This Incident From The Life Of Jesus Teaches Us All A Thing Or Two About Morality!

Updated on
This Incident From The Life Of Jesus Teaches Us All A Thing Or Two About Morality!

కొంతమంది వ్యక్తులు నిర్ధాక్షిణ్యంగా కనికరం లేకుండా ఒక మహిళను ఈడ్చుకుంటూ జీసస్ దగ్గరకి తీసుకువచ్చారు. క్రూరత్వం, కోపంతో నిండిన వారు గట్టిగా అరుస్తూ "ఈ పాపాత్మురాలు క్షమించరాని తప్పు చేసింది, వ్యభిచారం చేస్తుంది. ఇలాంటి వారిని ఈ సమాజంలో బ్రతకనిస్తే ఇలాంటి వారు మన సమాజంలో పెరగడమే కాక, ఆ పాపం మనకు కూడా చుట్టుకుంటుంది.. మా ప్రాచీన గ్రంధాలలో వివరించినట్టు దీనిని రాళ్ళతో కొట్టి చంపాలని మేము నిర్ణయించుకున్నాం".

విచక్షణ మరచి ఆగ్రహంతో ఊగిపోతున్న వారిని చూసిన జీసస్ కాసేపు ఏమి మాట్లాడకుండా నిశ్శబ్ధంగా ఉండిపోయారు. ఆ నిశ్శబ్ధంలోనే జీసస్ సమాధానం కోసం, ఆయన ఏం చెప్పబోతున్నారా అని అక్కడున్న వారంతా ఎదురుచూస్తున్నారు. వారు అనుకున్నట్టు జరిగితే అది ఒక హింసా మార్గం అవుతుంది.. కాని ఒక్క ప్రేమ ద్వారానే అందరి జీవితాలలో శాంతి నిలుస్తుంది. ఒకవేళ జీసస్ "వద్దు" ఆమెను చంపకండి.. క్షమించి వదిలేయండి.. అని అంటే ఆ వ్యక్తులు మరింత ఆగ్రహంతో ఊగిపోతారు.. "నువ్వు మా ప్రాచీన గ్రంధాలకు విలువ ఇవ్వడం లేదని వారు అనుకున్నది చేస్తారు". ఒకవేళ వారు అనుకున్నట్టే జరగనిస్తే ప్రేమ ఓడిపోయి, ఒక మనిషి ప్రాణం మాత్రమే కాదు ఇలాంటి ఎన్నో ప్రాణాలు భవిషత్తులో కూడా పోతాయి.. మరి ఇప్పుడు జీసస్ సమాధానం ఎలా ఉండబోతుందని అక్కడున్న వారిలో ఉత్కంటత నిండిపోయింది.

అప్పుడు జీసస్ ఇలా చెప్పారు.. "మీరు చెప్పినట్టు ప్రాచీన గ్రంధాలు సరిగానే చెప్పాయి.. ఆ మహిళను రాళ్ళతో కొట్టిచంపండి".. కాని ఒక్క షరతు "మీ ప్రాచీన గ్రంధం లాంటి గొప్ప శాసనాన్ని అమలు చేసే అర్హత మరొక గొప్ప మంచి వ్యక్తికే ఉంటుంది. కనుక మీలో తప్పు చేయనివారు, వ్యభిచారం చేయనివారు, ఆఖరికి మీ ఊహలలో కూడ వ్యభిచారం చేయని వారు వచ్చి ఈ మహిళ మీద రాళ్ళు విసిరి కొట్టిచంపండి". కాని అది అసాధ్యమని అక్కడున్న వారందరికి తెలుసు వాళ్ళలో ప్రతి ఒక్కరూ ఎవరినో ఒకరిని అల్లరి చేసినవారే, కొంతమంది సమజానికి భయపడి నిగ్రహించుకున్నారు కాని వారి కోరికను మనసులో ఊహించుకుంటున్న వారే.. జీసస్ ఆ షరతు పెట్టగానే అక్కడున్న వారంత ఒక్కసారిగా ఆగిపోయారు. నిదానంగా ఒక్కొక్కరిగా అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతున్నారు. సూర్యుడు అస్తమించేసరికి అక్కడికి చీకటి అలుముకుంది. అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు. అక్కడ జీసస్ ఇంక ఆ మహిళ మాత్రమే ఉన్నారు.

ఆ మహిళ ఒక్క పరుగున జీసస్ కాళ్ళమీద పడి.. అప్పటి వరకు ఆపుకున్న కన్నీటి ప్రవాహాన్ని జీసస్ పాదాల మీద అభిషేఖం చేసింది.. "నన్ను క్షమించకండి, మీకు నచ్చినట్టు నన్ను శిక్షించండి.. నేనొక వ్యభిచారిని.. చేయకూడని పనిచేసిన పాపాత్మురాలిని.. మీరు నాపై చూపించిన కరుణ నేను మాటల్లో వర్ణించలేను. నన్ను శిక్షించండి నేను పాపాత్మురాలిని. తప్పు బురుద మీద కన్నీటి పశ్చాతాపంతో శుభ్రపడిన ఆ మహిళ వంక చూస్తూ జీసస్ ఇలా అన్నారు.. "నేను ఎవరిని నీకు శిక్ష విధించడానికి.? నీకు నువ్వు తప్పుచేశావని తెలిస్తే ఇంకోసారి చేయకు. నీ భగవంతునితో స్నేహం చేయి. నీకు ఒక పని మంచిది అనిపిస్తే ఆ పని చేయి. నీ పనులపై మిగితాది ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. కాని నీకు నిజం అంటే ఏంటో తెలుసు.. ఆ నిజంపై నడక సాగించు..

జీసస్ జీవితంలో జరిగిన ఈ సంఘటన మీరు చాలా సార్లు ఏదో రకంగా విని ఉంటారు ఇందులో మనకి ఎప్పటికి ఉపయోగపడే ఒక గొప్ప నీతి ఉంది. ఒకడు తాను చేసిన తప్పుకు విపరీతంగా బాధ పడుతున్నాడు అంటే వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో అని వాడు తెలుసుకున్నాడు అని అర్ధం. తప్పు చేసి ఆ తప్పు తెలుసుకుని పశ్చాతాప పడ్డవారిపై పగ తీర్చుకోవడం కన్నా అతన్ని క్షమించడమే సరైన పద్దతి. అంతే కాని క్రూరంగా, కోపంతో పగతీర్చుకోవడం అతనికే కాదు, మన ఆరోగ్యానికి, మన భవిషత్తుకి మంచిది కాదు. (ఐనా కూడా అదే తప్పు మరల జరిగితే అది వేరో విషయం) నువ్వు నేను మాత్రమే కాదు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి పొరపాట్లు, తప్పులు చేస్తారు కాని అవ్వే తప్పులు వారు ఎన్నిసార్లు చేశారన్నదే కీలకం. తప్పు చేయడం తప్పు కాదు ఆ తప్పు నుండి ఏమి నేర్చుకోకపోవడమే అసలైన తప్పు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.