A Mother Describing The Pain Of Her Children Leaving Her For A Job

Updated on
A Mother Describing The Pain Of Her Children Leaving Her For A Job

Contributed By Leela Prasad Vattikuti

ఒకప్పుడు.... నా ఇల్లు నవ్వులు, వాదనలు, అరుపులు, కేకలు, అల్లరితో హడావిడిగా ఉండేది. ఇల్లంతా పెన్నులు, పుస్తకాలు, ఆట సామాన్లు, మడత పెట్టని దుప్పట్లు, విసిరేసిన చెప్పులు, ఆరేయని తడి తువ్వాళ్ల తో చిందరవందర గా ఉండేది. నా రోజువారీ పని అరవడం, వాళ్ళని కోప్పడ్డం, క్రమ శిక్షణ చెప్పడం, చివరికి అన్నీ నేనే సద్దుకోవడంలా ఉండేది..

ఉదయ రాగం :

పొద్దున్న లేచిన దగ్గరనుండీ అమ్మా నా బ్రష్ ఎక్కడ, అమ్మా నా స్కూల్ బాగ్ ఎక్కడ? నా బూట్ లేసు పోయింది! నా హోమ్ వర్క్ బుక్ పోయింది! హోమ్ వర్క్ చెయ్యలేదు, స్కూల్ మానేస్తాను. ఇవీ మా ఇంట్లో ఉదయ రాగాలు!

నా దినచర్య విసుక్కుంటూనే వాళ్ళ వస్తువులు వెతికి ఇవ్వడం, "మీ వస్తువులు మీరే జాగ్రత్త చేసుకోవాలి, పెద్దవుతున్నారు, ఎప్పుడు నేర్చుకుంటారు?" ఇదే నా అరిగిపోయున రికార్డు.

సంధ్యా రాగం:

"అమ్మా, ఏదైనా పెట్టు, ఆడుకోడానికి వెడుతున్నా,నాకు కొత్త బ్యాట్ కొనాలి, మా ఫ్రెండ్ ఇంటికి వెడుతున్నా" అని వాళ్ళంటే, "చీకటి పడకుండా త్వరగా రావాలి, దెబ్బలు తగుల్చుకోకండి" ఇవే నా గొంతు లోంచి అప్రయత్నంగా వచ్చే మాటలు.

వర్తమానం:

ఇప్పుడు నేను అదే ఇంటిలో... వాళ్ళు అల్లరిచేసిన, కొట్టుకున్న, అరుచుకున్నచోట నిలబడి చూస్తున్నాను. ప్రస్తుతం మా ఇంట్లో నీట్ గా సర్థి ఉన్న పక్కలు, మంచాలు, కొంచెం చిరిగిన, పొట్టి అయిపోయిన బట్టల బీరువాలు, ఖాళీ అలమారాలు. కానీ... అప్పుడు పిల్లలు వాడిన సెంట్ల వాసన మాత్రం గాలిలో అలానే ఉంది.

ప్రతి పిల్లకి, పిల్లాడికి ఒక ప్రత్యేక సువాసన ఉండేది. ఆ వాసనలు ఇప్పటికీ నా ఖాళీ గుండెని నింపుతాయి. ప్రస్తుతం నాకు వాళ్ళ అల్లరి, ఆటలు, ప్రేమతో ఇచ్చిన కౌగిళ్లు, మధుర జ్ఞాపకాలు.

ఈరోజు మాఇల్లు ఎక్కడివక్కడ పొందికగా ఆరేసిన తడి బట్టలు, తెరవాల్సిన అవసరమేలేని చెప్పుల స్టాండు, శాంతిగా, ప్రశాంతంగా ఉంది. కానీ... ఇది నిర్జీవమైన ఎడారి అనిపిస్తుంది.

ఇప్పుడు నేను ఎవరి మీదా అరవక్కరలేదు. ఎవరికీ ఏమీ చెప్పక్కర లేదు. అసలు మాట్లాడ్డానికే మనుషులే లేరు. ఎప్పుడైనా నా పిల్లలువస్తే... నాతో గడిపి వెళ్లిపోతుంటే, వాళ్ళ బ్యాగ్లు సర్థుకుంటుంటే, నా గుండెలు పిండినట్టు అనిపిస్తుంది. వాళ్ళు కార్లు ఎక్కి తలుపులు వేస్తుంటే, "వీధి తలుపులు వేసివెళ్ళండి" అని నేను అరిచిన సందర్భాలు గుర్తుకొచ్చి, కళ్ళ నీళ్లు తిరుగుతాయి.

ఈ రోజు నేనే అన్ని తలుపులు వేసుకుంటూ, తీసుకుంటూ ఉంటే... పిల్లలు రెక్కలొచ్చిన పక్షుల్లా దేశ విదేశాల్లోని వాళ్ళ గమ్యాలు వెతుక్కుంటూ వెళ్లిపోయారు. వాళ్ళు ఎప్పటికీ నాపిల్లలు కాబట్టి... నాతోనే ఉండిపోవాలని నా స్వార్ధం చెబుతున్నా, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు, పిల్లల కోసం వెళ్ళాలిగా ! భగవంతుడా, పిల్లలందరూ ఎక్కడ వున్నా, సుఖంగా, ఆనందంగా, ఉంటూ అభివృద్ధిలోకి వచ్చేట్టు చెయ్యమని రోజూ పూజా మందిరం ముందు కూర్చుని ప్రార్ధించడం తప్ప నేనేమి చేయ్యగలను?

పిల్లలు పెరుగుతూ తమ దగ్గరే ఉన్న తల్లితండ్రులకు నా విజ్ఞప్తి ఏమిటంటే - వాళ్ళు మీ దగ్గర ఉండగానే వాళ్ళ అల్లరి ని ఆనందించండి, ప్రేమని ఆస్వాదించండి, ఆప్యాయత పంచండి, వీలైనంత ఎక్కువ సమయం వాళ్ళతో గడపండి. మీ పెళ్ళికిముందు మీ అమ్మ, నాన్నలతో,అన్న దమ్ములతో, అక్క చెల్లెళ్ళతో గడిపారు. ఇప్పుడు వీళ్ళతో ఆనందించండి. అందరు మాతృమూర్తులకు, పితృ దేవులకు, అమ్మమ్మ, నానమ్మ, తాతలకు ప్రేమతో అంకితం.

(ఇది వాట్సాప్ లో కొంత కాలం క్రితం ఇంగ్లీషులో వచ్చిన, ఒక మంచి సందేశానికి స్వేచ్చానువాదం.) ఆ అజ్ఞాత రచయితకు క్షమాపణలతొో కూడిన కృతజ్ఞతాభినందనలతో..