Chai Bisket's Story Series: మనసు పలికే మౌన గీతం (Part-4)

Updated on
Chai Bisket's Story Series: మనసు పలికే మౌన గీతం (Part-4)
జరిగిన కథ: Part - 1, Part - 2, Part - 3 మమ్మల్ని ఆ పోలీసు లోపలికి తీసుకెళ్ళాడు. మేమిద్దరం ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకుని ఒకరికి ఒకరు మనసులో ధైర్యం చెప్పుకుంటూ లోపలికి నడుస్తున్నాం. గాజు తలుపులు మా ముందు తెరుచుకుని మా వెనుక మూసుకుపోతున్నాయి. గది మధ్యలో తెల్ల కోటులో కళ్ళద్దాలు పెట్టుకుని ఒక తెల్లని వస్త్రం కప్పబడ్డ దాని పక్కన నిల్చుని మా వైపే చూస్తున్నాడు. నాకు చాలా భయమేసింది. బయట పడ్డ అవయవాలన్నీ శవానికి జతచేసాము అని ఆ పోలీసు మాతో చెప్పాడు. ఇద్దరం శవం ముందు వణుకుతూ నిలబడ్డాం. ఆ పోలీసు ఆ తెల్లకోతులోని వ్యక్తికి ఆ తెల్లని గుడ్డని తీయమని సైగ చేసాడు. అతను ఆ గుడ్డని అలా సగం వరకు కిందికి జరిపాడు.శరణ్య ప్రశాంతంగా నిద్రపోతోంది. చిన్న చిన్న గాయాలను వీళ్ళు మూసేశారు. మూసి ఉన్న ఆ కళ్ళు, వెనక్కి కట్టేసున్న తన జుట్టు, పాలిపోయిన తన పెదాలు, కదలిక లేని తన ముక్కు...తనకు చుట్టబడి ఉన్న తెల్లని గుడ్డ.. అంతే... తను ప్రశాంతంగా నిద్రపోతోంది. చావు అంటే ఇదా? కలిసి ఉన్న అందరిని వదిలేసి ప్రశాంతంగా నిద్రపోవడమేనా చావంటే?నాకు నమ్మబుద్ది కాలేదు.తనను పూర్తిగా చూడాలి అనే భావనతో ఆ గుడ్డని కిందికి ఇంకా లాగాలి అని చూశాను. ఆ పోలీసోడు వద్దని వారించాడు. “తమ్ముడు, నువ్వు అక్కడ చూసి తట్టుకోలేవు. అది చాలా భయంకరం, అమానుషం. అన్ని reports మీకు త్వరగా అందేలా చేస్తాము.శవాన్ని అంత్యక్రియలకు పంపే ఏర్పాట్లు చేస్తాము.మేము FIR file చేశాము . ప్లీజ్ ఇక్కడ ఎక్కువ సేపు ఇక్కడ ఉండకండి” అని అన్నాడు. ఆ మాటలు విన్న శరణ్య తల్లి ఎక్కిళ్ళు పెట్టి మరీ ఏడవటం మొదలుపెట్టింది. బ్రతికి ఉన్నాననే కాని, నా మెదడు ఎండిపోయింది, గుండె లయ తప్పింది. కన్నీళ్ళతో నిప్పులు కురుస్తున్న నా కళ్ళు, బాధతో ఏడుస్తున్న శరణ్య తల్లి రోదనలు,శరణ్య మొహాన్ని తడుముతూ.. వణుకుతున్న ఆమె చేతులు.. లోలోపల దహించిపోతున్న మా బాధ హాలాహలంతో ఆ గది నిండిపోయింది. ఆమెను బలవంతంగా బయటకు తీసుకువచ్చిన నేను అలానే కార్ దగ్గరకు తీసుకోచ్చేశాను. నా జీవితంలో ఇది ఒక రక్తపు మరక, కాదు కాదు ,నా గుండెలు చీలి అవుతున్న రక్తస్రావం. ఈ బాధ ఇప్పట్లో ఆగిపోయేదిలా లేదు అనిపించింది. ఒకపక్క మా బాధ లో మేముంటే, మరోపక్క హాస్పిటల్ అంతా ఈ వార్తతో అలజడి వాతావరణంతో నిండిపోయింది. ఎవరు చెప్పారో ఏంటో కాని మైకులు పట్టుకుని పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు, హాస్పిటల్ చుట్టూ ఈగల్లాగా ముసిరారు.మాతో పాటు వచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్ మమ్మల్ని ఆ గందరగోళానికి దూరంగా తీసుకెళ్ళాడు. “మీ పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు, మీ శోకం నేను అర్థం చేసుకోగలను. కాని మీ అమ్మాయికి ఇలా చేసినవారు శిక్ష తప్పించుకుని పారిపోకుండా ఉండాలంటే మీరు మాకు సహకరించాలి. మన దేశంలో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీరు కాస్త ధైర్యంగా ఉండాలి” అని అన్నాడు. ”ఈ రిపోర్ట్ ఫైల్ లో కాస్త సంతకం చేయండి …” అనగానే ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ పెన్ను తీసుకుని సంతకం చేసింది. చేస్తూ చేస్తూనే ఆమె శరణ్య గోస్వామి అని ఆ ఫైల్ లో రాసున్న తన కూతురి పేరుని తన కన్నీటి తో తడిపి, ఆయన చేతిలో ఆ ఫైల్ పెట్టి పక్కకు వచ్చి వెన్ను చల్లబడేలా తన వేదనను తీర్చుకునే ప్రయత్నం చేసింది. “మీ కూతురు జీవితానికి జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదు, అందుకు మీ ఇద్దరి సహకారం నాకు కావాలి. ఇప్పుడు ఏడుపు కంటే తెగింపు చాలా అవసరం”అని మాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. నేను నాలోని బాధను దిగమింగి ఆవిడ దగ్గరకు వెళ్లి పక్కన నిలబడ్డాను. నన్ను గట్టిగా పట్టుకుని వాచిపోయిన కళ్ళతో, అలుపులేని శోకంతో విషాద రాగం ఆలపించింది. తల్లి వేదన, గర్భశోకం అంటే ఏంటో అనాథ అయిన నాకు ఆ క్షణం అర్థమయ్యింది. ఆ పోలీసు మమ్మల్ని ఇద్దరిని ఒక నిస్సహాయ ప్రేక్షకుడిలాగా అలా చూస్తూ ఉండిపోయాడు.మా ఒంట్లో మండుతున్న ఆ మంటలు అతడికి కూడా అర్థమయ్యుంటాయి ఎందుకంటే మా మనోవేదనను మనిషనేవాడు ఎవరైనా అర్థం చేసుకోగలరు. గాయం ఎవరికైనా గాయమే కదా, కాని ఆ గాయం వేడి, ఆ నొప్పి అనుభవించే వాడికే కాదు, ఆ అనుభవాన్ని దగ్గరనుండి చూసేవాడికి కూడా తెలుస్తుంది. ఆ తల్లిని అలా పట్టుకుని కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాను. పోలీసోడు కూడా ఒక పక్కకు మమ్మల్ని చూస్తూ కూర్చుండిపోయాడు. చాలాసేపటి తరువాత, ఇక ఏడ్చే ఓపిక ఆవిడకు నశించిపొయాక, ఆవిడను చూస్తూ, “అమ్మా, తన కోసం మనం ధైర్యం చేయాలి. తను తిరిగి రాకపోయినా తనకు జరిగిన అన్యాయాన్ని న్యాయంతో బదులు చెప్పకపోతే, తను అనుభవించిన ఆ నొప్పికి, strong woman అని మీ పై తనకున్న భావనను వమ్ము చేసిన వాళ్లము అవుతాము”అని అన్నాను. ఎర్రని ఆ కళ్ళ చివర వేలాడుతున్న తెల్లని నీటితో, కను రెప్పలు కిందికి వంచి, ఒక క్షణం నన్నుఅలా దీర్ఘంగా చూసింది. అవే కళ్ళు, శరన్యవి కూడా. “పద క్రిస్, వెళదాం, చేద్దాం, తనకోసం” అని ఆ పోలీసు దగ్గరికి నా చేయి పట్టుకుని నడిపింది.