Contributed by Sai Ram Nedunuri
ప్రతి శనివారం లాగే ఈ రోజు కూడా హోటల్ కి ఉదయం తొమ్మిది గంటలకే వెళ్ళాను.. వారాంతపు రోజులు కాకపోతే, ఉదయం పదకొండు కి వెళ్ళినా హోటల్ మేనేజర్ ఏమి అనడు.. శనివారం ఆదివారం మాత్రం తొమ్మిదింటికల్లా హోటల్ లో ఉండాలి.. హోటల్ లోపలికి వెళ్ళగానే మేనేజర్ ని పలకరించాను, వెయిటర్ యూనిఫామ్ నన్ను పలకరించింది. హోటల్ కిచెన్ లో ఉన్ననాప్కిన్స్, స్పూన్స్, ఫోర్క్స్ బయటకి తీస్కోచ్చాను, హోటల్ లో తినడానికి వచ్చిన వాళ్ళు చెప్పుకోవాల్సిన కబుర్లని వాళ్ళతో పాటు హోటల్ కి తీసుకొచ్చారు. పాశ్చాత్య తినుబండారాల మీద ఎంత మక్కువ ఉన్నా, మన తెలుగు భోజనం కమ్మగా ఉండే చోటు ఉంటే మాత్రం మన తెలుగు వాళ్ళు చెవి కోసుకుంటారు కదా, అందుకనే మా హోటల్ కి జనాల తాకిడి ఎక్కువ. ఎప్పటిలాగే సాధారణంగా ఆర్డర్లు, బిల్లులు, మధ్యమధ్యలో టిప్ లు. టిప్ లు తీసుకునేటపుడు ఆత్మాభిమానం అడ్డు వచ్చినా, ఆకాశాన్నంటే ధరల వైపు ఆశగా చూస్తున్న నా జీతం కోసం తీస్కోవాల్సి వచ్చేది.
ఎప్పుడూ కుటుంబంతోనో, స్నేహితులతోనో వచ్చే జనాలని చూసే నేను, ఇవాళ ఒక అమ్మాయి, తనతో పాటు వచ్చిన ముగ్గురు పిల్లలని చూసి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాను.
నేను:: మేడం, ఆర్డర్ ప్లీజ్.. అమ్మాయి :: ఏం తింటారు మీరు (అని ఆ పిల్లలతో అడిగింది). పిల్లలు ఏమీ చెప్పకపోవడం తో, తనని కూడా కలుపుకుని, నాలుగు మీల్స్ తీసుకు రండి అని అంది. నేను :: ఓకే మేడం. కానీ, ఆ పిల్లలని ఎక్కడో చూసినట్టు ఉంది నాకు. కిచెన్ లోకి వెళ్లి మీల్స్ చెప్తూనే ఆ పిల్లలని ఎక్కడ చూసానబ్బా అని ఆలోచించాను. హా, గుర్తొచ్చింది !! నేను రోజూ హోటల్ కి వచ్చే దారిలో పెన్ లు కొనుక్కోమని ఈ పిల్లలు అడుగుతూ ఉంటారు కదా.. నేను అసలు వీళ్ళ మీద ఎప్పుడు దృష్టి కూడా పెట్టేవాడిని కాదు కాబట్టి గుర్తుకురావడానికి కొంచెం సమయం పట్టింది. ఈ అమ్మాయి వాళ్ళని తీసుకొచ్చి అన్నం తినిపిస్తోందా?? ఎందుకో వీళ్ళకి సర్వ్ చేయడం నా అదృష్టంగా భావించాను నేను.
పక్కన టేబుల్ లో ఒకతను ఒక్కడే భోజనం చేయడానికి వచ్చాడు. తదేకంగా ఆ అమ్మాయి వాళ్ళు కూర్చున్న టేబుల్ వైపు చూస్తున్నాడు. తను భోజనం చేసేసి, నాతో, "ఆ టేబుల్ లో ఆ అమ్మాయి తో కూర్చున్నది ఈ సిగ్నల్ దగర పెన్ లు అమ్మే పిల్లలు కదా ?" అని అడిగాడు. "ఔను సర్" అన్నాను నేను. ఆ అమ్మాయి కూర్చున్న టేబుల్ బిల్ కూడా ఈ అబ్బాయే కట్టేసి, ఆ అమ్మాయికి ఇచ్చే బిల్ కి బదులు ఇది ఇమ్మని నాకు ఒక చీటీ ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను ఆ చీటీ ఆ అమ్మాయి కి ఇచ్చే ముందు ఆ చీటీ తెరిచి చూసాను, ఎమన్నా రాయకుడనిది రాసాడేమో అన్న చిన్న భయం తో. ఆ చీటీ లో ఇలా ఉంది.
"హలో, నేను మీ పక్క టేబుల్ లో ఇందాక భోజనం చేసాను. నాకు చాలా సేపు మీతో కూర్చున్న పిల్లలని ఎక్కడ చూశానో గుర్తుకురాలేదు. అందుకనే అన్ని సార్లు మీ టేబుల్ వైపు చూసాను. మీరు ఇబ్బంది పడినట్టయితే మన్నించండి. మీరు చాలా సార్లు ఇలా చాలా మందికి ఆకలి తీర్చి ఉంటారు. మీరు ఈ పని చేస్తూ పొందే ఆనందాన్ని ఈ ఒక్కసారి నేను కూడా పొందుదామనుకున్నాను. అందుకనే మీ టేబుల్ బిల్ నేను కట్టేసాను. ఇది మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి."
ఇది చుసిన నేను, నాలో నేను నవ్వుకుని, ఆ అమ్మాయి కి ఇచ్చే బిల్ బదులు ఈ చీటీ ఇచ్చాను. ఈ చీటీ చదివాక, ఆ అమ్మాయి మొహం మీద ఒక చిరునవ్వు చూసాను. నేను కూడా ఒక చిరునవ్వు నవ్వాను. ఎందుకో ఈ ఆనందం లో నాకు కూడా ఎలాగో అలా పాలుపంచుకోవాలి అనిపించి "ప్లీజ్, నో టిప్ మేడం" అన్నాను. ఆ రోజు ఎందుకో నా ఉద్యోగం మీద తృప్తి గా అనిపించింది.