నాకు తెలిసిన మంచు లక్ష్మి గారు..
నాలుగైదేళ్ల క్రితం హీరో మనోజ్ పుట్టినరోజు వేడుకకి వెళ్ళాను..అక్కడ చాలా మంది నటీనటులు, డైరెక్టర్లు, టెక్నిషియన్స్ వచ్చారు..పార్టీ జోరుగా జరుగుతోంది.. నేను కూడా హీరో రవితేజ అండ్ బ్యాచ్ తో మీటింగ్ పెట్టాను..హలో పోలో లన్నీ అవుతున్నాయి.. ఫుల్ జోష్ లో ఉన్నారందరూ..నేను కూడా పార్టీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నా..సడన్ గా డైరెక్టర్ బి. గోపాల్ గారు నాదగ్గరికి వచ్చి ‘ఏమ్మా తినేద్దామా?” అన్నారు..నాకేమో కాసేపు అక్కడే ఉండి మ్యూజిక్ కి డాన్స్ చేస్తున్న వాళ్ళని చూడాలని, ఇంకో బీరేద్దామని, ఫ్రెండ్స్ తో కాలక్షేపం చెయ్యాలని ఉంది..కానీ అడిగింది పెద్దాయన..సరే అనుకుని “ఎక్కడ సర్ డిన్నర్?” అన్నాను.. ” పైన ” అన్నారు గోపాల్ గారు..ఇద్దరం పైకెళ్లాం..అప్పటికి టైమ్ రాత్రి 8.30 అంతే..అక్కడ తినడానికి ఎవరూ రాలేదు.. పార్టీ ఎంజాయిమెంట్ కొచ్చి ఆ టైంలో బుద్దున్నోడెవడు తింటాడు చెప్పండి.. వడ్డించేవాళ్ళు కూడా ఇద్దరే ఉన్నారు..సరే ఆకలి లేకపోయినా ఆయనకి కంపెనీ ఇవ్వాలి కాబట్టి నేనూ తిందాం అని ప్లేట్ తీసుకున్నా..
అక్కడ ఇంకో చోట 10 మంది చిన్న చిన్న పిల్లలున్నారు..నిక్కర్లు సరిగ్గా లేక, చింపిరిజుట్లు, చీమిడి ముక్కులుతో ముచ్చటగా ఉన్నారు..అసలు అలాంటి పార్టీలో ఇలాంటి అవతారాలని కిలోమీటర్ దూరంగా పెడతారు..కానీ వాళ్లందరికీ ప్రేమగా వడ్డిస్తూ ” ఒరేయ్ నువ్వు అది వేసుకో” ” ఓయ్ బుడ్డీ నువ్వు ఈ చికెన్ తినవే” అంటూ క్లాస్ మేట్స్ తోనో, చుట్టాల పిల్లల్తోనో మాట్లాడుతున్నట్టు ప్రేమగా తిండి పెడ్తూ కనిపించింది మంచు లక్ష్మి గారు..నేను రెండు నిమిషాలు షాకై, షేకై అటూ ఇటూ చూశాను..మీలాగే నాకూ డౌట్ వచ్చింది..కెమెరాలు, ప్రెస్ జనం ఎవరూ లేరు..ఎందుకంటే సెలబ్రిటీస్ ఇవన్నీ పబ్లిసిటీ కోసమే కదా చేసేది..మరి ఈవిడేంటి?? అనుకుని కడుపుబ్బరం ఆగక ఆడిగేసా..” మీరెంటిక్కడ?” అని డొంకతిరుగుడుగా..లక్ష్మి గారు నవ్వి ఆ పిల్లల్ని చూపిస్తూ ” వీళ్ళిద్దరూ మా అపార్ట్మెంట్ వాచ్ మాన్ పిల్లలు, వీళ్లంతా ఈ బుడ్డోళ్ల ఫ్రెండ్స్..ఆ ఎదురుగా ఉన్న బస్తీ లో ఉంటారు..మనందరం తినేసాక వీళ్ళకి ఫుడ్ మిగలదేమో అని ముందే పెట్టేస్తున్నా ” అన్నారు..
ఒక్కసారిగా నా కళ్ళముందు ఆవిడ గొప్పతనం, మంచి మనసు కనపడలేదు..మనమే కనపడ్డాం..మనందరం..మీరూ, నేనూ, వాళ్ళూ, వీళ్ళూ అందరూ..ఎందుకంటే మనకి ఆవిడ పైన జోకులు, ఆవిడ తెలుగు పైన సెటైర్ లు తెలిసినట్టుగా, ఆవిడేంటో తెలీదు కదా!!
ఈరోజు మంచు లక్ష్మి గారి పుట్టినరోజు అట..శుభాకాంక్షల కంటే నాకెందుకో ఆవిడకి థాంక్స్ చెప్పాలనిపిస్తుంది..
…లక్ష్మీ భూపాల