిప్పుల గుండమై రగిలిపోతున్నాను అలసిపోతున్నాను అసలు మోయలేకున్నాను
నీ లోభానికి అంతు లేదా నీ స్వార్థానికి చావు రాదా
లేదు ఇక ఓర్పు నీలో రాదు ఇక మార్పు ఈ పతనమే నీకు నేర్పు ఇకనైనా మారక పోతే మృత్యువే నా అంతిమ తీర్పు ......
ప్రకృతి యొక్క కోపాన్ని చూసిన మనిషి తను ఎంత నేరం చెసాడో తెలుసుకొని పశ్చాతాపంతో వేడుకొంటే .... తప్పులను చేసాము తలదించుతున్నాము తప్పించుకోలేని ఆపదలో చిక్కాము నీ పాద పద్మములే శరణంటు వచ్చాము నీ అభయ హస్తమే దిక్కంటు మొక్కాము మన్నించు మమ్ములను ఓ జగన్మాతా కరుణించి మార్చవా మా తలల రాత శాంతించు శాంతించు ఓ ప్రాణదాతా ఇక పైన దాటబోము నువ్వు గీసిన గీత మా స్వార్థాన్ని అణచేసి మా అహంకారాన్ని కాల్చేసి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాజ్యోతిని వెలిగించి కాపాడరావేమి ఓ జగజ్జనని కడసారి ఆలకించు మా విన్నపాన్ని