అమ్మ నేర్పిన కమ్మనైన భాష తెలుగు. తెలుగులో వర్ణించినంత అందంగా, తెలుగులో పొగిడినంత గర్వంగా మరే ఇతర భాషలో ఉండదనిపిస్తుంది. అది హాస్యమైన, వెటకారమైన, ఏ భావమైన తెలుగువారికి "తెలుగు" వారి శరీరంలో ఒక అవయవంగా మారిపోయింది. ఈ సాంప్రదాయమే భవిషత్తులోను కొనసాగాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ముందుకు రావడం నిజంగా తెలుగు వారందరూ ఆనంద పడాల్సిన విషయం. రాష్ట్రాలుగా విడిపోక ముందు ఇరు ప్రాంతాల మధ్య సవాలక్ష మనస్పర్ధలుండేవి కాని విడిపోయాక అభివృద్ధి విషయంలో పోటినే కాని తెలుగు వారి మధ్య కాదని మరోసారి నిరూపణ అయ్యింది కాకపోతే ఈసారి మన తెలుగు భాష విషయంలో..
తెలుగు లోనే: అవును.. విద్యార్ధి తన మాతృభాషలో చదువుకుంటేనే స్పష్టంగా అర్ధమయ్యి చదువులోను, జీవితంలోను ఉన్నతంగా ఎదగగలరు అని ఎంతోమంది శాస్త్రవేత్తలు చెబుతుంటారు, ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఖచ్చితంగా తెలుగును ఒక పాఠ్యంశంగా పాఠశాలలో భోదించాలని ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారు నిర్ణయం తీసుకోవడం వల్ల పిల్లలకు మాత్రమే కాదు మన తెలుగు భాషకు మరెంతో భవిషత్తు ఉండబోతున్నది. అంత మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రమంతటా తెలుగు భోదించే పాఠశాలలకు, కాలేజీలకు(ఇంటర్మీడియట్) మాత్రమే అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు.
అకాడమీ పుస్తకాలు మాత్రమే: తెలుగు పాఠ్యంశం ఖచ్చితంగా బోధించాలని అనగానే తమకు నచ్చిన పుస్తకాలు అని కాకుండా సాహిత్య అకాడమి వారు రూపొందించిన పాఠ్య ప్రణాళికలో ఉన్నవి మాత్రమే బోధించాల్సి ఉంటుంది.
ప్రైవేట్ ఆఫీసులలో కూడా: అలాగే ఇంత వరకు ప్రభుత్వ ఆఫీసులలో మాత్రమే తెలుగు అక్షరాలలో దర్శనమిచ్చిన బోర్డులు ఇక నుండి ప్రైవేట్ సంస్థలు, ఆఫీసులలో కూడా తెలుగు బోర్డులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. (తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో కూడా రాసుకోవచ్చు)