Chai Bisket's Story Series: మనసు పలికే మౌన గీతం (Part - 5)

Updated on
Chai Bisket's Story Series: మనసు పలికే మౌన గీతం (Part - 5)
జరిగిన కథ: Part - 1, Part - 2, Part - 3, Part -4 వెనుక సీటులో నేను, అమ్మ ఇద్దరం కూర్చున్నాం. ముందు సీటులో కూర్చున్న ఆ పోలీసు, డ్రైవర్ ని స్టేషన్ కి తీసుకెళ్ళమని చెప్పాడు.బెల్లం చుట్టూ ముసిరిన ఈగల్లాగా జనాలతో నిండిపోయిన ఆ గందరగోళానికి దూరంగా వచ్చిన తర్వాత కాస్త ఉపశమనం అనిపించింది. రహదారి పై ఎన్నో మలుపులు తిరుగుతూ మంచి వేగంతో వెళుతున్న ఆ జీపు పోలీసు స్టేషన్ ముఖ ద్వారంగుండా లోపలికి వెళ్ళింది.ఆయన ముందు సీటులో నుండి వెనక్కి తిరిగి, "Madam ఇక్కడ మా D.G.Pగారు మీకోసం లోపల wait చేస్తూ ఉన్నారు. ఈ కేసు ని ఆయన చాలా serious గా తీసుకున్నారు. మీరు చేయవలసిందల్లా ఆయన అడిగిన వాటికి ఎక్కడా భయపడకుండా, తడబడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే” అని అంటూ కిందికి దిగాడు. ఆయనను అనుసరిస్తూ మేము కూడా ఆ జీపు దిగాము జీపు దిగగానే ధర్మ చక్రం పొదిగి ఉన్న నాలుగు సింహాల విగ్రహం మాకు స్వాగతం పలికింది. మిట్ట మధ్యాహ్నం ఎండ దాని మీద పడి అది మిరుమిట్లు గొలుపుతోంది. ఆ పోలీసు వాడితో కలిసి ఇద్దరం లోపలికి నడిచాము. మెట్లు ఎక్కి రెండవ అంతస్తులో ఉన్న D.G.P కేబిన్ ముందుకు చేరుకున్నాము. మాతో పాటు వచ్చిన పోలీసు మమ్మల్ని అక్కడే ఉన్న కుర్చీల్లో కూర్చోమని చెప్పి, కేబిన్ డోర్ ముందు నిలబడ్డ గార్డ్ దగ్గరికి వెళ్లి మమ్మల్ని చూపిస్తూ అతని చెవిలో ఏదో చెప్పాడు. ఆ గార్డ్ కళ్ళు పెద్దవి చేసి మమ్మల్ని చూస్తూ జాలి, ఆశ్చర్యాలు తన కళ్ళలో నింపుకుని ఇతని తో ఏదో అన్నాడు . సరే అన్నట్టు ఆయన నడుచుకుంటూ మా దగ్గరకొచ్చి నా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. “ఒక ఐదు నిమిషాలు, పిలుస్తారు, నేను మీ పక్కనే ఉంటాను. ఏమి భయపడాల్సింది లేదు, నిజం బైటికి రావాల్సిందే” అని ఒకింత గంభీరంగా అంటూ నా భుజం మీద చేయి వేశాడు. ఇంతలో ఆ గార్డు మా పక్క చూస్తూ లోపలికి వెళ్ళండి అని సైగ చేసాడు. మేము లేచి మాతో పాటు పోలీసుని అనుసరిస్తూ లోపలికి వెళ్ళాము. మా పోలీసు ఆయన ముందు సెల్యూట్ చేసాడు. తెల్లని జుట్టుతో నెరిసిపోయిన ఆ వ్యక్తి మేము చేసిన నమస్కారానికి ప్రతి నమస్కారం చేసి కూర్చోమని సైగ చేశాడు. ఆయన ముందు ఉన్న టేబుల్ మీద ఒకపక్కకు ఏవేవో fileలు ఇంకొక పక్క త్రివర్ణ జెండా, ‘వి.శ్రీనివాసులు Deputy General of Police’ అని తెల్లని అక్షరాల్లో చెక్కబడ్డ ఒక నీలపురంగు Nameboard, గది నిండా అరల్లో పెద్ద పెద్ద పుస్తకాలు కనపడ్డాయి. స్టేషన్ కి రాగానే కనపడ్డ నాలుగు సింహాల బొమ్మ మాకు ఇక్కడ కూడా ఎదురైంది. “ఈవిడ, victim mother Sir, ఈ అబ్బాయి victim friend and classmate sir, incident జరిగిన చోటు నుండి ఈ అబ్బాయే అమ్మాయిని ఆటో లో తీసుకొచ్చి I.H.S లో admit చేశాడు sir” అని చెప్పాడు. ఆయన నా వైపు, అమ్మ వైపు చూసి అర్థమైంది అన్నట్టు తల ఆడించాడు. “మన దేశంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఏ రొజూ అనుకోలేదు. అమ్మాయిల పరిస్థితి మరీ దారుణం గా మారిపోతోందయ్యా దిలీప్ కుమార్. ఇలా చేసిన వారిని encounter చేసి విసిరేయ్యాలి,” అని ఆవేశంగా మాతో పాటు వచ్చిన పోలీసుని చూస్తూ అన్నాడు. ఔనన్నట్టు ఆయన కూడా తల ఆడించాడు. “నేషనల్ మీడియా కూడా ఈ కేసు ని సీరియస్ గా కవర్ చేస్తోందయ్యా. నగరం నడిబొడ్డున ఇలా అవడం తో ఫోకస్ మొత్తం మన డిపార్టుమెంటు మీదే ఉంది... అమ్మా మీరిద్ధరిని ఇలాంటి పరిస్థితిలో కూర్చోబెట్టి ప్రశ్నలు వేయడం సబబు కాదు, అయినా సరే మీరు మాకు co-operate చేస్తేనే నిందితులను పట్టుకోగలుగుతాము” అని అన్నాడు. నేను ఆయనను చూస్తూ, “Sir మేము జీవితంలో ఎప్పుడు ఇంత భయంకరమైనవి చూసింది, ఇంత బాధ అనుభవించింది లేదు సర్. అక్కడ చనిపోయింది మా పిల్ల, ఇక్కడ మాకు ఉన్న బాధ, భయం కంటే జరగాల్సిన న్యాయం చాలా గొప్పది సర్, మేము ఎక్కడికైనా వస్తాము, we are ready” అని స్పష్టం చేశాను. ఇంతలో డోర్ ఓపెన్ అయిన శబ్ధం వినపడింది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఖాకి uniform లో ఒక వ్యక్తి “May I come in Sir?” అని అంటూ నిలుచున్నాడు. “Come in, come in... నేను నీ కోసమే wait చేస్తున్నాను జగదీశ్. అమ్మా మీ కేసు చేస్తున్నofficer ఈయనే. Mr. జగదీశ్, victim's mother and friend” అని మా వైపు చూపెట్టాడు. శరణ్యను వాళ్ళందరూ “victim, victim” అని పిలవడం నాకు అస్సలు నచ్చలేదు. శరణ్య దేనికి victim? దౌర్జన్యానికా, కిరాతకానికా లేకపోతే చెడ్డ కోరికలకా? ఛా! Crime చూసి చూసి వీళ్ళందరి మనసు మొద్దు బారి పోయిందేమో అని లోలోపలే తిట్టుకున్నాను. మా ఇద్దరికీ ఆయన జాలిగా చూస్తూ హలో చెప్పాడు. D.G.P గారు మమ్మల్ని కాస్త బయట వెయిట్ చేయమని చెప్పాడు. మేము బయటకు వచ్చేశాము.అలా కొద్దిసేపు కూర్చుని ఉండగా, జగదీశ్, దిలీప్ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ బయటికి వచ్చారు. హాస్పిటల్ నుండి మాతోనే ఉన్న దిలీప్ మా దగ్గరకొచ్చి “ఇక ఈ కేసు ఇప్పటి నుండి జగదీశ్ గారు handle చేస్తారు. మీకేమైనా problem వస్తే నాకు phone చేయండి. నేనొస్తాను” అని చెప్పి బయల్దేరబోయాడు. మా మనసుల్లోని కృతజ్ఞతా భావాన్ని నేను అమ్మా మా హావభావాల్లో చూపించే ప్రయత్నం చేశాము. ఆయన ‘నేనున్నాను’ అనే భరోసా ఇస్తూ వెళ్ళిపోయారు. “క్రిస్, ఆ టైం లో అదే area లో నువ్వెలా ఉన్నావు? ఆ అమ్మాయి అక్కడ ఆ పరిస్థితి లో ఉందని నీకెలా తెలిసింది?” అని జగదీశ్ ప్రశ్నించాడు. “నేను అదే area లోనే ఉంటాను సర్, అక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాను. ఆ రోజు రాత్రి శరణ్య నన్ను కలవడానికి వస్తాను అని కాల్ చేసింది. అక్కడి bus stop లో కూర్చుని తన కోసం చాలా సేపు ఎదురు చూశాను. కాని తను చెప్పిన టైం దాటిపోయినా ఎంతసేపటికి రాకపోయేసరికి డౌట్ వచ్చింది. అంతలోపల మా ఫ్రెండ్ గణేష్ కాల్ చేశాడు. అర్జెంటు గా రమ్మన్నాడు. తను వస్తే కాల్ చేస్తుంది కదా అని నేను హాస్టల్ కి బయలుదేరాను. హాస్టల్ కి వెళ్ళేదారిలో ఉన్న ముళ్ళపొదల పక్కన తను ఒక విగత జీవిగా కనిపించింది” అని చెప్పాను. “ఓకే...ఓకే...కాని రాత్రి పది గంటలకు మియాపూర్ లో ఉండే శరణ్య గచ్చిబౌలి కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నిన్ను కలవడానికి ఆ టైములో ఎందుకొచ్చింది?” అని తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు. " అదేం లేదు సర్, మామూలుగానే ఉండి ఉంటుంది" అని చెప్పాను. “No no… But it was too late కదా, అంత ఏమి అవసరం లేకుంటే, మామూలుగానే అయ్యుంటే , next day, అదే, ఈరోజు మార్నింగ్ వచ్చి కలిసి ఉండచ్చు కదా?” అని అడుగుతున్నాను. “చూడండి, మీకు నేనడిగే ప్రశ్నలకు జరిగిన incidentకి అస్సలు సంబంధం లేకుండా అనిపించవచ్చు.కాని కొన్నిసార్లు వాటిలోనే మనకు జవాబులు, నిజాలు కనబడతాయి. నేనడిగిన వాటికి బాగా ఆలోచించి జవాబులు చెప్పండి” అని అన్నాడు. ఆలోచించాను. ఆయన అడిగేది కూడా నిజమే కదా అనిపించింది. అప్పటిదాకా blankగా ఉన్న నా తలకి కాస్త పదును పెట్టి ఆలోచించాను. ముందురోజు...కరెక్ట్! “సర్ ముందురోజు నాకు తనకు చిన్న గొడవ అయింది. కోపంతో నాతో మాట్లాడకుండా వెళ్లిపోయింది. మామూలుగా గలగలా మాట్లాడే శరణ్య నాతో ఒక్కసారి అలా మాట్లాడకుండా వెళ్లేసరికి చాలా బాధపడ్డాను. మళ్ళీ కాల్ చేసింది. నేను కూడా కోపంలో ఫోన్ lift చేయలేదు. మళ్లీ చాలా సార్లు కాల్ చేసింది, I am sorry, అని మెసేజ్ పెట్టింది. నా కోపం తగ్గాక మెళ్లిగా కాల్ చేశాను. అప్పుడు తను వస్తాను, బయటకు వెళ్దాం అని చెప్పింది. నేను సరే అన్నాను. కాని చివరికి ఇలా జరిగింది” అని చెప్పాను. “మీ ఇద్దరికీ ముందురోజు జరిగిన గొడవకు కారణం?” అని ప్రశ్నించాడు. ఆయన అలా అడగగానే నాకు గుండెల్లో నుండి బాధ తన్నుకుని వచ్చింది. నేను ఫోను అప్పుడే చేసి ఉంటె, తను అలా ఆ టైం లో నన్ను సంతోష పెట్టడానికి వచ్చుండేది కాదు కదా... ఎంత మూర్ఖంగా చేసాను అనిపించింది. నేను నిశ్శబ్దంగా నిలబడి ఉండటం చూసి ఆయన మళ్లీ అదే ప్రశ్న వేశాడు. “చెప్పు క్రిస్, come on” అని తొందరపెట్టాడు. “ఎందుకంటే ఆ రోజు నేను...తనకు నా love propose చేశాను కాబట్టి” అని గట్టిగా ఏడ్చేశాను.