నా చిన్నతనంలో మా ఇంట్లో టీ.వి ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేరయ్యే ఓ అన్న ఒక నోట్ బుక్ పట్టుకుని మా ఇంటికి ప్రతిరోజు వస్తుండేవారు. ఆ న్యూస్ 30 నిమిషాల నిడివి ఉన్నా కాని అందులో దేశ, విదేశాలకు సంబంధించిన విలువైన సమాచారం వివరించేవారు. "ఎండకాలంలో మామిడి పండ్లను అందుకున్నట్టుగా, ఖాళీ సమయాన్ని పుస్తకాలు చదవడం కోసం వినియోగించుకున్నట్టుగా, కాలంతో వచ్చిన ఈ టెక్నాలజీ విప్లవాన్ని మనమూ ఉపయోగించుకోవాలి. వేల సంవత్సరాల నుండి మనిషి నాగరికతతో జీవించడం మొదలుపెట్టిన దగ్గరినుండి లేని టెక్నాలజీ విప్లవం ఈ 20 సంవత్సరాలలో మనం చూడబోతున్నాము.. దీనిని సరైన విధంగా ఉపయోగించుకోవాలి" అని ఆ అన్న(ప్రస్తుతం ఎం.ఆర్.ఓ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగిగా అన్న పనిచేస్తున్నారు) చిన్నతనంలో చెప్పిన మాటలు నాలో బలంగా నాటుకుపోయాయి.. అన్నకు ఇన్ని తెలివితేటలు, ఇంతటి జ్ఞానం రావడానికి కూడా మీడియానే కారణం అని నేను విసుగు చెందకుండా న్యూస్ చూడడం మొదలుపెట్టాను.
కాలానుగునంగా వచ్చే మార్పులను, వస్తువులను సృష్టించడం మాత్రమే కాదు దానిని సరైన విధంగా ఉపయోగించుకున్నప్పుడే మానవ మనుగడ ఉన్నత స్థాయిలో సాగుతున్నది. గత పదిహేను సంవత్సరాల క్రితం మన తెలుగులో ఒక్క న్యూస్ ఛానెల్ కూడా లేదు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ళ కన్నా న్యూస్ ఛానల్లే ఎక్కువయ్యాయి. నాడు కుక్క చనిపోతే చూపించారు, సింహాం చనిపోతే చూపించారు, ఏనుగు చనిపోయినా చూపించారు. కాని ఇప్పుడు మాత్రం కేవలం బలమైన సింహాం చనిపోతే మాత్రమే చూపిస్తున్నారు, అందమైన హంస చనిపోతే మాత్రమే చూపిస్తున్నారు.. 'నల్లని కాకి చనిపోతే మాత్రం ఎవ్వరూ చూపించి చావడం లేదు".
నిన్నగాక మొన్న మధు అనే ఓ అడవిలో బ్రతికే వ్యక్తి అజ్ఞానంతో, ఆకలి కొట్టిన దెబ్బకు తట్టుకోలేక 200రూపాయల ఆహారాన్ని దొంగతనం చేశాడని చెప్పి అక్కడి గ్రామంలోని కొంతమంది వ్యక్తులు బలమైన ఇనుప రాడ్డును తీసుకుని అప్పటికే కొన్ని రోజులుగా అన్నం లేక బలహీనంగా క్షీణించిన మధును విచక్షణా రహితంగా ఒకరి తర్వాత ఒకరు కుల్లబొడిచారు, పైకి అంతగా కనబడకపోయినా లోపలి అవయవాలు ఛిద్రమై ఆకలితోనే చనిపోయాడు. ఇది అత్యంత పాశవికం. ప్రతి మనిషిలోనూ భగవంతుడున్నాడు.. సహాయం చేసేవాడు మాత్రమే కాదు, సహాయం కోసం అర్ధించే వ్యక్తిలోను భగవంతుడున్నాడు.. "మానవసేవనే మాధవసేవ" అని సూక్తులు చెప్పే నా భారతదేశంలో కూడా మధును చంపిన "ఇలాంటి వ్యక్తిత్వం" ఇంకా మనుషులలో ఉండడం ఇది మానవ మనుగడకే గొడ్డలిపెట్టు.
ఇది మధు కుటుంబ సమస్య కాదు దేశ సమస్య.. సాటి మనిషిని క్షమించి మార్చలేని వ్యక్తి "మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై, అని గొంతుచించుకునే అర్హతలేదు".. కనీసం "మా బతుకుల్ని మార్చురా భగవంతుడా" అని వారు కొలవడానికి నైతికతే లేదు. ఇలాంటి అత్యంత పాశవిక సంఘటనల మీద డిస్కషన్ జరగాలి, అక్కడి మనుషుల మనస్తత్వాల మీద జరగాలి.. ఇదే దేశానికి, సమాజానికి ఉపయోగపడే న్యూస్. అంతే కాని శ్రీదేవి గారు ఎలా మరణించారు, శ్రీదేవి గారి మరణం వెనుకు కూతురు, భర్త హస్తం ఉందా? శ్రీదేవి గారి మొదటి భర్త ఎవరూ? ఆ భర్త కొడుకు ఎవరూ? ఆ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరూ? ఆ గర్ల్ ఫ్రెండ్ పెంచుకున్న కుక్క ఏ జాతి? ఇదా న్యూస్..?? నిజానికి శ్రీదేవి గారి మరణం ఎంతోమందిని కలిచివేసింది, బాధతో కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు ఎంతోమంది ఆశ్చర్యంతో ఇంకా వాస్తవాన్ని నమ్మలేకపోతున్నారు.. స్మశానం దగ్గర పుడ్చిపెట్టిన శవాలను కోరపళ్ళతో బయటికి లాగి గోతికాడి నక్కలు శవాలను పీక్కొని తింటాయి ఎందుకంటే అవే కదా వాటి ఆహారం.. నిజానికి నక్కలు ఎంతో నయమనిపిస్తున్నాయి ఎందుకంటే అవ్వైనా చచ్చాకనే తింటాయి ఇలాంటి వారు మాత్రం బ్రతికుండగానే పీక్కొని తింటుంటాయి. ఒకపక్క శ్రీదేవి గారి మరణంతో అత్యంత విషాదంలో ఉన్న కుటుంబ సభ్యుల మీద ఆరోపనలు చేస్తు వారిని మరింత మానసిక క్షోభ పెట్టేవారిని చూస్తే బహుశా నక్కలు కూడా ఈసడించుకుంటాయి కాబోలు..
మధు మరణమే తీవ్రమైనది.. శ్రీదేవి గారి మరణం వ్యక్తిగతం. అది సమాజానికి ఏ విధమైన హానీ కలిగించదు.. లేదా శ్రీదేవి గారి మరణాల మీద అనుమానాలుంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయండి. ఆధారాలతో బయటపెట్టి నిజాలు చెప్పండి. అంతేకాని నాకు నోరు ఉంది, నాకు మీడియా ఉంది అని వాగితూ సమజానికి ఎంతో కీడుచేస్తున్నారు. "బహుశా శ్రీదేవి గారి సుధీర్ఘ కెరీర్ లో నటనతో సంపాదించిన డబ్బు కన్నా ఈ రెండు మూడు రోజుల్లో భారత మీడియా ఎక్కువ గానే సంపాదించి ఉంటుంది". ఒక పక్క సిరియాలో మారణహోమం జరిగి లక్షలాది మంది ప్రజలు, పిల్లలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మని సహాయం చేసే సాటి మనిషి కోసం ఆర్తితో ఎదురుచూస్తుంటే ఇవ్వేమి కనపడవు. ఈ న్యూస్ ఛానెల్స్ యే ఇలా ఉంటే ఇక యూట్యూబ్ Thumbnails గురించి ప్రత్యేకంగా తిట్టుకోవాల్సిన పనిలేదు
ఈ సంధర్బంలో నా జీవితంలోని మరో సంఘటన గురించి వివరిస్తున్నాను. నేను ఈ మధ్యనే ఎం.ఏ సైకాలజీలో జాయిన్ ఐయ్యాను మునపటి కన్నా మనుషుల మనస్తత్వాలను అర్ధవంతంగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాను. రెండు రోజల క్రితం కాకతాలీయంగా యూ ట్యూబ్ లో "చూస్తే షాక్ అవుతారు" లాంటి ఓ ఛానెల్ ఓనర్ నీ కలవడం జరిగింది. కావాలనే మాటల్లో పెట్టి, పద్దతిగా రెచ్చగొట్టి నాకు కావాలిసిన సమాచారం రాబట్టుకోవాలనుకున్నా.. అతను చెప్పిన వివరణకు నేను కూడా షాక్ తిన్నా..
నేను: "మీరు ఇలా పొలిటికల్ లీడర్స్ గురించి, నటుల గురించి గాసిప్స్ చెబుతుంటారు కదా.. ఇదంతా మీకెలా తెలుస్తుంది? మీ మనుషులు ఎవరైనా వారికి సన్నిహితంగా ఉంటారా?
ఆ వ్యక్తి: (నన్ను చిన్నతనంగా చూసి నవ్వుతూ..) అదేం లేదు బ్రదర్, మాకు తెలుస్తాయి. ఇక్కడున్నోడు ఎవ్వడూ మంచోడు కాదు బ్రదర్.. పొలిటీషియన్స్ అందరూ డబ్బులు దొబ్బుతారు, హీరోయిన్లతో పాటు హీరోలు కూడా వ్యభిచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. అంతెందుకు ప్రశ్నిస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ కోట్లు దండుకున్నాడు.. ఏపికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా వస్తుంది కావాలనే లేట్ చేసి ఎన్నికల టైమ్ వరకు ఆగి అప్పుడు డిక్లైర్ చేస్తారు ఎందుకంటే ఓట్లు రావాలని.. ఈ జగన్ కే.సి.ఆర్ కు హైదరాబాద్ లో ఉన్న ఆస్థులన్నీ అప్పజెప్పాడు..
(నాకు కోపం ఎక్కువై మధ్యలోనే కలుగజేసుకున్నా)
నేను: హో అవునా.. మీకెలా తెలుసు మీకు ఎవరైనా చెప్పారా లేదంటే ఆధారాలున్నాయా..?
ఆ వ్యక్తి: ఎవ్వరూ లేరు. నాకు వాళ్ళని చూస్తూనే అలా తెలిసిపోతాయి.!!
ఇది "Open mind, Research, Empathic thinking లేని ఆ వ్యక్తి చెప్పిన మాటలు.. ఓ సామాన్యుడు ఆధారాలు లేకుండా అర్ధం పర్ధం లేకుండా అంటే ఏదైనా అనుకోవచ్చు.. కాని ఒక ఛానెల్ ఓనర్ ఇలా మాట్లాడి తనకు తోచిన న్యూస్ నే నిజమని ప్రజలను మభ్య పెడితే ఎవరికి నష్టం.?
డబ్బు సంపాదించడమే ధ్యేయమైతే ఎలాగైనా సంపాదించుకోవచ్చు. పవిత్రమైన మీడియాలోకి ఇలాంటి నీచులు ప్రవేశించి దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నారు. ప్రజలకు వారి వ్యక్తిగత అనుమానాలను పంచి వారి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. దేశ భవిషత్తుకు నిజమైన ఆటంకదారులుగా నేడు కొన్ని మీడియా సంస్థలు నిజంగా ఎంతో శోచనీయం.
చివరిగా మీడియాకు ఒక్కమాట "మీరు ప్రజలను ఏవిధంగా చూస్తే మిమ్మల్ని ప్రజలు ఆ విధంగానే చూస్తారు. ప్రజలు తెలివైనవారు అని గౌరవం ఇచ్చి వారికి ఉపయోగపడే సమాచారం అందిస్తే మిమ్మలని కూడా వారు అంతే గౌరవిస్తారు.. మీరు ప్రజలను పిచ్చివాళ్ళు అని ప్రవర్తిస్తే మీతో కూడా వాళ్ళు పిచ్చివాళ్ళతో ప్రవర్తించినట్టుగానే ప్రవర్తిస్తారు".