A Movie Lover's Heartfelt Note About Phanindra Narsetti, 'Manu' & Its Beauty

Updated on
A Movie Lover's Heartfelt Note About Phanindra Narsetti, 'Manu' & Its Beauty

ఆరేళ్ళ క్రితం యూట్యూబ్ ని పిచ్చిపిచ్చిగా వాడుతున్న రోజులు. అలా పైపైన స్క్రోల్ చేస్తున్నప్పుడు కనిపించింది "Backspace" అనే లఘు చిత్రం. అప్పటి నా మస్తిష్కం ప్రకారం సినిమాలు, లఘు చిత్రాలు అంటే కేవలం ప్రేమ, జనాల ఎమోషన్స్ తో ఆడుకునే మాధ్యమాలు మాత్రమే. కానీ Backspace చూసిన తర్వాత ఎవరు తీసారో గుర్తించుకోలేదు కానీ అసలా ఆలోచన ఎలా వచ్చిందబ్బా అని ఓ రెండ్రోజులు ఆలోచించా అంతే.

అలా ఇంకో రెండేళ్లు గడిచాయి ..... కాలేజీ హాస్టల్ లో మంచి టాక్ వచ్చింది "మధురం" అనే మరో లఘు చిత్రం గురించి. వెంటనే ఉన్న పనులన్నీ మానుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూస్తున్నప్పుడు అసలా సంభాషణలు ఇంత మధురం గా ఎలా రాసాడు రా అనిపించింది. లఘు చిత్రం మొదటిలో "తను ప్రేక్షకులకు తిరుగులేని నటి ఐతే అభిమానులకు గర్భగుడి లేని దేవత" అని సావిత్రి గారి ఔన్నత్యం గురించి చెప్తున్నప్పుడు, "ప్రపంచం లో ఎప్పుడూ దాహమేసినప్పుడు బీరు గురించో షాంపైన్ గురించో ఆలోచించడు, నీళ్ళే తాగుతాడు" వంటి మనసులో ఇముడుపోయే సంభాషణలు చెప్తున్నప్పడు ఎందుకో ఎక్కడో ఇది నేను చుసిన లఘు చిత్రాల్లో ది బెస్ట్ అనిపించింది. కానీ ఈసారి సంభాషణలు తో పాటు "ఫణింద్ర నర్సెట్టి" అనే పేరుని గుర్తించుకున్నా.

ఇంకో రెండేళ్లు గడిచాయి ...... ఫేస్బుక్ లో చూసాను. ఇతను ఒక చిత్రం తీస్తున్నారు అని తెలిసింది. ఆరోజు నుండి ఈరోజు సినిమా చుసిన ముందు వరకు ఎప్పుడెప్పుడు చూస్తానా , మళ్ళీ ఎప్పుడెప్పుడు ఆ సంభాషణలు వింటానా అని ఎదురుచూసా. లఘు చిత్రం లోనే ఇంత పరిణామం లోనే అంత లోతైన, మనసుకి హత్తుకునేగా రాసారంటే, ఇంక సినిమా లో ఎలా చూపిస్తారో, ఏం చేస్తారో అని ... సినిమా కలర్స్ , సౌండ్స్ ఇలా వచ్చిన ప్రతీది చూసి ఇంక సినిమా ఎలా ఉన్నా చూసేయ్యాలి అని నిర్ణయించుకున్నా .

సినిమా చూసిన తర్వాత ఒక్కటే ఆలోచన. ఒక కళ (Art ) ని , ఒక ప్రేమ (Love) ని ఇంత అందం గా ఇంకెవ్వరైనా చూపించగలరా అని. మనం రోజూ చూసే సినిమాల్లో సాహిత్యం (పాటలు) ఎలాగనో ఉంటుంది. సాహిత్యం తో పాటు కొన్ని వాటిలో మనకి నచ్చుతాయేమో అనే భ్రమ లో సినిమా వాళ్లు పెట్టిన ఫైట్ సీన్ లు. "సాహిత్యం " స్థానం లో "కళ" ని పెట్టారు, "ప్రేక్షకులు ఎలాగైనా చూస్తారు లే" అనే భావన నుండి "ప్రేక్షకులు చూడాల్సినది" అనే భావన కి తీసుకొచ్చారు.

ఇంగ్లీష్ లో "Eternal" అంటే "చావు లేనిది", "కాలం తో సంబంధం లేనిది" అని మాత్రమే తెలుసు కానీ, ఎక్కడా కూడా కళ్ళకి కట్టినట్టు చూడలేదు ఒక్క "మను" లో తప్ప. "కళ" కి, ప్రేమ కి కాలానుబంధం ఉండదు అని మర్చిపోలేనంత గా చూపించారు. "ప్రకృతి లోనే సమాధానం దొరుకుతుంది అని సముద్రపు అంచున నడిపించారు.... దానికి అనుకున్నట్టు కనిపించే ఆకాశం.... ఈ రెండిటికి ఉన్న ఓర్పు మనకి కావాలి" అని చెప్పారు. "Solitude(ఏకాంతం)" లో మనకి జవాబు దొరుకుతుంది అని ఒక విశ్వాసం నింపారు. "స్వార్ధం తో సంబంధం లేని నిజమైన ఇష్టాన్నే ప్రేమ అంటారు" అని ఎంత మధురం గా చెప్పారో, ప్రేమ అంటే ఇంద్రియాలకు ( 5 Senses - చూపు, వినికిడి, రుచి, వాసన , స్పర్శ ) సంబంధించినది అని ఇంకా మధురం గా చూపించారు. అసలు మనసు పెట్టి చూడాలే కానీ మనకి తెలియని, తెలిసినా తప్పు గా అర్థంచేసుకున్న వాటికన్నింటికీ "మను" లో సమాధానం దొరుకుతుంది.

సంభాషణలా (dialogues ) అంటే అదీ కాదు, పోనీ ఫిలాసఫీ ఆ అంటే అస్సలు కాదు. నిక్కచ్చి గ చెప్పాలంటే అవి "ఒకరి మనస్సుల్లో ఉన్న భావాలని మన మనస్సుల్లో పెట్టడం". ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమైనా ఉంది అంటే అది కేవలం అందులో ప్రధానాంశం గా చూపించిన "కళ(Art)" గురించి. ఒక కళాకారుడు (Local Artist అని ట్రైలర్ లో వినిపించే పదం) గా తనకి కళలని తన కళ్ళతో కళాత్మకం గా చూడటం మాత్రమే తెలిసిన వాడు మను. నుదిటి మీద కుంకుమ పెట్టినప్పుడు, అతని మనస్సులోని కళ ఎంత ఉన్నతమైనదో, తన ఆలోచనలు ఎంత శుభ్రమైనవో చెప్పచ్చు. అదే కళ కి ప్రేమ తోడైతే ఎలా ఉందొ సినిమా చివరిలో ఊహించనంతగా విడమరిచి చెప్పారు.

సినిమా లో ఉన్న కలర్ పరిణామం గురించి వర్ణించలేం. ఒక నిబద్ధత, ప్రతీ ఫ్రేమ్ లో ఒక ఆకర్షణ, ఒక నిగూఢమైన ఆలోచన, ఒక స్థిమితం ఇచ్చే గుణం ..... ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఇమిడి ఉన్నాయి. ఒక సన్నివేశానికి తగ్గట్టు కలర్, దాన్ని వెంటాడే సంగీతం. ఈ సంగీతం మీరు సినిమా చూసి ఇంటికి వెళ్తున్నపుడు కూడా వెంటాడుతుంది. ప్రతీ ఫ్రేమ్ లో నేపధ్య సంగీతం గురించి చెప్పాలంటే "చాలా బాగుంటుంది" అనేది చిన్న పదం అవుతుంది.

ఏళ్ళ తరబడి హైబ్రిడ్ కూరగాయలతో వండిన వంట తిన్నా మనకి ఆర్గానిక్ పద్దతి ప్రకారం గా పండించిన కూరగాయలతో వండిన వంట ఈ మను చిత్రం. సినిమా లో ఒక్కోసన్నివేశానికి క్రమ బద్ధం గా , రంగు పరంగా, సంగీతం పరంగా ఎలా తీర్చిదిద్దాలో నేర్పించే అపురూపమైన చిత్రం....... చివరికా ఇది ఒక "మను"స్ఫూర్తిగా తీసిన సినిమా!