ప్రపంచంలో హిందువులు ఎక్కడున్నా వారి దృష్టిలో ఈ భూమి మీద ఉన్న పరమ పుణ్యక్షేత్రాలలో మొదటిదిగా వారణాశిని కీర్తిస్తారు. పరమశివుడుకి కూడా ఈ భూమి మీద ఇష్టమైన ప్రదేశాలలో కైలాసం, వారణాశి అని హిందువుల నమ్మకం. ఉత్తర భారతదేశ భక్తులకు కాశి ఉంటే, దక్షిణ భారత దేశానికి దక్షిణ కాశిగా శ్రీశైలం ఉంది.. అలాంటి పవిత్రమైన శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారంగా ఈ ఉమమహేశ్వర స్వామి వారి దేవాలయాన్ని పూజిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపూర్ సమీపంలోని దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంది ఈ గుడి.
ఆలయ పూజారుల కథనం ప్రకారం 'పూర్వం ఇక్కడి ప్రశాంతమైన ప్రదేశంలో పరమేశ్వరుడు ధ్యానం చేసేవారట.. కొంతకాలం తర్వాత పార్వతిదేవి కూడా శివుడిలా ధ్యానం చేయాలని నిశ్ఛయించుకుని ఇక్కడే ధ్యానం చేశారట.' అలాగే ఇంకొంతమంది కథనం ప్రకారం కొన్ని కారణాల మూలంగా పార్వతి దేవి శివుడి కోసం ఇక్కడ తపస్సు చేసేవారని, ఆ తర్వాత ఈ ప్రాంత పవిత్రత గుర్తించి మహా ఋషులు, మహర్షులు, మునులు, దేవతలు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడే తపస్సు చేసేవారని కథనం. అంతమంది గొప్పవారి పాద స్పర్శలతో పుణీతమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే 600 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
చుట్టు పచ్చని పరిసరాలు, కొండలు, దట్టమైన అడవిలో ఈ దేవాలయం ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని దర్శించిన భక్తులకు ఒక మధురమైన అనుభూతి కలుగుతుంది. ఈ క్షేత్రంలో ఉన్న గిరిధార, రుద్రధార, భస్మధార, పాపనాశి అనే ముఖ్యమైన తీర్థాలలో సంవత్సరమంతా ఏ ఆటంకం లేకుండా నిత్యం జలం కొండల మీద నుండి రమణీయంగా జాలువారుతుంది. శివపార్వతులు స్వయంభూ గా వెలసిన ఈ దివ్య దేవాలయాన్ని కాకతీయ రాజులు ఆ కాలానికి తగ్గట్టుగా నిర్మించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.