మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. మహాత్ముడంటూ ప్రపంచంచే కీర్తింపబడుతున్న మహా వ్యక్తి. జాతి పిత, బాపు అంటూ భారతీయులంతా ప్రేమగా పిలుచుకునే మనిషి. సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య కబంద హస్తాల నుండి భారత దేశ స్వతంత్ర కోసం పోరాడిన ముఖ్యులలో ఒకరు. సత్యం శాంతి అహింసలనే అస్త్రాలుగా మార్చుకొని ఎంతో మందికి స్పూర్తినిచ్చిన మహానుభావుడు. ఏ భారతీయుల కోసమైతే పోరాడాడో అదే భారతీయుల సాక్షిగా, తోటి భారతీయుని చేతిలో హత్యగావింపబడ్డాడు. ఏ తరాల కోసమైతే తన జీవితం అంకితమిచ్చి ఉద్యమిన్చాడో ఇప్పుడు అదే తరంలోని యువత(కొందరి) దృష్టిలో దోషిగా దింపబడుతున్నాడు. కొన్ని అపోహలు, కొన్ని అనుమానాలు కొన్ని అబద్దాలను ఆధారం చేసుకొని గాంధీ పై చులకన భావంతో ఉన్నారు. మహాత్మా గాంధీ గురించి ఆ అనుమానాలని అపోహలని నివృత్తి చేసేందుకే ఈ ఆర్టికల్.
1. గాంధీ వల్లే దేశానికి స్వతంత్రం రావడం ఆలస్యం అయ్యింది. గాంధీ లేకుంటే ఎప్పుడో స్వతంత్రం వచ్చి ఉండేది. భారత స్వతంత్ర తొలి పోరాటంగా భావించే 1857 నాటి తిరుగుబాటు విఫలం అయ్యింది కేవలం ఐక్యత లేకపోవడం వల్లే, 1885 భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు అయనప్పటికీ అది కేవలం ఏడాదిలో మూడు రోజుల సభలకే పరిమితం అయ్యింది అదీ నగరాలలోనే. ప్రజలకి నాయకులకి మద్య అంతరం పెరుగుతూనే ఉంది. అప్పటికే అతివాదులు మితవాద వర్గాలుగా విడిపోయి ఉన్న నాయకత్వం. ఎవరి దారి వారిది ఎవరి తీరు వారిది అన్నట్లుగా ఉన్న ఉద్యమం. 1917 లో గాంధీ తన తొలి పోరాటం చంపారణ్ సత్యాగ్రహం తోనే శాంతి అహింసలనే ఆయుధాలుగా మార్చుకొని సాదించిన విజయం ప్రజలలో ఆయనపైన నమ్మకాన్ని పెంచింది. నాయకులకి ప్రజలకి మద్య ఓ వారధిని చేసింది. అఖండ భారతంలో ఆయన ఎక్కడ సభ నిర్వహించినా జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. అప్పటివరకు ఎవరికీ సాధ్య పడనిది ఆయనకి సాద్యం అయింది. యావద్భారతాన్ని ఒక్క తాటి పైకి తీసుకొచ్చాడు.
రెండో ప్రపంచ యుద్ధం ముందు వరకు కూడా ఎన్ని ఉద్యమాలు ఎన్ని పోరాటాలు చేసినా ఎవరు ఎన్ని దారుల్లో ప్రయత్నించినా బ్రిటిష్ పాలకులు భారతదేశం పై తమ హక్కుని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత మారిన పరిస్థితులు, దేశం లో పెరుగుతున్న వ్యతిరేకత, అంతర్జాతీయంగా మొదలైన ఒత్తిడి, రెండో ప్రపంచ యుద్ధం తదితర కారణాల వల్ల బ్రిటిష్ పాలకులు గత్యంతరం లేని పరిస్థితులలో భారత్ కి స్వతంత్రం ప్రకటించారే తప్ప ఇందులో గాంధీవల్ల జరిగిన ఆలస్యం అనువంతైనా లేదు.
2. రాజ్ గురు సుఖ్దేవ్,భగత్ సింగ్ లకి ఉరి శిక్ష విదించినప్పుడు గాంధీ మౌనంగా ఉన్నారు. గాంధీ వారిని కాపాడే ప్రయత్నం చేయలేదు . గురు సుఖ్దేవ్,భగత్ సింగ్ లకి ఉరి శిక్ష రద్దు చేయమని,వారి శిక్షా కాలాన్ని తగ్గించమని బ్రిటిష్ పాలకులకి గాంధీ ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసారు . ఈ విషయం పై గాంధీ రాసిన లేఖ...
3.గాంధీ సుభాస్ చంద్ర బోస్ కి మద్య ఎన్నో విభేదాలు ఉన్నాయి. సుబాష్ చంద్ర బోసే అసలైన స్వతంత్ర పోరాట వీరుడు. గాంధీని జాతిపిత అని సంబోదించింది, ఆ బిరుదు ఇచ్చింది స్వయంగా సుబాష్ చంద్ర బోసే(1944), అది కూడా గాంధీ ఆశీసులున్న పట్టాభి సీతారామయ్య పై కాంగ్రెస్ అద్యక్ష ఎన్నికలో గెలిచిన తరువాత(1939). బోస్ గాంధీని తండ్రి భావంతో చూసేవారు. గాంధీ అంటే వల్లమాలిన అభిమానం బోస్ కి. ఎంత అంటే బోస్ నెలకొల్పిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఒక బ్రిగేడ్ కి గాంధీ బ్రిగేడ్ అనే పేరు పెట్టేంత అభిమానం ఆయనది. గాంధీ కూడా బోస్ పై పుత్ర వాత్సల్యం తోనే ఉండేవారు. ఈ విభేదం వ్యక్తుల మద్య కాదు, సిద్దాంత పరమైన విభేదం. చేరే లక్ష్యమే కాదు వెళ్ళే దారి కూడా సరైనదై ఉండాలనేది గాంధీ సిద్ధాంతం. బందీగా ఉన్న మాతృభూమికి స్వేచ్చనివ్వడానికి తుపాకీ పట్టడం తప్పేమీ కాదని బోస్ సిద్దాంతం. ఇద్దరి లక్ష్యం ఒకటే, దారులే వేరు. చేతిలో తుపాకీ ఉన్నవాడు గెలవాలి అంటే రివాల్వర్ మీద AK 47 పై చేయి సాదిస్తుంది, దాని మీద మెషీన్ గన్ పై చేయి సాదిస్తుంది, అంతిమంగా పెద్ద తుపాకీ ఉన్నవాడే గెలుస్తాడు ఆ పెద్ద తుపాకీ రాజ్యాధినేత దగ్గరే ఉంటుంది. అందుకే హింస కన్నా అహింసా మార్గమే ఉత్తమమని గాంధీ ఎన్నో సార్లు ఆచరించి చూపారు.
4. గాంధీ దేశ విభజన కోరుకున్నారు. దేశ విభజన ఆపేందుకు గాంధీ చేయని ప్రయత్నం లేదు. జిన్నా కి ప్రదాని పదవి ఇచ్చేందుకు నెహ్రు ని కూడా ఒప్పించారు. కాని అప్పటికే మతాల మద్య మారణ హోమం మొదలైంది, ఇక దీనికి పరిష్కారం విభజన తప్ప మరో దారేది లేదని తేలడంతో గాంధీ సైతం విభజనకి ఒప్పుకోక తప్పలేదు .
5. గాంధీ దళిత వ్యతిరేకి. అంబేద్కర్ గాంధీ ని ఇందుకోరకే వ్యతిరేకించాడు. దళితులు, పంచములు అని సమాజానికి దూరంగా ఉంచబడ్డవారిని వారు హరికి(దేవునికి) ఇష్టమైన వారు హరిజనులు అనే పేరు పెట్టిందే గాంధీ, హరిజనులకి దేవాలయ ప్రవేశాలు వారితో సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలు చేపట్టి తక్కువజాతి వారంటూ ఎవరూ లేరు అని చాటారు. అంబేద్కర్ కి గాంధీ కి దూరం కలగడానికి కారణం, బ్రిటిష్ వారు వేసిన ఒక ఎత్తు. 1930 నాటికే బ్రిటిష్ వారు సమాజాన్ని separate electorate పేరుతో(ఒక వర్గానికి ఎక్కువ ప్రాతినిద్యం ఉన్న చోట ఆ వర్గం వారే ఎన్నికలలో పోటి చేయాలనే నిభందన ) విడగొట్టారు. MacCaulay అవార్డు పేరుతో ఇక మిగిలిన హిందువులలో కూడా దళితులకి కొన్ని స్థానాలు, ఈ కులానికి కొన్ని స్థానాలు అంటూ బ్రిటిష్ వారి Divide & Rule సిద్దాంతాన్ని పాటించారు. దళితులకి అధికార స్థానం వస్తుంది, అభివృద్దికి ఇది తోడ్పడుతుంది అని అంబేద్కర్ నమ్మకం. కాని ఇది కులాల మద్య చిచ్చుగా మారుతుంది, ఇప్పటికే మతాల పేరుతో సమాజాన్ని విడదీసారు, ఇలాగె కొనసాగితే అందరూ సమానులే అనే భావన పోతుంది,సమసమాజం ఏర్పదేమో అనే వాదన గాంధీది. ఇది కూడా సిద్దాంత పరమైన విభేదమే తప్ప వ్యక్తిగత విభేదం కాదు .
6. గాంధీ నే పటేల్ ని తప్పించి నేహ్రుని ప్రధానిని చేసారు. వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉంది ఉండేది. గాంధీ కాంగ్రెస్ పార్టీ నుండి 1934 లోనే వైదొలిగారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ తో గాంధీ కి ఎటువంటి సంబంధం లేదు. ప్రధానిగా ఎవరు ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశం. దీనిలో గాంధీ ప్రమేయం ఏమి ఉండదు. 1945 లో ఎన్నికైన Interim Government లో ఉన్న మంత్రులే దాదాపుగా స్వతంత్ర భారత తోలి మంత్రి వర్గం లో ఉన్నారు. ప్రధాని పదవిలో ఎవరు ఉండాలో నిర్ణయించే అధికారం కాని అవసరం కాని గాంధీ కి లేదు.
7. ఒక చెంప చూపిస్తే రెండో చెంప చూపెట్టడం ఏంటి?? ఇంట్లోకి వచ్చి దోచుకేల్తుంటే చూస్తూ ఊరుకోవాలా?? ఎదురుగా అన్యాయం జరుగుతుంటే చేతులు కట్టుకొని నిల్చోవాలా? ఇదేమి సిద్ధాంతం?? అహింస అంటే పిరికితనం కాదు, శాంతి సహనం అంటే చేతకాని తనం కాదు. అహింసా మార్గంలో నడవడానికే ఎక్కువ గుండె ధైర్యం కావాలి. శిక్షించడానికన్న క్షమించడానికి ఎక్కువ బలం కావాలి. జయించడం అంటే శత్రువు లోని చెడుని సంహరించడమే తప్ప శత్రువుని చంపడం కాదు.
"If there is a Clash Between Cowardice and Violence I choose Violence", న్యాయం కోసం జరిగే పోరాటంలో శాంతి అహింసామార్గాన్నే ఎన్నుకుందాం, కాని మన మంచితనాన్ని చేతకాని తనంగా భావిస్తే మనపై దాడి చేస్తే ప్రతిఘటించడం హింస కానే కాదు. ఇవి గాంధీ చెప్పిన మాటలే . అవసరమైతే ఎదుటివాడ్ని దండించడం లో తప్పులేదు అని సుస్పష్టంగా చెప్పారు. గాంధేయ సిద్దాంతాలను అర్ధం చేసుకోలేని తనం వల్ల, తప్పుగా అర్ధం చేసుకోవడం వల్ల జరిగిన పొరపాటే తప్ప గాంధీ ఏనాడూ పిరికితనాన్ని నూరిపోయలేదు.
గాంధీ బలం ఎంత – ఆగష్టు 15 ,1947 ఎర్రకోట పై త్రివర్ణ జెండా ఎగురుతున్న రోజు, బెంగాల్ లో మత కలహాలతో నెత్తురు ఎరులైపారుతున్న వేళ. చిన్నా పెద్దా, ఆడ మగ తేడ లేకుండా నర మేధం జరుగుతున్నపుడు గాంధీ బెంగాల్ లో పర్యటిస్తున్నారు. ఈ నరమేధం ఆగే వరకు, ఈ అల్లర్లు ఆపే వరకు, ఈ అగ్గి చల్లరేవరకు పచ్చి గంగ కూడా ముట్టను అని 77ఏళ్ళ వయసులో నిరాహార దీక్షకి కూర్చున్నారు. కేవలం రెండే రెండు రోజుల్లో,అప్పటి వరకు ఎదురుపడితే నరుక్కున మనుషులు, కత్తులు పట్టుకున్న చేతులు, గాంధీ ముందు నిలబడి ఆ ఆయుధాలు గాంధీ పాదాల దగ్గర పడేసి శాంతి కోసం పాటుపడతామని హామీ ఇచ్చి దీక్ష విరమించమని కోరారు. వేల సైన్యం చేయలేని పని గాంధీ ఒక్కరు చేసి చూపారు, అది గాంధీ బలం. కాదు గాంధీ మీద ప్రజలకున్న అభిమానం గౌరవం.
గాంధీ గొప్పదనం ఏమిటి – గాంధీ బయటే ఉంటె ప్రజలలో స్వతంత్ర కాంక్ష పెరుగుతుందని ఎదో ఓ కేసులో జైలులో పెట్టేందుకు ప్రభుత్వం కోర్ట్ ని ఆశ్రయిస్తే గాంధీ కి జైలు ఖైదు వేసిన ఆ న్యాయమూర్తే తీర్పు చదివిన తరువాత, పై కోర్టు కనక ఈ శిక్షని తగ్గించి గాంధిని విడుదల చేస్తే సంతోషించే మొదటి వాడిని నేనే అని చెప్పారు. శత్రువు మనసు సైతం గెలుచుకోవడం గాంధీ గొప్పదనం, కాదు అది ఆయన నమ్మిన సిద్దాంతమ్ గొప్పదనం .
గాంధీ సామర్ధ్యం ఏమిటి – రెండు ప్రపంచ యుద్దాలు జరిగిన సమయంలో, శత్రు దేశాలపై అణు బాంబులతో విరుచుకుపడుతున్న కాలంలో కూడా సత్యం, అహింస, శాంతిని ఆయుధాలుగా మార్చుకొని, చేరే గమ్యమే కాదు నడిచే దారి కూడా సరైనదే అయి ఉండాలి అని భావించి , ఎన్నో ఉద్యమాలకు, ఎంతో మంది ఉద్యమకారులకు మార్టిన్ లూథుర్ కింగ్, నెల్సన్ మండేలా, అంగ్సాన్ సూకీ, బరాక్ ఒబామా, స్టీవ్ జాబ్స్ వంటి ఎంతో మందికి స్పూర్తిగా నిలవడం.
అహింస సత్యాగ్రహం వంటి సిద్దాంతాలను నమ్మి ఒక దేశాన్ని ఏకం చేసి పోరాటం సాగించిన ఇలాంటి మనిషి ఒకరు రక్త మాంసాలతో ఈ భూమిపై బ్రతికారంటే రాబోయే తరాలు నమ్మకపోవోచ్చు అని ప్రఖ్యాత శాత్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గాంధీ గురించి చెప్పారు. ఆయన మాటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంతటి గొప్ప మహానీయున్ని, మన అపరిపక్వతతో,తెలిసి తెలియని తనంతో, అవగాహనా రాహిత్యాన్నే మన సిద్ధాంతంగా చెప్పుకుంటూ, ఆలోచించలేని తనాన్ని మన విధానం అని నమ్ముతూ, అర్ధం చేసుకోలేని తనాన్ని అభిప్రాయం అని చెప్పుకుంటూ చులకన చేస్తూ మాట్లాడడం, తక్కువ చేసి చూడడం మనకే చెల్లింది.
అందుకే బాపూ నీ జన్మదినాన క్షమాపణ కోరుతున్నా అందరి తరపున. మన్నించు మహాత్మా మా అజ్ఞానాన్ని, మా అపరిపక్వతని మన్నించు మహాత్మా..