Meet The MTech Graduate, Who's Running A Xerox Shop On Wheels & Helping People With Employment

Updated on
Meet The MTech Graduate, Who's Running A Xerox Shop On Wheels & Helping People With Employment

ట్రిగ్గర్ పాయింట్: ఖమ్మం తనికెళ్ళ ప్రాంతంలోని ఒక కాలేజీ వారు జాబ్ మేళా నిర్వహించారు. అప్పటికి ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం వెతుక్కుంటున్న అలీష్ గారు సర్టిఫికెట్లు పట్టుకుని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. అతని టాలెంట్ కు తగ్గట్టుగానే అన్ని రౌండ్లు ఫినిష్ చేసి సెలెక్ట్ అయ్యారు. చివరిగా కంపెనీ వారు రెండు జిరాక్స్ కాపీల సర్టిఫికెట్లు అడిగారు. సరే అని చెప్పి కాలేజ్ బయటకు వచ్చి జిరాక్స్ షాప్ కోసం వెతికారు ఎక్కడ కనిపించలేదు. అక్కడి లోకల్ సిటీజన్స్ ను అడగగా పక్కనే ఉంటుంది బాబు అని చెప్పారు.. సరే అని నడుచుకుంటూ వెళితే రెండు కిలోమీటర్ల దూరంలో ఒక జిరాక్స్ ఉంది. హమ్మయ్య ఇప్పటికైనా దొరికిందనుకుంటే అక్కడ కరెంట్ లేదు. కరెంట్ వచ్చే అవకాశం ఉందంటూ అక్కడే సాయంత్రం 4 వరకు ఉన్నారు.. ఇలా తను మాత్రమే కాదు తనతో పాటు ఎందరో జిరాక్స్ కోసం నడిచారు. మొత్తం మీద ఎలాగోలా జిరాక్స్ కాపీలు ఇచ్చారు. కానీ నెలల తరబడి వేచిచూసినా ఆ కంపెనీ నుండి అలీష్ గారికి ఎలాంటి కాల్ లెటర్ రాలేదు. అప్పుడే తనకో ఆలోచన వచ్చింది..

భార్య నగలు తాకట్టు పెట్టి: మనిషి ఎప్పుడైతే కొత్తగా ఆలోచిస్తాడో, అప్పుడే కొత్తగా జన్మించినట్టు.. అని రామకృష్ణ పరమహంస అంటారు. మన సిటీలో చాలా చోట్ల జాబ్ మేళా అని, పోలీస్ రిక్రూట్మెంట్ మొదలైనవి జరుగుతూ ఉంటాయి, అలాగే గ్రామాలలోను పొలానికి సంబందించినవో లేదంటే ఇతర అవసరాల కోసం వారికి పని ఉంటుంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొబైల్ జిరాక్స్ షాప్, ఈ నెట్ సర్వీసులను ఎందుకు మొదలుపెట్టకూడదు అని విపరీతంగా ఆలోచించారు అలీష్ గారు. ఈ ఆలోచనను ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గరి నుండి బయట ఫ్రెండ్స్ వరకు ఎవ్వరూ నమ్మలేదు, మొబైల్ జిరాక్స్ వ్యాన్ సక్సెస్ అవుతుందని ముందుగా నమ్మింది మాత్రం ఇద్దరు కేవలం వ్యక్తులు మాత్రమే.. ఒకరు అలీష్ మరొకరు బ్యాంక్ లోన్ సాంక్షన్ చేసిన బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు గారు. మొదట జిరాక్స్ మెషిన్, ఇన్వర్టర్, కంప్యూటర్, ప్రింటర్ కోసం భార్య నగలు తాకట్టు పెట్టి మరి కొన్నారు. వ్యాన్ కోసం బ్యాంక్ లో లోన్ తీసుకుని క్రిందటి సంవత్సరం మొదలుపెట్టారు, ఊహించినట్టుగానే మంచి సక్సెస్ సాధించింది.

ఎక్కడ జాబ్ మేళా జరిగినా: మాములు సందర్భాలలో జిరాక్స్ షాప్ వారు ఒక ధరతో, జాబ్ మేళా, రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు డిమాండ్ ని బట్టి ధరను పెంచుతారు. అలీష్ గారు ఎక్కడ జాబ్ మేళా జరిగినా అక్కడికి వెళ్తారు కానీ డిమాండ్ ని బట్టి ధర మాత్రం ఏనాడు పెంచరు. ఈ వ్యాన్‌ ప్రస్తుతం ఖమ్మం ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలైన సత్తుపల్లి, వైరా, ఇతర గ్రామాలకూ వెళుతుంది. అలీష్‌ గారికి కష్టమర్స్ తో మంచి అనుబంధం ఏర్పడింది. ఎప్పుడైతే వ్యాన్‌ గ్రామంలోకి చేరుకుంటుందో అక్కడికి రైతులు, మహిళలు, యువత ఆ వ్యాన్‌ దగ్గరకు వచ్చేస్తారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవడానికి చేసుకునే అప్లికేషన్లు, బ్యాంక్‌లోన్‌లు, పాస్‌పోర్ట్‌ అప్లికేషన్లు, ఇతర ఇంటర్‌నెట్‌ కార్యకలాపాలన్నింటినీ ఈ వ్యాన్‌ నిర్వహిస్తుంది. మీరు ఇంట్లో ఉండి షాపింగ్ చేసుకోండి అనే పద్ధతి ఒకానొక సమయంలో హేళనలతోనే ప్రారంభమయ్యింది. అసలు ఈ పద్ధతి సక్సెస్ యే కాదనుకున్నారు. మొదటి అడుగు, కొత్త దారి ఎప్పుడూ అపనమ్మకంతోనే సమాజం గుర్తిస్తుంది. మొబైల్ జిరాక్స్ వ్యాన్ ప్రయత్నం కూడా అలా మొదలయ్యిందే..