పాటలోని పాఠం; సిరివెన్నల గారు రాసిన "మరి అంతగా" పాట లోని అంతరార్థం - A Short Note

Updated on
పాటలోని పాఠం; సిరివెన్నల గారు రాసిన "మరి అంతగా" పాట లోని అంతరార్థం - A Short Note

Contributed By Raviteja Ayyagari

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, బహుశా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరికీ పరిచయం అవసరం లేని పేరు, ఎవరు మర్చిపోలేని పేరు. ఆయన్ని కలిసినప్పుడు మాములు అభిమాని లాగే నేను కూడా ఆయన పాటల గురించి, ముఖ్యంగా జగమంత కుటుంబం నాది పాట గురించి ప్రస్తావన వస్తే ఆయన, "ఆ పాట అర్థం చేసుకునేంత వయసు నీకు ఉందేంటిరా!" అని ఒక చిన్న నవ్వు నవ్వారు. ఆ తర్వాత ఆయన చంద్రబోస్ గారి ఒక ఇంటర్వ్యూ లో ఆ పాట గొప్పతనాన్ని చెప్పినప్పుడు, నేను కూడా ఒక పాటని రకరకాల కోణాలలో నుంచి ఆలోచించడం మొదలుపెట్టాను. అలా అలోచించి నేను విశ్లేషిస్తున్న పాట "మరి అంతగా మహా చింతగ మొహం ముడుచుకోకలా". ఈ పాట ఆయనకీ నంది పుసరస్కారాన్ని అందించింది. నాకు మహానందాన్ని అందించింది.

ఈ పాట గురించి మాట్లాడుతూ నా శక్తికి మించిన సాహసం చేస్తున్నాను. తప్పులు ఉంటె మన్నించండి.

ఈ పాట ముందర సన్నివేశం, అంజలి గారు (సీత) అద్దంలో చూసుకుని ఏడుస్తూ ఉంటారు. ప్రకాష్ రాజ్ (రేలంగి మావయ్య) గారు చెప్తారు, చుస్కో ఎలా ఉన్నావో అని. అప్పుడు మొదలయ్యే ఆ పాట, సినిమాలో భాగంగా సాగిపోతుంది.

పల్లవి: "మరీ అంతగా మహా చింతగ మొహం ముడుచుకోకలా పనేం తోచక పరేషానుగా గడబిడ పడకు అలా మతోయెంతగ శ్రుతే పెంచగ విచారల విల విల సరే చాలిక అలా జాలిగ తిక మక పెడితే ఎలా"

విశ్లేషణ:: ఈ సాహిత్యం అంజలిగారిని ఉద్దేశించి రాసినప్పటికీ, మనం కనుక గుర్తిస్తే ఈ సాహిత్యం మనందరికీ వర్తిస్తుంది. మనం కూడా కష్టాలు వస్తే ముఖం ముడుచుకుని కూర్చుంటాం. ఎం చెయ్యాలో తోచట్లేదు రా, అని పక్కవాళ్ళని సలహాల కోసం అడుగుతాం. మతిపోతుంది రా! అని అనుకుంటాం, పిచ్చెక్కించకు (మతిపోగొట్టకు) అని పక్కవాళ్ళని కూడా అంటుంటాం. అందరి జాలి పొందాలి అని మన కష్టాలన్నీ నలుగురిలో చెప్పుకుంటాం, నలుగురితో చెప్పుకుంటాం.

"కన్నీరై కురవాల మన చుట్టు ఉండె లోకం తడిసేలా ముస్తాబె చెదరాల నిను చుడాలంటె అద్దం జడిసేలా ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పొతుందా కదా మరెందుకు గోల అయ్యయ్యొ పాపం అంటే ఎదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాలా"

విశ్లేషణ:: మన కష్టాలని నలుగురితో చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? మనల్ని మనం గుర్తించుకోలేనంతగా మారిపోవడం ఏంటి? అయినా ఏడిస్తే కష్టాలు పోతాయి అని భారత రాజ్యాంగంలో రాసి ఉన్నట్టు, ప్రతి చిన్న విషయానికి ఏడుపేనా? ఛ! నాకేంటి ఇలా? నేనేం పాపం చేశాను అని అనుకున్నంత మాత్రాన్న మనకి మంచి జరుగుతుందా?

చరణం 1: "ఎండలను దండిస్తామా వానలను నిందిస్తామా చలినెటో తరమెస్తామా చీ పొమ్మని కస్సుమని కలహిస్తామా ఉస్సురని విలపిస్తామా రోజులతొ రాజీ పడమా సర్లేమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం పూటకొక పేచి పడుతు ఏం సాధిస్తామంటే ఏం చెప్తాం"

విశ్లేషణ:: ఎండా, వాన, చలి, ఇవన్నీ మన ప్రకృతి కి చెందే అంశాలు. అవి మన పరిధిలో ఉండవు. కానీ వాటినే మనం ఎప్పుడు ఏమి ఆనం. మనం గడిపే ఒక రోజుతో కలహాలు (విరోధం), విలాపాలు (విచారం) చూపించం. కానీ, మనతో పాటు వీటన్నిటిని మనలాగే భరించే మనిషితో మనకి ఎందుకు విరోధం? మనిషితో మాట్లాడను (వెంకటేష్ గారి పాత్ర గురించినట్టు, అయన మనుషులతో మాట్లాడే తీరు గురించి వ్యంగ్యంగా రాసినట్టు), వాళ్ళతో నాకు సంబంధం లేదు, వాళ్ళ గురించి ఎదో ఒకటి అంటూ ఉంటాం (రావు రమేష్ గారి పాత్ర బెజవాడ మావయ్య గురించి). ఇవన్నీ చేసి ఏం సాధిస్తాం?

చరణం 2: "చమటలేం చిందించాల శ్రమపడేం పండించాల పెదవిపై చిగురించెలా చిరునవ్వులు కండలను కరిగించాల కొండలను కదిలించాల చచ్చి చెడి సాధించాలా సుఖశాంతులు మనుషులనిపించే ఋజువు మమతలను పెంచే రుతువు మనసులను తెరిచే హితవు వందెళ్ళయిన వాడని చిరునవ్వు"

విశ్లేషణ:: మన పెదవి పైన చిరునవ్వు నవ్వాలి అంటే మనం ఏమి కసరత్తు చెయ్యక్కర్లేదు. సుఖశాంతులు కావాలి అంటే ఆ చిరునవ్వు ఒకటి మొహం మీద ఉంటె చాలు. మనం మనుషులని, మన మధ్య ఉన్నది మమతల కొలువని, మన మనసులని కలిపే వారధిని అసలు అంతం అంటూ ఎరుగని చిరునవ్వే కదా! (ఆ విషయం తెలుసుకున్న ప్రకాష్ రాజ్ గారి పాత్ర, అదే మన రేలంగి మావయ్య పాత్ర అందుకే ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది).

నిజానికి ఈ పాటలోని ఇంకో 2 చరణాలు సినిమాలో కనిపిస్తాయి. వాటిలో నాకు నచ్చిన రెండు వాక్యాలు గురించి విశ్లేషిస్తాను. మహేష్ గారి పాత్ర చిన్నోడు ఇంటర్వ్యూ నుంచి బయటకి వస్తు, ఏడుస్తున్నపుడు వచ్చే ఇంకొక చరణం. పెద్దోడు నడుస్తుంటే కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వచ్చే చరణం, ఇద్దరు తోబుట్టువుల మధ్యలో చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు వచ్చే చరణం,

"బరువు అనుకుంటే బరువు సులువు అనుకుంటే సులువు బ్రతుకెలా వుండాలో నువ్వే తేల్చుకో అనుకున్నవన్నీ అవవు ఎప్పుడూ ఏదో కరువు అందుకీ కమ్మని కలలు సరిచూసుకో వేసవికి మామిడి పళ్ళు వానలకు ఆ హరివిల్లు చలికి ముగ్గుల ముంగిళ్ళు కష్టాలకిలా చిరునవ్వే చాలు చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే .. ఉగాదని అంటాం ఏ కష్టాలైనా వచ్చేపోయే చుట్టాలే అయితే సదా సుఖాలతో వుంటాం"

విశ్లేషణ: జీవితం మనం ఎలా అనుకుంటే అలానే ఉంటుంది. మన కష్టం ఒక నొప్పి అనుకుంటే నొప్పి ఎప్పుడు ఉంటుంది, ఆలా కాకుండా ఒక తీయటి జ్ఞాపకం అనుకుంటే సులువుగా ఉంటుంది. నిజానికి చిన్నోడి పాత్ర సినిమా అంత అవతల వాళ్ళ ముందర వెటకారంగా నవ్వుతుంది. కానీ అతను ఇచ్చిన ఇంటర్వ్యూ లో నిజంగా నవ్వితే అది నకిలీ నవ్వు అని అంటారు. మనం అనుకున్నవి అన్ని అయిపోతే అది జీవితం అవ్వదు, ఎప్పుడు ఎదో ఒక వెలితి ఉండే ఉంటుంది. అలాంటప్పుడే మన చిరునవ్వుతో (కమ్మని కలలరూపంలో) మనం వాటిని దాటొచ్చు. వేసవి కాలంలో ఎండలకు మామిడి పళ్ళు ఎంత ఆనందాన్ని ఇస్తాయో, వర్షాకాలం లో హరివిల్లు ఆనందాన్ని ఇస్తుంది, చలికాలంలో వచ్చే సంక్రాంతి గొబ్బెమ్మ ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కష్టాలలో నీకు చిరునవ్వే ఆనందం ఇస్తుంది. చెడుని మనం ఇష్టంగా తినేది ఉగాది రోజే. అలాగే జీవితం లో కష్టం అనేది తాత్కాలికం మాత్రమే అన్న విషయం తెలుసుకుంటే మన జీవితం సుఖ సంతోషలతోనే నిండిపోతుంది. ఈ చరణం అంతం అయ్యే సమయంలో పెద్దోడు కాలర్ సరి చేసుకోబోతు ఆగిపోతాడు. అంటే, మనం అనుకున్నవి అన్ని అవ్వవు. కొన్ని కొన్ని సార్లు ఉన్నవాటితోనే సంతృప్తి చెందాలి.

నిజానికి, ఈ ఒక్క పాట, ఈ చిత్ర కథని తెలుపుతుంది అని చెప్పటానికి నేను ఏ మాత్రం సంశయించను. రెండు కుటుంబాలు, వాళ్ళ మధ్యలో బాదం ఒక పంతంతో కూడిన ప్రయాణం, ఒక పేచీతో కూడా పయనం లా సాగుతుంది. ఒక కుటుంబంలో కూడా ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. చిరునవ్వు విలువ తెలిసి, ఆ చిరునవ్వుతోనే కష్టాలన్నీ మాయం చేసుకోగలం అనే తండ్రి, వ్యతిరేక ఆలోచనలు కలిగిన అన్నదమ్ములు, వాళ్ళ పరిస్థితి చూసి ఏమి చెయ్యలేని పరిస్థితి లో తల్లి, మరదలు, చివరికి మనిషి ని ప్రేమించడం, చిరునవ్వు విలువ గొప్పతనం చెప్పే సినిమా, ఆ సినిమాని ఒక పాటలో చెప్పే పాట.

ఒక మధ్య తరగతి కుటుంబంలో ఉండేయ్ ప్రతి చిన్న ఆనందం, ప్రతి చిన్న విషయం గురించి చాలా గొప్పగా చూపిస్తూ, ఆ నేపథ్యంలో సాగేయి పాట. తేగలు, జాంపళ్ళు తినడం, రిక్షా లో తిరగడం, డబ్బులు నేనిస్తాను అంటే నేనిస్తాను అనడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మధ్య తరగతి కుటుంబంలో చాలా విలువైన క్షణాలు. అలాంటి క్షణాలతో మనలాంటి వాళ్ళు కూడా సంబంధం ఉంటుంది.