ఏంటీ ?? కోతుల కోసం నెలకు రూ. 25,000 ఖర్చు చేస్తున్నారా!! మోహన్ గారిని కొంతమంది చులకనగా చూడవచ్చు.. మరికొంతమంది రూ. 25,000 వేలు అంటే చాలా కోతుల ఆకలి తీరుస్తున్నారని గౌరవించవచ్చు. కానీ మోహన్ గారు పొగడ్తలకు, విమర్శలకు పెద్దగా స్పందించరు. మనిషికి నోరు ఉంది. వారికి అవసరం ఐతే కుటుంబ సభ్యులో, మిత్రులో లేదంటే ప్రభుత్వాలు సహాయం చేస్తాయి.. మూగ జీవుల పరిస్థితి అలా కాదు కదా.. ఈ భూమి మీద అత్యధిక తెలివితేటలు గల జీవి మనిషి. అలాంటి మనిషి జీవులన్నింటి బాధ్యతలను కూడా చూసుకోవాలని మానవత్వం నిండిన మోహన్ గారి తపన.
మోహన్ గారు ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రతిరోజు తాను చేస్తున్న జాబ్ లో భాగంగా హైదరాబాద్ నుండి భూదాన్ పోచంపల్లి వైపుగా ప్రయాణం చేస్తుంటారు. ఆ ప్రాంతంలో కోతుల సంఖ్య ఎక్కువ, అవి వేలల్లోనే ఉంటాయి. చూడడానికి విస్తారంగా చెట్లు ఉన్నా అందులో కోతుల ఆకలి తీర్చే పండ్ల చెట్లు ఉండవు. అందుకే రోడ్డు పక్కన మనుషులు విసిరేసే ఆహార పదార్ధాల కోసం ప్రతిరోజు ఎదురుచూస్తాయి. ఎంత వెతికినా పండ్ల మొక్కలు ఎక్కడా కానరావు కనుకనే కోతులు రోడ్డు పక్కన ప్రతిరోజు వేచిచూస్తాయి. వాటికి అదే ఆహార వేట. ఎవరైనా ఒక్క అరటిపండు విసిరేస్తే 20, 30 కోతులు పండును లాక్కోవడానికి ప్రయత్నించేవి, దీని వల్ల ఆ పండు దేనికి దక్కక, వాటి ఆకలి తీరక, పెనుగులాటలో అటూఇటూ పరిగెత్తడంలో రోడ్డుమీద వెళ్తున్న వెహికిల్స్ ఢీ కొని కోతుల ప్రాణాలు పోయేవి. ఈ సంఘటనలు చూస్తున్న మోహన్ గారికి ఎంతో బాధ కలిగించేది, వాటిని ఆదుకోవడం లేదని, పట్టించుకోవడం లేదని ఒక్కోసారి తాను తప్పు చేస్తున్నాననే భావన కూడా కలిగేది. కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ గారి శాలరీ చాలా తక్కువ ఐన గాని ఉన్నంతలో కోతుల కోసం ఆహారాన్ని అందివ్వడం మొదలుపెట్టారు.
రూ.25,000 వరకు: మోహన్ గారిది చిన్న కుటుంబం. ప్రేమగా చూసుకునే జీవన సహచరి, ఫస్ట్ క్లాస్ చదువుతున్న పాప, థర్డ్ క్లాస్ చదువుతున్న బాబు ఉన్నారు. మోహన్ గారి ఇష్టాన్నీ తమకు ఇష్టంగా చేసుకున్నారు కానీ ఏనాడు అడ్డు చెప్పలేదు. చాక్లెట్ కొనుక్కోమని ఎప్పుడైనా పిల్లలకు ఓ పదిరూపాయలు ఇస్తే ఈ పదిరూపాయలకు కనీసం రెండు పండ్లు వస్తాయి అని పిల్లలు కూడా తమ ఇష్టాలను కూడా తగ్గించుకుని పొదుపుచేసుకున్న డబ్బులను కోతుల కోసం ఉపయోగిస్తారు. ఎప్పుడైతే మోహన్ గారి సంపాదన పెరిగిందో అప్పటి నుండి కోతుల కోసం మరిన్ని ఆహార పదార్ధాలను కొనడం మొదలుపెట్టారు. ప్రతి ఆదివారంతో పాటు, పండుగలు, మరే ఇతర శుభకార్యాల రోజుల్లో నేరుగా ఉదయాన్నే ఆరు గంటలకు పండ్ల మార్కెట్ కు వెళ్లి ఒక టన్ను అన్ని రకాల పండ్లు కొని నేరుగా కోతులకు పంచుతారు. వీటి కోసం నెలకు రూ.25,000 వేలు వెచ్చిస్తున్నారు.
Sign Board కూడా ఏర్పాటుచేశారు: "యాక్సిడెంట్స్" కూడా కోతులు చనిపోవడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి. రోడ్డు మార్గంలో స్కూల్ ఉంటే School Zone అని బోర్డ్ పెట్టి స్పీడ్ తగ్గించడానికి సూచనలిస్తారు. దీనిని ఉదాహరణగా తీసుకుని Monkey Sign బోర్డ్ కూడా మార్గం మధ్యలో అమర్చారు. మోహన్ గారికి భార్య పిల్లల తర్వాత అంత ఎక్కువగా సహకరిస్తున్న వారు ఆటో డ్రైవర్ వెంకటేష్ గారు. ఉదయం 6గంటలకు తనతో పాటు మార్కెట్ కు రావడం, దాదాపు 50కిలోమీటర్లు తనతో పాటు ప్రయాణం చేసి కోతులు ఉండే ప్రదేశానికి చేరుకుని పండ్లను కోతులకు పెట్టడం వరకు వెంకటేష్ గారి సహకారం మరువలేనిది.
కోతులు మనిషి జనరేషన్ కన్నా పూర్వమైనవి. మట్టిలో ఆహారం పడితే ఒక్కో ఇసుక రేణువు తీసివేసి తింటాయి. వాటికి శుభ్రంగా తినడం తెలుసు. ఒకేచోట వెయ్యడం కాకుండా కోతులున్న నాలుగైదు ప్రదేశాలు చూసుకుని భార్య పిల్లలు, మోహన్ గారు ఆహారం వేస్తుంటారు. పిల్లలైనా నాకు అది కావాలి ఇది కావాలి అని మారం చేస్తుంటారు కానీ కోతులు అలా చెయ్యవు, ఇచ్చిన పండుతోనే ఆకలి నింపుకుంటాయి. మోహన్ గారికి కోతులకు మధ్య ఆత్మీయ అనుబంధాన్ని ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ మార్గం మధ్యలో వెళ్తున్నప్పుడు మోహన్ గారి బైక్ సౌండ్ వచ్చినా, విజిల్ వేసినా ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ తన ఆత్మీయ మిత్రుడిని కలుసుకుంటాయి. ఒకరు ప్రేమగా పండును చేతికందిస్తే, మరొకరు కృతజ్ఞతా పూర్వకంగా వాటిని అందుకుని మనిషంటే ఇలా ఉంటాడు కాబోలు అని నిర్ధారించుకుంటాయి.