Chai Bisket's Story Series: మనసు పలికే మౌన గీతం (Part - 7)

Updated on
Chai Bisket's Story Series: మనసు పలికే మౌన గీతం (Part - 7)
జరిగిన కథ: Part - 1, Part - 2, Part - 3, Part - 4, Part - 5, Part -6 “వీడు మా ఎకనామిక్స్ లెక్చరర్ సుబ్బారావు గారి అబ్బాయి సురేందర్ సార్!” అని గట్టిగా అరిచాను. అమ్మ తన నోటికి చేతులు అడ్డు పెట్టుకుని ఆశ్చర్యంలో అలా చూస్తూ ఉండిపోయింది. “చదువులు చెప్పే వాడికి పుట్టి, ఇలాంటి లోఫర్ పని చేస్తావ్ రా, రాస్కెల్ అని జగదీశ్ వాడి జుట్టు పట్టుకుని ఈడ్చి లాఠీ విరిగేలా కొట్టడం మొదలు పెట్టాడు. ఇంతలో రమేష్ ఒక ఫైల్ తీసుకుని వచ్చి, “సర్ వీళ్ళ బ్లడ్ samples ‘toxicology screening’ చేశాము,అందులో డ్రగ్ కంటెంట్ ఉన్నట్లు తేలింది. వీళ్ళు చేసుకుంది రేవ్ పార్టీ లాగా ఉంది సర్” అని తేల్చేశాడు. తండ్రికి తెలియకుండా తాగుతాడు, తిరుగుతాడు అనే తెలుసు కాని, ఇంత ఘాతుకానికి పాల్పడతాడని నేను కలలో కూడా అనుకోలేదు. నేను వాడి మీదకు ఉరికాను.“ఎంత పని చేసావ్ రా సురేందర్, ఎందుకు చేశావ్ ఇలాగ..” అని మరుగుతున్న రక్తంతో వాడిని గట్టిగా పట్టుకుని కొట్టే ప్రయత్నం చేసాను. అక్కడే ఉన్న ఖాకి లు నన్ను ఆపి పక్కకు తీసుకొచ్చారు.వార్త ఎలా పాకిందో ఏంటో తెలియదు కాని జర్నలిస్ట్లు అందరు స్టేషన్ ని చుట్టుముట్టారు. వాళ్ళను లోపలికి రాకుండా బయట ఉండే గార్డ్స్ అడ్డుపడ్డారు. పరిస్థితి గోలగోలగా తయారయ్యింది. “ఈ మీడియా వాళ్ళ గోల ఇంతా అంతా కాదు కదయ్యా రమేష్, వాళ్ళను లోపలికి రానివ్వకండి, గేట్స్ మూసెయ్యండి అని జగదీశ్ అన్నాడు. రమేష్ మిగతా వాళ్ళందరిని తీసుకుని జర్నలిస్ట్ లు అందరిని స్టేషన్ లోపలికి రానివ్వకుండా అడ్డుపడ్డారు. ఇంతలో అక్కడి ఫోన్ మోగింది. జగదీశ్ వెళ్లి ఫోన్ చేశాడు. " సర్, ఎస్ సర్, అన్ని evidence లు మ్యాచ్ అవుతున్నాయి సర్, ఔను సర్,కోర్టులో ప్రవేశ పెడతాం సర్, ఇక్కడ మీడియా వాళ్ళ గోల ఎక్కువగా ఉంది సర్, ఔను సర్, ఓకే..ఓకే... అలాగే సర్,”అని ఫోన్ పెట్టేసాడు. వాళ్ళున్న రూం లో నుండి మా ఇద్దరినీ పక్కకు తీసుకోచ్చేసాడు. వాళ్ళను మేము కోర్టుకి తీసుకెళ్ళి జడ్జ్ ముందు ప్రవేశ పెడతాం madam, మీరు కోర్టుకి రేపు రావాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మేలు, ఎందుకంటే ఈ మీడియా జనాలు వార్తల కోసం మిమ్మల్ని పీక్కు తింటారు” అని అన్నాడు. మేము ఏమి మాట్లాడలేకపోయము. నాకు కళ్ళలో ఇంకా ఆ నలుగురు, ముఖ్యంగా ఆ సురేందర్ మెదులుతున్నాడు. “వీరి నుండి నేను నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తాను. మీరు ఒక మంచి లాయర్ ని మాట్లాడుకోండి. వీళ్ళను చూస్తూ ఉంటె పలుకుబడినో, డబ్బులనో చల్లి, ఎలాగైనా శిక్ష నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేసేలా కనబడుతున్నారు. శిక్ష రుజువైతే మరణ శిక్ష వరకు వెళ్ళే అవకాశం ఉంది” అని అన్నాడు. ఒక ఖాకి ని పిలిచి మమ్మల్ని మీడియా వాళ్ళ కంటపడకుండా బైటికి పంపే ఏర్పాట్లు చేయమని చెప్పాడు. మా నుండి కాస్త దూరంగా ఉన్న కిటికీ దగ్గరికి వెళ్లి బైట జరుగుతున్న గోలను చూస్తూ జేబులో నుండి ఒక సిగరెట్ తీసి లైటర్ తో వెలిగించుకుని ఆలోచిస్తున్నట్లు నిలబడ్డాడు. ఆ constable లోపలికి వచ్చాడు. అన్నట్లు సైగ చేశాడు. అతన్ని దగ్గరగా పిలిచి ఏదో చెప్పాడు. మమ్మల్ని అతనితో వెళ్ళమన్నాడు..స్టేషన్ వెనుక పక్క నుండి మమ్మల్ని వేరే ప్రైవేటు బండి లోకి ఎక్కించి, ఇద్దరు ఖాకీలను వెంట పంపాడు జగదీశ్. అమ్మ కళ్ళు మూసుకుని బండిలో అలా కూర్చుండిపోయారు. నా కళ్ళలో ఒక పక్క శరణ్య, మరో పక్క సురేందర్ మెదులుతున్నారు. ఒక పక్క బాధ, మరొక పక్క రగులుతున్న కోపం. శరణ్య సురేందర్ కి బాగా తెలుసు. అయినా కూడా అలా చేయడానికి మనసెలా వచ్చింది వాడికి, వాడు మనిషి కాదు, మృగం అని అనిపించింది.ఒక తల్లిని తన కూతురికి కాకుండా చేశాడు. నా ప్రాణాన్ని నాకు దూరం చేశాడు. వాళ్ళను వదలను, న్యాయం ఉన్నంత దూరం వెళ్ళాలి అని ఆ క్షణం అనుకున్నాను.ఇంతలో అమ్మ ఫోను మోగింది. కళ్ళు తెరిచి ఫోను ఎత్తి మాట్లాడుతోంది అమ్మ. మీ సహాయం మేము మర్చిపోలేము అని ఏడుస్తూ బాధగా ఫోను పెట్టేసింది అమ్మ. ఎవరమ్మా? అని ప్రశ్నించాను. దిలీప్ గారు అని అంది. ఏమైంది? అని మళ్లీ అడిగాను. పెదాలు లోపలికి మడిచి కళ్ళు బలంగా మూసుకుని ఏడవడం మొదలుపెట్టింది. నాకు తెలుసుకోవాలనే ఉన్నా, ఆవిడను ఎక్కువగా విసిగించడం భావ్యం కాదేమో అనిపించింది. ఇంతలో కారు ఆగింది. బయటికి చూస్తే ఆ వీధిని చూసినట్టుగా అనిపించింది. కారు దిగి ఇద్దరం నడిచాము. మూడంతస్తుల భవంతి, అదే శరణ్య ఉండే ఇల్లు.అమ్మ ఒంట్లో ఉస్మానియాలో కనబడ్డ అలజడి నాకు మళ్లీ కనబడింది దాని ముందు ఎర్రని బుడగ పెట్టుకుని ఉన్న ఒక అమ్బులన్సు, దిలీప్ గారు కనపడ్డారు. ఇంటి వరండాలో శరణ్య తెల్లని వస్త్రం కప్పుకుని హాయిగా పడుకుని ఉంది. ఆ దృశ్యం దూరం నుండి చూడగానే అమ్మ గట్టిగా ఏడుస్తూ, “శరణ్యా!” అని అరుస్తూ దాని వంక పరిగెత్తారు. నేను మెళ్లిగా, కన్నీటిని తుడుచుకుంటూ, శరణ్య కు దగ్గరయ్యే కొద్ది బరువెక్కుతున్న గుండెతో తన ముందుకి చేరాను. జీవితాంతం పరుగులు తీసే మనిషి, అలుపు లేకుండా కష్టబడతాడు. రాత్రి నిద్ర సరిపోకపోయినా, ఉన్న శక్తి తో పరుగందుకుంటాడు. కాని అన్ని దశలూ దాటి చివరి గమ్యస్థానమైన చావు లో అనంతమైన హాయిని పొందుతాడేమో అనే భావన నాకు శరణ్యను చూస్తే ఆ క్షణం అనిపించింది. వైరాగ్య మేఘాలు ఆ ఇంట్లో ఉన్న మమ్మల్ని కమ్మేసాయేమో అనే భావన నాకు కలిగింది. D.G.P గారు ఇంట్లోకి బయటున్న వాళ్ళు ఎవరూ రాకుండా ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఏర్పాటు చేసారని తెలిసింది. కార్చిచ్చులా ఈ వార్త దేశమంతా పాకిందని కూడా తెలిసింది. ఎవరో ప్రజానాయకులంట, మేధావి వర్గం వారట, శరణ్య ను ఉంచిన గాజు డబ్బా మీదంతా పూలతో నింపేశారు. ఏమి అర్థం కాక ఏడుస్తున్న మమ్మల్ని ఓదార్చే ప్రయత్నమూ చేశారు. పగలు అంత్యక్రియలకు జనాల నుండి ఆటంకాలు ఎదురవుతాయి, ఈ రాత్రే వాటిని ఏర్పాటు చేసానని దిలీప్ గారు నాతో అన్నారు. ఇరవై మూడు సంవత్సరాల పడుచు పిల్ల, ఎండ పడితే కందిపోయే శరీరం గల నా శరణ్య, కిరాతకుల అరాచకానికి, పాడె మీది అగ్ని కీలలకు బలి అవుతుంది అనే ఆలోచనతో, వేదనతో నా మనసంతా నిండిపోయింది. అమ్మాయిని కాని,.అమ్మాయి బంధువులను కాని,కెమెరా లో బంధించ కూడదని పోలీసు వారు మీడియా వారికి 'లా' పాస్ చేశారు. శరణ్యను తీసుకొచ్చిన అదే అమ్బులన్సు లో తనను ఎక్కించి, అమ్మను, నన్ను శరణ్య పక్కనే స్మశానం వరకు కూర్చునేలా ఏర్పాటు చేశారు. నా వంటి మీది వెంట్రుకలన్ని నిక్కబొడుచుకుపోతున్నాయి. శరీరం అంతా స్పర్శ లేని విధంగా మొద్దుబారిపోయింది. నాతో పాటు బైకు ఎక్కి ప్రయాణించిన శరణ్య, తనతో పాటు జీవితమంతా ప్రయానించాలనుకున్న నేను, తను బ్రతికినంత కాలం తోడున్న శరణ్య తల్లి, శరణ్య ఆఖరి ప్రయాణంలో తనకు తోడుగా, తన కొరివికి నిప్పు పెట్టే దాకా వెళతామని ఊహించలేదు. అలా ఊహిస్తే ఇది జీవితం ఎందుకు అవుతుంది! ప్రతి క్షణం ఒక యుగం లా గడిచింది. శరణ్య తల్లి చలనం లేని తన కూతురిని అలా చూస్తూ, తనను ఉంచిన ఆ గాజు డబ్బా మీద తన అశ్రు నయనాలతో దారంతా అభిషేకం చేసింది.ఆ బండి ఆగి, ఇంజిన్ ఆగిపోవడంతో నాకు స్మశానం వచ్చిందని అర్థమైంది. దిలీప్ గారు వెనక డోర్ తెరిచి లోపలికి చూశారు. అమ్మ రెట్టించిన ఆవేదనతో, ఆ గాజు డబ్బా ను గట్టిగా హత్తుకుని ఏడుస్తున్నారు. నేను అమ్మను తీసుకుని బలవంతంగా కిందికి దించాను. ఇద్దరు వ్యక్తులు ఆ డబ్బాను పట్టుకుని కిందికి దించారు. స్మశానం మధ్యలోకి దానిని మోసుకుని వెళ్ళారు. అమ్మ ఆ పెట్టె పక్కనే తన కూతురి మొహం చూస్తూ, ఆ పెట్టె ను తడుముతూ నడుస్తున్నారు.దుంగలను క్రమంగా పరిచారు. గాజు పెట్టెను తెరిచారు ఆ ఇద్దరు వ్యక్తులు. అమ్మ తన కూతురిని పట్టుకుని అలుపు ఎరగకుండా ఏడుస్తున్నారు. రాదు అనుకున్న క్షణం రానే వచ్చింది. అమ్మా ఇక తప్పదు అన్నట్లు దిలీప్ గారు మా ఇద్దరి పక్కన వచ్చి నిలుచున్నారు.అమ్మ తన కూతురి నుదుటి పై చివరి సారిగా ముద్దు పెట్టుకున్నారు. శరణ్య ను ఆ మరణ శయ్య పై పడుకోబెట్టాము. నా కన్నీళ్లు తన చేతి పై కురుస్తున్నాయి. తన అందమైన కళ్ళను వణుకుతున్న నా నా చేతులతో తడిమి, చివరి సారిగా తనను స్మ్రుశించాను. పిడకలతో మొత్తాన్ని కప్పేశారు.శరణ్య రక్త సంబంధీకురాలు అమ్మ ఒక్కటే కనుక, తన చేతిలో నిప్పులు చిమ్ముతున్న కర్రను పెట్టారు దిలీప్. నవమాసాలు మోసి, కనీ పెంచి, మరొక పక్క అదే పిల్లకు పాడె కట్టి దహన క్రియలు చేయాల్సిన కర్మ ప్రపంచం లో ఏ తల్లికి, తండ్రికి రాకూడదు అనిపించింది నాకు ఆ క్షణం.ఆవేదనతో తన కూతురి శవానికి నిప్పు పెట్టలేకపోతున్న ఆమె చేతులకు, నా చేతులు బలం ఇచ్చాయి. ఇద్దరం కలిసి శరణ్య చితికి నిప్పు పెట్టాము. తన శరీరంతో పాటు, తనతో గడిపిన క్షణాలు, తన జ్ఞాపకాలు ఆ నిమిషం అమరమైపొయాయి. చేతులు మొహానికి అడ్డు పెట్టుకుని సర్వం కోలోపోయిన అమ్మ మోకాళ్ళ పై కూర్చుండిపోయారు. నేను కళ్ళారా ఎగిసిపడుతున్న ఆ నిప్పు రవ్వలను చూస్తూ నిలబడిపోయాను. నాలుగు సంవత్సరాల తరువాత… ఆరోజు తో మేము కోర్టుల చుట్టూ న్యాయం కోసం తిరిగిన కాలం నాలుగు సంవత్సరాలు దాటింది. ఈ ఘటన జరిగిన మొదట్లో దేశంలో జరిగిన హడావిడి ఇప్పుడు లేదు. చరిత్రలో ఇలాంటి ఎన్నో ఘటనలు మాయమైపోతాయి. ఈ ఘాతుకానికి పాల్పడ్డ నలుగురు శిక్ష తప్పించుకోవడానికి ఎన్నో పాట్లు పడ్డారు. కింది నుండి పై కోర్టుల దాక అన్ని తిరిగారు. ఎకనామిక్స్ లెక్చరర్ కొడుకు ఒకడు, బంగారు దుకాణం వ్యాపారి కొడుకు ఒకడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకు, నాలుగో వాడు చదువుకోవడానికి పల్లె నుండి వచ్చిన రైతు కొడుకు ఒకడు. ఎవరి స్థాయిలో వారు తీర్పును ఆలస్యం చేయాలనో, లేకపోతే తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేశారు. విచిత్రమేంటంటే ఆ నలుగురి తల్లిదండ్రులు తమ కొడుకులు ఇలాంటి పనులు చేయరనీ, వాళ్ళు అభం శుభం తెలియని పసి పిల్లలని వాదించి, ఏడ్చి ఒప్పించే ప్రయత్నాలు చేశారు. ఎన్ని వాయిదాలు పడ్డా, ఇంత ఆలస్యమైనా సరే తీర్పు రానే వచ్చింది. నలుగురికి మరణ శిక్ష విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ వార్త విని దేశమంతా సంబరపడుతూ ఉండగానే, జైలులో తోటి ఖైదీల దాడిలో సురేందర్ ఘోరమైన చావు చచ్చినట్టు వార్త బయటకు వచ్చింది. న్యాయం కోసం శరణ్య ఫోటోను పట్టుకుని వీధి వీధి తిరిగిన మేము చివరకు గెలిచాము. కాదు కాదు, గెలిపించారు. ఇలాంటి అత్యాచారాలకు గురవుతున్న అమ్మాయిలు అందరిని చేరదీసి వారికి కొత్త జీవితం ఇవ్వాలని నేను అమ్మ నిశ్చయించుకున్నాము. ‘శరణ్య నవజీవన సమితి’ పేరు మీద ఒక సంస్థను స్థాపించి దిలీప్ గారిని దానికి డైరెక్టర్ గా నియమించాము. ఆరోజు, అలా జరిగిన ఆ క్షణం, శరణ్య చావుకు నిజమైన న్యాయం జరిగింది అనిపించింది. శరణ్య లాంటి అమ్మాయిలను మనం ప్రతి రోజు పత్రికలలో, వార్తలలో చూస్తూ ఉంటాము. ఈ కథ అత్యాచారాలకు గురి అవుతూ ఉన్న మన ఆడపిల్లల కథ. ఏ రోజైతే ఇలాంటి ఆకృత్యాల నుండి మన దేశం విముక్తి పొందుతుందో ఆరోజే శరణ్య కు అసలైన నివాళి. కథ సమాప్తం.