To That Beautiful Girl I Saw In Metro.. A Cute, Real Story

Updated on
To That Beautiful Girl I Saw In Metro.. A Cute, Real Story

రోజు లాగానే ఆఫీస్ కి రావడానికి మెట్రో కోసం ఎదురుచూస్తున్నాను. మూసాపేట్ నుండి అమీర్పేట దిగి, అక్కడనుండి, హైటెక్ సిటీ వెళ్లే మెట్రో ఎక్కాలి.. ఇది రోజు దినచర్య. కానీ ఈరోజు మెట్రో, తనతో పాటు ఒక దేవకన్య ని కూడా తీసుకొస్తుంది అని అనుకోలేదు. మెట్రో అద్దం లో నుండి ఎక్కడ ఖాళి ఉందా అని చూసుకుంటూ పరిగెత్తున్న నన్ను ఒక క్షణం పాటు ఆగిపోయేలా చేసింది తను.. వెంటనే తేరుకుని తను ఉన్న compartment ఎక్కాను.

లేడీస్ కంపార్ట్మెంట్ లో తను, ఆ కంపార్ట్మెంట్ కి ఆనుకుని ఉన్న కంపార్ట్మెంట్ లో నేను , ఇంకో 15 నిమిషాల్లో నేను దిగాల్సిన అమీర్పేట స్టేషన్. ఎమన్నా మాట్లాడదామంటే మా మధ్య గీత లాగ పింక్ రిబ్బన్.. ఏమి చేయాలో తేలిక చూస్తూ ఉండిపోయాను...

పంటి మీద పన్ను ఆ నవ్వు కి ఇంకొంచెం అందాన్ని ఇచ్చింది.. బాగా ఇస్త్రీ చేసిన బ్లూ కాటన్ చుడిదార్, దాన్ని మీద ఒక రెడ్ చున్నీ, తెలీక చూసిందో, తెలిసి చూసిందో, తెలియాలి అని చూసిందో, తెలియదు కానీ అప్పుడప్పుడు కలిసే ఇద్దరి చూపులు. ఆ క్షణం లో నాకు ఏ మాయ చేసావే లో జెస్సీ లా కనిపించింది. అంతమంది అమ్మాయిల లో తను ప్రత్యేకంగా కనిపించడానికి అదే కారణం ఏమో...

ఈ ఆలోచనల్లో ఉండాగానే ఎర్రగడ్డ దగ్గర ఆగింది మెట్రో.. ఈ అమ్మాయి గురించి ఎక్కువ ఆలోచిస్తే పిచ్చెక్కుతుందేమో అని వెంటనే బ్లుటూత్ ఆన్ చేసి, పాటలు వినడం మొదలుపెట్ట.. కానీ ప్రతి పాట తన గురించే పాడుతున్నట్టు అనిపించింది. మొదట్లో "హలొ గురు ప్రేమకోసమే రో జీవితం" వచ్చింది. వెంటనే next కొట్టా, "ఇంకా ఎదో ఇదై పోతావే ఇష్టాన్నే తెలిపేందుకు" అని డార్లింగ్ మూవీ లో పాట వచ్చింది..అందుకే shuffled సాంగ్ వినకూడదని అనిపించి, విసుగొచ్చి పాటలు ఆపేసే సమయానికి ESI Hospital నుండి start అవ్వడం మొదలుపెట్టింది మెట్రో..

ఇంకో ఒక్క స్టేషన్ దాటితే అమీర్పేట వచ్చేస్తుంది. తను అక్కడ దిగచ్చు లేదా వేరే మెట్రో ఎక్కచ్చు, నేను వెళ్లే మెట్రో లో కూడా రావచ్చు.. మూడోది జరిగితే బాగుణ్ణు..

నాకున్న ఈ తక్కువ సమయం లో నేను చేయగలిగేది రెండే రెండు... ఒకటి, ఆ అమ్మాయి తో ధైర్యం చేసి మాట్లాడటం. కానీ అది ఏ పరిణామాలకి దారి తీస్తుందో చెప్పలేను.. ఇంకోటి గమ్మునే అమీర్పేట్ లో దిగేసి నా దారి లో నేను వెళ్లడం. ఈ option.. ఆ అమ్మాయిని ఒక జ్ఞాపకంగా ఉంచేస్తుంది అంతే. సరే ఏం చేస్తాం రెండోదే ఎంచుకున్న..

అనుకున్నట్టే ఆ అమ్మాయి అమీర్పేట్ లో దిగి.. వెళ్ళిపోయింది. బహుశా అక్కడ ఎక్కడైనా course చేస్తూ ఉండచ్చు.. నేను హైటెక్ సిటీ మెట్రో ఎక్కి ఆఫీస్ కి వచ్చి పని చేస్కోవడం మొదలు పెట్టా.. ఆ పని లో పడి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అని కూడా మర్చిపోయా..మళ్ళీ కనిపిస్తే గుర్తుపడతానో లేదో, ఇప్పుడు వచ్చిన feel వస్తుందో లేదో కూడా చెప్పలేను. కానీ తను ఆ అరగంట లో కలిగించిన భావన మాత్రం అపురూపం అది అలానే ఉండిపోతుంది..

ఒక మంచి కల వస్తే కొంతసేపటికి ఆ కల ఏంటి అని almost మర్చిపోతాం. కానీ ఆ కల ఇచ్చే feel అలానే ఉంటుంది.. తను కూడా అలాంటి కలేనేమో.. ఇంత పెద్ద హైదరాబాద్ లో, ఎన్నో వేల మంది ప్రయాణించే మెట్రో లో కల గా కనిపించిన ఓ అమ్మాయి.. చాలా చాలా థాంక్స్ నీకు..