Here's The Unimaginable Transformation Journey Of Keerthy Suresh For Mahanati!

Updated on
Here's The Unimaginable Transformation Journey Of Keerthy Suresh For Mahanati!

మహానటి సావిత్రి గారి తిరుగులేని అందాన్ని, భారతీయ మహిళ విద్వత్తును తెలియజేసే ఆ పొందికైన చీరకట్టుని, కోటి భావాలను తెలియజేసే ఆ కళ్లను, నక్షత్రాలను కురిపించే ఆ మధురమైన నవ్వును, ఎన్. టి.ఆర్, నాగేశ్వరరావు గార్ల కన్నా మిన్నగా దక్షిణ భారతదేశంలో వెలుగొందిన ఆ వైభవాన్ని నాతో సహా నేటి యువత ఎవ్వరమూ చూడలేకపోయాం. సావిత్రి గారి పాత్ర కోసం వెతుకుతున్న దర్శకుడు నాగ్ ఆశ్విన్ గారి మదిలో కీర్తి సురేష్ రూపం ఎవరు చిత్రించారో తెలియదు కాని సినిమా విడుదల తర్వాత నుండి "మహానటి సావిత్రి" అనే పదం వినగానే వెంటనే మనకు మొదట ఆ సావిత్రి గారు స్పురణకు వస్తే ఆ వెనువెంటనే కీర్తి సురేష్ కూడా మనసులోకి దూసుకువస్తుంది. 10 సంవత్సరాల పిల్లల దగ్గరి నుండి 100కు చేరువ అవుతున్న పెద్దల వరకు కూడా సావిత్రి గారి పాత్రలో కీర్తి అద్భుతంగా నటించి.. కాదు కాదు జీవించింది అంటూ ప్రేమపూర్వక ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.. తెర మీద సావిత్రి గారిని చూశాము, అలాగే తెర మీదకు సావిత్రిలా మారడానికి కీర్తి సాగించిన ప్రయాణాన్ని ఒక్కసారి నెమరువేసుకుందాం..

"సావిత్రి గారి పాత్రలో నేను నటిస్తున్నాని తెలియగానే కీర్తి ఏంటి సావిత్రి గారి పాత్రలో.. అని చాలామంది అనుమానపడ్డారు. నిజానికి నాకు కూడా నా మీద అనుమానం ఉంది. ఇక ప్రేక్షకులు అనుమానపడటంలో తప్పేముంది.?" -కీర్తి సురేష్.

1. ఏంటి కీర్తి సురేష్ హా..!! ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా జరుగుతుండగానే తరువాతి సినిమా సావిత్రి గారి జీవితచరిత్రను ప్రేక్షకులకు తెలుపుదాం అని అనుకుంటుండగానే ఆ పాత్రలో ఎవరు సూట్ అవుతారా అని నాగ్ ఆశ్విన్ ఆలోచనలో మునిగిపోయాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దగ్గరినుండి సౌత్ ఇండియన్ హీరోయిన్స్ వరకు అందరిని సావిత్రి గారితో పోల్చడం మొదలుపెట్టారు. సావిత్రి గారి పాత్రకు స్టార్స్ కాదు ఆమె పోలికలకు దగ్గరిగా ఉన్న మంచి నటి ఐతే బాగుంటుందనుకున్నాడు. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ మదిలోని ఊహకు భౌతిక రూపం ఇవ్వగలదు అని భావించి ముందు కుటుంబ సభ్యులకు వివరించారు. అశ్వినీదత్ గారికి పూర్తి నమ్మకం వచ్చేసింది. స్వప్న, ప్రియాంక లకు మాత్రం అర్ధం చేసుకోవడానికి కాస్త సమయం పట్టింది. కీర్తిని కలిసి "కథ Explain చేశాక ఇన్ని Variations ఉన్న పాత్రను నేను చెయ్యగలనా.?" అని కీర్తి కూడా మొదట భయపడింది. కాని టీం సభ్యులు "మీ మీద మాకు నమ్మకం ఉందని" ఒప్పించారు. కథ ఒప్పుకున్నప్పుడు కీర్తికి ఉన్న భయమే సినిమా విడుదల తర్వాత వచ్చిన ఇన్ని ప్రసంశలకు కారణమయ్యింది.

"కీర్తి సావిత్రి పాత్రలో నటించలేదు, జీవించింది."- రాఘవేంద్రరావు గారు.

2. మొదటి టెస్ట్ షూట్: దేవదాసు సినిమాలోని పార్వతి గెటప్ లోనే కీర్తిని మొదటిసారి సావిత్రి గారిలా చూసినది. అప్పటివరకు నాగ్ ఆశ్విన్ విజన్ మీద అందరికి విశ్వాశం ఉంది.. ఐతే కీర్తి సావిత్రి గారి పాత్రలో ఎలా ఒదిగిపోగలదు అనే మీమాంస మాత్రం కీర్తి దగ్గరినుండి ప్రతి ఒక్కరిలోనూ తొణికిసలాడుతూ ఉంది. డ్రెస్సింగ్, కాస్ట్యూమ్ విషయంలో మాత్రమే కాదు హావభావాలు, బాడీ లాంగ్వేజ్ విషయంలోనూ ఫస్ట్ టెస్ట్ షూట్ నుండే కీర్తి యూనిట్ సభ్యులను ఆనందంతో కూడిన ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పుడే కీర్తితో పాటు యూనిట్ సభ్యులందరికి బలమైన నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు కదిలారు.

"సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఎక్కువగా షూటింగ్ స్పాట్ లోకి రాలేదు. మొదటిసారి కీర్తిని శశిరేఖ గెటప్ లో చూశాను. కీర్తి అలా నడుచుకుంటూ వస్తుంటే సావిత్రి గారిని చూసినంత పులకింతకు లోనయ్యాను. సావిత్రి గారి సినిమాను సావిత్రి గారే వచ్చి చేసినట్టుంది." - రచయిత సాయిమాధవ్ బుర్ర గారు.

3. ప్రతిరోజూ మూడు గంటలకు పైగా మేకప్: సావిత్రి గారి పాత్ర అంటే మామూలు విషయం కాదు. దక్షిణ భారతదేశంలోని అగ్రనటులందరితో నటించి అగ్రనటిగా వెలుగొందారు. సావిత్రి గారి వ్యక్తిత్వం కూడా ఎందరికో ఆదర్శం. కీర్తి మేకప్ విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించింది. ప్రతిరోజూ సావిత్రి గారిలా మారడానికి మనసును శరీరాన్ని మార్చుకుంది. మేకప్ రూమ్ లో సావిత్రి గారి ఫోటో పక్కన పెట్టుకుని చీర కట్టు, బొట్టు, కాటుక, సావిత్రి గారి హెయిర్ స్టైల్ లా కనిపించడానికి తన జుట్టును కాస్త కర్లీ హెయిర్ గా మార్చుకోవడం, ఒక్కోసారి ప్రత్యేకంగా తయారుచేసిన విగ్ ను ఉపయోగించడం.. ఇలా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసి కెమెరా ముందు సావిత్రి గారిలా జీవించడానికి కెమెరా వెనుక సావిత్రి గారిలా మారిపోయారు, Perfectionకై తపన పడ్డారు.

"సావిత్రి గారిలా కీర్తి సురేష్ చేసిన Performance నేను చూసిన బెస్ట్ Performanceలో ఒకటి. కేవలం Copy Pasteలా కాదు సావిత్రి పాత్రకు ప్రాణం పోసింది కీర్తి". - ఎస్.ఎస్. రాజమౌళి గారు.

4. తల్లిదండ్రులు, విజయచాముండేశ్వరి గారి ప్రోత్సాహం: మహానటి సినిమా నుండి మాత్రమే కాదు కీర్తి చిన్నతనం నుండే సావిత్రి గారి సినిమాలను చూసి పెరిగింది. కీర్తి అమ్మ మేనక గారు తమిళ్ లో మంచి నటి. ఒక సీనియర్ నటిగా సావిత్రి గారి నటన మీద వారికి అవగాహన ఉంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది అని తెలిసిన దగ్గరినుండి మరింత క్షుణ్ణంగా సావిత్రి గారిని పరిశీలించమని సజెస్ట్ చేసేవారు. అలాగే సినిమా కోసం సావిత్రి గారి ఎడమచేతి వాటం, చీరకట్టుకునే విధానం మొదలైన విషయాలు వివరించేవారు. ఇక తన తల్లి పాత్రలో కీర్తి నటిస్తుందని తెలియగానే సావిత్రి గారి కూతురు విజయచాముండేశ్వరి గారు కథ విషయంలో, పాత్ర విషయంలో ఎన్నో విలువైన సూచనలిచ్చారు. సావిత్రి గారు వయసుకు తగ్గట్టు పూర్తి జీవితంలో సుమారు నాలుగు రకాల బొట్లు పెట్టుకునేవారు. నిలువు బొట్టు, గుండ్రని బొట్టు, ఇంట్లో ఉన్నప్పుడు విభూది ఇలా.. ఒక్కోసారి కాస్ట్యూమ్ డిజైనర్ సూచించినా మరింత Perfectionకోసం సావిత్రి గారి కూతురు విజయచాముండేశ్వరి గారికి కాల్ చేసి అన్ని వివరాలను కూలంకుషంగా తెలుసుకునేది.

"షూటింగ్ స్పాట్ లో ఒక్కోసారి సడన్ గా చుస్తే కీర్తి అమ్మలాగే కనిపించేది. అమ్మ గుర్తుకువస్తే తన దగ్గరికి వెళ్ళిపోతాను, హగ్ చేసుకుంటాను. Keerthi is my cute little mom".- విజయచాముండేశ్వరి గారు.

5. ఒక్కోసారి 30 టేకుల వరకూ: సావిత్రి గారి కెరీర్ లో చిర స్థాయిలో నిలిచిపోయే సినిమా మాయాబజార్. మాయాబజార్ సెట్ కోసం100 మంది 20 రోజులపాటు శ్రమపడ్డారు. అంతే కాదు కీర్తి వేసుకున్న ఆ ఒక్క డ్రెస్ తయారికే మూడు నెలల సమయం పట్టింది. ఇక నగల తయారీకైతే ఆరు నెలలు. మాయాబజార్ సినిమా కోసం ఆ మహానటి సావిత్రి గారు అలవోకగా నటించి ఉంటారు. నాడు సావిత్రి గారు వొలికించిన ముఖకవళికలను ప్రదర్శించడానికి కీర్తి విపరీతంగా శ్రమ పడింది. ఒక్కోసారి చిన్న షాట్ కోసం కూడా 30 టేకులు తీసుకోవాల్సివచ్చేది. కీర్తి సావిత్రి గారిని మనస్పూర్తిగా ప్రేమిస్తుంది కనుకనే ఎన్ని టేకులు తీసుకోవాల్సి వచ్చినా కేవలం Perfectionకోసం మాత్రమే ఆలోచించేది.

"మనం తినే ప్రతి మెతుకుమీద తినేవాడి పేరు రాసుంటుంది. అలాగే సావిత్రి గారి పాత్రమీద కేవలం కీర్తి సురేష్ పేరు మాత్రమే రాసి ఉంది. కీర్తి వందకుకు వందశాతం ఆ పాత్రకు న్యాయం చేసింది".-నటుడు రాజేంద్రప్రసాద్ గారు.

6. నా తల్లి: సావిత్రి గారు మొదటిసారి బిడ్డకు జన్మనిచ్చే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు ఆరోజు. " అమ్మ నాకు ఎలా జన్మనిచ్చిందో చూడడం కోసం" విజయచాముండేశ్వరి గారు అక్కడికి చేరుకున్నారు. అమ్మ పాత్రలో లీనమై కీర్తి చేసిన నటనకు కూతురు విజయచాముండేశ్వరి గారి కళ్లు కన్నీళ్లతో వర్షించేవి. షూటింగ్ తర్వాత కీర్తి దగ్గరికెళ్ళి "నా చిన్ని తల్లి" అని అభినందిస్తూ మరోసారి ఆత్మీయంగా పలుకరించేవారు.

"నెలలపాటు కలిసి షూటింగ్ చేసిన మాకే వెండితెర మీద చూస్తున్నప్పుడు కీర్తి మా కీర్తి యేనా లేదంటే సావిత్రి గారా అని చాలా సందర్భాలలో అనిపించేది". - స్వప్న దత్.

7. ట్రాజెడి సన్నివేశాల్లో: మహానటి షూటింగ్ జరుగుతున్నంత కాలం పాటు కీర్తికి సంపూర్ణ నిద్ర లేదు. రిహార్సల్స్, కాస్ట్యూం సూట్ అవుతుందా లేదా తదితర పనులలో నిత్యం బిజీగా గడిపేది. కొన్ని ట్రాజెడి సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు "ఈ డబ్బు, ఫేమ్ అంతా దేనికోసం.? ఏదో ఒకరోజు వదిలిపెట్టాల్సిందే కదా" అనే వాస్తవం కీర్తికి ఆ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడే అర్ధమయ్యింది. సావిత్రి గారి వ్యక్తిగత సంఘటనలు మాత్రమే కాదు ఆ సమయంలో కీర్తి మనస్తత్వం కూడా సన్నివేశాలకు అదనపు బలం చేకూర్చేవి.

"ముందు ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక కాస్త భయం తగ్గింది. టీజర్ వచ్చాక మరికాస్త తగ్గింది. సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆశీర్వాదాలు, ప్రశంసలు వెల్లువెత్తుతుండడంతో ఆ భయం పూర్తిగా తగ్గిపోయింది. పడ్డ శ్రమ చిటికెలో మాయమైపోయింది." -కీర్తి సురేష్.

8. టైట్ బ్లౌజ్ వల్ల చేతులు రంగు మారేది: నాటి సావిత్రి గారి పాత్ర కాబట్టి వేషధారణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఒక్కోసారి చిన్ని లోపం కూడా పెద్ద తప్పుగా పరిణమిస్తుంది. ఆ రోజుల్లో బ్లౌజ్ ఫిటింగ్ చాలా టైట్ గా ఉండేది. సినిమాకు ముందు కీర్తి ఇంతటి టైట్ బ్లౌజ్ వేకుకోకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరిగేదికాదు. కొన్నిసార్లు షూటింగ్ పూర్తైన తర్వాత కాస్ట్యూమ్ విప్పేసి చూసుకుంటే చేతులు గ్రీన్ కలర్ లోకి మారిపోయి ఉండేది.

"కీర్తి సురేష్ Performanceని నేను మాటల్లో వర్ణించలేకున్నాను. బహుశా సావిత్రి గారే ఆమెతో అలా చేయించారేమో". - జూనియర్ ఎన్.టి.ఆర్. గారు

9. లిక్విడ్ డైట్: ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే కీర్తి ప్రొస్థటిక్ మేకప్ కోసం ప్రతిరోజూ సుమారు 3 గంటలకు పైగా శ్రమించేది. సమయం కూడా తక్కువ. ఒక్కసారి మేకప్ కాస్ట్యూమ్ వేసుకుని సావిత్రి గారిలా మారిన తర్వాత బయటకు రాకూడదు. షూటింగ్, మేకప్ కే సమయం ఎక్కువగా వెచ్చించాలి, మరింత సమయం కోసం కీర్తి లిక్విడ్ డైట్ మాత్రమే తీసుకునేది.

"అమ్మాయి నుంచి అమ్మాడిగా, అమ్మాడి నుంచి అమ్మగా ఎంత అద్భుతంగా అభినయించావు. నువ్వు నిజంగా మహానటివి.. మొండిఘటానివి..." - జాగర్లమూడి క్రిష్ గారు.

10. 11 రోజులపాటు డబ్బింగ్: సావిత్రి గారి లాంటి నిజ జీవిత పాత్రను పోషించాలంటే పాత్రను ఆత్మతో అనుభవించి శరీరంతో అభినయించాల్సి ఉంటుంది. కీర్తి ఇందుకోసం అన్ని విషయాలతో పాటు డబ్బింగ్ విషయంలోనూ కేర్ తీసుకుంది. మరెవరో చెబితే వాస్తవికత లోపిస్తుందని డబ్బింగ్ కూడా తనే చెప్పింది. సావిత్రి గారి జీవితంలో వివిధ స్టేజెస్ కు తగ్గట్టుగా తనని తానూ మార్చుకుంది. వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్ డిక్షన్ సింక్ అవ్వడానికి ఒక పరభాషా నటిగా ఎంతో శ్రమించింది.

"నేను ఇంతవరకు చేసిన సినిమాలతో "మహానటి" ని పోల్చలేను. ఏ నటికైనా తాను చేసిన సినిమాలలో కొన్ని మాత్రమే మనసుకు దగ్గిరవుతాయి. అందులోనూ ఆత్మసంతృప్తి కలిగించేవి కూడా అత్యంత అరుదుగా ఉంటాయి. నటిగా నాకు ఆత్మసంతృప్తి కలిగించిన సినిమా ఇది. భవిషత్తులో ఇంతటి తృప్తి కలిగించే పాత్ర వస్తుందో లేదో నేను చెప్పలేను. సావిత్రి గారికి విల్ పవర్ ఎక్కువ. తనలోని జనరస్, కేరింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా నచ్చుతాయి. తనని పరిశీలించి ఇవన్నీ నేర్చుకున్నాను. ఈ సినిమా చేస్తున్నప్పటి నుండి సావిత్రి గారికి మరింత దగ్గిరయ్యాను. సావిత్రి గారితో మాటల్లో వర్ణించలేని అనుబంధం ఏర్పడింది."- కీర్తి సురేష్.